11, జనవరి 2015, ఆదివారం

ఎవరన్నారు వ్రాయడంలేదని ?
ఎవరన్నారు .. వ్రాయడం లేదని?
అస్పష్టమైన భావాలతో.
అనల్పాక్షరాలలో...
అసంపూర్తి కథనంలో ..
నిత్యం నాతో నాకే  ఘర్షణ

గుండె గానం గొంతు దాటనంటుంది
భావరాగం పెదవి పలకనంటుంది
వ్రాతవైనం  అక్షరాలలో కుదరనంటుంది
ఆత్మజనిత వాక్యమేదో జ్వలిస్తూనే ఉంటుంది
వ్రాయనందుకు శపిస్తూనే ఉంటుంది

ఎవరన్నారు  వ్రాయడం లేదని !

అక్షరాల పుష్పవనంలో
సీతాకోక చిలుకల ఆట మొదలైంది
భ్రమరాల దాహం తీరనట్లుంది
గాలిపాట ప్రవహిస్తోంది
కథానికో , కవితో  సంయోగం చెందుతున్నాయి .

-వనజ తాతినేని 11/01/2015 

9 వ్యాఖ్యలు:

Kondala Rao Palla చెప్పారు...

సంఘర్షణ అనేది సాహిత్యమవుతూంటే కథానికో, కవితో... అదో నిరంతర ప్రయాణం !

శ్యామలీయం చెప్పారు...

కవిత బాగుందండీ వనజగారూ, అభినందనలు. కొన్ని చిన్నచిన్న సవరణలూ సూచనలూ గమనించండి.

"నిత్యం నాతో నేను ఘర్షణ"
ఇది అన్వయం కావటం లేదండీ సరిగా "నిత్యం నాతో నాకే ఘర్షణ" అంటే బాగుంటుంది అన్వయసుభగత్వం కోసం.

దాటనంతుంది ... pl correct the typo.

"అక్షరాల వనంలో"
తరువాతి పాదంలో సీతాకోచిలుకల ప్రసక్తినీ, ఆ వెంటనే భ్రమరాలనూ రంగం మీదకు తెచ్చారు కాబట్టి. మొదటి పాదం కొంచెం మార్చండి. "అక్షరపుష్పవనంలో" లేదా "అక్షరాల పూదోటలో" అని.

" ప్రవహిస్తుంది" అన్నది " ప్రవహిస్తోంది" అని మార్చాలండి. ఎందుకంటే తరువాతి పాదంలో క్రియాపదం "చెందుతున్నాయి" అని ఉందికదా - అందుకని.

మొత్తానికి ఇది ఒక చక్కని కవిత.

మరికొన్ని ఇటువంటి భావాలకు చోటికి మరొక రెండు చరణాలను చేర్చితే మరింత సమగ్రస్వరూపంతో ఇంకా కళగట్టే అవకాశం ఉందీ‌ కవితకు. పరిశీలించగలరు.

ఒకవేళ మీకీ విమర్శ అధికప్రసగంగా అనిపిస్తే మన్నించగలరు.

వనజ తాతినేని చెప్పారు...

Kondala Rao Palla గారు .ధన్యవాదములు .

వనజ తాతినేని చెప్పారు...

శ్యామలీయం గారు .. మా అక్షర దోషాలని, భావ దోషాలని సరిదిద్దాలని మీరు చూపే చొరవ మాకు ఎప్పటికి గురుతుల్యమినదే ! మీరు సూచించినట్లు చేసానండీ! వచన కవిత్వంలో ఇవన్నీ పట్టించుకోరు. భావాన్ని హృదయగతం చేసుకోవడం పైనే దృష్టి పెడతారు . అందుకే కవిత్వం అలా వర్దిల్లుతుందేమో ! మీలా బెత్తం పట్టుకునే మాస్టారు ఉంటే అసలు కవిత్వం వ్రాయరు . వ్రాసే వాళ్ళు నేర్చుకుంటూ వ్రాస్తారనుకోండి. ధన్యవాదములు . పూర్తీ కవిత ఎలా ఉంటుందో చూసించండి ప్లీజ్ !

