అవే ముఖ చిత్రాలు ..
అన్నిచోట్లా... నామ వాచకం
మోసగించేవాడికి మోసపోయామనుకునే వారికి
వేదిక ఎక్కడైనా కావచ్చు వేడుక రూపం మారవచ్చు
విషయం మాత్రం ఎప్పుడూ ఒకటే !
ఆవాంచిత స్నేహాల వల వేసి ఒడిసి పడుతున్న వ్యాఘ్రాలెన్నో
మాటల తీయదనంలో మోసపోతున్న చంచితలెందరో !
భ్రమపడి పొరబడి జీవితాలని కాల్చుకున్న అభిసారిక లెందరో
చిత్తకార్తె కుక్కల వలే ఆ కక్కుర్తి ఏలనో!?
వీడు ఇంటిలో పురుష పుంగమా?
పరుల ఇంట పర పురుష భుజంగమా !?
కాల సర్పం కాటుకి బలి అయ్యేదెన్నడో?
కొన్ని చోట్ల ... సర్వ నామం
స్నేహంలో ప్రేమ ప్రేమలో స్నేహం
ఏది ఎందులో ఉండక పోయినా ఆశ్చర్యం ఏమీ లేదు
కానీ ప్రేమలో నమ్మకం లేవక పోవడమన్నంత
విచారం ఇంకోటి లేదు, అంతకన్నా అవమానం వేరేకోటి లేదు
అవమానింపబడ్డ ప్రేమలో తడిమి తడిమి తడిని కాంచడమంటే
ఎడారిలో ఒయాసిస్ కై అన్వేషణే !
ఆత్మాభిమాన బలం మెండుగా ఉన్న ఆ చెంత
చీత్కారం తప్ప ఏమి విదల్చని చోట
కపట వేషాలు, మోసాలు ఆ మాత్రం తెలియనివా ?
అతివల అంతరంగాలోచానలపై పై అంత చిన్న చూపు ఏమిటో!
మారండి.. మారండి తల్లులూ
మసిపూసి మారేడుకాయ అని చెప్పేస్తే నమ్మకండి
ముఖ చిత్రాలని నమ్మకండి
మనసు చిత్రాలని ఆవిష్కరించుకోండి