7, ఏప్రిల్ 2016, గురువారం

అంతేగా ...వేలి కొసల్లోకి ప్రవహించిన హృదయ  స్పర్శని   
సంభాషణలలో  తొణికసలాడే ఆత్మీయతని  
వెన్నెల పంచుకున్నట్టు నవ్వులని 
నీళ్ళు అడిగి  పుచ్చుకున్నట్లు  కన్నీళ్ళని 
పంచుకునే మనసున్నంత  కాలమూ  
అంతర్వాహినిగా ఎన్నో మైళ్ళు ప్రయాణిస్తూనే ఉంటాం 

నేను  నా అనే  స్వార్ధమో  అనుమానపు బీజమో  
మొలకెత్తిన మరునిమిషం ... 
బాహ్యంగా అడుగు కూడా ప్రవహించలేని సరస్సయి పోతాం 
ఎప్పుడెన్ని  గజాలు విస్తరించాలో లెక్కలేసుకుంటాం 
బిరడాలో మనని మనమెలా  బంధించుకోవాలో నేర్చుకుంటాం 
క్షణానికో మారు నియంత్రించుకుంటాం  
ఓ అత్యవసరాన్ని సృష్టించుకుని చిన్నగా పక్కకి తప్పుకుంటాం . 
మానవ ప్రయాణాలన్నీ అంతేగా ! 

-వనజ తాతినేని 06/04/2016- 08:20 PM.

1 కామెంట్‌:

Sri[dharAni]tha చెప్పారు...

జీవితం ఒక నిరంతర వాహిని
జీవితం ఒక చంచల యామిని
అక్షరాలనే భావాలుగా మలచి
భావల ఒరవడిలో సాగే నవరసభరితమైన నిఘంటువు

~శ్రీ~