28, ఆగస్టు 2016, ఆదివారం

భావచిత్రాలు

భావచిత్రాలు కొన్ని పాతవే ....

తొలకరి

మేఘరాజు భువి కన్నెపై వలపుగొన్నాడేమో
మెరుపు తీగలతో మురిపిస్తూ వచ్చి
తొలి ముద్దు ముద్రవలె
కాసిని వానచుక్కలు రాల్చి అదృశ్యమయ్యాడు
మలి ముద్దు కోసం
ముద్దరాలు నునుసిగ్గుతో  తలనెత్తి నిలిచింది పాపం.

****************

కవితై ....

పువ్వు వోలె రాలకుండినట్లు
శతాయుష్షు నిమ్మని వేడుకుంటిని విధాతని
నీ ప్రియుడి కవితలో
నిత్యమై నిలిచి ఉండెదవు పో అన్నాడు దయతో ..

*****************

శిక్ష

నువ్వు అవునంటే
నీ ఎదపై మంగళ సూత్రమై సేదదీరుతా
నువ్వు కాదంటే
భగ్నహృదయపు దివ్వెగా మలిగిపోతానంతే.. కానీ
నీ ఎడబాటుకి గురిచేసి
ఏడు జన్మలకి సరిపడా శిక్ష విధించబోకు ప్రియా !

***************

ఆదేశం

ఒక్కసారి కలలోకి వచ్చి తప్పిదం చేసినందుకే
నీ వలపు చూపుల సంకెలతో బంధించి
జీవనపర్యంతమూ కళ్ళల్లో కాపురముండమని
ఆదేశించుట న్యాయమా
కనిపెంచిన అమ్మకైనా చిన్న మాట చెప్పిరావద్దూ ..  

16, ఆగస్టు 2016, మంగళవారం

రెండు అరణ్య ప్రయాణాలు

చిమ్మ చీకటిలోనూ ..వెన్నెల కాంతులలోనూ అరణ్య శోభని కనులారాకాంచాలని ఎడతెరుగని కోరిక. నీలి కెరటాలపై  పై పైకి తేలివచ్చే చంద్రుడిని,  తీరం వొడ్డున విరిగి పడే అలల సవ్వడిలో చూడటం ఓ వింత అనుభూతి అయితే రేయీ  పగలు ఏదైనా .. చీల్చుకునివచ్చే కిరణాల వెలుగులో కూసింత వెలుగు మరింత నీడలో  అడవులలో తిరగడం ఓ సాహసమైన ప్రయాణమే !   నిశ్శబ్ద సంగీతం అంటే ఏమిటో అనుభవిస్తూ అప్పుడప్పుడూ పక్షుల జిలిబిలి సంగీతాన్ని ఆహ్లాదిస్తూ ఆ అరణ్యపు దారులలో చీకటి కొసన  వాహనపు వెలుగులకాంతిలో ప్రయాణిస్తూ ..కదిలిపోయే అడవిని ఎక్కడ నింపుకోవాలో తెలియక తికమక పడతాము.

మొట్టమొదటి సారి  నల్లమల అడవులని  జోరుగా కురుస్తున్న వర్షంలో    దోర్నాల  నుండి కర్నూలు జిల్లా ఆత్మకూరు వైపు  బస్ లో వెళుతూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను . ఉదయకాంతి వ్యాపిస్తున్నా భానుడు కానరాని ఆకాశంలో కారు మబ్బులు కరి  రాజులా మందగమనముతో నడుస్తున్నాయి .రోడ్డికిరువైపులా మనిషి కాళ్ళు రెండూ దగ్గర పెట్టుకుంటే ఉండేంత దగ్గరగా ఒరుసుకుంటూ ఆకాశం వైపుగా దట్టంగా  పెరిగిన వృక్ష సముదాయం ... ఆ చెట్ల కొమ్మలు రోడ్డు పై ప్రయాణిస్తున్న బస్ కి  వర్షంలో తడవకుండా పట్టిన గొడుగులా అనిపిస్తే .. కొండలపై నుండి జలజలా ఉరికే వాన నీరు వరదలా మారి  బస్ ని ముంచేస్తాయా అన్నట్టు భయం కల్గించాయి. కాసేపు పిసిని గొట్టు వాడి ఏడుపులా కురుస్తున్న వాన మరి కాసేపు  తొండాలతో గుమ్మరించి పోస్తున్నట్లు వాన.నాలా కురిసే విశాలత్వం మీకుందా ..అని అడిగినట్లు అనిపించింది.వాన చెప్పిన  రహస్యాన్ని కూడా ఆలోచనల్లో  ముద్రించుకుని అలా కళ్ళు మూసుకుంటే కురుస్తున్న వాన చప్పుడు ఆరోహణావరోహణాలతో అమృతాగానంలా తోచింది మెల్లగా కళ్ళు విప్పి పైకి చూస్తే  ఎన్నడూ తలవంచని ఆకాశం కూడా ఆహరహమూ తన చూపుని క్రిందికే  దించి చూస్తున్నట్లు అనిపిస్తుంది ఎందుకో ! భువికి దివికి ఉన్న అనుబంధమేమిటో అన్న ఆలోచనలని భంగపరుస్తూ పెళ్లున విరిగిపడిన వృక్షం.అసంకల్పితంగా కీచుమని శబ్దంతో ఆగిన బస్సుతో పాటు ఒక్క క్షణం గుండె ఆగినట్టయింది.తేరుకుని  తలతిప్పి చూస్తే ఎండుటాకుల క్రింద దాగున్న బీజం ఆవలించుకుంటూ లేచి వొళ్ళు బద్దకాన్ని విదిల్చి అవతల పడేసినట్లు  మెల్లగా పైకి లేస్తూ అబ్బురంగా తోచింది.  భూమికి ఎంతో ఎత్తు లో ఆకాశం కనబడకుండా చుట్టూ ఒక్క వాహనమో లేక ఒక్క మనిషి కూడా కనబడని ఆ అరణ్యపు దారి కాస్త భయం కల్గించింది. రెండు గంటలు సాగిన ఆ ప్రయాణంలో  బస్ లో  ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంలో మునిగి పోయారు. దట్టమైన అరణ్యంలో నుండి బయట పడ్డాక ..అమ్మో ! ఇక్కడ నివశించే చెంచులు,గిరిజనులు ఎలా ఉంటారో అని అనుకున్నాను. అప్పుడప్పుడూ వెళ్లి చూసేయడమే కానీ నాగరిక జీవనానికి అలవాటు పడిన మనం అక్కడ జీవించడమంటే చాలా కష్టం సుమీ అనుకున్నాను .  ఆ అడవి ప్రయాణాన్ని ఇప్పటికి మర్చిపోలేదు నేను.



