3, ఫిబ్రవరి 2023, శుక్రవారం

వెనుకెలుగుతో


గుర్తుకొచ్చినప్పుడల్లా నోట్లో నీరూరినట్లు

ఆలోచనలో నువ్వూరుతూనే ఉంటావ్

రెండు గుండెల దరుల మధ్య ఒరుసుకుంటూ వెళ్ళి 

ఒంటరిగా ప్రవహిస్తున్న నది వద్దకి తోడెళతాను

అసంగత విషయాలేవో ముచ్చటించుకోవాలని

ఆణువణువూ దర్పణమైన తనలో

నన్ను చూసుకోవాలని


నదిలోనువ్వేం వదిలేస్తావ్ ...

కానిదేదో వదిలేయ్ ..ఒక పనైపోతుంది.

ఎవరో విసిరిన చెణుకులు తగులుకునే ఉన్నాయి

వదలడమంటే .. మనకి కష్టం కల్గించే వాటిని వదలడమా ...

ఇష్టమైన దానిని ఇష్టంగా వదలడం కాదా !

ఒదిలేసాక కొంత దూరం ముందుకు నడుస్తాను

ఇంకా ముందుకు పోలేక వెనక్కి రాలేక

అగమ్యగోచర పధాన ఆచూకీ వెదుకుతూ అవస్తపడతాను


నది నల్లదనాన్ని వెలిగించాలని మిణుకు మిణుకు మనే

తారల తాపత్రయాన్ని చూస్తూ ఉంటాను

రాని వసంతం కాసిని పూలనీ రాల్చనట్లు

ఎంతకీ రాలని పలుకులు కోసం నిరీక్షిస్తాను

కంఠ స్వరం పై మౌనం నాట్యంజేస్తూ

మాట బిడ్డలు లేని గొడ్రాలవుతుంటే

నిశ్శబ్ధ నీరవాలని వింటూ

నీ ధ్యానంలో మునిగిపోతాను


చీకటి చిక్కనైంది మనసులో కూడా

వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళానేమో

వచ్చేటప్పుడు ఈడ్చుకుంటూ మోసుకొస్తాను

నాతో పాటు నిన్నువెలుగులా

ముందు నా నీడతో ఏళ్ళ తరబడి ఇదే దృశ్యం

అక్కడ ఒదిలింది నిన్నా నన్నా !?


02/11/2015.




కామెంట్‌లు లేవు: