7, అక్టోబర్ 2015, బుధవారం

సౌందర్య పిపాస
మట్టిపాత్ర లాంటి మనిషి మట్టిలో కలిసిపోయేలోగా
అనుభూతుల వర్షంతో నింపుకోవాలి ఒలకబోసుకోవాలి

నలుపు తెలుపుల జీవితం రోట్లో
కాలం రోకలి పోటుకి చిందే అమృత క్షణాలు
పిండై పోయిన ఘడియలు తిరిగి రానే రావు

లోలోతుల్ని తెలుసుకోలేని మనిషి
పై పైన తేలే హంసలా ఎగిరిపోక తప్పదు

గుండె పుప్పొడి రేణువులని చిట్లిస్తుంది
చినుకులు ములుకుల్లా తగులుతుంటాయి
సంకెలకి చిక్కని హృదయం మేఘమై తేలిపోతుంది

అంతర్నేత్రానికి అంటిన సౌందర్య సారమంతా
అనంత దీప్తమైన ఈ ప్రకృతి ఆకృతి యే కదా !

ప్రభూ !... ఈ మట్టి పాత్ర ని ఇలాగే నింపుతూ ఉండు .