3, జనవరి 2018, బుధవారం

ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట.మైదానంలో కావాల్సిన పుస్తకం కోసం వెతుకుతుంటే
మస్తకమే ఎదురైందామెకి
ఆ నాలుగు కళ్ళు కలిసిన సమయంలో
అప్పుడెప్పుడో అపరిచిత భావాలు ముప్పిరిగొన్న
క్షణాలు గుర్తుకురావడమంటే మాటలు కాదు
మనసు ముంగిట్లో ఆవుపేడతో అలికిన నేల పచ్చిదనంపై
తెల్లని రాతిపిండితో ముగ్గేసినట్లు
పసుపు కుంకుమతో అలంకరించినట్లు
ఊహల ద్వారానికి బంతిపూల తోరణం ఊగుతున్నట్లు
ఇష్టమైన రంగు దుస్తుల్లో దాచుకున్న
ఎండిన మరువపు కొమ్మ మైమరుపుతో నిలేసినట్లు
ఒకరిలోకి ఒకరు ప్రవహించినట్లు ఉంటుంది

కారణాలు వెతుక్కున్నారు
ఎవరిదో ఒకరిది మాట తూలిందని
వెన్న ముద్దలో తుమ్మముల్లు గుచ్చినట్లై౦దని
రెండో చోట బరువు తూగింది
హృదయాన్నితూకపు రాళ్ళు చేసని
ఆఖరికి నవ్వుకున్నారు తడికళ్ళతో

ఓ ముళ్ళ కొమ్మ పడమటికి ఒంగిన
నిండు చందమామను కూడా
రెండు సగాలుగా విడగొట్టినట్టు చటుక్కున
ఆ నాలుగు కళ్ళు దృష్టి మరల్చుకుంటాయి
జ్ఞాపకాలని వెచ్చబెట్టుకుంటూ అలవాటైన నడకలోకి దారి తీస్తాయి

దృశ్యాన్నైనా, వాక్యాన్నైనా, నిశ్శబ్దాన్నైనా,
ఆఖరికి మనషినైనా మనసుతో పట్టుకున్నంత
కాలం అద్బుతాలు ఆవిష్కారమవుతూనే వుంటాయి
ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట.

(ఈ రోజు పుస్తక మహోత్సవంలో అరవై పైబడిన ఒక స్త్రీ తన బాల్య స్నేహితుడు కనబడగానే సంతోషంతో తనమునకలైపోయింది. వారిరువురూ కాసేపు మాట్లాడుకున్నారు. వారు విడిపోయాక ఆ స్త్రీ అతని గురించి అతని సాహిత్యాభిలాష గురించి చాలా సేపు మాట్లాడింది. కళ్ళల్లో ఆమెరుపు ,ముఖంలో సంతోషం చూసి చెప్పలేనిది ఇంకేదో చెప్పకనే చెప్పింది.. నా కవి హృదయం ఆ భావాలని ఇలా ఒడిసి పట్టుకుంది. ఆమె ఈ కవిత చూస్తుంది చాలా సంతోషిస్తుంది .. నాకు తెలుసు. (అన్నట్టు ఇంకో మాట ..నేను కవిని కాదు అన్నవారిని కత్తితో పొడిచేస్తా .. ఈ మాట మాత్రం .. just kidding. )