అజ్ఞాత చెప్పారు...

కవిత బాగుంది కాని ఇంతకీ మీరు శ్యామలీయం గారిని పొగిడినట్లా, ఎగతాళి చేసినట్లా?

వనజ తాతినేని చెప్పారు...

అజ్ఞాత గారు .. నేను అజ్ఞాతంగా ఉంది కామెంట్ చేసేవారిని పట్టించుకోను అసలు కామెంట్ కూడా ప్రచురించను కానీ మీకు సమాధానం చెప్పాలి కదా ! నిజంగా మీరు అజ్ఞాత కాదండీ! అజ్ఞాని. శ్యామలీయం గారిని ఎగతాళి చేయాలనుకుంటే . గురుతుల్యులు అని అనను అలాగే కవితని ఇంకా ఎలా పెంచి వ్రాస్తే బావుంటుంది ? సూచించండి అని అనను కదండీ ! అజ్ఞాని అని మిమ్మల్ని పేర్కొన్నందుకు మన్నించాలి. అది నా సంస్కారం కాదు. కానీ తప్పలేదు .

శ్యామలీయం చెప్పారు...

వనజగారూ,

కవిత్వవిషయకమైన సలహా యేదన్నా ఇచ్చినప్పుడు, మొదటనో చివరనో తప్పకుండా ఆ సలహా వెనుక ఉన్నది నా చాదస్తమేననీ నచ్చకపోయినా - నొచ్చుకున్నా నన్ను మన్నించవలసిందనీ కూడా వ్రాస్తాను. అప్పుడప్పుడు నా మతిమరపు వలన ఆ మాట వ్రాయటం మరచిపోతున్నాను.

ఇప్పుడు కూడా సాహసించి అదే చాదస్తంతో మరికొంచెం వ్రాస్తున్నాను.

సంప్రదాయకవిత్వమైనా ఆధునికకవిత్వమైనా అది కవిత్వమే. ఆధునికమా, సంప్రదాయికమా అన్న వివక్షలేకుండా, యే‌కవితకైనా, ఒక కవితకు ఎటువంటి గౌరవాదరాలు తగినవో, అవి ఆ కవితకు తప్పక లభించాలి.

ఒక అభరణానికి దాని నిర్మితి వెనుక ఉన్న అభిరుచి ఆత్మ, దానికి సొగసునిచ్చే కెంపులో, వజ్రాలో, పచ్చలో అవి దాని ప్రాణం. దానికి ఒక ఆకృతినిచ్చే బంగారం ఆ ఆభరణానికి శరీరం.

ఒక ఇంటికి దాని శుభాశుభలక్షణాలు ఆత్మ, ఆ ఇంటికి అమర్చిన హంగులూ సౌకర్యాలూ దాని ప్రాణం, దాని అందమైన అకృతికి ఆధారమైన పునాదీ, గోడలూ, కప్పూ, గుమ్మాలు కిటికీల వంటివి దాని శరీరం.

ఒక వాక్యానికి అంతర్యం ఆత్మ. వ్యక్తీకరించిన భావం దాని ప్రాణం. పదసంపదను అందించిన భాష దాని శరీరం.

అదేవిధంగా కవిత్వానికి రసం అన్నది ఆత్మ, భావం ప్రాణం, భాష శరీరం.

అందుచేత మనం కోరిన భావాలను చక్కగా వ్యక్తపరచటానికి భాష పట్ల తగిన శ్రధ్ద, భాషపై తగిన అధికారం అన్నవి అవసరం. మనకు భాషపైన ఎంత అధికారం సిధ్దిస్తే అంత చక్కగా భావవ్యక్తీకరణ కుదురుతుంది. అంత చక్కగా మన కవిత్వంలో అంతర్లీనంగా ఉన్న ఆంతర్యం రససిధ్ధిని పాఠకుడికి కలిగిస్తుంది. వాక్యం రసాత్మకం కావ్యమ్‌ అన్నారు మనవాళ్ళు. అందుచేత అ రససిధ్ధిని కలిగించటానికి కవిత్వం ప్రయత్నించాలి.

నగలదుకాణంలో మనం ఒక నగను పరిశీలించేటప్పుడు బంగారం నాణ్యతకు కూడా ప్రాముఖ్యత ఇస్తున్నాము కదా? మంచి ఇల్లు కావాలంటే మంచి డిజైన్ అనే దానితో పాటు నిర్మాణసామాగ్రి నాణ్యతకూ ప్రాముఖ్యత ఇస్తున్నాము కదా. కవులు కూడా తమ కవిత్వసాధనలో భాషవిషయంలో అటువంటి శ్రధ్ధనూ గౌరవాన్ని ప్రదర్శించటం ఉచితం అన్నది నా భావన.

మీరు చక్కగా వ్రాస్తున్నారు. ఇంకా బాగా వ్రాయగలరు ముందుముందు. వీలైతే అధునిక వచనకవుల్లో కుందుర్తి, శ్రీశ్రీ, తిలక్ వంటివారి కవిత్వాలనీ, తదనంతకవులనూ అధ్యయనం చేయండి. భావప్రకటన పట్ల మాత్రమే శ్రధ్ధ చూపటం సరైన మాట అన్నది నిజమే కాని భాషపై పట్టుపెరిగిన కొద్దీ భావప్రటనలో మరింత సౌలభ్యం మీకు చేకూరుతుంది. లేని పక్షంలో మనం ప్రకటించాలనుకున్న భావం నిస్సందేహంగా మన కవిత్వం ప్రకటిస్తున్నదా అన్నది కొంత సందిగ్ధంలో పడిపోయే అవకాశం ఉంది.

ఈ‌ రసమే కవిత్వానికి ఆత్మ అన్నది నా సిధ్ధాంతం కాదు. అది అనాది యైన భారతీయ కవిత్వసిధ్ధాంతం. ఈ కాలం వారికి నచ్చకపోతే నేను అభ్యంతరం చెప్పను. కాలం మారుతోందని నాకు తెలుసుకాబట్టి, కేవలం నేను చెబుతున్నది భారతీయ సిధ్ధాంతాన్ని మరొకసారి పరిచయం చేదామనే ఉద్దేశంతోనే కాని ఏవిధమైన అధిక్షేపణాదృష్టితోనూ కాదని మనవి చేసుకుంటున్నాను.

అన్నట్లు ఈ కవితకు మరికొంచెం ఇటువంటి కొన్ని భావాలను చేర్చి పరిపుష్టం చేస్తే ఇంకొంచెం సమగ్రచిత్రం ఆవిష్కృతం అవుతుంది పాఠకుడి మదిలో అన్న ఉద్దేశంతో వీలుంటె కొన్ని చరణాలను చేర్చమని సలహా ఇచ్చాను. ఒక ఇల్లు కట్టేటప్పుడు అన్ని విధాలా సమగ్రంగా సంపూర్ణంగా ఉందా అన్నదీ ఎలా చూస్తామో అలాగే కవిత్వంలోనూ సమగ్రత అన్నదీ చూపటం కవులకూ, చూడటం పాఠకులకూ సంతోషం కలిగిస్తుంది. బాగా మనస్సుకు పట్టేందుకు తగినంత నిడివీ, ప్రతీకలూ వంటివి కూడా మంచి భూమిక పోషిస్తాయని చెప్పటం నా ఉద్దేశం. అంతే. అదెట్లా సాధించాలో అన్నది మంచి భావశబలతకల మిమ్మల్ని ఆట్టే ఇబ్బంది పెట్టగల అంశం కాదని నా నమ్మకం.

ఒక బెత్తం మేష్టారులా కూర్చుని మిమ్మల్ని కాని మరే వర్ధమాన కవిని కానీ తప్పులు పట్టి గదమాయిస్తూ హడావుడి చేయటం నా ఉద్దేశం కానేకాదు. అలా చేసినంతమాత్రాన నా బోటి ఛాందసుడికి బెదిరి తోచినరీతిగా కవిత్వం వ్రాయటం మానే అర్భకులు ఎవరూ నేడు లేరనే అనుకుంటున్నాను. కాని నేను కవిత్వం వ్రాసే వారికి నా సలహాలపేరుతో అడ్డుపుల్లలు వేస్తున్నానని భావనలు కలగటం నాకు కూడా సమ్మతం కాదు. కాని నేను పునరాలోచించుకోవాలేమో, ఇలా సలహాలు ఇవ్వటం అన్నది ఈ‌ కాలంలో అనుచితమేమో! అలాగైతే తప్పక ఆ అలవాటును మానుకోవటానికి ప్రయత్నిస్తాను.

అజ్ఞాత చెప్పారు...

వనజ గారూ,
నువ్వు అజ్ఞానివి అంటారా? అలాక్కానివ్వండి. మిడి మిడి జ్ఞానం కన్నా అజ్ఞానమే తక్కువ ప్రమాదకరం కదా. అయినా మీకు నచ్చని కామెంట్ పెట్టినంత మాత్రాన అజ్ఞాని అయిపోతారన్నమాట మీ దృష్టిలో. బాగుంది. లేక అజ్ఞాత, అజ్ఞాని అనే పదాలకి రైమింగ్ కుదిరిందని వాడారా? ఆ రకంగా ఎదుటివారిని అజ్ఞాని అనటం వ్యక్తిగత దూషణ కోవలోకి వస్తుందని, మర్యాదని అతిక్రమించినట్లవుతుందనీ మీరు అనుకోలేదన్నమాట. పైగా అనదల్చుకున్నది అనేసి, అనక తప్పలేదు, కాని ఇది నా సంస్కారం కాదు అని సమర్ధించుకోవటం కూడా హర్షణీయం కాదు. తప్పనిసరి అనిపించినప్పుడు కూడా సంయమనం పాటించటం సంస్కారానికి కొలబద్ద. మాటలోను, చేతలోనూ సంస్కారం ప్రతిఫలించాలి.

రెండవది, అజ్ఞాతలు వ్రాసే కామెంట్లని పట్టించుకోనని, అసలు ప్రచురించననీ అన్నారు మీరు. అది మీ బ్లాగు యొక్క పోలసీ కావచ్చు, మీ ఇష్టం. తొందరలో వుండి అజ్ఞాత గా వ్యాఖ్య పెట్టాను అంతే. అలా ఎన్నోసార్లు ఎంతోమందికి జరుగుతుంది. నేను నా పేరుతో వ్రాసినా నా కామెంట్ లో ఏమీ మార్పుండేది కాదు, మీకు నా గురించి అధికంగా తెలిసేదీ లేదు నా ప్రొఫైల్ ఆన్లైన్ లో లేదు కాబట్టి. అయినా రచయిత కన్నా రచనలే ముఖ్యమని ఈ మధ్య బ్లాగుల్లో చర్చలు జరుగుతున్నాయిగా, చూసే వుంటారు మీరు. అలాగే వ్యాఖ్యల విషయంలో కూడా.

మీరు నా కామెంటుకి సమాధానం ఇవ్వాలని నన్ను అజ్ఞాని అనాలని ఎలా నిశ్చయించుకున్నారో, నేను కూడా మీ స్పందనకి ప్రతిస్పందన ఇవ్వటం సబబే కదా. అజ్ఞాత గా మొదలెట్టాను గనుక అజ్ఞాత గానే కొనసాగిస్తాను ఈ జవాబుని కూడా. పబ్లిష్ చేస్తారో లేదో మీ ఇష్టం. నాకొచ్చే నష్టమేం లేదు.

ఇక శ్యామలీయం గారి వ్యాఖ్య దానికి మీ సమాధానం విషయానికొస్తే, మీరు శ్యామలీయం గారి మొదటి కామెంట్ కి ఇచ్చిన సమాధానం లో "గురుతుల్యులు" అని, "మీరు సూచించినట్లు చేసానండీ ! " అంటూనే అక్కడతో ఆపెయ్యకుండా "వచన కవిత్వంలో ఇవన్నీ పట్టించుకోరు. ................... అందుకే కవిత్వం అలా వర్ధిల్లుతుందేమో! " అనటం ఆయన్ని పొగుడుతూనే, ఆయన చేసిన సూచనలు వర్ధిల్లటానికి అంత ముఖ్యమైనవేమీ కావనే అర్ధంలో చెప్పినట్లు కాదా?
తర్వాత మీరు అన్నది "మీలా బెత్తం పట్టుకునే మాస్టారు ఉంటే అసలు కవిత్వం వ్రాయరు" అనటం ఆయన్ని హేళన చేస్తూ చిన్నబుచ్చే అర్ధం రాదా?
మీకు అనిపించలేదేమో గాని, మీ వ్యాఖ్య ని సరిగ్గా చదివితే ఈ పరస్పర వైరుధ్యం కనిపిస్తుంది. నాకు కనిపించింది కాబట్టే నేను నా మొదటి వ్యాఖ్య పెట్టి మీచేత అజ్ఞాని ననిపించుకున్నాను. మీకు తెలుసుగా, శ్యామలీయం గారు ఉభయభాషా ప్రవీణులని, పాండిత్యం గలవారనిన్నూ. అలాగే వయసులో పెద్దవారని కూడా మీకు తెలిసే వుంటుంది. మరి అటువంటి వ్యక్తి వ్యాఖ్య మీద మీరు అలా స్పందిచవచ్చునా?
నేను ఇచ్చిన ఈ విశ్లేషణ మీకేమీ గొప్పగా అనిపించకపోయినా, మీరు శ్యామలీయం గారికిచ్చిన సమాధానంలో ఇటువంటి అర్ధమే ధ్వనించింది. అందువల్లే నా మొదటి వ్యాఖ్య.

మరో మాట కూడా చెప్పి ముగిస్తాను. బ్లాగుల్లో కామెంట్లు ఎలా ఉండాలి అనే చర్చ ఒకటి, మార్గదర్శకాలు తయారు చేస్తే బాగుంటుందనిన్నూ కొంతకాలం క్రితం పల్లా కొండలరావు గారు మొదలెట్టారు. దాంతోపాటే వ్యాఖ్యాతల పట్ల బ్లాగు ఓనర్లు ఎలా వుండాలి అనే అంశం కూడ చర్చకు పెట్టమని, మార్గదర్శకాలు ఆహ్వానించమనీ నేను అప్పుడే సూచించుదామనుకున్నాను, కాని కుదరలేదు. దీని ఆవశ్యకత చాలా వుంది ప్రస్తుత తెలుగుబ్లాగుల లోకంలో.

నా ఈ కామెంట్ మీరు పబ్లిష్ చెయ్యకపోయినా నా జీవితానికొచ్చే నష్టమేమీ లేదు. దీన్ని పొడిగించే ఉద్దేశ్యమూ నాకు లేదు. మీకందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

వనజ తాతినేని చెప్పారు...

అజ్ఞాత గారు ... వెరసీ జ్ఞానం, సంస్కారం లోపించిన "అజ్ఞాని" ని నేననిపిస్తుందండీ ! క్షమించాలి. మరియు ధన్యవాదములు . వ్యక్తులకన్నా రచనలలో విలువలే ముఖ్యమని నా అభిప్రాయం కూడా నండీ. వ్యక్తిగతంగా ఎవరిని కించపరచడం, లేదా విమర్శించడం నా అభిమతం కాదు. మీకు బాధ కల్గిన్చినందుకు క్షమించండి.