21, అక్టోబర్ 2015, బుధవారం

ఆధునిక భారతం - ఆధునిక మహిళ

శతాబ్దాల చీకటి పురులు విప్పి నాట్యం చేస్తున్న చోట 
కొన్ని వెలుతురు రువ్వలని  గువ్వల్లా 
సమానాకాశంలో ఎగరేయాలని కదం ద్రొక్కుతూ ఆమె 

విద్యా  ఉద్యోగ  ఆధార దారంతో పైకెగసే తపస్సు  
ఆ దారాన్ని కత్తిరించే పనిలో ఒకరు  
అహంకార ఖడ్గం ఝుళిపిస్తూ ఇంకొకరు
మెదడులో మొలకెత్తిన చివురులని  చీల్చేస్తూ కొందరు 
మాటాడమని  అనుమతిచ్చిన నోరే  
వేనవేల చేతులై  గళాన్ని నొక్కేస్తూ మరి కొందరు   
అంతర్జాతీయ అంగడి సరుకుని చేస్తూ అందరూ 
అడుగడుగునా అంధకార బంధురమే..

ఇన్నాళ్ళుగా సాధించిన విజయానికి సాక్ష్యమడిగితే

తొలకరి చినుకుకి పచ్చ  పొత్తిళ్ళు పరవలేని పుడమిలా చూసింది 
జవాబు దొరకని ప్రశ్నల పొదిని మోస్తూన్నట్లుగా  యోచిస్తుందామె
అయినా ఆమిప్పుడు  ఆధునిక  భారతంలో ఉంది 

అదెక్కడుంది ! ఎలా ఉందంటే ...  ? 

మనుషులు కామ వృక్షాలై కోరికల పూలు పూస్తున్నట్లు
భావప్రకటన మొలకలని గొడ్డలితో నరికేస్తుందన్నట్లు
నిత్యం దృశ్యీకరణ శత్రువు చేతుల్లో చస్తూ బ్రతుకుతున్నట్లు
మత విద్వేషాల పడగ నీడలో భయపడుతూ భంగపడుతూ 
సంప్రదాయపు ముసుగులో ఛాంధసుల పిడివాదాల మధ్య నలుగుతూ
శుష్క దేహంతో నిప్పుల గుండాల మధ్య నడక సాగిస్తూ
మేల్ చ్వావినిజం నోట్లో మై చాయిస్ ఆవగింజై నానుతుంది


ఆధునిక భారత స్త్రీ చరిత్రని పునర్ లిఖిస్తుంది
అన్న  గురజాడ మాటని నిజం చేస్తూ ..

నా ముందొక  చిత్రం దృశ్యా దృశ్యంగా .
నలబయ్యిల్లో పడుతున్న ఓ ప్రమద
ఆమె తనువంతా ఆశల ఆకు పచ్చని చీర
ఎరుపు పసుపు మేళవింపు గల కొంగేమో
గాలికి రెప రెపలాడుతున్న జెండా లా ఉంది
నల్లని కురులలో సూర్య చంద్రులిద్దరిని అలంకరించుకుని ఉంది
ఆమె తలకి రెండువైపులా లేతపచ్చని
రెండాకుల కొమ్మలని కిరీటంలా అలంకరించుకుంది

తల ప్రక్కగా పైకి లేచిన కుడి చేయి
చూపుడు వ్రేలు మధ్యవేలు కలిసి
సాధించిన విజయాన్ని చూపుతున్నాయి
ఆమె ఎడమ చేయి గుప్పిలి బిగించి
బొటన వ్రేలిని క్రిందికి చూపిస్తుంది
శతాబ్దాల నడకలో ఆమె అతని వెనుకే కానీ
ఇప్పుడామె స్వరం ఉరుముతుంది
కళ్ళల్లో తటిల్లత నాట్యం చేస్తూ ఉంటుంది

అనుభవాల కుంకుమ భరిణ ని తెరిచి బొట్టు పెట్టి
హక్కుల పేరంటానికి ఆహ్వానిస్తుంది
పర్దా లని గోళ్ళతో చించేస్తుంది
అంటరాని తనాన్ని ఉప్పు  నీళ్ళలో జాడించి
కుహనా మేధస్సుకి సంప్రోక్షణ చేస్తుంది

స్త్రీల అస్తిత్వమంటే 
చెప్పుక్రింద తేలు కాదు నలిపేయడానికి 
తోక త్రొక్కిన త్రాచు లాంటిదని  
నిద్రాణంలో ఉన్న మగువలు  మేల్కొంటే 
పర్వతాల కూసాలే కదులుతాయనే నిజాన్ని చాటుతూ    
 ప్రతి మగువ మండే భాస్వరం కావాలంటూ   
గౌరవాల నిశ్శబ్దాన్ని భగ్నం  చేయాలన్నట్లు సాగుతుందామె
మనిషి తనానికి ఆనవాలమయ్యి నడుస్తుంది
గమనమే గమ్యంగా .