ఇక రెండో ప్రయాణం ... ప్రొద్దుటూరు నుండి విజయవాడ ప్రయాణంలో ..మైదుకూరు పోరుమామిళ్ల మార్గంలో అడవి అంచున ప్రయాణిస్తూ ... తమకంతో కళ్ళు విప్పార్చి చూస్తూ ఉండిపోయాను ఆ సౌందర్యం ఎలా ఉందంటే పౌర్ణమి వెళ్ళిన మూడోనాటి చంద్రుడు చిన్న గడ్డమున్న అందాల భరిణె మోములా ముద్దుగా ఉన్నాడు. పలుచని పాల వంటి వెన్నెల అడవంతా వ్యాపించి ఉంది.ఆ కొండ నిండు చందురుడుని అలంకరించుకున్న శశిధరుడి మోముని తలపించింది.కొండలకి ఆవలి వైపున చంద్రుడు. ఈవల వైపు ప్రయాణిస్తూ నేను. చీకటి తలుపులుగా మారి ఓరగా  అరణ్యాన్ని ఆకొండక్రింద గదిలో  బంధించినట్టు ఆగంతుకునిలా వెన్నెల చల్లగా జొరబడింది.  తెమ్మెర కూడా ఏవో అడవి  పూల  పరిమాళాలని మోసుకొచ్చి ఇచ్చి పొదల  నిట్టూర్పులని తిరిగి తీసుకెళుతుంది. వాటిని  చేరవలసిన చోటు వరకు చేరుస్తుందో లేదో తెలియదు. మొగలి పొదలు తమ  పువ్వుల పరిమళాన్నితామే భరించలేక  వమనం చేసుకున్నట్టున్నాయి దారంతా ఆ  పరిమళాలే !. ప్రయాణం నిమిషాలు యుగాలు గడచినట్లు భారంగా  ఉంది.  ఆకాశానికి అవనికి ఉన్న  అంతులేని స్నేహాన్ని మరొకమారు గుర్తు చేద్దామనుకున్నట్టు గూడు విడిచిన గువ్వొకటి ఎక్కడికో ఎగిరిపోతూ కనిపించింది. . దారి ప్రక్కన ఉన్న పొదలు గుస గుసలాడుకుంటూన్నట్లు చిరుగాలి అలలకి ఆకులు కదిలిస్తున్నాయి. తెల్లని మబ్బులతో చందురుడు దోబూచులాట లాడుకుంటున్నాడు.  ఆ వన జ్యోత్స్నని గాంచడానికి రెండు కళ్ళూ చాలలేదు.రోడ్డుని ఆనుకునే అక్కడక్కడా  మైదానాలు లేతాకుపచ్చతో  పచ్చిక నవ నవ  లాడుతూ వెనక్కి జారిపోతున్నాయి.ఈ రాత్రి కాలమెరుగని నిశ్శబ్ద ప్రయాణం చేద్దాం రా ... అంటూ చెలికాడిని పిలిచినట్టు వెన్నెలని తోడు రమ్మని  పిలుస్తూ  పైట చుట్టినాక వచ్చి తిష్ట వేసిన ముప్పై యేళ్ళ  అభ్యంతరాలన్నీ మరిచి విడిచి పడి పడి పచ్చికలో ఆడుకోవాలనిపించింది.
ఓస్ ..ఇంతేనా ! ఇంతకంటే దట్టమైన అరణ్యాలని చూస్తే అప్పుడు ఇంకేమంటావో... మళ్ళీ ఇంకో ప్రయాణానికి సిద్దం చేసుకో అంటుంది మనసు.  ఆ ప్రయత్నంలోనే  .. ఉన్నా నేను. అన్నట్టు మనిషి ప్రయాణం కూడా అరణ్యదుర్గమమే కదా! ఎప్పుడు ఎలా ఉంటుందో ఇసుమంతైనా ఊహించలేం కదా !