వారు వారే
ఇంట్లో ప్రదర్శించిన దానితో తృప్తి చెందక
మిగుల్చుకున్న వికృతపు చొక్కా తొడుక్కుని
చెప్పులో కాలు పెడుతూనే చుట్టుపక్కల గోడలని దాటి
మరీ వెతుక్కునే ఆకలి చూపులు
అంతటితో ఆగవు సరికదా
అందరూ వారి కోసమే ఆరేసుకుని
ఉంటారనుకున్నట్లు
రోడ్డుపై పరికింతలు
వరుసలలోనూ సందోహాల మధ్యనూ
అవకాశం దొరికితే వంటరితనంలోనూ
శరీరాల తాకిడికై వెంపర్లాటలు
జేబుదొంగలు కూడా సిగ్గు పడే వీరి లాఘవం
నడుము వంపులని సృశిస్తూనో
గుప్తంగాలు రాపిడిచేస్తూనో
పైపైన పలికే “సారీ” లతో
పోనీలే ! పాపం పొరబాటు అన్నాడుగా అనుకున్నా
ఒక్క క్షణం అయోమయం తర్వాత
నిజాన్ని గుర్తించి ఏది అబద్ధపు ముసుగో
ఎవరు మేకవన్నె వ్యాఘ్రమో తెలిసి
అమ్మో! ఈసారి అయినా జాగ్రత్త పడాలనుకుంటాం
వయసు ఉడిగేదాకా
పర స్త్రీ అనాటమీ లో
అమ్మ అనాటమీ చూడలేని
అనాగరిక సంతతి వారిది
అరుచిల అనాటమీలో
ఏదీ రుచించని
వికృత అభిరుచి వారిది
వారు వారే ఎన్నటికిమారని వారు వారే
(ద్వేష వ్యక్తికరణ రూపాన్ని కాదు ద్వేషించే కారణం చూడాలి)
(ఈ కవితలో కనిపించే ద్వేషం కేవలం నా ఒక్క దానిది మాత్రమే కాదు. ఎందరో ఆడ కూతుర్లు పైకి వెల్లడించుకోలేక నిత్యం మృగాల చూపులను, వారి వికృత చేష్ట లను భరించవలసి రావడం అవమానకరం,ఆవేదనా భరితం. ఇది స్త్రీలందరి సమస్య. అందుకే వాడిగా వ్రాయవలసి వచ్చింది.అలాంటి వారు మారతారనే ఆశతో..ఈ కవిత )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి