నీరెండ ఛాయల్లో (An Inner Battle story)
జీవితానికి అవసరమైనది వాస్తవమే అయినప్పటికీ అప్పుడప్పుడూ ఊహల్లో బతకడం ఆనందం కల్గిస్తుంది. చెద పురుగు తొలుస్తుందేమో అన్నట్టు ఆలోచనలు కుట్టి చంపుతున్నప్పుడు నిద్ర లేచిన ఓ ఊహజనిత ఉన్మాదం జీవితాన్ని కూడా గాడి తప్పిస్తుంది. ప్రస్తుతం నేను అదే స్థితిలో వున్నాను.
కిటికీ అద్దాల బయట మేఘాలు భీకరంగా దుఃఖిస్తున్నాయి. భూమి సంతోషంగా నవ్వుతున్న సంగతిని క్షణాలపాటు టార్చ్ లైట్ వేసి చూపించింది మెరుపు. ఉరుము శబ్ధంలో అవమానం అవమానపడింది. జేవురించిన కోపంతో మేఘాలు మరింత వర్షించాయి. భూమి తల్లిలా కరిగి సముద్రుడి వైపు దోవ చూపించింది. మేఘాలు తండ్రిని చేరుకుని గాఢ పరిష్వంగం లో ఊరట పొందాయి. చిన్నగా నవ్వుకున్నాను. వాడు కూడా నవ్వాడు..
ఉత్తరపు వైపు కిటికీ తెరిచాను.గాలి స్నానం చేసినంత హాయిగా వుంది. ఆయనవెరో చెప్పాడు స్నానాలు కూడా ఐదు రకాలని. స్నానం చేయడానికి షవర్ క్రింద నిలబడి నీళ్ళు మీద పడకుండా పడుతున్న ధారలన్నింటిని మగ్ లోకి నింపుకుని ఒంటిపై వొలుపుకోవడం అదొక పని లేని వ్యాపకం. ఒక్కో ధార తనకు ముఖ్యులైన పరిచయం వున్న వ్యక్తుల ఆలోచనలే అయినట్టు అవి ప్రవాహంలా మారి తనను తడిపేస్తున్నట్లు.. తనను అలా తడపడానికి వారికి ఏం హక్కుంది!? అందుకే వారందరిని మగ్ లోకి వొడువుగా వొడిసి పట్టి గుమ్మరించుకోవడం అనే ఊహ నాకు అమితానందం కల్గిస్తుంది. నన్నే తడుపుదామనుకున్నారా, చూసారా..మీ అందరినీ కలిపేసి కలగాపులగం చేసేసి మీ తిక్క ఎలా కుదిర్చానో.. అంటాను.
భలే వాడు వీడు అని వాడూ పగలబడి నవ్వుకుంటున్నాడు. నేను మరింత నవ్వుకుంటూనే బట్టలు ధరించి వ్యాహాళికి బయలుదేరాను. వీధి మలుపు తిరిగాను.ఖాళీ అరుగు కనబడింది. ఆరాగా చూస్తున్న వాడికి చెప్పాను.
ఆ ఇంటి అరుగుపై కూర్చుని వచ్చేపోయే బాటలారులను పలకరిస్తూ నిలబెట్టేసి ఆరాలడిగి బంకసాగుడు మాటలతో కాలక్షేపం చేసే పెద్దామె మరణించిందట అని. “అయ్యో అవునా” అన్నాడు విచారంగా. ఆ వార్త వినగానే నీ ఫీలింగ్ యేమిటో? ఆరా తీసాడు.
“కొత్తగా యేముంటుంది? తెలియగానే కాసేపు నిజంగానే విచారం. అంతలోనే ఒక తుస్కారపు ఆలోచన. పోతే పోయిందిలే, బ్రతికి ఉద్దరించేది ఏముంది గనుక? పనులపై వెళ్ళేవాళ్ళను ఆపి విసిగించడం తప్ప.” అనుకున్నానని చెప్పాను.
వాడు విని మౌనంగా వున్నాడు.
“ఇపుడెవరిని విసిగిస్తదో మరి. పాపం పుణ్యం తక్కెడలో ఆమెక్కడో.. అదో చిదంబర రహస్యం కదా!” అని అడిగాను.
మళ్ళీ వాడు మౌనమే.
వాడిక నాతో మాట్లాడడు. దిక్కులు చూసాను.నాలా వ్యాహాళికి బయలుదేరిన నలుగురు కలిసారు. ఆరోగ్య అవగాహన వీడియోల్లో చెప్పబడిన విషయాల గురించి అమెరికా మాజీ అధ్యక్షుడి అరెస్ట్ వరకూ అదానీ కంపెనీల షేర్ ల పతనం నుండి అనంతపురంలో సాగుతున్న పాదయాత్ర వరకూ చర్చించుకున్నాక అలుపొచ్చి యింటి దారి పట్టామందరం.
వాడు నాతోపాటు లోపలికి వచ్చాడు.
అలవాటుగా తినాలి.అధరువు గా వండి పెట్టేవాళ్ళు లేకపోయాక తప్పేదేముంది?
“తప్పించుకున్నన్నాళ్ళు తప్పించుకోలేదేమిటీ? నిన్నెవడు వండమన్నాడు యిది, అంటూ చేయి విసిరింది మర్చిపోకు” గుర్తు చేసాడు వాడు.
“ఏడిసావులే.. నోర్మూసుకుని వుండు. వంటేమన్నా బ్రహ్మ విద్యా!?” కసిరాను వాడిని.
ధార కింద గిన్నె పెట్టి అది సగం నిండే సమయానికి డబ్బాలో బియ్యం తెచ్చి గిన్నెలో వేయాలి. అదీ లెక్క. ఆ లెక్క సరిగా పాటించబోయి పట్టు దప్పి ఇరవై గింజలదాకా సింక్ పాలు.
వెంటనే వాడు మౌనం వీడి “యిప్పుడు నీకు ఆ ధాన్యం పండించే రైతు గుర్తుకు రావాలి అతని పట్ల గౌరవం ఉప్పొంగాలి” అన్నాడు.
“అబ్బే అదేంలేదే, నేను తినే తిండిలో కొంత తగ్గుతుందే అనుకుంటున్నా” అన్నాను.
“మనుషులను అంతగా ద్వేషించకు తట్టుకోలేరు.. అవసరం లేకపోయినా ప్రేమించినట్లు నటించు. కొన్నాళ్ళకు పండిపోతావు నటిస్తున్నానని నువ్వు కూడా మర్చిపోతావు” అన్నాడు వాడు. అంగీకరించాను. కానీ ఆ విషయం వాడికి చెప్పను. గ్రహిస్తాడు కదా, నాకు నోరు నొప్పి యెందుకంటా!.
లేత రంగుల కర్టెన్స్ కదలాడుతుంటే మనసు కదులుతుంటుంది కాంచన కోసం. నీలిమబ్బు దుప్పటి పరిచిన మెత్తని శయ్య నిండుచందమామ లాంటి దిండ్లుతో దశాబ్దాల అలసటను తీర్చడానికి తయారుగా వుంచి. రా.. రమ్మని ఆహ్వానిస్తుంటే చూడనట్లు నటిస్తుంది. ప్రతిది ఆమెకు నచ్చేటట్టు శ్రద్ద తీసుకుంటాను. గుత్తులు గుత్తులుగా పూచే కస్తూరి పూలను తీసుకొనివచ్చి గాజు ప్లవర్ వేజ్ లో అలంకరిస్తాను. ఈ మధ్య ఆమె వొచ్చినపుడు కొత్తగా అలాంటి పరిమళమేదో చుట్టుముట్టినట్టు ఉంటుంది గనుక. డ్రాయింగ్ రూమ్ వరకూ మాత్రమే పరిమితమైన పరిమళాన్ని బెడ్ రూమ్ వరకూ విస్తరింపజేసుకుని ఊహలో బ్రతుకుతుంటాను. అరమరికలు లేకుండా ఆమె వస్తానంటుందేమో అని ఆశ పడుతుంటాను.
ఇప్పుడైతే షరతులు వుంటాయని గుర్తు చేస్తాడు వాడు. “అంధకారంలో తవుళ్ళాట యెందుకు? చిత్తశుద్ది లేదు నీకు” అని ముల్లుగర్రతో పొడిచాడు కూడా.
అడిగేద్దాం తాడోపేడో తేల్చేసుకుందాం అని వడి వడిగా కాంచన ప్లాట్ ముందుకు వెళ్ళి బెల్ మోగించాను. స్నానం చేస్తూ వుండొచ్చు. వచ్చి తెరుస్తుందని అక్కడే నిలబడి పది నిమిషాలు తర్వాత మళ్ళీ మోగించాను.” నేను ఇక్కడ” అంటూ వెనుక నుండి పలకరింపు. పక్కకు తొలగి నిలబడితే తాళం తీసి తలుపు తెరిచింది.
“అల్లం చాయ్ తాగుతారా, రండి. “ ఆ పాటి పలకరింపుకే అనురాగ గంగ ఉబుకుతుంది నాలో నేనా.. లేక కాంచన లోనా. అందుకే ఆహ్వానమా?
“భోజనం రెడీగా వుంది” అంటూనే మెల్లిగా అనుసరించాను.
బేగ్ సోఫాలో పడేసి వాష్ రూమ్ కి వెళ్ళింది. ఎదురుగా ఉయ్యాల బల్లపై బోర్లా పడి వున్న డైరీ.. పక్కనే పెన్. ఆమె గుణ శీలాలు గురించి కూపీ లాగబోయాను.
చేతిలోకి తీసుకోబోతే వాడు వద్దు వద్దు అంటున్నాడు. కళ్ళు
అక్షరాల వెంట కిలోమీటర్ల వేగంతో పరుగు పెడుతున్నాయి.
“అనురాగమా! సప్తవర్ణపు సూర్య కిరణమై నువ్వు నన్ను తడుముతుంటే మనఃకమలం వికసించక ఊరుకుంటుందా! ఇంకా దాగుడుమూతలాట యెందుకు?
కవిత్వమా ప్రేమలేఖా! నిశ్శబ్దపు అణుబాంబు పేలింది నాలో.
ఇంకా చదవబోయాను. తలుపు చప్పుడై చప్పున డైరీ అక్కడ పెట్టి వెనుదిరిగి “ఏదైనా నవలేమో అని చూసాను”. ఆత్మవంచన తన విశ్వరూపాన్ని యెక్కడైనా చూపవచ్చని అనుకుంటూ.
నవ్వింది. చల్లటి నీరు గ్లాస్ లో పోసి .. కావాలా అన్నట్టు చూసింది. తల అడ్డంగా ఊపాను.
వాడు చెబుతూనే వున్నాడు వద్దు వద్దు అని. వాడి మాట వింటే బావుండేది. స్నాక్స్ తెచ్చిచ్చి యెదురుగా కూర్చుంది. మాట పెగలడం లేదు. లోతుగా పరిశీలన చేస్తున్నట్లు వున్నాయి చూపులు.
ఇంకా ఆమె యెదురుగా కూర్చుని వుంటే నా వక్ర మనోభావాలు బహిర్గతమయ్యేటట్లే వున్నాయి. గొంతు పెగిలించుకుని “ఇంటి పనికి వంట పనికి వొక మనిషి కావాలనుకుంటున్నాను. మీకెవరైనా పరిచితులు వుంటే పంపరూ” అన్నాననుకొని గొణిగాను. లేచి వచ్చేసాను. కాంచన ను నువ్వు అనకుండా మీరు అనడం తెలుస్తూనే వుంది నాకు. అంత యెడం వచ్చేసిందా?
ఇంటికొచ్చాక నాలో యేవో అనుమానపు ఛాయలు పిల్ల పాములై పిగిలిపడ్డాయి.అవి త్వరగానే పెరిగి పెద్దవై విషనాగులై పడగలెత్తి నర్తిస్తున్నాయి. కాంచన మరో బంధంలోకి వెళ్ళబోతుందా లేకపోతే తనపై యెందుకంత తిరస్కరణ?.
ఉన్నట్టుండి వాడు పకపకా నవ్వసాగాడు.
“కూలిపోయిన వంతెనలు ఎవరు నిర్మిస్తారు కొత్త వంతెనలు నిర్మించుకోవాలనుకుంటారు కానీ” అన్నాడు.
ఎదురుగా అద్దం పట్ మని శబ్దం చేస్తూ కిందకి జారి పడింది.
“పగిలిన వాటికి మోత యెక్కువ” రెచ్చగొట్టినట్టు అన్నాడు మళ్ళీ వాడే.
“షటప్” అరిచాను.
రెండు రోజుల తర్వాత కాలింగ్ బెల్ మోగుతుంది అదే పనిగా. తలుపు తెరవకుండానే తలుపు అద్దంలోనుండి చూసాను.
అపరిచితురాలు. కాంతి తగ్గిన ఖరీదైన డ్రెస్ ధరించినా పేదరికపు ఛాయలు ఆమె ఒంటిని వొదిలిపోలేదు. నూనె రాసి బిగించి వేసిన జడ రోల్డ్ గోల్డ్ చెవికమ్మలు. వక్షస్థలం కప్పుతూ కొంగులు ముందుకు వేసుకున్న చున్నీతో ఒక విధమైన నిర్లక్ష్యపు ధోరణితో గుమ్మం ముందు నిలబడివుంది. తలుపుతెరిచి ఏమిటని అడిగాను.
“పనికి, వంటకి మనిషి కావాలన్నారట. కాంచన గారింట్లో చేస్తాను. ఉదయం తొమ్మిదిన్నరకు మాత్రమే రాగలను. గరుకైన మాట తీరుతో షరతులు చెప్పింది. అడ్డంగా తల ఊపబోయి నిలువుగా ఊపేనేమో! “రమ్మంటారా” అంటూనే లోపలికి అడుగువేసింది.
లోపల వాడు ఫక్కున నవ్వాడు. నవ్వుతూనే వున్నాడు. ఇల్లంతా తిరిగి వచ్చి “నెలకు ఆరువేలు ఇవ్వండి. వంట రెండు పూటలకు కలిపి ఉదయమే చేస్తాను. రోజూ కూరగాయలు రెడీగా పెట్టాలి.”
తల ఊపాను. “నా పేరు లలిత” అంది. మళ్ళీ తల ఊపాను.
కొన్నాళ్ళ తర్వాత “సార్ గారూ! మీరూ ఆ కాంచన గారూ భార్యభర్తలంట కదా! “ ఆశ్చర్యంగా అడిగింది లలిత.
అవునని చెబుతూ.. మా ముప్ఫై యేళ్ళ వివాహ బంధాన్ని నేనొక ప్రయోగం చేసినప్పటి విషయాలను జ్ఞాపకం చేసుకున్నాను.
*****************
“స్త్రీలు అందంగా వుండటమే గొప్ప విషయం అనుకుంటారు. అందంతో పాటు మిగిలినవన్నీ వుంటేనే కదా సంసారాన్ని చక్కదిద్దుకుంటారు. మగవాడు అష్టకష్టాలు పడి సంపాదించి అంతా భార్య చేతుల్లో ధారపోస్తే ఇంటి పని వంట పని మార్కెట్ పనులు చేసుకోవడం పిల్లలను చూసుకోవడం పెద్దలకు తలలో నాలుకలా వుండగల్గడం ఏమంత గొప్ప విషయమని?” అక్కసు అంతా పదునైన మాటల తూటాలుగా మార్చి పేల్చాను చాలాసార్లు. .
“అదే పని మీరు చేయండి. ఇప్పుడు పిల్లల పెద్దల భాద్యత కూడా లేదు. నేను ఉద్యోగం చేసి మీరు నా చేతికిచ్చినన్ని డబ్బులు మీ చేతుల్లో ధారపోస్తాను” అంది సహనం చచ్చిన కాంచన.
వాదన పెరిగింది. సరదాగా అనుకున్న మాటలే సీరియస్ గా తీసుకోవడం. నేను మెడికల్ లీవ్ తీసుకుని ఇంట్లో కూచోవడం. ఆమె ఉద్యోగం వేట.
హేళన చేసాను కానీ మహాలక్ష్మి లాంటి ఆమె రూపం డిగ్నిటీ ప్లస్ పాయింట్ అయి ఒక ఛానల్ లో ఫ్యామిలీ కౌన్సిలర్ గా స్థిరపడిపోయింది. గుక్క తిప్పుకోకుండా యెన్నో విషయాలు మాట్లాడుతుంటే నా భార్య యేనా ఈమె అని ఆశ్చర్యపోవడం నా వంతు అయింది.
భరించలేకపోయాను. నాఉద్యోగం నేను చేస్తాను. నువ్వు నీ ఛానల్ ఉద్యోగం మానేసి యింట్లో అదివరకటి గృహిణిలా వుంటే చాలన్నాను. కుదరదు మూడేళ్ళకు అగ్రిమెంట్ రాసాను అంది.
కుదరకపోతే నీ దారి నీది నా దారి నాదే అన్నాను. ఆమె లక్ష్యపెట్టలేదు. నా మగవాడి అహంకారం వూరుకుంటుందా.. విడాకులిస్తానన్నాను. ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఒకే ఇంట్లో వుంటూనే విడాకుల నోటీసు అందుకుంది. ఆ రోజే ముఖ్యమైన వస్తువులు బట్టలు సర్దుకుని వెళ్ళిపోయింది. పదిరోజుల్లో తన నగలు అమ్మేసి యెదురుగానే చివరగా వున్న ప్లాట్ కొనుక్కొంది. విడాకులకు ఆమోదించి సంతకం పెట్టేసింది.
పిల్లలు అయినవాళ్ళందరూ ఈ వయసులో మీకిదేం పోయేకాలం, విడాకులేమిటి అని ఆశ్చర్యపోయారు, బుగ్గలు నొక్కుకున్నారు. బుర్ర తొలిచి తిన్నన్నాళ్ళు తిని తర్వాత మీ చావు మీరు చావండని యెవరి దారిన వారు పోయారు. కాంచన నువ్వెవరో నేనెవరో అన్నట్టు అపరిచితురాలు మాదిరి వుండసాగింది.
తనకు బంధనాలేవో తెగిపోయి స్వేచ్ఛగా వున్న భావన. కొన్ని నెలలు బాగానే గడిచింది. స్నేహితులు పార్టీలు వంట పని లేని స్విగ్గీ జుమాటో ఆర్డరులు. మగవాళ్ళు పెళ్ళిచేసుకుని చాలా తప్పు పని చేస్తున్నారు. పెళ్లిలో లేని హాయి వొంటరిగా బతకడంలో వుందని నొక్కి వక్కాణించాను.
కాంచన అప్పుడప్పుడు కనబడుతూ వుంటుంది. గతంలో కన్నా అందంగా ప్రశాంతంగా కనబడుతుంది. నాకే ఇంటి తిండి కరువై రుచుల పేరిట నానా రకాల గడ్డీ తిని జీర్ణ వ్యవస్థ దెబ్బతింది. మందులు చప్పిడి కూడు. ఒక్కసారిగా వయసు పదేళ్ళు పైబడినట్లు వుంది. పిల్లలు రాయబారం చేసారు. ఛానల్ లో ఉద్యోగం మానవసరం లేదు.. ఎప్పటిలా కలసి వుండండి అని.
కావాలంటే ముప్పూటలా క్యారియర్ పంపుతాను కానీ కలసి వుండలేనంది. ఆ పని కూడా మానవత్వంతో చేస్తున్నాను అనేది. ఆ జాలి మానవత్వం నాకెందుకు? భార్య కావాలి కానీ.
“ఆమె ను బానిస గా చూడకపోయినా అర్ధ బానిసగా చూసావ్, నిత్యం కొత్త ఆకర్షణ లేకపోయినా రాత్రుళ్ళు కనీసం కాలు మీద కాలు వేసుకుని పడుకోవడానికి వొక తోడు కావాలి లే అనుకునేవాడివి కదా!” గుర్తు చేసాడు వాడు.
“అవును రా! ఇప్పుడనిపిస్తుంది పొరబాటు చేసానని. నిర్మించుకున్న ఊహా చిత్రాలన్నీ క్షణంలో పేకమేడల్లా కూలిపోతే.. నేను కూడా వీధి వైపు అరుగులున్న ఇంటి నొక దానిని అన్వేషించాలేమో జీవితం డొల్లించడానికి అని భయపడుతున్నాను. అందుకే కాంచనతో సయోధ్య కోసం యిన్ని వేషాలు” అన్నాను. .
“సయోధ్య కోసం వెళ్ళిన వాడివి. అందుకేనా, పని మనిషి వంట మనిషిని చూసి పెట్టమన్నావా?” ఫక్కున నవ్వాడు.
మౌనం వహించి పార్క్ వైపు నడక సాగించాను. పడమటి యెండ మీద పడి పొడుగ్గా నీడలు. చెట్ల నీడల్లో నా నీడ జాడ వెతుక్కోలేకపోతున్నా.
**************
రోజులు గడుస్తున్నాయి.
రెండు నెలలకల్లా పని మనిషి లోని ఆడతనంతో నా వొంటరి మగతనం జత కట్టింది ఇంటి మనిషిని చేస్తాననే హామీతో. అది కాంచన దృష్టికి అందటం అసాధ్యం అనుకున్నాను కానీ..చివరకు ముఖం పగలగొట్టుకున్నంత పనైంది. .
ఆఖరి ప్రయత్నంగా పార్క్ లో ఎదురుగా కూర్చుని వాదన మొదలెట్టాను.
“మనిషికి అసలు వివాహమే లేకపోతే ఏ సమస్యా ఉండదు. అన్నింటికీ అదే మూల కారణం. ప్రతి భార్యా తన శారీరక, మానసిక, ఆర్థిక అవసరాలన్నీ సరదాలన్నీ భర్త దగ్గర ఆశించడం, భర్తే ఆ అవసరాలన్నీ తీర్చాల్సివుండటం. ఇవన్నీ వివాహం ద్వారానే జరుగుతాయని అంచనాలుంటాయి విశ్వాసాలుంటాయి.పుట్టిన దగ్గర్నుండి అదే నూరిపోస్తారు మీ ఆడవాళ్ళకు, మొగుడనే వాడికి అదెంత కష్టమో ఆలోచించరు. ఎక్కువమంది మగవాళ్ళు అవన్నీ భరిస్తూ గుండె పోటుతో పోయేదందుకే”
“ఒక స్త్రీ భర్తకు అన్ని విధాలా తగిన భార్య అనిపించుకోవాలంటే చాలా కష్టం కదా! ముప్పూటలా వంట చేసి పిల్లలను కని వారికి కావాల్సినవి సమకూర్చి భర్త అత్తమామలకు సేవ చేస్తూ మళ్లీ ఉద్యోగం కూడా చేయాలంటే కష్టం. అందుకే చాలా మంది స్త్రీలు విసుగు చెంది కారణాలు వెతుక్కుని మరీ వివాహ బంధం వద్దు అనుకుంటున్నారు లెండి.”
“స్త్రీకి ఏ కాలంలోనైనా పురుషుడి నీడ అవసరం” మనువు చెప్పిన దానిని వల్లె వేయబోయాను.
“అదే మనువు స్త్రీలు తమను తాము యెలా రక్షించుకోవాలో కూడా చెప్పాడు” కొంచెం ఆగి అంది.ఇంకొక మాట మరిచాను అన్నట్టుగా వొత్తి చెప్పింది. “దాంపత్య సంబంధాల్లో బాధ వలన పునరుత్పత్తి కారణాల వల్ల కేన్సర్ బారినపడి చనిపోయేది కూడా స్త్రీలే యెక్కువట”
మాట్లాడటానికి ఇంకేమీ మిగల్లేదనిపించింది.
“ఆధిపత్య ధోరణి, శ్రమ దోపిడీ రెండూ రెండు కళ్ళు పురుషుడికి” అని లేచి వెళ్ళింది. దింపుడు కళ్ళెం ఆశతో వెనుకనే నడిచాను. గేట్ దగ్గర ఆగి అంది.
“సెక్సువల్ డిజైర్స్ మగవాడిలో కనిపించని మూడోకన్ను. నేనింకా దగ్దం కాదల్చుకోలేదు. పాపం లలిత!!” అని వ్యంగ్యంగా నవ్వు విసిరి వడివడిగా వెళ్ళిపోయింది.
తూలి పడిపోబోయాను. ఆసరా కోసం చూసాను.ఆమె వెనక్కి చూడకుండా దూరంగా వెళుతూవుంది. ఆశాసౌధమేదో కూలిపోయింది. ఇక సరికొత్త ప్రశ్నాపత్రం నాదే జవాబు నాదే!
వాడు ఫక్కుమని నవ్వాడు. వాడి మీద నేను విరుచుకు పడ్డాను. “నా ప్రతి చర్యకు ముందు నేను నీతో మాట్లాడుతూనే వుంటాను. నువ్వెందుకు నన్ను హెచ్చరించ కూడదూ మందలించకూడదూ” అని. నా తప్పులను వేరొకరిపై ఆయాచితంగా నెట్టేయడం నాకు సులభతరమైన పని.
“ఎద గాయాన్ని సృశిస్తే యుగళ గీతాలు పుట్టవు రా పూల్. బాధాతప్త గేయాలు మాత్రమే వినిపిస్తాయి” అన్నాడు.
వాడి మీద కోపం బుస్సున పొంగింది కానీ వాస్తవమైతే కఠోరంగా వుంది.పైగా నిండా దుఃఖం వుంది. అయోమయంలో రోజులు వెళ్ళమారుస్తున్నప్పుడు కాస్త ఊహలను మేతగా మార్చుకోవాలి. వాడితో మాటలు మానేస్తే సరి.
అసలు వాడెవరంటే..
విచిత్రమేమి కాకుండానే.. నేను ఇద్దరు మనుషులం. ఒకొరితర్వాతొకరు మాత్రమే బయటకొస్తుంటారు. మనిషికి ఒంటరితనం విరామమెరుగని యుద్దం. ఆ యుద్ధంలో కత్తి డాలు రెండూ ఆలోచనలే. మనసుకే మనస్త్రాణం అవసరం.వాడూ నేనూ వేరు కాదు. వేరు వేరుగా వున్నప్పుడు జరిగిన కథ ఇది. కాంచన దూరం అయ్యాక బాగా తోడయ్యాడు వీడు.
అవునూ, లలిత ను ఏం చేద్దామిప్పుడు!? మళ్ళీ వాడికి దూరంగా జరిగి బయటకు వచ్చి చేసిన ఆలోచన ఇది. వాడిని చంపేస్తే సరి. శత్రువుని వశపర్చుకొని జగత్తునందు అజేయంగా వుండాలని యెవరికి మాత్రం వుండదు. హమ్మయ్య, రిలీఫ్ గా ఫీల్ అయ్యాను.
******************సమాప్తం*******************
(కొత్త చూపు కథా సంకలనం లో కథ )