6, జూన్ 2018, బుధవారం

ముందు మాట..




" కుల వృక్షం  " కథల సంపుటి ముందు మాట..
 
ఈ అక్షరాలపూలపై వాలిన పాఠక సీతాకోకచిలక మిత్రులకి స్వాగతం.
ఏ కథకా కథ వ్రాసాక నేను వెనుదిరిగి చూసుకుంటాను.  ఓ స్వల సంతోష వీచిక మాటున అనంతమైన అసంతృప్తి. మంచి కథ వ్రాయాలని మళ్ళీ అనుకుంటాను.  ఎందుకో వ్రాసిన  యే కథ నాకు సంతృప్తినివ్వదు. నా కథలన్నీ జీవితంలోనుండి నడిచొచ్చిన కథలు. మూడొంతులు జీవిత సత్యానికి  పావు వంతు కల్పనా శక్తిని జోడించి  యీ కథలని వ్రాసాను .
కథలెలా వ్రాస్తారు అంటే నేను చెప్పలేను. వ్రాసిన తర్వాత ఇది కథగా బాగా కుదిరింది అని వేరొకరు చెప్పేవరకూ,పత్రికల వారు ఆమోదించేవరకూ అదొక సంశయం. వ్రాసే ప్రతి కథని  సరికొత్తగా కథ వ్రాస్తున్నాననుకుని  బెరుకు బెరుకుగా మొదలబెట్టడమే నాపని. కథ ముగిసినాక హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాను.
నేను రచయితనై సమాజానికి యేదో సేవ చేస్తున్నానని అనుకోవడంలేదు.  నా రచనలు చదివి సమాజ పురోగవ్రుద్ది సాధిస్తుందనే భ్రమలు నాకు లేవు. నా కాలంలో నా చుట్టూరా ఉన్న ప్రపంచం యెలా వుంది ప్రజల  జీవనం, జీవితాల్లో సంక్లిష్టతని నా దృష్టికోణంతో దర్శించి నా ఆలోచనలనకి అక్షర రూపమిస్తూ  నా కాలాన్ని నమోదు చేసానని అనుకుంటానంతే !
నా మొదటి కథాసంపుటిని చదివిన మిత్రులిచ్చిన ప్రోత్సాహంతో రెండో కథాసంపుటిని మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఈ కథా సంపుటిలో ఇరవై నాలుగు కథలున్నాయి. ఇందులో పదిహేను కథలు వివిధ పత్రికలలో వచ్చినవి. మిగతావి బ్లాగ్ లో ప్రచురించుకున్నవి.  ఒక విధంగా నా స్వయం చోదకశక్తితో కథ వేదికపై  నన్ను నేను నిలబెట్టుకుంటూ ..  నేనుగా  జయప్రదం చేసుకునే  ప్రయత్నమిది. చదివి మీ సద్విమర్శలని ,సలహాలని అందించి నా అక్షరాన్ని పునీతం చేసి  రాబోయే రచనలకి మరింత వన్నెనిస్తారని ఆశిస్తూ ..
వెనుదిరిగి చూసుకుంటూ ముందుకు  నడుస్తున్న నా రచనా ప్రయాణంలో ఆగి కాసేపు మీతో ముచ్చటించే ఈ భాగ్యానికి మురిసిపోతూ .. .
                                                                                   నమస్సులతో ..
                                                                                  వనజ తాతినేని.

   

కామెంట్‌లు లేవు: