27, జూన్ 2018, బుధవారం

సామాజిక ఆర్ధిక అసమానతలను ప్రశ్నించిన కులవృక్షం


సామాజిక ఆర్ధిక అసమానతలను  ప్రశ్నించిన  కులవృక్షం - అరసవిల్లి కృష్ణ గారి ప్రసంగానికి అక్షర రూపం .    తాతినేని వనజ కధకురాలిగా   సాహిత్యానికి సుపరిచిత.  చాలా కాలంగా వనజ రచనలను చదువుతున్నాను.  కొంతమేర కేవలం  సాహిత్య పరిచయం మాత్రమే కాదు. గత పదిహేనేళ్ళుగా కవిత్వపు ఉనికితో  వ్యక్తిగత పరిచయం కూడా వుంది. మనిషియొక్క స్వభావాన్ని లేదా చైతన్యశీలతను అతని వునికి నిర్ణయిస్తుంది అని మార్కిజం  చెబుతుంది . అన్నివేళల,అన్నికాలాల్లోను ,ఈ మాటలు ప్రాసంగిత ఉన్నది. తాతినేని వనజ గ్రామీణ జీవన సంబంధాలనుండి వచ్చినవారు . పుట్టుక ద్వారా  స్త్రీ  అస్తిత్వ మున్నది. సహజంగానే హృదయపు  తడి కలిగిన రచయిత్రి స్వచ్చంగా, స్వేచ్చగా తన భావాలను , అభిప్రాయాలను చెప్పగలరు.తన ఉనికి తన సాహిత్య సందర్భాన్ని నిర్ణయించింది .తను ఎలా ఉండాలో ,ఏం రాయాలో నిర్ణయించింది. తడబాటు లేని అత్యంత నికార్సయిన సాహిత్య సృజనకు  బీజాలు వేసింది . ఈ  రచయిత్రి వ్యక్తిగత పరిచయం వలన ,ఆమె రచనలకు ,ఆమె వ్యక్తిత్వానికి మధ్య తేడా ఉన్నదా !అనే  సంశయంనుండి  ఆమె కథల్లోకి దారి చేసుకోగలిగాను . మూడు ప్రధాన అంశాల  చుట్టూ ఆమె కధలు  రూపు దిద్దుకున్నా యి.   
1.స్త్రీ .
2 .ఆమె అవగాహన.
3.సామాజిక దొంతర్లు .
కధలు ఎలా రాస్త్హారు :- ఏది కధ అవుతుంది ? కథా  వస్తువులు ఎట్లా స్వీకరిస్తారు. వస్తువును శిల్ప పరంగా ఎలా చెబుతారు .వనజ రాసినవి కధ లేనా! కధా నిర్మాణ ముందా !అనే ప్రశ్నలు తలెత్తవచ్చు .కధ గురించి చర్చ చేయవచ్చు .తన స్వభావంలోనే తన మానసిక స్థితిలోనే ఆమె కధలు వున్నాయి .ఇది వనజకే పరిమితం కాదు యే స్వభావ శాలికయినా అన్వనయించుకోవచ్చు. తను చూసిన  తన అనుభవంలోకి  వచ్చిన జీవిత శకలాలను ఆమె కధలుగా మలిచారు .రచయిత్రిగా  ఆమె కోక  దృక్పథం  ఉన్నది .ఆ కోణం  నుండి ఆమె తాను రాయాలనుకున్నదేమిటో ఆమెకు స్పష్టంగా తెలుసు .ప్రధానంగా మూడు అంశాలు ఆమె కధలలో  సంగీవం చెందుతాయి .
1 .కులం-మతం -వర్ణం  
2.  కుటుంబ సంబ౦ధాలలో  స్త్రీ  పురుషులు మానసిక సంఘర్షణలు .
3.విలువల పతనం .
                             ఈ మూడు  భారతీయ సమాజ చిత్రికలో  అంతర్భాగం .ఈ మూడు అంశాలు పైనే  కుటుంబ వ్యవస్థ నిలబడి ఉన్నది .కుటుంబపు పునాది నుండి ,రాజకీయ అవగాహన నుండి ఈ కథలను విశ్లేషించాలి. ఆమె కథ నిర్మాణం, చివరిలో ప్రస్తావిస్తాను గాని , కథలలోని వస్తువు పట్ల ఆమెకు  స్పష్టత ఉన్నది . ఇంకా ముందుకు వెళ్లి చెప్పాలంటే దగ్గర తనమున్నది .విభజన కాదు గాని ఒక స్రీగా  స్త్రీల పట్ల కరుణ ఉండవచ్చు, సానుభూతి ఉండవచ్చు , ఈ దిశగా ఆమె కథలలో స్త్రీ  కేంద్రబింధువుగా ఉండవచ్చు. కాని ఆమె స్త్రీ అనే కవచం నుండి బయటపడి విశాల ప్రపంచాన్ని చూశారు. చూడటమనేది వాస్తవ దృష్టిలో చూశారు. ఆర్ధిక, సామాజిక అసమానతల సమాజంలో ,మతం ,కులం, స్త్రీలు  కుటుంబం, స్త్రీ  పురుషుల స్నేహాల మధ్య ఇంకా కొనసాగుతున్న అనుమానపు బీజాలు . సామాజిక ఆమోదం పొందని  స్త్రీ పురుషుల స్నేహాలు, కార్పోరేట్ వైద్య మోసాలు, స్త్రీల జీవన పోరాటం,  పలుచనవుతున్న కుటుంబ అనుబంధాలు, పాశ్చాత్య సంస్కృతీ గురించి చర్చకు తీసుకువచ్చారు.  మొత్తంగా  కథల సారాంశం ఇదే .
                             కులవృక్షం కథా సంపుటిలో ఇరవై నాలుగు కధలున్నాయి.  రెండు మూడు కథలు తప్ప ప్రతి కథ వైవిధ్యమైన వస్తువునే మనముందువుంచాయి.ఇవన్నీ మనమెరిగిన జీవితాలు. నిత్యమ్ తరిచి చూస్తున్న వెలుగు నీడలు. మనకు తారసపడుతున్న  మనుషులు సంఘటనలు అత్యంత సహజ మైనవి కావొచ్చు .వాటికి సృజనాత్మక రూపం ఇవ్వవచ్చా అన్పించవచ్చు ,   కథానిక ప్రక్రియలో ఇవ్వాల్సిన అవసరం  ఉన్నది. మానవ జీవిత పరిణామ క్రమంగా ఆయా రచయితలు ,తమ భావనా పటిమ నుండి ,కథను సంపన్నం చేసారు,  విస్తృతిని కల్పించారు. ఆ కోణంలో చూస్తే వనజ మంచి కథకురాలిగా నిలబడ్డారనిపిస్తుంది .
                              నేను కేవలం నాలుగైదు కథల గురించి మాత్రమే  చెప్పదలచాను.చూసీ చూడనట్లు అనే కథలో ముస్లిం మహిళల బురఖా సంప్రదాయాన్ని కథగా మలిచే ప్రయత్నం చేసారు . ముస్లిం మహిళల బురఖా ధరించావచ్చా, వారికి వారి మత  సంప్రదాయం ఇచ్చే స్వేచ్చ ఏమిటి  అనే చర్చలోకి  వెళ్ళాను. ప్రభుత్వ కార్యాలయం ,కుల మత రహితంగా ఉంచవలసిన ప్రాంతం. కానీ అక్కడేం జరుగుతుంది .ఒక మతానికి ఎక్కువ  హిందూమత ఆచార కేంద్రంగా ఆ కార్యాలయాలు  రూపు దిద్దు కుంటాయి . ప్రజా అవసరాలకు సంబందించిన కార్యాలయం లోనికి  కేవలం హిందువులు  మాత్రమే రారు .ముస్లింలు ,క్రిస్టియన్లు ఇంకా అనేక మతస్తులు కూడా వస్తారు. ఒక లౌకిక సంప్రదాయానికి భిన్నంగా హిందూ దేవుళ్ళు  పూజలందుకుంటు౦టే  ఆ బ్యాంక్ ప్రాంగణంలోకి వెళ్ళిన బురఖా వేసుకున్న ముస్లిం మహిళ మానసిక స్థితి ఏమిటి ? తల్లి అనారోగ్యం  కారణంగా తల్లి డబ్బులకు తల్లి సంతకం తను చేసి చెక్  ద్వారా డ్రా చేయాలనే ముస్లిం యువతి కథ ఇది . నైతికత  దృష్ట్యా చూస్తే తల్లి సంతకాన్ని  పోర్జరీ చేయడం తప్పు కావొచ్చు .కాని ఇది చాలా చిన్న ఘోరం. దర్జాగానే సంతకాలు పెట్టి వేలాది కోట్లను దోచుకున్న ఆర్ధిక నేరగాళ్ళ కంటే ఇదేమి పెద్ద ఘోరం కాదు  కదా !
                                      దీనికి కొనసాగింపే ఉడాన్ కథ .దీనిలో ప్రధాన వస్తువు బురఖా.  ముస్లిం స్త్రీల  సంప్రదాయం గురించి  రచయిత్రి ఏ అధికారంలో  మాట్లాడుతున్నారు  అని అనిపించవచ్చు .ఈ కథలో షబానా ,నసీమా నే  కాదు. ముస్లిం మహిళల అంతరంగ చిత్రాన్ని ఒకింత అవగాహనతోనే రాసారు వనజ. బురఖా వేసు కోవడమనేది  ఒక మత సంప్రదాయంకు గుర్తు.   ఆ సంప్రదాయాన్ని పాటించాలా వద్దా  అనేది  వారి వారి వ్యక్తిగత ఇష్టా ఇష్టాలతో  ఆధారపడి వుంటుంది .ఇక్కడ ఎవరి ఆధిపత్యం వుండకూడదు .ముస్లిం మహిళలు  అన్ని రంగాలలో  ఎదుగుతున్నారు . ఉద్యోగాలు చేస్తున్నారు.  తమ సాంప్రదాయ బంధనాలనుండి  బయటకు వస్తున్నారు .అయినా  బురఖా వుంచుకోవాలా  వద్దా  అనేది  పూర్తిగా వారి మానసిక  స్థితికి  సంబం ధించినదే,  మనిషి జీవితం  గాలిపటం  దానికి కావాల్సింది  దారం మాత్రమే . ఇక్కడ దారం అంటే స్వేచ్ఛ .
  కథల సంపుటికి  శీర్షిక కథ   కులవృక్షం . వృత్తుల నుండి  కులాల విభజన జరిగిందనే ఒక ఆలోచన ఉన్నది. ఆయా వృత్తులను బట్టి  కులాలు ఏర్పడినాయని  ఇవ్వాల్టికి  ఈ దేశంలో  కులవ్యవస్థ  బలంగా ఉండటానికి కులవృత్తులు కారణమనే భావన వున్నది. అయితే ఇటీవల కాలంలో అన్ని వృత్తులు , అన్ని కులాలు వారు చేస్తున్నారనేది కూడా వాస్తవం .మన పరిసరాలను శుబ్రఫరిచే  సఫాయి కార్మిక నేపధ్యం నుండి రాసినది .సమాజంలో  ఈ వృత్తి పోవాల్సిందే , మన గౌరవ న్యాయస్థానాలు కూడా , దీనిలో కల్పించుకున్నవే .కానీ  జీవితముంటుంది .దీనికొక వెలవుంటుంది . సఫాయి కార్మికుడు లేదా  కార్మికురాలు  ఆ వృత్తి నుండి  వైదొలగితే వారి బతుకుకు  భరోసా ఏది!  ఈ వృత్తి  వారిది మాత్రమే కాదు ,నిచ్చెన మెట్ల  వ్యవస్థ లోని  అందరూ భాగం కావాల్సిందే  అంటే సరిపోదు . సఫాయి కార్మికుల కుటుంబo  ఆర్ధిక అవసరాలు  తీరినప్పుడు మాత్రమే వారు ఈ పని నుండి  బయటకు వస్తారు .భారతీయ సమాజం  ఇంకా ప్రజాస్వామికం  చెందవలసి వున్నది .నిచ్చెన మెట్ల  కులవ్యవస్థ అంతరించాలంటే  ఈ దేశంలో  కుల నిర్మూలన జరగాలి .
ఎవరయినా ఏమి వదిలి వెళతారు ? కాసిని నవ్వునో  ,ఆ కంక్షలనో దుఃఖలనో  అవమానాలనో ,ఇంకా చెప్పాలంటే  బిడ్డల రూపంలో అహంకారపు  జాడల్ని వదిలి వెళతారు  ఇది ఏకాంత జీవితం  గడుపుతున్న సత్యవతి కథ.దుఃఖo ,కన్నీళ్ళు  మానవ ఉద్వేగాలు   ఆవిరయిపోయిన  సత్యవతి  బుజ్జోడు అనే పెంపుడు కుక్క చుట్టూ  పెనవేసుకున్న  గతం ,వర్తమాన  జీవన చిత్రణ .(రెప్పలతడి ) కుటుంబ సంబంధాలు అంటే, మొక్కలనో, కుక్కలనో  పెంచుకునో  దశకు వాటి చుట్టూ అనుబంధం ఏర్పడుతున్న  దశకు చేరుతున్న సమాజంలో  సత్యవతి కథ సమాజంలో  ఒంటరి స్త్రీల కధని ప్రతిబింబిస్తుంది.
                             కులవృక్షం ,కధా సంపుటిలో  తాతినేని వనజ స్త్రీ  ,పురుషుల  మధ్య వుండే ,శారీరక- మానసిక భావోద్వేగాలను  అవి శరీరo  చుట్టూ వుoటాయా! కేవలం మనసు చుట్టూ పరిభ్రమిస్తాయా  అనే ప్రశ్నలు వేస్కొని ,లతాంతాలు ,చిగురించిన శిశిరం  వంటి కధలకు  మానవ పరిణామ క్రమంలో ,కుటుంబవ్యవస్థ లో  స్త్రీ  పురుషులు  మద్య చిగురిస్తున్న  కొత్తతరం ప్రేమలు ,మరీ ముఖ్యoగా వివాహ వ్యవస్థలో  వస్తున్న  మార్పులు ,అవి యే దశకు  చేరుకుంటున్నాయి. పెళ్ళైన తర్వాత భాద్యతలు మోయాల్సిన వయస్సులో పిల్లలు పెద్దవాళ్ళయి  ఒక అవగాహనకు  వస్తున్నపుడు, తమ మానసిక  స్థితిలో  ప్రేమ చాటున విచ్చుకుoటున్న  కామోద్రేకాన్ని  చెప్పే ప్రయత్నo  చేసారు. ఈ కాలాన్ని జాగ్రత్తగా  గమనిస్తే  సంపద పెరిగి ,జీవితం భద్రతలోకి  ప్రవేశించాక చిగురిస్తున్న  అసహజ ప్రేమలకు ,లేదా శరీరాకర్షణ లని  కధలుగా  మలిచారు  చిగురించిన శిశిరం, ఒంటరిగా జీవిస్తున్న కుముద  కు  వచ్చిన ప్రపోజల్ ,నా భార్య అంగీకారంతో నిన్ను పెళ్ళి చేసుకుంటాను  అని  వివాహితుడు  అనడం మన కుటుంబ వ్యవస్థ డొల్ల తనాన్ని  బట్టబయలు చేస్తుంది . అయితే దీనికి భిన్నంగా ఈ కధ వుంటుంది. వివాహితుడు, ఒంటరి స్త్రీల మధ్య  శరీర కాంక్షలు  తగ్గి  మానసికంగా దగ్గరయ్యే  వాతావరణం ఏర్పడటం,శృంగార  కాoక్షల కంటే స్త్రీ –పురుషుల మధ్య మానసికంగా  భరోసా ఏర్పడటం  ఈ కథ నేపధ్యం. మోహన, కుముద  వంటి పాత్రల చిత్రణలో  వనజ తాతినేని  చాలా పరిణితి సాదించారు .
                              కేవలం  ఈ కథలు  చదవడం  ఒక అనుభవ౦. అందునుండి  స్వీకరిoచాల్సినది  ఏమయినా  వున్నదా! కథ వస్తువు దాన్ని  స్వీకరించడం  ఒక ఎత్తుయితే  కథగా మలచడం శిల్పంకు సంబంధించిన అంశం. కథలో శిల్పం లేనప్పుడు  యెన్ని  వున్నా దండగే అంటాడు కొ.కు. వనజ కథను  శిల్ప పరంగా  మలచడానికి ఇంకా కృషి చేయాల్సి వున్నది .కథ కేవలం దృశ్య రూపంగా  ఉండకూడదు .వస్తువును ఎంత బాగా చెప్పగలిగితే, అంతగా కథ ప్రాచుర్యం పొందుతుంది .అంతమాత్రమే కాదు ఒక తాజాదనాన్ని వస్తువు ఇస్తుంది. ఆ కథను చదవడం  ఆ కథల ద్వారా శిల్ప రహస్యాన్ని   గ్రహించడం ,ప్రధానంగా  పాత్రలను మలిచే  క్రమంలో  వాటిని చిత్రించే క్రమంలో ఏ పాత్రలను  రచయిత సృష్టిస్తున్నదో  ఆ పాత్రల వెనుక వున్న,దాగిన స్వభావాన్ని పట్టుకోగలిగితే  కథలు దృశ్యరూపంలో  నుండి కథా రూపంలోకి వస్తాయి. కొన్ని కథలు చదివినప్పుడు  శిల్పం  లేనట్లు అనిపించినా వస్తువు  ఆ లోటుని కనబడనీయలేదు. కులవృక్షం చదవడం ద్వారా  మంచి కథలను చదివామనే భావన  చాలా కాలం వెంటాడుతుంది .
                                                                                                                -అరసవిల్లి కృష్ణ
                                                                                                                 9247253884
     
                                                                               

6, జూన్ 2018, బుధవారం

ముందు మాట..




" కుల వృక్షం  " కథల సంపుటి ముందు మాట..
 
ఈ అక్షరాలపూలపై వాలిన పాఠక సీతాకోకచిలక మిత్రులకి స్వాగతం.
ఏ కథకా కథ వ్రాసాక నేను వెనుదిరిగి చూసుకుంటాను.  ఓ స్వల సంతోష వీచిక మాటున అనంతమైన అసంతృప్తి. మంచి కథ వ్రాయాలని మళ్ళీ అనుకుంటాను.  ఎందుకో వ్రాసిన  యే కథ నాకు సంతృప్తినివ్వదు. నా కథలన్నీ జీవితంలోనుండి నడిచొచ్చిన కథలు. మూడొంతులు జీవిత సత్యానికి  పావు వంతు కల్పనా శక్తిని జోడించి  యీ కథలని వ్రాసాను .
కథలెలా వ్రాస్తారు అంటే నేను చెప్పలేను. వ్రాసిన తర్వాత ఇది కథగా బాగా కుదిరింది అని వేరొకరు చెప్పేవరకూ,పత్రికల వారు ఆమోదించేవరకూ అదొక సంశయం. వ్రాసే ప్రతి కథని  సరికొత్తగా కథ వ్రాస్తున్నాననుకుని  బెరుకు బెరుకుగా మొదలబెట్టడమే నాపని. కథ ముగిసినాక హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాను.
నేను రచయితనై సమాజానికి యేదో సేవ చేస్తున్నానని అనుకోవడంలేదు.  నా రచనలు చదివి సమాజ పురోగవ్రుద్ది సాధిస్తుందనే భ్రమలు నాకు లేవు. నా కాలంలో నా చుట్టూరా ఉన్న ప్రపంచం యెలా వుంది ప్రజల  జీవనం, జీవితాల్లో సంక్లిష్టతని నా దృష్టికోణంతో దర్శించి నా ఆలోచనలనకి అక్షర రూపమిస్తూ  నా కాలాన్ని నమోదు చేసానని అనుకుంటానంతే !
నా మొదటి కథాసంపుటిని చదివిన మిత్రులిచ్చిన ప్రోత్సాహంతో రెండో కథాసంపుటిని మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఈ కథా సంపుటిలో ఇరవై నాలుగు కథలున్నాయి. ఇందులో పదిహేను కథలు వివిధ పత్రికలలో వచ్చినవి. మిగతావి బ్లాగ్ లో ప్రచురించుకున్నవి.  ఒక విధంగా నా స్వయం చోదకశక్తితో కథ వేదికపై  నన్ను నేను నిలబెట్టుకుంటూ ..  నేనుగా  జయప్రదం చేసుకునే  ప్రయత్నమిది. చదివి మీ సద్విమర్శలని ,సలహాలని అందించి నా అక్షరాన్ని పునీతం చేసి  రాబోయే రచనలకి మరింత వన్నెనిస్తారని ఆశిస్తూ ..
వెనుదిరిగి చూసుకుంటూ ముందుకు  నడుస్తున్న నా రచనా ప్రయాణంలో ఆగి కాసేపు మీతో ముచ్చటించే ఈ భాగ్యానికి మురిసిపోతూ .. .
                                                                                   నమస్సులతో ..
                                                                                  వనజ తాతినేని.

   

శంఖం ఊదుతున్నా ..

పొద్దున్నే దినపత్రిక  చూసినా , వార్తా ఛానల్ ని చూసినా , ఎక్కడ విన్నా స్త్రీలపై ,పసిపిల్లలపై అత్యాచార వార్తలు. విని వినీ అది అలవాటుగా అయిపోయింది. ఎంతగా అంటే అదొక సాధారణ విషయంలా . జ్యోతి వలబోజు గారూ  2015. లో మహిళా దినోత్సవం సందర్భంగా ... మాలిక  వెబ్ పత్రిక కోసం అత్యాచారాల పై నిరసన తెలుపుతూ కవిత్వం వ్రాయండి వనజ గారూ  అని అన్నారు . ప్రేమగా చెపుతున్న, కోపంతో చెపుతున్నా శిక్షలు వేస్తున్నా సమాజంలో అత్యాచారాలు  జరగడం ఆగలేదు. చాలా  కోపంగా వున్నానేమో .. ఆవేశంలో కవిత వ్రాసేశాను .  ఆ కవిత చదివిన చాలామంది ఆ తీవ్రతకి ఆశ్చర్యపోయారు. కొంతమంది చదివి వినిపించండి అన్నారు .. రేవతీ రావూరి మీ గొంతుతో వినాలని వుంది అన్నారు. అప్పుడు అంత పట్టించుకోలేదు కానీ ఇప్పుడు కథలని  శబ్దంతో రికార్డ్ చేయాలన్న తలంపులో వున్న నాకు ఈ "పునీత" కవిత  ను  నా గొంతుతో వినిపించాలనిపించింది. అందుకే ..ఈ ప్రయత్నం.


ఒక స్నేహితురాలైతే ..తల్లీ ..నీ గొంతుతో ఈ కవిత వినిపిస్తే చెవుల్లో నుండి రక్తం కారడం తధ్యం అని దీవించింది ..అది మరీ మంచిది అన్నాను. భావతీవ్రత తెలియాలి కదా ! సరే నా ఈ ప్రయత్నం చెవిటి వాడి చెవిలో శంఖం ఊదినట్లుగా కాకుండా కొంచెమైనా ప్రయోజనం వుంటే బాగుండును. అదేనండీ ..విన్నవారు కాస్త ఆలోచించి విచక్షణతో మెలిగితే చాలు. మరి వింటారు కదూ .. 

పునీత ..కవిత .. టెక్స్ట్ లో ఇక్కడ .. 

4, జూన్ 2018, సోమవారం

కవితా పఠనంలో ..



11-05-2013 శనివారం సాయంత్రం 06:00 కి బంజారా హిల్స్ రోడ్ నంబర్ 1 లామ్ కాన్ వేదికగా జరిగిన కవిసంగమం లో నేను ఒక కవిగా పాల్గొన్నప్పుడు చదివి వినిపించిన కవిత్వం . విని యెలా వుందో చెప్పండి ..ప్లీజ్ !
అయిపోయిన పెళ్ళికి .. బాజాలాగా .. 
అయిదేళ్ళ తర్వాత.. ఇలా రూపొంది ..అందరి ముందుకు వచ్చింది . 

3, జూన్ 2018, ఆదివారం

కథ చెపుతా ..

కథ చెపుతా .. వూ కొడతారా, వులికి పడతారా ....ఫ్రెండ్స్ ..
ఇదో ప్రయోగం .. బాగుంటే ఇంకా బాగా కృషి చేస్తాను. చదవడం అంటే చాలామందికి ఆసక్తి లేదు. అందుకే ఈ రకమైన బాదుడు :).

ఇదిగో .."మురికి మనసు " ని .. నా గళంతో వినండీ ..


2, జూన్ 2018, శనివారం

కొత్తగా ...

ప్రాతఃకాలంలో క్షణక్షణం మారిపోయే ఆకాశపు రంగులు చూస్తూ కాఫీ సేవిస్తూ రాలేపూలని మొలిచిన చివురులని చూస్తూ ..అలా అరగంటపైన గడిపేసాక ..రాలిన పువ్వులని యేరుకుని ఉర్లిలో అలా అలంకరించుకుని . రాలినా అందం అందమే కదా మరొక రోజు ఇలా పూల సౌందర్యాన్ని పొడిగించే భాగ్యం కల్గిందనుకుంటూ ....

 కంప్యూటర్ లో చదువుతూ ఆపేసి వెళ్ళిన పేజీని చూస్తే తూలిక బ్లాగ్ పతాక శీర్షిక కూడా నాకు చాలా సౌందర్యంగా తోచింది. ఇక నాల్గో చిత్రంలో కనిపిస్తున్న లేత చివురు నన్ను ఆశ్చర్య పరిచింది. పూర్తిగా వాడిపోతే ఆ మొక్కని తీసేసి అందులో రెండు మొక్కలు వేసి యేబై రోజులైన తర్వాత మళ్ళీ మొలకెత్తి తన ఉనికిని చూపించింది. ఎందుకో యీ నాలుగు చిత్రాలు విశేషమైన అర్ధాలు చెప్పాయి నాకు. చాలా సంతోషంగా కూడా వుంది. కొత్తగా రెక్కలు వచ్చినట్టుంది మరి.
తూలిక   మాలతీ గారు (నిడదవోలు మాలతి) .. ఎంతో శ్రద్ధతో మీ సమయం కేటాయించి ..మీ పాత టపాలని వెతికి పన్నెండు లంకె లను యిచ్చి నాకెంతో నేర్చుకునే అవకాశం యిచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.కథకులకు పాఠకులకు .. ఆసక్తికరమైన  అందించే పోస్ట్ యిది. వీలైతే చదవండి మిత్రులారా !