ఆ తోటలో సుతి మెత్తని పదధ్వనుల మధ్య
పావురాళ్ళు స్వేచ్చగా ఆడుకుంటున్నాయి
ఓ పిల్ల తెమ్మెర మోయలేక
పూలపరిమళాలని జారవిడిచి వెళ్ళినట్లుంది
జాబిలీ తల్లి వెన్నెల పిల్లని పారేసుకుంది
ఓ రాతిరి బద్దకంగా ఇక్కడే ముసుగేసింది
చక్కని పాప ఆడి ఆడి అలసిపోయింది
మళ్ళీ నిద్రలేచి....
తన ఇంద్రధనుస్సుని ఎవరో ఎత్తుకుపోయారని
ఏడిస్తే నేనేం చేయగలను ?
స్వచ్చతని ఎలా నిలుపుకోవాలో తెలియని నేను
ఎవరో నా కలలని అలాగే ఎత్తుకుపోయారని
మరెవరో నా కలంలోకి నెత్తుటి చుక్కలు
కన్నీటి పాత్రలు ఒంపారని చెప్పడం తప్ప.
నా కన్నీటిని తన లేలేత చేతులతో తుడుస్తూ ...
ఎందుకేడుస్తావ్ ? అనడిగింది
ఇక్కడ నొప్పిగా ఉంది
గుండెపై తన చేయి పెట్టి చూపిస్తూ అన్నాను .
ఇంద్రధనుస్సు పోయిందనా ?
ఏడవకు ... మళ్ళీ రేపోస్తుందిలే... అంది హామీ ఇస్తున్నట్లుగా
జ్ఞాన బోధతో ఆత్మావలోకనం
ఈసారి నవ్వులో కన్నీళ్ళు చిట్లాయి
ఆ బిందువు పై పడిన నవ్వు కిరణమై
ఇంద్రధనుస్సై తోటంతా విరిసింది. .
వనజ తాతినేని 04/01/2015
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి