అంజనీ యలమంచిలి
27 జనవరి 2017 న వ్రాసిన పుస్తక పరిచయం
‘రాయికి నోరొస్తే’ నా మాటల్లో....
---------------------------------------------
ముఖపుస్తకం... బ్లాగుకే పరిమితం కాదు...
నా గమ్యం అనంతం... నా అక్షరం అజరామం...
‘ఆనందం అర్ణవమైతే,
అనురాగం అంబరమైతే----
అనురాగపు టంచులు చూస్తాం,
ఆనందపు లోతులు తీస్తాం...’ అన్నట్టుగా..
తన భావాల వెల్లువలను..
తలపుల దాహార్తిని...
అక్షరాలుగా మలచి... కథలు, కవితలు చెక్కి...
వాటికో రూపం ఇస్తే... అదే ‘రాయికి నోరొస్తే’...
కృషివుంటే మనుషులు రుషులవుతారన్నట్టుగా
కృషి చేస్తే రాళ్లతోనూ మాట్లాడించొచ్చు అని
రుజువు చేశారు స్నేహితురాలు వనజ తాతినేని.
తొలి కథల సంపుటం వెలువరించిన వనజ గారికి
హృదయపూర్వక అభినందనలు...
***
ఇక ఈ పుస్తకం విషయానికొస్తే....
అర్థవంతం... చైతన్యవంతం అయిన శీర్షిక ‘రాయికి నోరెస్తే’.
అలాంటి ఒక భావస్పోరకమైన శీర్షికను ఈ కథల సంపుటికి పెట్టడంలోనే
రచయిత్రి ఉద్దేశ్యం అర్థమౌతుంది.
ఇందులో వున్నవి ఇరవై నాలుగు కథలు...
మన కళ్లముందు నిలుస్తాయి ఎన్నో జీవితాలు...
వాస్తవిక సజీవ దృశ్యాలు...
తన భావాలను, తన పరిశీలనలోని వివిధ అంశాలను
సూటిగా... స్పష్టంగా.... సరళంగా... హృదయాన్ని తాకేలా చెప్పారు ప్రతి కథలోనూ.
'ఆమెనవ్వు' కథలో స్త్రీలోని రెండు కోణాలను చక్కగా ఆవిష్కరించారు.
‘వ్యాపారం సాగటానికి పైట కాస్త పక్కకి జరిపి, చిన్న చిరునవ్వు నవ్వుతున్నా...
అంత మాత్రానా రంకుదాన్ని అయిపోలేదంటూ..’ తన వ్యక్తిత్వాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తుంది.
తన టిఫిన్ బండి దగ్గరకొచ్చేవారి కళ్లలోని ఆకలిని తట్టుకుంటూ...
కడుపులోని ఆకలిని తీర్చుతూ... కుటుంబానికి అండగా నిలిచిన మహిళ ఒకరు.
నగలషాపుల వాళ్లు, బట్టల షాపుల వాళ్లు, కార్ల షాపుల వాళ్లు ఆడాళ్లను చూపిస్తూ అడ్వర్టయిజ్‌మెంట్లు ఇస్తున్నారు.
వ్యాపారం బాగా సాగడానికి చెమటలు కక్కే మా ఆవిడను చూపిస్తే తప్పేమిటి... అంటాడు కృష్ణ.
ప్రపంచీకరణ ప్రభావం మన నట్టింట్లోకి వచ్చిన తర్వాత మహిళను వ్యాపార వస్తువుగా చూపించడం మరింత ఎక్కువైంది.
ప్రపంచీకరణ ప్రభావాన్ని కృష్ణ పాత్ర ద్వారా చక్కగా చెప్పించారు.
తద్వారా భర్త చేతిలో వ్యాపార వస్తువుగా మారిందొక యువతి.
అలాగే....‘లఘుచిత్రం’ కథ. నిజం చెప్పాలంటే... హృద్యంగా వుంది. మనసును హత్తుకుంది.
ఒక సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసుకొని... కఠిన వాస్తవాలను బట్టబయలు చేసిన కథ ఇది.
ఇది కథకాదు... వ్యధ్యార్థ జీవితాల యధార్థ గాథ. కథ చెప్పిన తీరు కూడా ఆకట్టుకుంది.
‘దేవసేన కాళ్లపై పడుకున్న అభి... అమ్మ కాళ్ళపై పడుకున్నట్టే ఉంది. అప్రయత్నంగా ఆమె చేయి తల్లి చేయిలా మారిందంటూ...’ చెప్పడం హృదయాన్ని టచ్ చేస్తుంది. అంతలోనే చివరివాక్యం పెదాలపై నవ్వులనూ పూయిస్తుంది.
మరో కథ ‘గడప బొట్టు’. ఈ కథలో ఒక ఆవేదన వుంటుంది... ఒక ధిక్కారమూ వుంటుంది.
ఒక చైతన్యం వుంది.. ఒక సందేశం వుంది.
ఇంకో వందేళ్లు గడిచినా... నాగరికత ఎంత అభివృద్ధి చెందినా...
ఈ తరహా మూఢాచారాలు మన సమాజాన్ని అంత తేలిగ్గా వదలవు.
మీ కథలో సమాజాన్ని ఎదురించిన ఇద్దరు స్త్రీలున్నారు.
ఒకరు భర్త ఉండి... బొట్టు, ఇతర అలంకారాలకు దూరంగా ఉంటే,
మరొకరు భర్త లేకున్నా... చిన్ననాటి నుంచి తనకు అలవాటైన అలంకారాలను వదిలిపెట్టకపోవడం.
వీళ్లిద్దరూ తమ తమ మార్గాల్లో తమ అస్తిత్వాన్ని నిలుపుకొనేందుకు..
తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకునేందుకు కొన్ని కష్టాలను భరించారు... భరిస్తున్నారు... అయినా ఎదిరిస్తున్నారు.
ఇటువంటి వాళ్లు సమాజంలో అనేకమంది వున్నారు.
బొట్టు, మెట్టెలు, తాళిబొట్టును చూసి గాదు...
మమ్మల్ని మనుషులుగా గుర్తించండి అని ఎదురించి నిలబడాలి. ఈ సనాతన సంప్రదాయాల్ని బద్దలు కొట్టాలి.
అప్పుడే స్త్రీ తనను తాను నిర్మించుకోగలుగుతుంది... భవిష్యత్తరాలకు మార్గదర్శకమౌతుంది.
‘పురిటిగడ్డ’ కథ కూడా చాలా బాగుంటుంది.
ముఖ్యంగా ముగింపు హృద్యంగా వుంది. మనసును పిండేసింది.
వ్యవసాయం పనులు ప్రారంభం నుండి అవి ముగిసే వరకూ రైతూ కూలీల మధ్య ఉండే అనుబంధాన్ని కళ్లకు కట్టారు.
రైతు సాదకబాధలు... కూలీల వెతలు, ముఖ్యంగా వలస కూలీల వ్యధలు చక్కగా రాశారు.
కూలీల పనుల్లోని శ్రమైక జీవన సౌందర్యాన్ని చక్కగా వర్ణించారు.
అలివేలు మరణం... వారి సొంత ఊరికి వెళ్లడానికి ఆర్ముగమ్ ప్రయాసను అక్షరబద్ధం చేసిన విధానం బావుంది.
"ప్రతి ప్రసవం గండమని
ప్రతి నిమిషం మరణమని
తెలిసి కూడా కన్నతల్లులు
మరల మరలా కంటారు పిచ్చి తల్లులు"... అద్భుతమైన వ్యక్తీకరణ.
***
ఇలా ఈ పుస్తకంలోని 24 కథల గురించి చెప్పాలనే వుంది.
కాకపోతే చదివేవారికి విసుగుపుట్టిస్తానేమో అనే భయంతో మూడు నాలుగు కథల గురించే ప్రస్తావించాను.
మిగతా కథలు కూడా ఆద్యంతం ఆసక్తికరంగా చదివిస్తాయి.
వాస్తవిక ఘటనలను ఇతివృత్తాలుగా తీసుకొని...
వాటికి తనదైన చక్కని శైలిని జోడించి...
కొన్ని జీవితాలను ఈ కథల సంపుటిలో ఆవిష్కరించారు.
ఇలాంటి కథలు, కథా సంకలనాలు అనేకం వెలువరించాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా....
ఈ సందర్భంగా వనజ తాతనేని గారికి నా అభినందనలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి