25, ఫిబ్రవరి 2013, సోమవారం

పుష్పవర్ణ మాసం ఒక మోహనాస్త్రం

పెన్నానదీ తీరంలో  జొన్నవాడ  గ్రామం ఉంది . అది ఒక శక్తి పీఠం గా విలసిల్లుతుంది . అక్కడ అమ్మవారి పేరు కామాక్షితాయి.

రోజువారి దర్శించుకునే  భక్తులతో పాటు అక్కడ బస చేసే వారు కూడా ఎక్కువే!  అక్కడ బస చేసేవారు ఒక రెండు మూడు రోజులకే తిరిగి వెళ్ళిపోరు కనీసం మూడు నెలలు అయినా ఉండే వాళ్ళు ఉంటారు .

అలా ఉండే వాళ్ళే దెయ్యం పట్టిందని కుటుంబ సభ్యులచే వదిలివేయబడ్డ వారు.  సదరు దెయ్యం పట్టింది అన్న వ్యక్తికి తోడుగా  ఏ ముదుసలి వారో ఉండటం కద్దు.

దెయ్యం పట్టింది అని పేరు పడ్డ అందరూ రాత్రి పన్నెండు గంటలకి ముందే కామాక్షి తాయి గర్భ గుడి  చుట్టూరా చేరి నిద్రకి ఉపక్రమిస్తారు. అర్ధ రాత్రి సమయాలలో హటాత్తుగా లేచి పిచ్చి కేకలు పెడుతుంటారు "నన్ను వదులు  వదులు " అంటూ విదిలించుకుంటారు గుడి నుండి బయటకి పారిపోయే దానికి ప్రయత్నిస్తారు. వాళ్ళని చూసి (దెయ్యం పట్టని అనుకోవాలి ) మంచివాళ్ళు "అమ్మోరి" దెబ్బకి దెయ్యం పారిపోబోజూస్తుంది .
ఇంకొన్నాళ్ళు ఇక్కడే నిదరజేస్తే దెయ్యం వదలడం ఖాయం అనుకుంటారు .

ఇలాంటి దృశ్యాలని ఒక మానసిక వైద్యుడు  చూస్తే .. దెయ్యం వాళ్లకి కాదు పట్టింది,చుట్టూ ఉన్నవారికి పట్టినట్లు ఉంది మానసిక రుగ్మత తో బాధపడే వాళ్ళని హాస్పిటల్ కి తీసుకురావాలి. మందులు ఇప్పించాలి కాని ఈ గుళ్ళు గోపురాలు వెంబడి తిప్పడం ఏమిటి అని విసుక్కోవడం ఖాయం కదా!

అదే సన్నివేశాన్ని ఒక రచయిత కాని రచయిత్రి కాని చూస్తే  ఆసక్తితో వాళ్ళని నిశితంగా పరిశీలించి వారు ఏం మాట్లాడుతున్నారో విని వారిది  ఒక రకమైన మానసిక వ్యాధి లేక బ్రాంతి లో అలా మాట్లాడుతున్నారా అని ఆలొచిస్తారు. వీలయితే వారి మాటలకి ఉన్న అంతరార్ధాన్ని గ్రహించి.. కథలు అల్లుతారు.

హేతువాదానికి భిన్నంగా తాము పుట్టి పెరిగిన వాతావరణం,కొన్ని నమ్మకాలు, పెద్దల మాటల ప్రభావం వల్ల దెయ్యాలు ఉండవచ్చేమో ! అని కూడా యోచన చెస్తారు. కొందరైతే దేవుడు , దెయ్యాలు గట్రా లేవనే గట్టి నమ్మకం లో ఉన్నప్పటికీ కూడా  దెయ్యం పట్టింది అనే మాటలకి ప్రాముఖ్యత  నిచ్చి ఊహా జనిత కథలు అల్లుతారు.

ఎందుకంటే పాఠకులు ఊహాజనిత  కథలు చదువుతూ ఆ కథల్లో పరకాయ ప్రవేశం చేసి  తమని తాము ఊహించుకోవడం కోసమో లేదా అలాంటి కథలు చదవడం అంటే సరదా కోసమో అలాంటి కాల్పనిక సాహిత్యాన్ని ఆదరిస్తారు. అటువంటి నవలలని ప్రపంచమంతా ఆదరిస్తూ ఉన్నారు కదా!.

అలా అనుకునే .. దెయ్యం పట్టిన స్త్రీ అనబడే  "వీణాధరి " గురించి ఒక కథ రూపుదిద్దుకోబడింది ఆ కథ " పుష్పవర్ణ మాసం "

ఆ కథని నేను చదివినప్పుడు నాకు కల్గిన అనుభూతి ని వర్ణించలేను . అసలు ఈ కథ పేరే ఊహా జనితం  పుష్ప వర్ణ మాసం అని మాసం లేదు కదా!

ఇక  పుష్పవర్ణ మాసం గురించి..

అనుభూతి ప్రధానంగా ఈ కథ చదివినప్పుడు .. అబ్బ ! ఎంత బావుంది ఈ కథ అనిపించడం ఖాయం నీలి మేఘం అడవితో మాట్లాడుతుందే .. ఆ బాష .. అంటే సంభ్రమంగా అక్షరాల వెంట కళ్ళు పరుగులు తీసాయి. ఆదేమిటి అన్న ఆలోచనే రాలేదు . అదొక కనీ విని ఎరుగని అనుభూతి

ఈ రచనలో వీణాధరి తల్లి ప్రకృతి  ప్రేమికురాలు మృదు స్వభావి అందంగా ఉంటుంది చక్కగా పాడు తుంది భర్త తో చీటికి మాటికి గొడవ పెట్టుకుంటుంది  ఎందుకు అంటే అతని వైఖరి ఆమెకి నచ్చి ఉండకపోవచ్చును కదా అని మనం అర్ధం చేసుకోవాలి ఆఖరికి మరణించింది తరువాత డబ్బు,నగలు,మేడలు కి ప్రాధాన్యత ఇచ్చే అమ్మమ్మ సంరక్షణలో పెరుగుతూ

పుష్ప వర్ణ మాసంలో పుట్టిన వారికి దెయ్యాలు కనబడతాయి అంట అని పడే పడే చెప్పి అమ్మమ్మ మాటల వల్ల  అతర్లీనంగా దెయ్యాలు ఉంటాయి అనే భ్రమ కల్గి ఉంది వీణాధరి కూడా స్వభావ సిద్దా తల్లితో పోల్చదగిన స్త్రీ మూర్తి .

ఆమెకి తను జీవిస్తున్న జీవితం కి ఆమె మనస్తత్వం కి అసలు పొంతన కుదరక పోవడం వల్ల అసంతృప్తి కల్గి  అతర్లీనంగా ఆమెలో దాగున్నఊహా జనిత పురుషుడే అతను. బహుశా ఆమె అమితంగా ప్రేమించే పురుషుడుని కోరుకుని ఉండవచ్చు అది ఆమెకి లభించక పోవడం వల్ల ఊహాజనిత లోకంలో ఆమె బ్రతుకుతూ ఉంటుంది

పెద్ద మేడ, వెనుక తోట, ఒంటరిగా ఉండటం  లాంటి అనువైన వాతావరణం  వల్ల ఆమె ఊహలు అతని చుట్టూ అల్లుకుంటాయి  అందరికి కనబడని అతని ని చూస్తూ  ఉంటుంది .పైగా అతను  చాలా పురాతనుడు అని అక్కడ ఏడు  మామిడి చెట్లు మరణించి మళ్ళీ నాటిన మామిడి చెట్టు పై కూర్చుని ఆతను ప్రేమించిన ఆమె కోసం ఎదురు చూస్తున్నాడని చెప్పడం ఆమె ఎవరో కాదు ఆమె మరో నేనే అని చెప్పడం కూడా ఆమె ఎంతటి అధివాస్తవికతలో ఉందొ చెప్పడం జరిగింది  ఆఖరికి అతను  ఇచ్చిన గోమేధికం  అంతకంతకు బరువు పెరిగి పోతుందని చెప్పడం కూడా దానిని ఆరగ దీయడం కూడా .

 తన గురించి  తను ఇవన్నీ చెప్పుకుంటున్నప్పుడు  విని  ఆమె బ్రాంతి లో ఉందని భావించవచ్చు .  లేదా పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తుంది అని లేదా దెయ్యం పట్టింది అని ఎవరి అవగాహన మేరకు వారు బావించడం కద్దు.

అప్పుడు నేను అనుకున్నాను పువ్వు నవ్వుతున్నట్లు లేదు!? అని ఆశ్చర్యంగా  అనడానికి,  పువ్వు నవ్వుతుంది అనడానికి తేడా ఉన్నట్లే  ఈ వీణాధరి కథ ఉంది అని.

కాల్పనిక సాహిత్యం  అయినప్పటికీ అనుభూతి ప్రధానంగా రచన సాగడం  వల్ల మిగిలిన అంశాలపై పాఠకుడి దృష్టి అంతగా మళ్ళి ఉండకపోవచ్చు .  నా ఫ్రెండ్స్ కొందరైతే ఏం కథ ఇది ..? ఒక్క ముక్క కూడా అర్ధమై చావలేదు అని విసుక్కున్నారు

మా బంధువుల ఆమె కూడా వీణాధరి లా అదిగొ..  అక్కడ ఎవరో కూర్చుని నన్ను చూస్తున్నాడు నన్ను రమ్మని పిలుస్తున్నాడు  అంటూ మాట్లాడుతూ ఉండేది . భర్త నిరాదరణ  వల్ల వైవాహిక జీవితమే ప్రధానంగా అనుకుని బ్రతికే మనిషి ఆమె.   ఎప్పుడూ భర్త గురించి ప్రేమగానో, లేదా అమితమైన ద్వేషం గానో ఉంటూ అలాగే మాట్లాడుతూ  ఉండేది అందరిని తిట్టేది తన జీవితం నాశనం కావడానికి అందరూ కారణం అని తిట్టిపోసేది. తర్వాత తర్వాత వీణాధరి లా మాట్లాడేది .  ఈ కథ చదువుతూంటే  నాకు చప్పున ఆమె గుర్తుకు వచ్చింది మానసిక వైద్యుల చుట్టూ తిరగడం తోనే ముప్పయ్యి ఏళ్ళు గడచి పోయి ఇప్పుడు కదిలిస్తే కదిలి కదిలి ఏడ్చే స్తుంది.

ఈ కథ పొడిగిస్తే ఇలాంటి విషయమే ఉంటుంది అనుకున్నాను కూడా

ఏదైనా...  పెద్దలు వారి  ఆలోచనా విధానం వల్లనో  వారి వారి  నమ్మకాలను పిల్లల ముందు పదే  పదే మాట్లాడటం జరుగుతూ ఉంటుంటుంది వీణాధరి అమ్మమ్మ కూడా   దెయ్యాలు ఉన్నాయని  వెల్లడించడం మూలంగా వీణాదరికి  కొన్ని నమ్మకాలు ఏర్పడతాయి. అందుకే  తన  మాటల్లో కూడా  నేను దెయ్యాన్ని  చూసాను అని అంటుంది  పైగా ఈ కథ అంతా తన కథనం లోనే వింటాము మూడవ వ్యక్తి ఎవరు ఉండరు కూడా కేవలం  వీణాధరి రచయిత్రి మాత్రమె ఉంటారు .  .

 మనుషులు ఎంతటి  విద్యాధికులు అయినప్పటికీ కొన్ని నమ్మకాలు ఉంటాయి అవి   అలాగే బలపడి ఉంటాయి ఆ నమ్మకం దేవుడు కావచ్చు దెయ్యం కావచ్చు   లేదా ఈ రెండింటిలో  ఏదో ఒకటికి అన్వయించుకుని బ్రాంతి  లో బ్రతకడం కావచ్చు.

విషయం ఏదైనప్పటికీ రచయిత్రి శైలి పాఠకులని మంత్రం ముగ్ధుల్ని చేసింది అనడం నిజం.  నేను ఈ కథని అనుభూతి ప్రధానం గానే చదివాను అలా చదవడమే నాకు అంతులేని ఆనందం కల్గించింది  అందుకే మళ్ళీ మళ్ళీ చదువుతూనే ఉన్నాను

ఏదైనా  సామాన్య గారి  "పుష్పవర్ణ మాసం  ఒక మోహనాస్త్రం" 

ఈ కథ చదవడానికి ఈ క్రింది  లింక్ లో వెళ్ళండి

http://www.navyaweekly.com/2012/jun/13/page62.asp


( ఈ విశ్లేషణ నేను కథని అర్ధం చేసుకున్న తీరుని బట్టి  వెల్లడించాను మరి కొందరు విశ్లేషిస్తే చూడాలని ఉంది  ఇంకా లోతుగా తెలుసుకోవాలని ఉంది )

6 కామెంట్‌లు:

సృజన చెప్పారు...

నేను కూడా సామాన్యగారి కధలు కొన్ని చదివానండి. చక్కని శైలితో మనసుని ఆకట్టుకుని ఆలోచింపజేసే విధంగా రాస్తారు.

gandavarapu saamaanya చెప్పారు...

వనజ గారూ
కథపై మీ విశ్లేషణ చాలా బాగావచ్చింది.

దాదాపు మీ బంధువులావిడే వీణాధరి కావచ్చును.మనుషుల మనసు చాలా సంక్లిష్ట మైనది .ఒకరు చాలా కష్టమని భావించిన విషయం మరొకరికి సరళంగా అనిపించవచ్చు .అలాగే ప్రేమ, అనురాగ సంబంధ విషయాలకి కూడా ఒక్కోరికి ఒక్కో కొలత వుంటుంది.మేషర్మెంట్స్ లో ఇమడ్చలెం.నిన్నఒక కథ చదివాను పండుటాకులు అని .అందులో మందాకినీ కూడా వీణాధారే .ఎంత బాధ కలిగిందో ఆ కథ చదివి.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సృజన గారు.. మీ స్పందనకి ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సామాన్య గారు.. మీ స్పందనకి మరీ మరీ ధన్యవాదములు.

మీరన్నట్లు ప్రేమానురాగాలని కొలిచి చెప్పలేం. ఒక్కొక్కరి కి ప్రేమే జీవిత లక్ష్యం . ఆ ప్రేమ లభించకపోతే వాళ్ళు వీణాధరి ,మందాకినీ లు కావడం తధ్యమ్. ఈ విషయంతో ఏకీభవిస్తున్నాను

కథ పై విశ్లేషణ బాగా వచ్చింది చెప్పడం చాలా సంతోషం థాంక్ యు సో మచ్ . .

Dantuluri Kishore Varma చెప్పారు...

మీ రివ్యూ చాలా బాగుంది.

శశి కళ చెప్పారు...

అవును చాలా బాగా వ్రాసావు అక్క.వారిని కౌన్సిలింగ్ చేస్తే ప్రయోజనం ఉంటుంది ఏమో