3, మే 2015, ఆదివారం

బంగారు ఉదయం

నిదుర మంచం వదులుతూ దేవునికి కృతజ్ఞత చెప్పుకుంటాను .


తండ్రీ !


నాకు మరొకరోజు ఆయువునిచ్చి


జీవితాన్ని ఆస్వాదించే వరం ఇచ్చినందుకు


అలాగే పోరాడే శక్తిని కూడా ఇవ్వు తండ్రీ !





ఉత్థానపతనాలు  ఆరోహణా అవరోహణాలు


జయాపజయాలు వెలుగు నీడలు


పేరుకి ఏదైతేనేం అవన్నీ సహజాతాలు అని నమ్మినదాన్ని 


పిడికెడు మెతుకుల లేమితోనూ ప్రేమ రాహిత్యం తోనో 


చచ్చే దౌర్భాల్యం లేనిదాన్ని



తప్పు చేసినది ఒకరైతే శిక్ష నేననుభవిస్తూన్నదానిని


నడక పై నడతపై ఆలోచనలపై ఆర్ధిక స్థితిగతులపై


నిత్యం నిఘా వేసి  పొల్లు కబుర్లుతో


అనుచిత వ్యాఖ్యానాలు చేస్తుంన్నందుకు చస్తూనయినా


బ్రతికే వరం ఉన్నందుకు గర్వ పడుతూన్నదానిని  


మనుషులని ఆస్తుల లెక్కన చూడటం కాక


విలువల లెక్కన ప్రేమల లెక్కన


చూడటానికి అలవాటు పడిన దాన్ని 




మానధనం కన్నా అభిమానధనం కన్నా


వారసత్వ ఆస్తులు గొప్పవేమి కాదని నమ్మినదాన్ని  


 ఆస్తులకి కుక్కల లెక్కన కాపలా కాయడమే అసలైన వారసత్వం కాదని


ధిక్కారస్వరంతో తల ఎగరేస్తున్న దాన్ని


అరొకొరో మిగిలినఆస్తులని అమ్ముకోవడమే తప్ప


వేరొకటి అమ్ముకోలేని అసహాయురాలిని



ఎవరైతే దాడి చేస్తారో వారినే నా వారిగా ఆహ్వానించి


ముందు వరుసలో కూర్చోబెట్టే దౌర్భాగ్యాన్ని


 నాకెందుకిచ్చావని వగస్తున్న దానిని 


పైకగుపించని హింసని,ధ్వంసని  


సుతిమెత్తని రంపపుకోతలా అనుభవిస్తూ 


పొగిలి పొగిలి ఏడుస్తూనే... నవ్వుతూ 


నాకిచ్చిన రోజుని దీరోదాత్తంగా  ముగించాననుకుంటూ


వేదనగా ఒత్తిగిల్లుతూంటాను..తండ్రీ ! ప్రతి రోజు 


నీవిచ్చే ... ఓ  బంగారు ఉదయపు సాక్షాత్కారం కోసం.