24, సెప్టెంబర్ 2022, శనివారం

రచయితలకు యోగం

 ఈస్తటిక్ సెన్స్ కథలు చదివిన పాఠకుల అభిప్రాయాలు. పుస్తకం చదవడమే అరుదైన ఈ కాలంలో.. ఇదిగో ఇంకా మాలాంటి వారిమి వున్నాం. పుస్తకం కొనుక్కొని చదువుతాం. మా స్పందనను కూడా రచయితకు ఇష్టంగా తెలియజేస్తాం అంటున్న మిత్రులు పంచుకున్న అభిప్రాయాలు. 

రచనలు ఎవరి కోసం అన్న ప్రశ్న ఉదయించినపుడు.. ఇదిగో.. ఇలాంటి పాఠకుల కోసం అని చెప్పుకునే వినయం సంతృప్తి. 

ఈ 14 కథలు మూడేళ్ళ కృషి,బాధ్యత కూడానూ. రచయితకు తమ రచనలను చదివే పాఠకుడు లభించడమే ఒక యోగం. ఈ లెక్కన అదృష్టవంతురాలిని. నాకంటూ కొంతమంది పాఠకులున్నారు. జయశ్రీ గారికి  ఉమా మహేశ్వరి గారికి ధన్యవాదాలు. 

***********

#ఈస్తటిక్ సెన్స్...వనజ తాతినేని గారు..14 కధలు ..14 రకాల layered problems which girls / women face ...అక్రమ సంబంధాలు, body shaming, ఉద్యోగాల బిజీలో ఇంట్లో ఉన్న సహాయకులు చేసే ఘోరాలు, సోషల్మీడియా మత్తులో జీవితాలు నాశనం చేసుకుంటున్న అమాయకులు... భార్యే ఆదాయవనరైతే, భర్త ఆధిపత్యం..

మనుషుల మధ్య డబ్బు గీతలు..... కుబుసం వదిలేసిన పాము దాని పని మీద అది పోతుంది. కుబుసం కధలో రాజేశ్వరి లాగా

( సమస్యలను కుబుసంతో పోల్చారు). అన్ని కధలు ఆలోచనని రేకెత్తించేవే..

(men too have many issues with womenfolk. I would like to read them too.)  -జయశ్రీ అబ్బినేని. 

**************

కథలన్నీ చాలా బాగున్నాయి వనజ గారూ. 

ఇంత మంచి కథలనందించినందుకు చాలా సంతోషం. మీకు హృదయపూర్వక నమస్కారాలు.

ముందు మాటలో నారాయణ స్వామి గారు చెప్పినట్టు ప్రతి కథలోనూ స్త్రీల గాయాలు మాట్లాడుతున్నాయి. మాట్లాడడమే కాదు, సరైన మలామునూ వెతుక్కున్నవి. చికిత్స దిశగా ముందుకు కదిలిపోయినవి అనిపించింది.

ప్రతి కథలోని పాత్రలన్నీ మన చుట్టూ ఉన్నవే. రోజూ చూస్తూనే ఉంటాము. గాయపడుతున్న వారికి ఆ సమయంలో వారేస్థితిలో ఉన్నారో, అసలేం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో ఆలోచించగలిగే, అర్థం చేసుగోగలిగే పరిస్థితి గానీ, మనస్థితి గానీ ఉండదు. సమస్యలోనే కూరుకుపోయి ఉక్కిరిబిక్కిరవుతుంటారు. చుట్టున్న సమాజమూ చూసీ చూడనట్లే ఉంటుంది. వారి వ్యక్తిగతమని దాటవేస్తుంది. దారిన పోయే కంప మన మీద పడుతుందేమోనని భయపడుతుంది. తనకలాంటి పరిస్థితి ఎదురవనందుకు హమ్మయ్య అని ఊపిరిపీల్చుకుంటుంది. అలాంటివో.. కొంచం అటూ ఇటూవో తామూ ఎదుర్కున్నట్లైతే.. లోలోన… మనలాంటి వాళ్ళు మనమొక్కరే కాదు.. ఇంకా ఉన్నారన్న మాట అని కొంత ఊరట పొందుతుండవచ్చు

. గాయపడుతున్న వారికి పరిస్థితి అర్థమయ్యే నాటికి గాయం ఓ మచ్చగా, లోపంగా, బలహీనతగా, తెలివి మాలినతనంగా వారి మనసుల్లో బలంగా నాటుకుపోతుంది కాబట్టి ఇక దాని గురించి వారు ఆలోచించనూ లేరు. (అంతా అయిపోయాక అప్పుడాలోచించి ఉపయోగమూ ఉండదు)

 సరిగ్గా అలాంటి సమయం లోనే.. హే… లోపం నీది కాదు. నీ బాధ నాకర్థమౌతోంది. తప్పు నీది కాదు, తప్పంతా నీమీద జులుం చేసేవాళ్ళది. వాళ్ళది లోపం అని చెప్పే స్వరం కావాలి. దురదృష్టవశాత్తు సమాజం అలాంటి చేయూతను ఆ సమయంలో చేయదు. 

అచ్చం అలాంటి వారికి ఈ కథలు దివిటీలలాంటివి. ఇలాంటి బాధలు మనకొక్కరికే కాదు ఇంకా ఉన్నారన్నమాట. వాళ్ళు మనలా మౌనంగా భరించకుండా సమస్య నుండి బయటపడడానికి ఇంకా ఎవో మంచి మార్గాలు వెతికారన్నమాట. ఆ దారుల నడిచి ఒడ్డున పడ్డారన్నమాట. ఇదుగో… ఇలాంటి కొన్ని పరిష్కారాలు వారినా సమస్యలనుండి బయటపడేసాయన్న మాట. ఈ పరిష్కారాలు ఇంకెవరి చేతుల్లోనో కాదు. అచ్చంగా మనచేతుల్లోనే ఉన్నాయన్న మాట అన్న ఊరటనూ నమ్మకాన్నీ ఖచ్చితంగా కలిగిస్తాయి. అందుకని ఈ కథలు అలాంటి వారు తప్పకుండా చదవవలసినవి.

ఇంత గొప్ప కథలు అందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.

- ఉమా మహేశ్వరి సామ. 

**************.



కామెంట్‌లు లేవు: