ఇటీవల రెండు స్వీయ కవితలు, ఒక స్కెచ్ వీడియోగా రూపొందించాను. మీకు ఆసక్తి వున్నట్లైతే చూడండి ప్లీజ్!
6, ఫిబ్రవరి 2026, శుక్రవారం
30, అక్టోబర్ 2025, గురువారం
పాపాయి మనస్సు వీడియో కవిత
నేను రాసిన “పాపాయి మనస్సు “ కవిత ను వీడియో ముఖంగా చదివి వినిపించాను. ఎప్పడో పదిహేనేళ్ళ క్రితం బ్లాగ్ తో మొదలుపెట్టి ఇలా వీడియో లో స్వీయ కవితలు కథలు వినిపించడం మొదలెట్టాను. ఈ వీడియో చూసేయండి. ధన్యవాదాలు 🙏
వీక్షించండి. ..
1, జులై 2025, మంగళవారం
వాగ్ధానం
నాశనం చేసినదాన్ని చూసి దుఃఖించడానికి కాదు
ఎలా నాశనం అయ్యిందో పరిశీలించడానికి కాదు
నీ పురాతన ఆత్మ అక్కడ సంచరిస్తున్న
ఆనవాళ్ళు కూడా వున్నాయనే ఎరుక తో వచ్చాను.
ఈ పరిసరాల్లో ఈ ప్రకృతి లో ఆ సూర్యోదయాల్లో
ఆ గాలిలో ఆ పువ్వుల్లో తెరవబడక బావురుమంటున్న పుస్తకాల్లో
మనసు చిలికిన ఆ కవిత్వంలో వానకు తడిసి పరిమళాలు వెదజల్లుతూన్న మట్టిలో..
ఏవో నిశ్శబ్ద వర్ణ చిత్రాల గుసగుసల్లో నువ్వు జీవిస్తున్నావని.
సగం తెరిచి వుంచిన తలుపు
సగం మాత్రమే పంచుకున్న మనసు
అర్ధోక్తి తో ఆగిపోయిన మాటలు
ఏనాటికైనా పూర్తి అవుతాయనే ఆశను కూకటివేళ్లతో పెకిలించిన ఆ పరువు హత్య
లోకం దర్పణంలో ముక్కలై ఏడుస్తున్న నా ప్రతిబింబాన్ని చూసి జాలిపడుతూ ఎగతాళిగా నవ్వుతూ మీరు
లోపల యుద్ధం జరిగినాక వెలుపల యద్ధం చేయాల్సిన పనిలేదు.
శాంతి పతాకం యెగరేయడం మినహా
ప్రపంచానికి తెలియని రహస్య దుఃఖాలను మోస్తున్న నేను
నీ ఆత్మ ను వెదుక్కుంటూ వచ్చాను వస్తూనే వుంటాను నాశనం చేయలేని ప్రేమతో
నీవు హృదయాన్ని మాత్రమే ఇచ్చావు
నేను జీవితాన్నే విడిచి వచ్చాను.
6, జూన్ 2018, బుధవారం
ముందు మాట..
" కుల వృక్షం " కథల సంపుటి ముందు మాట..
ఈ అక్షరాలపూలపై వాలిన పాఠక సీతాకోకచిలక మిత్రులకి స్వాగతం.
ఏ కథకా కథ వ్రాసాక నేను వెనుదిరిగి చూసుకుంటాను. ఓ స్వల సంతోష వీచిక మాటున అనంతమైన అసంతృప్తి. మంచి కథ వ్రాయాలని మళ్ళీ అనుకుంటాను. ఎందుకో వ్రాసిన యే కథ నాకు సంతృప్తినివ్వదు. నా కథలన్నీ జీవితంలోనుండి నడిచొచ్చిన కథలు. మూడొంతులు జీవిత సత్యానికి పావు వంతు కల్పనా శక్తిని జోడించి యీ కథలని వ్రాసాను .
కథలెలా వ్రాస్తారు అంటే నేను చెప్పలేను. వ్రాసిన తర్వాత ఇది కథగా బాగా కుదిరింది అని వేరొకరు చెప్పేవరకూ,పత్రికల వారు ఆమోదించేవరకూ అదొక సంశయం. వ్రాసే ప్రతి కథని సరికొత్తగా కథ వ్రాస్తున్నాననుకుని బెరుకు బెరుకుగా మొదలబెట్టడమే నాపని. కథ ముగిసినాక హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాను.
నేను రచయితనై సమాజానికి యేదో సేవ చేస్తున్నానని అనుకోవడంలేదు. నా రచనలు చదివి సమాజ పురోగవ్రుద్ది సాధిస్తుందనే భ్రమలు నాకు లేవు. నా కాలంలో నా చుట్టూరా ఉన్న ప్రపంచం యెలా వుంది ప్రజల జీవనం, జీవితాల్లో సంక్లిష్టతని నా దృష్టికోణంతో దర్శించి నా ఆలోచనలనకి అక్షర రూపమిస్తూ నా కాలాన్ని నమోదు చేసానని అనుకుంటానంతే !
నా మొదటి కథాసంపుటిని చదివిన మిత్రులిచ్చిన ప్రోత్సాహంతో రెండో కథాసంపుటిని మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఈ కథా సంపుటిలో ఇరవై నాలుగు కథలున్నాయి. ఇందులో పదిహేను కథలు వివిధ పత్రికలలో వచ్చినవి. మిగతావి బ్లాగ్ లో ప్రచురించుకున్నవి. ఒక విధంగా నా స్వయం చోదకశక్తితో కథ వేదికపై నన్ను నేను నిలబెట్టుకుంటూ .. నేనుగా జయప్రదం చేసుకునే ప్రయత్నమిది. చదివి మీ సద్విమర్శలని ,సలహాలని అందించి నా అక్షరాన్ని పునీతం చేసి రాబోయే రచనలకి మరింత వన్నెనిస్తారని ఆశిస్తూ ..
వెనుదిరిగి చూసుకుంటూ ముందుకు నడుస్తున్న నా రచనా ప్రయాణంలో ఆగి కాసేపు మీతో ముచ్చటించే ఈ భాగ్యానికి మురిసిపోతూ .. .
నమస్సులతో ..
వనజ తాతినేని.
శంఖం ఊదుతున్నా ..
ఒక స్నేహితురాలైతే ..తల్లీ ..నీ గొంతుతో ఈ కవిత వినిపిస్తే చెవుల్లో నుండి రక్తం కారడం తధ్యం అని దీవించింది ..అది మరీ మంచిది అన్నాను. భావతీవ్రత తెలియాలి కదా ! సరే నా ఈ ప్రయత్నం చెవిటి వాడి చెవిలో శంఖం ఊదినట్లుగా కాకుండా కొంచెమైనా ప్రయోజనం వుంటే బాగుండును. అదేనండీ ..విన్నవారు కాస్త ఆలోచించి విచక్షణతో మెలిగితే చాలు. మరి వింటారు కదూ ..
పునీత ..కవిత .. టెక్స్ట్ లో ఇక్కడ ..
4, జూన్ 2018, సోమవారం
కవితా పఠనంలో ..
3, జూన్ 2018, ఆదివారం
కథ చెపుతా ..
ఇదో ప్రయోగం .. బాగుంటే ఇంకా బాగా కృషి చేస్తాను. చదవడం అంటే చాలామందికి ఆసక్తి లేదు. అందుకే ఈ రకమైన బాదుడు :).
ఇదిగో .."మురికి మనసు " ని .. నా గళంతో వినండీ ..
