30, ఏప్రిల్ 2016, శనివారం

దుప్పటి

రంగు రంగు దారాల లతలతో    

జరీ జిలుగు పూలతో  నైపుణ్యంగా 

అలంకరించబడింది నా దుప్పటి.  


అదృశ్య హస్తమేదో పూలకి రంగులద్దినట్లు 

నా ప్రాణ దర్పణాన్ని  ఆ రంగుల దుప్పటి 

ఆత్మీయంగా కమ్మేసేది. కనబడని నీడయ్యేది 

తన విముక్తాకాశం క్రింద పులుగునై 

సంచరించడానికి అవకాశమూ ఇచ్చేది 

ఎన్నెన్నో  హృదయాఘాతాలని 

భరించిన  బాధని  గోప్యంగా దాపెట్టేది 


క్షత గాత్ర గానాన్ని వినబడనీయకుండా  

నన్ను  రహస్యంగా కప్పేసేది . 

చర్మ చక్షువులతో సంగ్రహించిన సత్యాన్ని 

బయల్పడకుండా కాచే కన్నూ అయ్యేది 


శుభ్రవస్త్రం లాంటి మనసుపై 

ధూళి నంటనివ్వని తెరయ్యేది 

పలుచనైన పలకరింపులన్నీ వొడపోసేది  

అతిగా బాధించే సున్నితత్వాన్ని కత్తిరించేసేది 


కొత్తగా హృదయానికి రెప్పలు మొలవడాన్ని   

 ప్రేమ ఓ భ్రమరంలా జొరబడి  చేసే రొదలని 

పొరలు పొరలుగా విచ్చుకున్న జ్ఞానాన్ని 

కాపాడే రహస్య సైనికుడయ్యేది. 


ఇతరముల నుండి నన్ను విడదీసి 

ప్రియమైన  అలంకారమైంది. 

ఇంతగా నన్ను కాచిన  ఈ " అహం"  దుప్పటి 

నాకొక కవచకుండలమైనది. 


నా అనవసర త్యాగాలలో ఎన్నటికీ  చేరని 

ఈ దుప్పటి నునుపు మెరుపు 

తరక్కుండా చేసే సాము గరిడీ  

నాకు బహు ప్రీతికరమైనది. 


ఇది కులమతాల జాతి విద్వేషపు దుప్పటి 

కానందుకు మరీ గర్వకారణమైంది .

కామెంట్‌లు లేవు: