1, జులై 2025, మంగళవారం

వాగ్ధానం



 నాశనం చేసినదాన్ని చూసి దుఃఖించడానికి కాదు 

ఎలా నాశనం అయ్యిందో పరిశీలించడానికి కాదు

నీ పురాతన ఆత్మ అక్కడ సంచరిస్తున్న ఆనవాళ్ళు కూడా వున్నాయనే ఎరుక తో వచ్చాను. 

ఈ పరిసరాల్లో ఈ ప్రకృతి లో ఆ సూర్యోదయాల్లో ఆ గాలిలో ఆ పువ్వుల్లో  తెరవబడక బావురుమంటున్న  పుస్తకాల్లో మనసు చిలికిన ఆ కవిత్వంలో  వానకు తడిసి పరిమళాలు వెదజల్లుతూన్న మట్టిలో.. ఏవో నిశ్శబ్ద వర్ణ చిత్రాల గుసగుసల్లో నువ్వు జీవిస్తున్నావని.

సగం తెరిచి వుంచిన తలుపు

సగం మాత్రమే పంచుకున్న మనసు 

అర్ధోక్తి తో ఆగిపోయిన మాటలు

ఏనాటికైనా పూర్తి అవుతాయనే ఆశను కూకటివేళ్లతో పెకిలించిన ఆ పరువు హత్య

లోకం దర్పణంలో ముక్కలై ఏడుస్తున్న నా ప్రతిబింబాన్ని చూసి జాలిపడుతూ ఎగతాళిగా నవ్వుతూ మీరు


లోపల యుద్ధం జరిగినాక వెలుపల యద్ధం చేయాల్సిన పనిలేదు. 

శాంతి పతాకం యెగరేయడం మినహా


ప్రపంచానికి తెలియని రహస్య దుఃఖాలను మోస్తున్న నేను

నీ  ఆత్మ ను వెదుక్కుంటూ వచ్చాను వస్తూనే వుంటాను నాశనం చేయలేని ప్రేమతో 

నీవు హృదయాన్ని మాత్రమే ఇచ్చావు

నేను జీవితాన్నే విడిచి వచ్చాను. 

29, ఏప్రిల్ 2025, మంగళవారం

దుఃఖపు రంగు

 నాలుగు సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూనే వున్నాను.. ఎట్టకేలకు ముద్రణకు వెళ్ళింది.. 

కవర్ పేజీ తో పాటు.. ప్రస్తుత చిత్రం.. 




25, ఏప్రిల్ 2025, శుక్రవారం

ఝంకారం

 ఝంకారం 

జీవితాన్ని అసాంతం  పిండుకున్నాక  

పిప్పిని కూడా  వదలనివాడు ఆమె పతి   బేహారి 

సూర్యుడు రంగులన్నీ పోగేసుకుని పోయినట్లు ఆమె నవ్వులన్నింటిని దోచేసుకున్నాడు చీకటి సముద్రంలో ముంచేసి పోయాడు 

రాత్రి   అశ్రుభారంతో దీర్ఘంగా కదులుతోంది నిద్ర కల వొడిలో సేద తీరక  కలవరంగా ఉలిక్కిపడుతుంది 

విషాద గానంలో   హోయా పక్షి ఆమెకు తోడుగా వుంది. 

ఆమె కన్నీళ్ళకు మాట్లాడే శక్తి ఉంటే ఎన్ని కథలు చెప్పేవో

వాటికే  గనుక రంగులుండుంటే .. 

తడిసిపోయిన తలగడ ఆమె  భావోద్వేగాలకు కాన్వాస్‌గా ఉండేదేమో.

 తెల్లవారింది. బయలంతా పచ్చదనం 

ఎద లోపల మండే గ్రీష్మం 

దిక్కుతోచని దారి తెలియని బాటసారి

ఆమె చెవులకు వీనులు విందుగా గడ్డి పువ్వు పై వాలిన  తుమ్మెద ఝంకారం వినిపించింది 

పెదాలపై సన్న నవ్వు మొదలై విస్తరించింది. జీవన మధువు ఆస్వాదనకై అడుగులేసింది.