6, ఏప్రిల్ 2016, బుధవారం

రాలుటాకు స్వగతం

రాలుటాకు స్వగతం

ప్రవాహానికి నిరోధకమని  గుర్రపు డెక్కని తొలగించే నువ్వు  
ఊదా రంగు పూలందాలన్నీ నిరాశ్రయమయ్యాయని బాధతో   నేను
కార్తీకేయఖడ్గం లా కస కసలాడుతూ నీవు 
దర్భ పోచలా ఊగిసలాడుతూ నేను  

ఏనుగు పాద ముద్రలో అన్ని ప్రాణుల ముద్రలు ఇమిడిపోయినట్లు 
సమస్త జీవ కోటి ప్రాణాధారం మేఘంలో దాక్కున్నట్లు
నీ ముద్రలో లీనమవ్వాలనే ఆశలు నాలో 
ఎన్ని నువ్వులు నాలో ఒంపగా 
నేను నువ్వైనానో స్మృతికందనిది.  

రెప్పల తలుపులు మూసి కలల  కోసం గడి తీస్తే 
అవ్యక్తం అనుభవమూ కాని  గతం ముల్లై గుచ్చింది   
దృశ్యం వర్ణాలలో శ్రవణం హోరులలో చిక్కబడింది 
వ్రాయబడని వాక్యమేదో తెంపబడి మాలగా మార్చబడక 
వాడిన పూలవోలే  చిన్నబోయింది 
పరమ రహస్యమైన సంవేదన కన్నీటి బుగ్గయ్యింది.  

జీవితాన్ని ఆవరించిన అంధకారం 
కబోది చుట్టూరా ఉన్న వెలుగులా ఉంది 
పాదాల క్రింద  పచ్చిక నలిగి 
మళ్ళీ గర్వంగా తలెత్తుతుంది
అంతటి  వినయాన్ని  మనమెందుకో 
నేర్చుకోలేకపోయామన్న బాధ తోడయ్యింది.   

కలతల తుఫాన్ జీవన వృక్షాన్ని కూకటివేళ్ళతో పెకిలించి వేసింది 
బావిలో  చందురుడు బోర్లాపడిన  వెండి కుండలా  ఉన్నాడు   
గేలం వేసి లాగాలనుకుంటే  నీలాగే వెన్నెల నీళ్లై కారిపోయాడు
తూరుపు వాకిలి ఎవరో దీపాన్ని బలవంతంగా దాచినట్లు ఉంది 
ఎవరి ఆసక్తుల మేరకో నువ్వాగిపోయినట్లు 

జీవితపు ప్రతి దశ పాట లాంటిదే నడక నేర్చే పాపాయి లాంటిదే  
 రాలే పండుటాకులకి పాటల్లేవ్ మూగరోదన తప్ప
అయినా పాటలా ఆ  స్పర్శలు వెంటాడతానే ఉంటాయి
స్వగతాలై వెన్నుతడుతూంటాయి రాలేదాకా.  

**********************************************************


కామెంట్‌లు లేవు: