18, ఆగస్టు 2025, సోమవారం

ముందు మాట

 


“దుఃఖపు రంగు” కథా సంపుటికి ముందు మాట రాసిన వారు “పద్మజ సూరపురాజు “ 

వారికి.. హృదయ పూర్వక ధన్యవాదాలు. 🙏

ఇందులో 24 కథలు వున్నాయి. కథా ప్రేమికులు ఈ పుస్తకాన్ని చదివండి.. 👍😘


‘Close-up’ ఇరానియన్ సినిమా లో ఒక పేదవాడి నోట్లోంచి వస్తుందొక మాట, “ పుట్టిన ప్రతి ఒకరికీ వారి భావాలను వ్యక్తం చేయాలనీ, తన గొంతు వినిపించాలనీ తీవ్రమైన కోరిక ఉంటుంది, హక్కూ ఉంటుంది.” 


మూడు ప్రాథమికావసరాలతో సమానంగా అవసరమైనది మనిషికి వ్యక్తీకరణ. రచనకు ఊరికనే ఉపక్రమించరు ఎవరూ. అన్యకారణాలు ఎన్ని ఒకవేళ ఉన్నా ఒక రచనక్రియ వెనక ముఖ్య ప్రోద్బలం మనిషికి, తనుంటున్న ఈ ప్రపంచం తనకు ఏవిధంగా అర్థం అవుతున్నదో, తన ఉనికి ఈ జీవప్రవాహంలో కలగచేయగల ప్రకంకపనలేమాత్రమని తను అనుకుంటున్నాడో,  ఈ లోకానికి అరిచో, మెల్లగానో చెప్పాలని అనుకోవటమే.

భావాన్ని ప్రాణం లా మోస్తూ చిరంజీవిగా నిలబడిపోయే అక్షరం మానవులందరూ ఆరాధించే ఊర్వశి.


యుగాలుగా వేల పుటల సాహిత్యం వస్తూనే ఉన్నా రచించటానికి విషయం ఇంకా ఉంటూనే ఉంటోంది. ఎన్ని మానవ మస్తిష్కాలో అన్ని దృక్పథాలు మరి. బాధలూ, వాటి కథలూ సరేసరి. 

ఒక పరిహాసం ఆ మధ్య చెలామణి అయింది. స్త్రీలు పురుషులు ఒక సభలో వారి వారి కష్టాలు చెప్పుకోవటానికి గుమి కూడారుట. ఒక స్త్రీ తన జాతి తరఫున నిలబడి చెప్పుకుంటూ పోతోందిట ఆడవాళ్ళు పడే కష్టాలు ఇవీ ఇవీ అంటూ. చివరకు “ఒక్క కష్టం ప్రపంచంలోది చెప్పండి మేము పడనిదంటూ ఉంటే?” అని సవాల్ చేసిందిట. వెంటనే ఒక అర్భకుడు లేచి నిల్చుని “ఒకటున్నది మీరు పడని కష్టం; అదేంటంటే బయటికి వెళ్ళబోసుకోకుండా నిశ్శబ్దంగా కష్టాన్ని భరించే కష్టం మాత్రం స్త్రీలు పడరు.” అన్నాడట. 

 ఆమె అన్నదిట “ఆ హక్కు కూడా మానుంచి హరించకండి, బాధలు వెళ్ళపోసుకోవడం అనే కోరికను బౌద్ధ భిక్షుణీలు కూడా తప్పించుకోలేకపోయారు” అని.


పురుషుడికి జన్మ ఎత్తాక వెయ్యి సమస్యలు ఉంటే స్త్రీకి వెయ్యినొకటి ఉంటాయి, అతనితో కలుపుకుని.

దేశకాలాల బేధం పాటించకుండా ఒకటే విధంగా కాసే ఎండ పితృస్వామ్యాధికారం కదా మరి. 

మెల్లిమెల్లిగా మారుతూ వస్తున్న సామాజికపరిస్థితి వెనక పుంఖానుపుంఖాల స్త్రీ అణిచివేత గూర్చి సాహిత్యం రావటాన్ని మించిన ప్రభావవంతమైన తిరుగుబాటు లేదు.


ఎంత వ్రాసినా ఇంకా కొంత మిగిలి ఉండబట్టే ఇంకా రాయవలసి వస్తోంది స్త్రీ కి, ఇప్పటికీ. 

బహుముఖీన అభివృద్ధి జీవనంలో వస్తే, సమస్యలూ బహుముఖీనంగా ఉంటున్నాయి. 


అవన్నీ జీవితంలో దశలవారీగా ఎదుర్కుంటున్న తోటి ఆడవారిని చూసినప్పుడు ఆ సమస్యలను మూలాలతో పట్టుకునే ప్రయత్నం చేసిన రచనలు వనజ తాతినేని గారివి. 

వార్తాపత్రికల్లో చదివినవో, కర్ణాకర్ణిగా విన్నవో విషయాలు గా కథలల్లకుండా, సమీపం నుంచి తరచి చూసిన స్త్రీ జీవితాల్లోని అణచివేత, దుఃఖం ఆమెతో రచనలు చేయించాయి. 


సమస్యలకు, అందునా స్త్రీ సమస్యలకు కరువున్న దేశం కాదిది. ఆడ పిల్లల ప్రథమ సమస్య ప్రాథమిక విద్య; అటు బడిలో ఇటు ఇంట్లో. మొదటి కథ, ‘మాతృ హృదయం’ లో విషయం, నాలుగిళ్ళల్లో పాచిపని చేసుకుని పిల్లల్ను పోషించే సింగిల్ వుమన్ కు పిల్లల పెంపకం లో ఉండే కష్టం. చాలా సున్నితమైన అంశం ఎత్తుకున్నారు ఇక్కడ రచయిత్రి; సామాన్యంగా అందరూ చర్చించే ఆ స్థితిలో ఉన్న వారి ఆర్థిక సమస్యో, శ్రమదోపిడియో, లైంగిక అత్యాచారమో కాకుండా. అమ్మూ వాళ్ళమ్మ తన ప్రాణమంతా ధారపోసైనా పిల్లలకు చదువు చెప్పిస్తే కనీసం వాళ్ళకైనా పాచిపని చేసే తన గతి పట్టదనుకునే ఆశ తో ఉంటుంది. పిల్లలతో బడికి వెళ్ళు , సరిగా చదువు అంటూ కఠినంగా ఉండే ఆమెను ఎదుగుతున్న పిల్ల సరిగ్గా అర్థం చేసుకోదు. “అమ్మకు నేనంటే ప్రేమ లేదు, రెండో పెళ్ళి చేసుకున్నా నాన్న నే మేలు, ఆయన, ఆయన మరోభార్య దగ్గరికి వెళ్ళినా బావుంటుంద”ని అనుకునే అమాయకురాలు. ఇది చాలా సహజంగా ఎదిగే పిల్లలున్న ఇళ్ళల్లో కనపడే పిల్లల, ముఖ్యంగా ఆడపిల్లల మనస్తత్వధోరణి; అమ్మకు నాకంటే చెల్లి ఇష్టం, లేదా తమ్ముడు ఇష్టం అనుకోవటం. 

తల్లీ తండ్రి రెండు బాధ్యతలు ఒక తల్లే తలకెత్తుకోవలసి వచ్చినపుడు, తండ్రి కమశిక్షణలో, భయంలో పెరిగే పిల్లలకు దొరికే తల్లి అనునయం తల్లి ఒంటి చెయ్యి అందివ్వలేదు. అన్నమూ తనే పెట్టాలి, భయమూ తనే పెట్టాలి. పిల్లలకది నిరంకుశత్వం అనిపిస్తుంది.

వనజగారి కథలు నిస్పృహతో విషాదంతో మిగిలిపోవు. 

ఆవిడ తన స్త్రీ పాత్రను వివేచన, కార్యశీలత తో నింపుతారు. అదొక ఎంతో ఆవశ్యకమైన ఆశావహ దృక్పథం.

ఈ కథలో, మొదట్లో కఠినంగా “కనిపించిన” సవతి తల్లి అటూఇటూకాని అపరిపక్వమైన మనసుతో, తన తల్లిని, ఆమె మాత్రమే ఇవ్వగల రక్షణను దూరం చేసుకుని తన దగ్గరకు మాటిమాటికీ వస్తున్న పిల్ల తన తల్లి ప్రేమను అర్థం చేసుకుని తిరిగి తల్లి దగ్గరకు వెళ్ళాలంటే తను ఎలా వర్తించాలో అలా ప్రవర్తిస్తుంది. 

ఇదొక గొప్ప అడుగు; చెల్డ్ సైకాలజీ వస్తువుగా సంకలనంలో మొదటి కథకు ఎంచుకోవటం.


నడిచి నడిచి ఎంతో పురోగమించాం అనుకున్నా ఆడది మొదట చతికిలబడేది ఎక్కడో అందరికీ తెలుసు. 

అలా అంచెలవారీగా జీవితంలోని వివిధ మజిలీలలో స్త్రీలను ఎదగనీయకుండా నిరోధించే శక్తులతో పారాటం ఇరవై మూడు కథల వస్తువు.


స్త్రీ sexuality ని, ఆ విషయంగా ఆమె ఎంపికలను ఏకపక్షంగా సమర్థిస్తూనో విమర్శిస్తూనో కాకుండా ఆ విషయ సంబంధమైన నిర్ణయాలవల్ల ఎదురయ్యే పర్యవసానాలకు తన పాత్రలు పడే సంఘర్షణను, అందులోంచి ఆ స్త్రీలు దర్శించుకున్న సత్యాలను రచయిత్రి తను తటస్థంగా ఉండి నమోదు చేస్తారు. ఇది కూడా ఒక మేలైన రచనా లక్షణం. 

 

కోడలి వైపు నిలబడిన అత్తలు, స్నేహితురాలికి అండగా నిల్చిన మహిళలతో ఈ కథలు పునరుద్ఘాటిస్తునే ఉన్నాయి బలంగా,  స్త్రీలకు స్త్రీలు శత్రువులన్న అపకీర్తి చెరిగిపోయిన కాలం లో ఉన్నామని.


ఎదురు దెబ్బలు తిన్నా ఎక్కడా ధీరత్వం, ఆత్మగౌరవం జారవిడకుండా ఓటమీ గెలుపూ రెంటినీ తమ బాధ్యతగా స్వీకరించినవారే ఈ కథల్లో స్త్రీలు.


స్త్రీ అస్తిత్వపోరాటం ఎంత ముఖ్యమైన విషయమో పర్యావరణ స్పృహ, నగరీకరణ నష్టాలు, పల్లెటూళ్ళలో వాస్తవమైన రాజకీయాలు; కుల వర్గాల మధ్య ప్రచ్ఛన్నమైనవి, అసలు రాజకీయాలు…ఇలా ఏ అంశం కథకు ఎత్తుకున్నా దాని ఉపరితలాలు మాత్రం చూసినట్లు కాకుండా విషయం లోతులకెళ్ళి సమస్య మూలాలను పట్టుకోగలిగితేనే ఈమె రచనకు ఉపక్రమిస్తారు.

అదే, ‘బిహైండ్ హర్ స్మైల్’, ‘పూవై పుట్టి’ అని సెలబ్రిటీల జీవితాల ఆధారంగా వ్రాసిన కథల్లో, సదరు వ్యక్తుల గౌరవానికి భంగం కలగనీయని పద్ధతిలోనే ఆ జీవితాల్లో వైఫల్యాలకు కారణమైన సంగతులను సహానుభూతితో ట్రీట్ చేసారు ఈ కథల్లో.


ముఖ్యమైన జరీపోగు ఈ ఇతివృత్తాల నేతపనిలో ఏమిటంటే కాస్త ప్రేమ, అనురాగం, గౌరవం, కోరుకునే మహిళ అంతరంగపు అసలు రంగును చూపిస్తూ నిలబెట్టటం. ఈ అంతరంగాన్ని ఆడది భుజం మీద వేసుకు తిరిగితే వాటిల్లే ప్రమాదం తెలుసు కాబట్టే స్త్రీ ఎప్పుడూ తన ఆంతర్యాన్ని ఒక దుర్గ్రాహ్యమైన కవచం తో రక్షించుకోవాలని పటిష్టంగా చెప్పటం కూడా. 

ఈ కథలను ఒక మాటలో నిర్వచించాలంటే చెప్పవలసిన మాట స్త్రీ ఒక అజేయ. పరిస్థితులు కానీ మరో పురుషుడు కానీ మరో ఆడది కానీ పడగొట్టలేని అజేయత్వాన్ని సాధన చేసే ప్రయాణపు కథలివి.


ఎంత ఉద్వేగాల పుట్ట నో స్త్రీ, అంతగా సంయమి కూడా కాగలు.

-పద్మజ సూరపురాజు. 


పుస్తకం కావల్సిన వారు వివరాలకు సంప్రదించగలరు 


Get your copy now


balabooks.in

Whatsapp 9908091509. 

16, ఆగస్టు 2025, శనివారం

బ్రతుకు పాట

 ఎ సామ్ ఆఫ్ లైఫ్

హెన్రీ వాడ్స్‌వర్త్ లాంగ్ ఫెలో




(A Psalm of life...

H.W. Longfellow........)


బ్రతుకు పాట 


జీవిత ఒక ఖాళీ స్వప్నం అని 

దుఃఖం నిండిన సందర్భాల్లో 

నాకు చెప్పవద్దు 

నిద్రలోకి దిగిన ఆత్మ చచ్చిపోయింది 

పరిస్థితులు  ఏవీ కనిపించినట్టుగా 

ఉండడం లేదు 

జీవితం వాస్తవమైనది 

ఎంతో విలువైనది 

స్మశానానికి చేరుకోవడం దాని లక్ష్యం కాదు 

నువ్వు దుమ్ములోకే తిరిగి కలవాలి, కానీ 

అది అలా నీ ఆత్మ కోసం ఎక్కడా చెప్పబడలేదు 


విలాసాలు లేవు 

విచారమూ లేదు 

మనదారికి అవి ఏమీ ముగింపు కాదు 

అవి మన దారే కాదు 

కానీ చేతల్లో....

నిన్నటికన్నా ఈరోజు ఎంత దూరం

ముందుకు ప్రయాణించేమనేదే.....


కళ శాశ్వతమైనది 

ఉన్న సమయం మాత్రం తరిగిపోతోంది 

ఇంక మన గుండెలు ఎంత దిటవుగా ఉండినా సరే 

శవయాత్ర ముందు మ్రోగుతున్న డప్పు లాగే  కొట్టుకుంటూ వున్నాయి

 


ప్రపంచం లోని విశాలమైన యుద్ధ రంగంలో

ఈ జీవితపు క్షణ కాల మజిలీలో 

నోరులేని వాడివిగా ఉండకు 

తోలుకెళుతున్న పశువులాగా ఉండకు 

నిత్యం యుద్ధం చేస్తున్న నాయకుడిలాగే ఉండు 


భవిష్యత్తుని నమ్మకు 

అది ఎంత ఆహ్లాదంగా ఉన్నప్పటికీ 

చచ్చిపోయిన గతాన్ని తనని తాను 

మట్టి చేసుకోనీ 

జీవిస్తున్న వాస్తవంలోనే కార్యాచరణ కానివ్వు 

హృదయం పెట్టు అన్నింటా 

ఇక పైన భగవంతుడున్నాడు 


గొప్పవారి జీవితాలు మనకు గుర్తుచేసేది 

మన జీవితాలను మనం అత్యుత్తమమైనవిగా చేసుకొమ్మనే......

మరి వెళ్ళిపోయేటప్పుడు మన వెనుక 

కాలం ఇసుక తిన్నెల్లో మన అడుగుల గుర్తులు 

వదిలి వెళ్లాలని 


కాలి గుర్తులు, అవి బహుశా నట్ట నడి సముద్రపు 

 అతి భయంకరమైన గొప్పదైన రూపం నుండీ బయటపడిన నావికుడు __

అందరిచేతా తృణీకరించబడ్డ 

తాను ప్రయాణించిన నౌక  చిధ్రమైన ఒక సోదరుడు

వాటిని చూసి మరలా బ్రతుకు దారి పట్టవచ్చు 


మళ్ళీ మనం లేచి నిలబడాలి 

ఎటువంటి సంక్షోభం లో నైనా నిలబడే దమ్ముతో 

ఇంకా ఎప్పటికీ గెలుస్తూనే ఉండాలి 

ఎప్పటికీ ఈనీతిని అనుసరిస్తూనే ఉండాలి 

శ్రమ పడ్డం ఎలాగో నేర్చుకోవాలి 

నిరీక్షించడం కూడా నేర్చుకోవాలి ....


తెలుగు అనువాదం: 

P. సింహాద్రమ్మ