9, అక్టోబర్ 2015, శుక్రవారం

గోడలు

గోడలు


సంప్రదాయానికి  ఆధునికానికి మధ్య అడ్డుగా నిలిచేవి

మనుషుల మధ్య మొలిచినవి  కూల్చలేనివి

వీటి గురించి కాదు నేను చెప్పేది

ఒడలంతా చెవులు కళ్ళున్నట్టు గుండేమో రాయి అయినట్టు

మనసేమో వెన్నలా చల్లగా ఉన్నట్టుండేవి 

ఏకప్పునైనా తనపై నిలుపుకుంటూ 

ఆత్మ స్వేచ్చకి అర్ధంగా నిలిచినట్టు ఉండేవి 



సున్నం తాటి బెల్లం గానుగ వేసి కట్టినందువల్లనేమో

నాలుగుతరాల మా ఇంటి కథలని  అవలీలగా చెప్పేసేవి  

మా నానమ్మ తాతయ్యల మంచి మనసులకి ఆనవాలుగా 

తెల్లగా ఎప్పుడూ చలువ తేమనే  పంచేవి అవి

మనుషులని పీటలని పళ్ళేలని చేయడమే కాదు

నిచ్చెన వేసుకునేందుకు ఆధారంగా నిలిచినవి 

మా పురుషుల అహంకారాలని

పోసుకోల కబుర్లని పొల్లు బోకుండా చెపుతూ

నిరసన తెలుపుతూన్నట్లుగా పెళికలు రాల్చేవి

మా అమ్మ కన్నీటి చెలమలని పీల్చుకుని

సహానుభూతిగా బొట్లు బొట్లుగా చెమ్మని జార్చేవి 



నాకంకెలని అక్షరాలని నేర్పినవి

నా పిచ్చి గీతల ముగ్గులల్లరిని భరించినవి

పెద్ద పండుగక్కూడా కొత్త చీరవేసుకోకుండా

నా చిత్రకళా కౌశలాన్ని పదే పదే ప్రదర్శించిన త్యాగమయిలు అవే !



ఆడపిల్లవంటూ బేధాలు చూపినప్పుడు

నా మూగ ఊసులన్నింటిని ఓర్పుగా విని

నాకు స్నేయితంగా నిలిచినవి  

నన్ను నిలువెల్లా హత్తుకుని ఓదార్పు నిచ్చినవి 

నన్ను నిటారుగా నిలబెట్టినవి కూడా అవే

వెన్నానించి సాగిలబడితే

పచ్చని చెట్టులా సేదదీర్చేవి

ఎప్పుడింటికి వెళ్ళినా చూపులతో కుశలమడిగి

ఆత్మీయంగా చేతుల్లల్లి పరామర్శించి

వెనుక నుండో ముందు నుండో

నిలువెల్లా హత్తుకుని వీడ్కోలు చెప్పి వస్తాన్నేను



ఇంటికి వచ్చాక కూడా ఇంకా ఆ చూపులు 

నన్ను తడుముతున్నట్టే ఉంటాయి

వాటితో  తప్ప వేటితోనూ  గోస చెప్పుకోలేనేమో

పదే పదే మెదులుతుంటాయి సజీవ జ్ఞాపకంగా

అవంటే  రాళ్ళు సున్నం మాత్రమే కాదు 

చరిత్రలని చెప్పే నిలువెత్తు సాక్ష్యాలు మాత్రమే కాదు

అనురాగాలని అనుభవాల కథలని 

భాధలని గాధలని ఆర్ద్రంగా చెప్పేవి

మనకై మనం వ్రాసుకున్న చేవ్రాలు లాంటివి గోడలు. 


కామెంట్‌లు లేవు: