9, జనవరి 2021, శనివారం

కోకిల తల్లి


ఎంతైనా చిలకలు వాలిన చెట్టు అందంగానే వుంటుంది. గూడు పెట్టిన చెట్టూ మరింత అందంగా వుంటుంది చూసే కళ్ళకు. ఓరిమి లేకుండా ఉరుకురుకున ఉడతలు తిరిగే చెట్టూ కాలక్షేపంగా చూడటానికి  కనువిందుగా వుంటుంది. కడిమి చెట్టు నిమ్మచెట్టు సపోటా చెట్టు జామ చెట్టూ  మామిడి చెట్టు వున్న ఆ పెరటి తోటలో ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే  చెట్టు సంపెంగ. గంధం పచ్చి పసుపు కలగలిపిన అదొక ప్రత్యేక పసుపురంగులో సింహాచలం సంపెగ పూలలాగే సువాసనలు వెదజల్లుతూ ఆ తోటకే అలంకారంగా వుంటుంది. “కేరళ యాత్రకువెళ్ళినపుడు తిరువనంతపురంలో కొని  బట్టల సంచీలో పెట్టుకుని జాగ్రత్తగా  తెచ్చి నాటానమ్మాయ్. మన ప్రాంతంలో ఎక్కడా లేదనుకో ఇలాంటి చెట్టు’’ గర్వంగా అంటుంది పక్కింటి మామ్మ. పచ్చగా విరబూసినపుడు రెండు కళ్ళు చాలవనిపిస్తూ వుంటుంది. చెట్టుకున్న ఆకర్షణతో పాటు మరొక అదనపు ఆకర్షణ ఆ చెట్టుపై మసిలే ఆడ కోయిలలు. వసంతకాలమంతా  ఆ పెరడంతా నూతన ఉత్సాహం నిండుకుని వుంటుంది. కాకి లాగే ఎరుపు కనులున్న మగ కోయిల రెక్కలపై గోధుమ రంగు చారలున్న  ఆడకోయిలలు అన్నింటికి ఆ చెట్టు నివాసం.

గుత్తులుగుత్తులుగా పచ్చగా గుండ్రని కాయలు కాసి మరి కొన్నాళ్ళకు నల్లగా పండిన చెట్టు సంపెంగ కాయలను చిటుకు చిటుకుమని పొడుచుకు తినే కోయిలలను చూస్తూ అవి పలికే కూ కూ గానాలు వినడం కరుణకు మరీ ఇష్టం. నిజానికి అదొక వ్యాపకం కూడాను ఆమెకు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ  పెరటి తోట ఆ తోటని నివాసం చేసుకున్న అనేక పక్షులు అంతా కలిసి అదో జీవన సంరంభం. అదీ కాకుండా అదే చెట్టుపై గూడు పెట్టుకుని ఉన్న కాకి ఆమె నేస్తం కూడా. ఒకరి భాష ఒకరికి రాకపోయినా కదలికలు పూర్తిగా అర్ధం చేసుకోగలరు. ఆ కాకి అంతకు మునుపు  ముక్కు ఇరిగిన కాకితో జత కట్టేది విరిగిన ముక్కుతో ఆ కాకి ఆహారం సేకరించడం సాధ్యపడకపోయినా తానే సేకరించుకుని వచ్చి పిల్లలతో పాటు ఆ మగ కాకిని సాకడం చూసి ఆడకాకి మీద  జాలితో ఆహారం అందించడం మొదలెట్టింది. అలా ఆ కాకికి  కరుణకు స్నేహం కుదిరింది. ఒక యేడాది తిరిగేసరికి ముక్కు విరిగిన కాకి  మాయమైపోయింది. ఏమై పోయుంటుంది ఆకాకి ఏదైనా రోగంచేసి చచ్చిపోయిందేమో లేక మరో కాకితో జత కట్టి ఈ గూడు విడిచి పెట్టి పోయిందేమో అని ఆలోచనలు చేసేది కరుణ. ఆ నడివేసవిలో మరో కొత్త మగకాకితో జత కట్టి  కనబడింది ఆమె నేస్తం ఆడకాకి. కాకి పుట్టి నలుపే పెరిగీ నలుపే అని ఊరికే అనలేదు. కానీ కాకి నలుపు రంగుపై ఉన్న  అయిష్టత వ్యతిరేకతంతా ఈ కాకి ప్రవర్తన చూస్తే మనుషులకు కాకులపై ఉన్న అభిప్రాయమే  మారిపోతుంది అనుకుంటుంది.

 ఒకరోజు పూల సజ్జనిండా పూలను తెచ్చి దేవుని పీఠంపై పెట్టి భక్తిగా నమస్కారం చేసుకుని ఈత చాపపై కూర్చొనబోతూ పక్కింటితోటలోకి చూసింది కరుణ. అరవిరిసిన నాటు గులాబీలు నాలుగైదు కనబడ్డాయి. వాటిని యిష్టంగా చూసి చూపులతోనే వాటిని తుంపి కనురెప్పలపై వాటి భారాన్ని నెమ్మదిగా మోస్తూ పదిలంగా తెచ్చి ఆదిదంపతుల పటం ముందు వుంచింది. అత్యాశతో భక్తి పేరిట పక్కింటి తోటలో పూలుకోయకుండానే భావంలోనే భక్తి అన్నట్టు మనసుతోనే అర్పణ కూడా వుంటాయని అనుభవపూర్వకంగా తెలుసుకుంది ఆమె.

“నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం” శంకరపార్వతీభ్యాం  ప్లేయర్ లో నుండి శ్రావ్యంగా వినబడుతూ ఉంది. కూర్చొనబోతూ కిటికీ ప్రక్కగా వున్న చెట్టు సంపెంగచెట్టు కొమ్మపై వున్న కాకిని మరొకసారి చూసింది. దీర్ఘ తపస్సులో మునిగిన ఋషిలా స్థిమితంగా కూర్చునేవుంది. ప్లేయర్ మోగినంతసేపూ అలా కొమ్మపై కూర్చుని వింటూ వుంటుంది తోటి పక్షులో ఉడుతలో అంతరాయం కల్గించనంత వరకూనూ. పూర్వజన్మలో ఏ ఋుషిగా వుందో గత జన్మ వాసనలు వీడిపోవు అన్నట్లు గొప్ప సంస్కారం చూపుతుంటుంది యీ కాకి అనుకుని పూజకు ఉపక్రమించింది కరుణ.

పూజాది కార్యక్రమాలు ముగించాక కాఫీ కలుపుకుని వచ్చి కంప్యూటర్ తెరిచింది. చానల్స్ మోసుకొచ్చిన వార్తలు వింటూ మరొక ట్యాబ్ లో రాత్రి సేవ్ చేసి పెట్టుకున్న గ్యాస్ లైటర్ పాడైపోతే ఎలా బాగుచేసుకోవాలి అనే వీడియోని చూస్తూ కూర్చుంది. కరోన కాలంలో ప్రతి వస్తువుకు ఎంతో కొంత డిమాండ్ పెరిగింది. షాపులు సరిగా తెరవక తెరిసిన కొద్ది సమయానికే ఎగబడే జనం తాకిడికి సరుకు నిండుకుని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో సైతం  గ్యాస్ లైటర్  అగ్గి పెట్టెలు దొరకక నా నిప్పు లేనిదే మీకు తెల్లారదు రీతిలో పొయ్యి ముట్టించడానికి నానాఅవస్థ పడుతుంది కరుణ. పక్కింటి వాళ్ళను అగ్గిపెట్టెలు నిండుకున్నాయి గ్యాస్ లైటర్ పాడైపోయింది కొంచెం నిప్పు అరువిస్తారా అని అరువడగడటానికి మొహమాటపడిపోవడమే కాదు నామోషిగా అనిపించింది కూడా.

లైటర్ బాగుచేయడం ఎలా తో మొదలెట్టి ఆపకుండా ఇంకో నాలుగు వీడియోలలోకి వెళ్ళిపోయింది. అన్నింట్లో అదే విషయం.సమస్య వొకటే పరిష్కార మార్గాలనేకం అని అర్దం చేసుకోవాలన్నమాట అనుకుంది. ప్రతి విషయాన్ని ప్రయోగాత్మకంగానో అలవాటుగానో ఆసక్తిగానో చేసి ప్రపంచం మీదకు వొదలడం అలవాటైపోయింది జనాలకు. చేయడానికి పనిపాటాలేక కొందరు అదనపు ఆదాయంపై ఆశ కోసం కొందరు ఆసక్తితో కొందరూ నూటికి పదిమంది యూ ట్యూబర్స్ గా మారిపోయిన రోజులివి కదా! పిల్లలు కూడా అమ్మనాన్న ఫోన్లలోనే అమ్మనాన్న ఆటలు వీడియోలలో చూసి నేర్చుకోవడానికి తోటి పిల్లలపై ప్రయోగాలు చేస్తున్న విషయాలు దృష్టిలోకి వస్తున్నాయి. పెద్దలు వయసు విచక్షణ మరిచి అల్పంగా ప్రవర్తించడానికి కారణం ఈ వీడియోల వేలంవెర్రి అందుబాటులో ఉన్న  టెక్నాలజీ కారణం కాదూ అంటూ అనేక ఆలోచనలు చేస్తున్న కరుణను తట్టి లేపడానికన్నట్లు వంటింటి బాల్కనీ గోడపై వాలి కావ్ కావ్ మని అరిచింది కాకి. అపుడే ఉపాహారం తీసుకునే సమయమయ్యింది కాబోలు. భలే ఠంచనుగా గుర్తు చేస్తుంది తన ఆకలితోపాటు నా ఆకలి అవసరాన్ని గుర్తుచేస్తూ. తల్లీ!  నువ్వింత తిని నాకింత పెట్టూ అని. సందేహంలేదు గత జన్మలో  ఈ కాకి మనిషై వుంటుంది దానికీ నాకూ ఏదో బంధుత్వం వుండి వుంటుంది.. తనేదో రుణపడి  వుంటానేమో అనుకుంటా కంప్యూటర్ మూసి వంటింట్లోకి నడిచి దోసెలు వేయడానికి పెనం పెట్టి ఆఖరు అగ్గిపుల్ల వెలిగించింది. కరుణ వంటింట్లో తచ్చాడటం చూసి మౌనం వహించి  గోడపై కూర్చునుంది కాకి. 

కాసేపటి తర్వాత బాల్కనీలోకి వచ్చిన కరుణకు  సంపెగ చెట్టుపై రాగిరంగు రెక్కలు ఎర్రని కళ్ళూ వున్న చిన్న కోయిల  వొకటి ఆ చెట్టు కొమ్మలపై షికారు చేయడం గమనించింది. అది కాకి గూడులో పెరుగుతున్న కోయిల పిల్లని అది గొంతు విప్పకుండానే  కోయిలని నాకు తెలుసుకానీ కాకి గూడులో వున్న తోటి పిల్లలకు గుడ్డు పొదిగి పిల్లను చేసిన కాకి తల్లికి తెలియదు కదా అనుకుంది. గూటిలోనుండి బయటపడి చిన్నగా గెంతుతూ తడబడుతున్న అడుగులతో చెట్టు కొమ్మలపై పట్టు బిగించుకుంటూ బెదురుతూ చుట్టూ చూస్తూ తిరుగుతుంది కోయిల పిల్ల.తన పక్కనే గుత్తిగా వేలాడుతున్న చెట్టు సంపెంగ కాయలను ఎర్రటి ముక్కుతో పొడిచి తింది.అలవాటు లేని  ఆహారం కొత్త ఆహారం తిన్న కోయిల పిల్ల గొంతు నొప్పితో తొలిసారిగా ఏడుపుతో గొంతు విప్పింది. అంతే , ఆ తేడాను గమనించిన  కాకులు మరికొన్ని కాకులను పోగుచేసేసాయి. ఆ పిల్లకోయిల చుట్టూ చేరి కావ్ కావ్ కావ్ మని ఆపకుండా అరిచి గోల పెట్టాయి. ఆగోల ఆహార సేకరణకు వెళ్ళిన తల్లి కాకికి వినబడినట్టు ఉంది. తన బిడ్డలకు ఏదో ఆపద వచ్చింది అనుకుని  రివ్వున వచ్చి చెట్టుపై వాలింది. జింకపిల్లను చుట్టేసిన తోడేళ్ళ గుంపులా కొమ్మ కొమ్మకి కాకులు వాలి నువ్వు కావ్ మని కాకుండా వేరే విధంగా అరుస్తావా! నువ్వు మాలో మాతో కలవవు పో.. అంటూ భీకరంగా హెచ్చరికలు చేస్తున్నాయి. కాకులగుంపు మధ్య వాలిన ఆడకాకి  అప్పటి వరకూ తెలిపిన సంఘీభావానికి తగిన కృతజ్ఞతలను తన భాష తోనే తెలుపుతూ “ ఇక చాలు, ఇది నా గూడు నా పిల్లల విషయం గనుక నేను చూసుకుంటాను మీరు వెళ్ళి రండి’’ అన్నట్టు కావ్ కావ్ మని అరుస్తూ కాకుల  మధ్య ఎగురుతూ  వాటిని మర్యాద పూర్వకంగా పంపడానికి బాగానే కష్టపడింది. 

వానకు తడిసిన రెక్కలతో కొత్త ఆహారం తిన్న గొంతు మంటతో కాకుల అరుపుల మధ్య భీతిల్లిన హృదయంతో బిక్కు బిక్కున చూస్తున్న కోయిల పిల్ల దగ్గరకు వెళ్ళి ముక్కుతో పరామర్శించి తన రెక్కలను చాచి గొడుగులా కప్పింది. పిల్ల పక్షి కాళ్ళ చుట్టూ కాలిని వేసి దైర్యమిచ్చింది.  నెమ్మదిగా నెడుతూ గూడు లోపలికి తీసుకెళ్ళడానికి విశ్వప్రయత్నమైతే చేస్తూనే వుంది. ఆ ప్రయత్నాన్ని దూరంగా కూర్చున్న మగ కాకి చూసిచూడనట్టు చూస్తూనే వుంది. ఆశ్రయించిన గూడు ఆదరణ చూపించే ఆ వొడి పువ్వుల వలె మెత్తనైనవి అని గుడ్లు పెట్టిన కోయిలకు తెలిసినా  తెలియకపోయినా.. కోయిల పిల్ల విషయంలో జరిగినది అదే. ఆ దృశ్యం చూసి కరుణ హృదయం ఉప్పొంగింది.ఆడకాకి పై మరింత అభిమానం పొంగుకొచ్చింది.

ఆమె హృదయంలో  కురిసిన కరుణ లాగానే మళ్ళీ వాన కూడా కురువడం మొదలైంది. నిట్టనిలువుగా పడే వాన చినుకులు గుచ్చుకున్న గూటిలోని పక్షి పిల్లలు కిచకిచ మంటూ అరుస్తూనే వున్నాయి.  కోయిల పిల్లను కొమ్మపై వొదిలి మగ కాకి కాపలా వుంటే ఆడ కాకి ఆహారం వేటకు బయలుదేరింది చుట్టుప్రక్కల ఇళ్ళ ప్రహరీ గోడలపై వాలుతూ కావ్ కావ్ మని అరుస్తుంది. ఎవరైనా భోజనం సమయానికి గోడ మీద ఒక ముద్ద పెట్టి ఉండకపోతారా అని చక్కర్లు కొడుతూనే ఉంది.

అదంతా చూస్తున్న కరుణ గుప్పెడు అటుకులు తెచ్చి కాకి చూసేటట్లు గోడపై పోసింది. చెట్టు మీద నుండి ఆ కాకి చటుక్కున బాల్కనీ గోడమీదకు వచ్చి వాలింది తల అడ్డంగా వాల్చి గుట్టగా వున్న అటుకులను రెండు బొక్కులు బొక్కేసి గూడు దరిచేరింది. గూటిలోకి వొంగి కిచ కిచమని అరుస్తూ తలలు పైకి లేపిన పిల్ల పక్షుల నోటి లోకి ఒడుపుగా అటుకులను వొదిలి మరొకసారి పుక్కిటపట్టడానికి గోడపై వాలడం చూసింది. మాతృధర్మం పక్షి అయితేనేమి పశువైతేనేమి బిడ్డకు అందించడానికై పడే ఆరాటం ఆహార సేకరణకై చేసే పోరాటం ఒకేలా వుంటుంది కదా అనుకుంది.

వెంటనే ఆమె ఆలోచనల్లో కొన్ని సంఘటనలు లీలగా గుర్తుకు వచ్చాయి. చనిపోయిన భర్త మనసులో ఆఖరిరోజుల ముందు ఏమి వుందో  గ్రహించి అభ్యంతరమెందుకు తెలిపిందో గుర్తుకొచ్చింది . కరుణ భర్త శ్రీకర్ అందగాడు  అంతకు మించి అహంకారం మెండుగా ఉన్నవాడు. ఒకేసారి ఇద్దరిని ముగ్గురిని ప్రేమించి కామించి సంబంధాలను నెరపడం అతని చిత్త ప్రవృత్తి.అదేమి నేరమేమి కాదు పాలి ఎమరిస్ రిలేషన్ షిప్ అనేవాడతను. బాగా చదువుకున్న అతని దృష్టిలో కోరికలకు అతిగా స్పందించని కరుణ ఒక మట్టిముద్ద అని అతని భావన.

‘అలాంటి రిలేషన్ షిప్ నేను సాగిస్తే నువ్వు వొప్పుకుంటావా’ నిక్కచ్చిగా అడిగింది కరుణ.

“ ఏం తక్కువ చేస్తున్నాను నీకు నా  ప్రేమలో  లోపం కానీ నేను బాగా చూసుకోవడం లేదని కాని అనుకుంటున్నావా? లేక మన దాంపత్య జీవితం నచ్చడం లేదని చెబుతున్నావా! అని అనునయంగా అడుగుతున్నట్టు అడుగుతూనే అలాంటి పని చేస్తే  నరికేస్తాను జాగ్రత్త’’ అన్నాడు క్రూరంగా.

కరుణ ఆలోచించింది.దాంపత్యానికి దంపతుల మధ్య అనురాగానికి ప్రేమే శిరోధార్యం. అంతెందుకు? సహజీవనానికి కూడా అదే ప్రామాణికం. బంధాలలో ఇష్టాలు ప్రేమలు నిలిచి వెలగాలంటే ఒకొరినొకరు దోపిడి చేసుకోవడం మానుకోవాలి. ఇక అతనిని తన సొంత ఆస్థిగా అనుకోవడం మానేయాలి “ అని ధృఢంగా నిర్ణయించుకుని దూరంగా జరిగింది. దూరంగా బతకగల్గడానికి ఇంటా బయటా ఎన్నెన్నో పోరాటాలు చేయాల్సి వచ్చినా బెంగపడలేదు భయపడలేదు ఆమె .

శ్రీకర్ వలచిన ఒకామె నెరజాణ.  పరిచయమై ప్రేయసిగా పాతుకుపోవడానికి ఎంతో కాలం పట్టలేదు.ఎరిగిన వాళ్ళందరూ అదసలే వేశ్య, ఇకపై తా వలచి కోరితే సంసార బంధం విచ్ఛిన్నమవకుండా వుంటుందా? అదీ  పురుషుడికి నీవంటి మొండి ఇల్లాలు వుంటే గనుక సంసారం  ఆమె పరం కావడం చిటికెలో పని కదా. పంతానికి పోయి కాపురం పరులపాలు చేసావు అని అనేవాళ్ళు.అది ఆత్మాభిమానమని అనేవారికి యెన్నటికీ తెలియదు అని నవ్వుకునేది.

నదిలా ప్రవహించడం హృదయాన వశించడమే తెలుసును తనకు. భార్య  స్థానం నిలబెట్టుకోవడం కోసం నేలబారుగా ప్రాకులాడటం అసహ్యంగ ఉండదూ అనుకునేది కరుణ. దాంపత్య జీవితంలో ప్రమాదం ఎటువైపునుండైనా రావచ్చు. అరికాలు క్రింద అరటితొక్కే కాదు ఆవగింజ పడినా కాలు జారినట్టు భార్య స్థానం ఎప్పుడైనా జారిపోవచ్చు. ప్రారబ్దంలో వ్రాసి వుంటే జరగాల్సింది జరుగుతుంది అనుకుని మనసును సరిపెట్టుకుంది. కరుణ ఎక్కువుగా చదువుకోకపోయినా పుస్తకాలు బాగా చదవడం వల్ల  మానవులలో ఏర్పడే లైంగిక సంబంధాలను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేసేది.  లైంగిక వాంఛ సహజాతం. మనుషుల్లో అంతర్లీనంగా వుండే లాలస మనుషులకు తాత్కాలికంగానో జీవన పర్యంతమో మాయపొర కప్పేస్తుంది. భర్తకు ఆ పొర బాగా కమ్మేసింది. పురుషుడు బహుభార్యలు  కల్గి ఉండటం అనాదిగా ఉండేది అని బాగా వాదించేవాడు. అక్రమ సంబంధాల బంధాలలో తన  కూతురు కాని కూతురుని కూడా తన కూతురితో సమానంగా ప్రేమించాడు ఆదరించాడు. తన కొడుకుని మాత్రం నిరాదరణకు గురిచేసాడు. వాళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు లోకం విడిచి పోవడానికి రోగం కారణమయ్యింది కానీ రోజూ నరకప్రాయమైన బతుకు సాగించారని  ఎపుడూ కీచులాడుకుంటూ వగస్తూ రోజులు వెళ్ళదీసారని తెలిసినవాళ్ళే  కరుణకు మోస్తూవుండేవారు..

కరుణ క్షమా గుణం గమనించి కొడుకులో మంచితనాన్ని గుర్తించి  కాస్త ఎమోషనల్ టచ్ రంగరించి ఆఖరి ఘడియల్లో  అప్పగింతలు పెట్టబోయాడు ఆ పిల్లలను కూడా కరుణకు కన్నబిడ్డల్ల మాదిరిగా  కొడుకును చెల్లెళ్లుగా అనుకుని   ఆదరించమని. కరుణ నిర్విద్దంగా త్రోసిపుచ్చింది..ఆ పిల్లలను తన పిల్లలుగా అంగీకరించే ఔదార్యం లేకపోవడం దోషమైతే కావచ్చునేమో కాని నేరమేమి కాదు కదా అనుకుంది.మూడవ వ్యక్తిగా వచ్చిన ఆమె  సంబంధం లేనివిషయాల్లో తలదూర్చి పదునైన మాటలతో మనసుని గాయపర్చడం కరుణ మర్చిపోలేదు. అంతగా వారికి కావాలంటే అతని ఆస్థిపాస్తులలో భాగం పంచుకోమనండి.  అయితే గియితే అనాధలు అని జాలి చూపగలను కడుపు నింపగలను. కానీ నా తల్లిప్రేమ నా బిడ్డకు  మాత్రమే సొంతం. వారికి అందులో కాణీ వాటా కూడా ఇవ్వలేనని ఖండితంగా చెప్పింది.  

 ఇవన్నీగుర్తుచేసుకునే కొలదీ కరుణకు చిత్తశాంతి లేకుండాపోయింది. అసహనంగా మెదిలి లోపలికి వచ్చింది కానీ వంటకు ఉపక్రమించలేకపోయింది. మనిషి మనసెప్పుడూ  నిద్రలో పసిపాప నవ్వినంత హాయిగా నవ్వుతూ వుండాలి అనుకునే స్వభావం ఆమెది.ఎంత వద్దనుకున్నా తల్లి కాకి కోయిల పిల్ల చుట్టూనే ఆమె ఆలోచనలు తిరుగుతున్నాయి.తను చేయలేని పని తల్లికాకి చేస్తున్నందుకు ముచ్చట పడింది.  తెలియకుండానే కాకిలోని సహజమైన తల్లి ప్రేమకు ఫిదా అయింది. ఎందుకు తనలా ఉండలేకపోయింది. ఎందుకు ఎందుకు? అని తనని తాను పదే పదే ప్రశ్నించుకుంది . అప్పుడు ఆమె మనసు చెప్పింది . ఎందుకేమిటే పిచ్చి మొహమా! మనుషులకు ఉన్నట్లు పక్షులకు జంతువులకు మోనోగమీ ఉండదు కాబట్టి అవి సరిపెట్టుకుంటాయి. కానీ మనుషులు అలా సర్ధుకుపోయి ప్రేమ పంచగలరా ? అసలు అంత నిస్వార్ధంగా ఉండటం మనుషుల వల్ల అయ్యే పనేనా ? అని. మనసు చెప్పిన సమాధానం విని కరుణ కాస్త  శాంతపడింది.

కళ్ళకు గంతలు కట్టొద్దోయ్ కాకే కోకిల కాలేదోయ్ రేడియోలో పాట వినబడుతుంది. కాకి కోయిల కాలేకపోవచ్చు కానీ కాకి గూటిలో కోయిల కళ్ళు విప్పక తప్పదు కాకి కోయిలను పెంచక తప్పదు ఇది మాత్రం సత్యం అనుకుంది..

కరుణ ఆలోచనలు ఏమీ తెలియని  కాకి కరుణ పెట్టిన వేడి వేడి  అట్టు ముక్కలను నోటిలో కుక్కుకుని వెళ్ళి తొలుత చెట్టు కొమ్మపై వున్న కోయిల పిల్లకు అందించి తర్వాత గూటిలోని తన పిల్లలకు అందించివచ్చి మళ్ళీ  కొమ్మపైనున్న కోయిల పిల్లకు రక్షణగా పక్కనే వచ్చి కూర్చుంది ఏమీ ఆశించని తల్లి ప్రేమతో. మగకాకి అక్కడి నుండి నెమ్మదిగా ముఖం చాటేసింది ఎప్పటిలాగానే!

*****0*****

కామెంట్‌లు లేవు: