16, డిసెంబర్ 2013, సోమవారం

నా కవిత్వం పై "ఒక్క మాట"

యశస్వి సతీష్  కవిత్వం గురించి "ఒక్కమాట"  గా పరిచయం చేస్తూ 144 మంది కవులను పరిచయం చేసారు .

"ఒక్కమాట " లో నా పరిచయం ఇలా ఉంది .

"పంజరంలో పక్షిలా మనసే కాదు జీవితం కూడా పిడికెడు స్వేచ్చ కోసం అల్లాడి పోతుంటుంది అంటుంది. ఈస్ట్రోజన్ సూదిమందుబారినపడే తెరమీద బేబీ ఐనా కసువూడ్చి.. కళ్ళా పిజల్లి ఎనుకగన్న పిల్లల్ని సాకుతూనే ఉన్న పేదరికమైనా.. బాల్యం ఎట్టా బాగుంటాదని నిలదీస్తుంది. మట్టి చేతిగాజుల చిట్టి తల్లులని ఆడ పడుచులని కాపాడుకోవడానికి కవిత్వ ఆయుధం పట్టింది. రాళ్ళల్లొ వడ్లగింజలా జీవితం జీవించి చూపాలని, ఇతరుల ప్రేమని ఆశించకుండా ఉండటం అవసరమని.. అనుభవం తో.. నొక్కి చెప్తుంది కరిగిన ఘన సమయాలను ఒడిసిపట్టుకుంటూ ఈ నిఖిల చంద్రుడి వెన్నెల వనజ "  

హృదయం తో..స్పందించి , మనసులో.. మదించి,  ఆలోచన అగ్నికణం రగిలించి, తేట తేనియ భాషతో.. అక్షర లక్షలతో సుమాలతో....నవరస కదంబమాలికలు..అల్లడమే.. కవిత్వం  అంటుంది 

 యశస్వి సతీష్ గారు "ఒక్కమాట " ని పరిచయం చేసే క్రమంలో కవిత్వ ఔపాసన చేసిన మీకు నమోనమః. ఇంతమంది కవిత్వాన్ని అద్భుతంగా పరిచయం చేసారు . ధన్యవాదాలు. మీ కవి మనసుకి _/\_ చిరంజీవ ! యశస్విభవ!!

ముఖ్యంగా 15 సంవత్సరాల కాలంలో 60 కవితల దగ్గర ఆగిన  నా కవిత్వాన్ని సమీక్షించి చక్కని అభిప్రాయాన్ని, పరిచయాన్ని అందించిన మీకు హృదయపూర్వక ధన్యవాదములు. మీ ఈ పరిచయం నాకు నన్నే క్రొత్తగా పరిచయం చేసింది . (పేజీ 143 లో నా పరిచయం )






14, డిసెంబర్ 2013, శనివారం

కొన్ని జనరల్ స్టేట్మెంట్లు..

కొన్ని  జనరల్ స్టేట్మెంట్లు..

స్త్రీలవి ఎప్పుడూ ఏడ్పుగొట్టు ముఖాలు 

మగవారు ఎంత దుఖం వచ్చినా కంట్రోల్ చేసుకోవాలి .. ఆడదానిలా ఏంట్రా ..ఆ ఏడుపు ..? 

స్త్రీలు దయార్ధ్ర స్వరూపులు, అణువణువునా ప్రేమ నింపుకుని ఉంటారు ద్వేషించడం అసలు చేతకాదు , క్షమా గుణం వారి సొత్తు 
  
ఇంకా చెప్పాలంటే  సున్నితమైన మనసు, నాజూకుగా ఉంటారు. అమాయకంగా నమ్మి మోసపోతారు  

మగవారు కఠినస్వభావులు  మోస పూరితులు, దయ,జాలి ఏ మాత్రం ఉండవు. నిలువునా ముంచేస్తారు   

స్త్రీలు అనవసరంగా భయపడతారు పిరికివారు ,మానసిక బలహీనులు 

పురుషులు పుట్టుకతో ధీర గుణం కలవారు. ఏదైనా సాధించాలి లేకపోతే గాజులు తోడుక్కున్నట్లే!  

ఇదిగో.. ఇలానే  statements రాజ్యమేలుతుంటాయి ... 

ఇలా ఆడ-మగ సహజ గుణాలు అని వక్రీకరించడం వల్ల.. ఇద్దర్లో ఉన్న గుణాలు కొన్ని మరుగున పడిపోతాయి . 

భావోద్వేగాలు ప్రతి మనిషికి మనిషికి తేడాగానే ఉంటుంటాయి. సత్వ,రజో,తామసగుణాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు . పరిస్థితులని బట్టి మారుతుంటాయి. 

పురుషులందరూ ద్వేషించదగినవారు కాదు .స్త్రీలందరూ అమాయకులు,బలహీనులు కారు .       

ఇది గుర్తెరిగి మసలడం అవసరం కదా ! 

5, డిసెంబర్ 2013, గురువారం

అణువు అణువునా వెలసిన దేవా

ఈ ప్రపంచమంతా ఓ..పక్షి గూడు లాంటిది  కృత్రిమమైన ఎల్లలు,సరిహద్దులూ ఏవి లేని అందమైన వసుదైక కుటుంబంగా ఉండాలని కవి ప్రగాడమైన ఆకాంక్ష ఒక పాటలో నేను గమనించాను.  ఎక్కడ చూసినా ఆకలితో అలమటించి పోతున్నవారు, వర్గజాతి బేధాలతో,,లింగ వివక్షతో , అసమానతలతో వెలివేయబడుతున్నవారే కనబడుతున్నారు. ఎక్కడ చూసినా అధికార తృష్ణ,అర్ధ పిపాసతో ప్రాకులాడే మానవులనే చూస్తున్నాం,శాంతి,అహింస  కనుమరుగై మానవుడు మానవుడిగా ఉండే లక్షణాలు లోపిస్తున్నాయి. ఇవన్నీ గమనించిన కవి ఈ పాటలో తన ఆవేదనకీ అక్షర రూపం ఇచ్చి హృదయాలని మేల్కొలిపే భాద్యత చేపట్టారా ..అని ఈ పాట వింటున్నప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది. ఆ పాట మానవుడు -దానవుడు చిత్రంలో పాట. పాట రచయిత  డా:సి.నారాయణ రెడ్డి గారు. 40 సంవత్సరాల క్రితం వచ్చిన చిత్రంలోని  ఈ పాట అవసరం ఇప్పుడు చాలా ఉంది. ముఖ్యంగా  స్వార్ధ రాజకీయ నాయుకులకి , స్వచ్చంద సేవా సంస్థల ముసుగులో నిధులని  దోచుకునే దొంగలకి, కళ్ళ ముందు కనబడే దీనుల ఆక్రందనలు కనబడని,వినబడని బధిరులకి, ముఖ్యంగా వైద్యం పేరిట అక్రమార్జనకి పాల్బడుతున్న వైద్యులకి , అంతుచిక్కని వ్యాధుల బారిన బడ్డ వారిపట్ల వివక్ష చూపుతున్న వారికి ఈ పాట వినిపించాలని అనిపిస్తూ ఉంటుంది. మంచి మనసు ఉన్న వారికి వారిలో అంతర్లీనంగా దాగున్న దయార్ద్రత,కరుణ, మమత వెల్లువలా పొంగి విశ్వమానవసౌహార్ధం, సౌభ్రాతత్వం పెంపొందించాలని కోరుకుంటూ ..ఈ పాట పరిచయం    


నా గీతమాల ఆమనీ .. లో  ఈ లింక్ లో 


సకల ప్రాణ కోటిలో మానవుని ఉనికి ఉదాత్తమైనది. వివేకవంతమైన మానవుడు ఇతర జీవకోటి పట్ల, తోటి మానవుల పట్ల దయార్ద్ర హృదయుడై మెలగాలి కానీ మానవుడు దానవుడిగా మారి హింసాత్మక ప్రవృత్తితో మెలుగుతూ ఇతరులకి బాధని కల్గిస్తున్నాడు


నేడు మానవ సమాజంలో ఒకరి పై మరొకరికి ప్రేమ, అనురాగం, ఆప్యాయతఅన్నీ కనుమరుగై పోతున్నాయి మనిషికి మనిషే శత్రువైపోతున్నాడు  దయ,సత్యం,కరుణ లాంటివి అంతరించిపోతున్నాయి. మనిషిలోని మానవత్వాన్ని మేల్కొలిపే ఇలాంటి పాటల అవసరం ఉంది 


 "మానవ సేవే మాధవ సేవ " గా భావించి సమాజంలో నిరాదరణకి గురైన అన్నార్తులకి, వ్యాదిగ్రస్తులకి  అండగా నిలిచిన  అమృత మూర్తులు కొందరు తోటి మనుజుల పట్ల అపారమైన ప్రేమతో మెలుగుతూ వారి  అమృత గుణం తో సేవలందించారు. పేదలకి చదువు చెప్పడం,  అనాధలకి సేవ చేయడం కరుణ, శాంతి, సహనం ప్రదర్శిస్తూ  సేవా గుణం తో నడచిన   వారి అడుగు జాడలలో నడవాలని కోరుకుంటూ ఈ పాట మొదలవుతుంది. 


జాతికి జాతి అంధకార బంధరంలో మునిగి పోయినప్పుడు జాతిని చేతన పరుస్తూ..  పరపీడన నుండి జాతిని కాపాడాలని స్వేచ్చా స్వాతంత్ర్యాలు   కావాలని ఆకాంక్షిస్తూ వారి నిస్వార్ధ గుణంతో అహర్నిశలూ శ్రమించిన త్యాగధనుల గుణాన్ని మనకి అందించాలని 


 "వైద్యో నారాయణ హరి" అన్నట్లు కొత్త కొత్త వ్యాధుల పాల్బడి వైద్య సేవలు అందక ఎందఱో దీనులు అకాల మరణంకి గురిఅవుతున్నప్పుడు నిస్వార్ధంగా వైద్య సేవలందించి జీవనదాతలుగా మారే వారి గుణాన్ని కూడా సామాన్యమైన మన మానవులందరికీ అందించమని కోరుకుంటూ .. కుల మతాలకతీతంగా విశ్వమానవ శ్రేయస్సుని కోరుకుంటూ సామూహికంగా చేరి అణువు అణువునా ఆర్తిని నింపుకుని ప్రార్దించే గీతం ఇది. ఈ గీతానికి  అశ్వత్థామ  సంగీతమందించారు . ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం బృందం ఈ పాటని ఆలపించారు.  


    


ఈ పాట వీడియో లింక్ 

చిత్రం : మానవుడు - దానవుడు (1972)

సంగీతం : అశ్వద్దామ గీతరచయిత : సినారె నేపధ్య గానం : బాలు 
చిత్రం : మానవుడు - దానవుడు (1972)

పల్లవి:
అణువు అణువున వెలసిన దేవా
కనువెలుగై మము నడిపించరావా
అణువును అణువున వెలసిన దేవా

చరణం 1:
మనిషిని మనిషే కరిచే వేళ
ద్వేషం విషమై కురిసే వేళ
నిప్పుని మింగి నిజమును తెలిపి
చల్లని మమతల సుధలను చిలికి
అమరజీవులై వెలిగిన మూర్తుల
ఆ....ఆ....ఆ....ఆ....ఆ...ఆ...
ఆ.....ఆ.....ఆ.....ఆ....ఆ...
అమరజీవులై వెలిగిన మూర్తుల
అమృతగుణం మాకందించ రావా
అమృతగుణం మాకందించ రావా
అణువును అణువున వెలసిన దేవా
కనువెలుగై మము నడిపించ రావా
అణువును అణువున వెలసిన దేవా

చరణం 2:
జాతికి గ్రహణం పట్టిన వేళ
మాతృ భూమి మొరపెట్టిన వేళ
స్వరాజ్య సమరం సాగించి
స్వాతంత్ర్య ఫలమును సాధించి
ధన్య చరితులై వెలిగిన మూర్తుల
ఆ....ఆ....ఆ...ఆ...ఆ...
ఆ.....ఆ.....ఆ....ఆ...ఆ...
ధన్య చరితులై వెలిగిన మూర్తుల
త్యాగ నిరతి మా కందించ రావా
త్యాగ నిరతి మా కందించ రావా
అణువు అణువున వెలసిన దేవా
కను వెలుగై నడిపించ రావా
అణువు అణువున వెలసిన దేవా

చరణం 3:
వ్యాధులు బాధలు ముసిరే వేళ
మృత్యువు కోరలు చాచే వేళ
గుండెకు బదులుగ గుండెను పొదిగీ
కొన ఊపిరులకు ఊపిరిలూదీ
జీవన దాతలై వెలిగిన మూర్తుల
ఆ....ఆ....ఆ....ఆ....ఆ...ఆ...
ఆ....ఆ....ఆ....ఆ....ఆ.....ఆ...
జీవన దాతలై వెలిగిన మూర్తుల
సేవాగుణం మాకందించ రావా
సేవా గుణం మాకందించ రావా
అణువు అణువున వెలసిన దేవా
కనువెలుగై మము నడిపించరావా
అణువు అణువున వెలసిన దేవా .. 


1, డిసెంబర్ 2013, ఆదివారం

ఎయిడ్స్ భూతం -వివక్ష పిశాచం .

అవగాహన లేమి ఒక ప్రక్క  మానవత్వం లోపించి ఒక ప్రక్క .. మనుషులని బ్రతికి ఉండగానే కాటి

కీడ్వడం పై స్పందనతో ..

ఎయిడ్స్ వ్యాధి నియంత్రణా దినోత్సవం సందర్భంగా .. నేను వ్రాసిన వ్యాసం

 డిసెంబర్  నెల  విహంగ  లో ..

ఎయిడ్స్ భూతం -వివక్ష పిశాచం .. ఈ లింక్ లో 



ఎయిడ్స్ భూతం - వివక్ష పిశాచం  
                                                         వనజ తాతినేని 


పరీక్షలో తప్పామని, ప్రేమ పరీక్షలో ఫెయిల్ అయ్యామని ఆత్మ హత్య చేసుకునే వారికి  హెచ్ ఐ వి పాజిటివ్ గా ఉండి ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులుగామారబోతు కూడా  బ్రతుకుపై ఆశతో జీవిస్తున్న వారిని చూపి జీవితం యొక్క విలువ ఎలాంటిదో చూపాలనిపిస్తూ ఉంటుంది. 

ఒక్కగానొక్క కూతురు. అపురూపంగా పెంచాం . ఓ.. అయ్య చేతిలో పెడితే బాధ్యత తీరుతుందని మంచి చెడు అన్నీ విచారించుకునే పెళ్ళి చేసాము. ఏడాది తిరగక ముందే తాళి తెగి తిరిగొచ్చింది. పొలాలు ఇళ్ళు అబ్బాయి వ్యాపారం చూసాము కాని అబ్బాయికి ఎయిడ్స్ ఉందొ లేదో తెలుసుకునే పరీక్ష చేయించాలన్న ఆలోచనే రాలేదు  వాడు చచ్చిందిగాక పిల్లకి జబ్బు అంటించి పోయాడు  దాని బతుకు బుగ్గిపాలై పోయింది .. ఓ ..తల్లిదండ్రుల కన్నీటి వ్యధ . 

మా అబ్బాయికి ఎలాంటి వ్యసనాలు లేవు, ముంబై లో అయిదంకెల జీతం, అందగాడు   హెచ్ ఐ వి పాజిటివ్ కాదు  అంటూ అన్ని వివరాలతో ఓ..తండ్రి కొడుకు బయోడేటాని అమ్మాయి తరపు వాళ్లకి అందించాడు . అయ్యో! ఈయనేమిటి ఇలా మొహమాటం లేకుండా ఇలా చెపుతున్నాడు . ఇప్పుడు మన అమ్మాయి కూడా అలాంటి పరీక్షలు చేయించుకుని రిపోర్ట్ ఇవ్వాలా? ఇలాంటి సంబందం మనకి కుదరదు .. వద్దని చెప్పీద్దాం ..అని ఓ..సంప్రదాయ కుంటుంబ పెద్దల వెనుకడుగు .. 

అన్నెం పున్నెం ఎరుగని అమాయకులు మహమ్మారి ఎయిడ్స్ బారిన పడుతున్నా .. సరి అయిన అవగాహన లేక .. జీవితాలు బుగ్గి పాలు చేసుకుంటున్న వైనాలు . 

గతంతో పోల్చితే ఎయిడ్స్ వ్యాది పట్ల అవగాహనయితే పెరిగింది కాని .. వ్యాధి గ్రస్తుల పట్ల వివక్ష మాత్రం తొలగిపోలేదు . 

 . ప్రభుత్వం ఎన్ని  ఎయిడ్స్ నియంత్రణా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా  ప్రజలలో అవగాహన పెరగనంతకాలం హెచ్ ఐ వి ని తరిమి కొట్టడం అంత సాధ్యం అయ్యే పని కాదు . ముఖ్యంగా నిరక్షరాస్యులైన ప్రజల జీవన విధానంలో అంతగా మార్పు లేదనడానికి గ్రామీణ ప్రాంతాలలో నానాటికి పెరుగుతున్న పాజిటివ్ సంఖ్య. "నిశబ్ద్దాన్ని పారద్రోలండి ఎయిడ్స్ ని తరిమి కొట్టండి " ప్రచారం వీధి వీధినా జరిగినా హెచ్ ఐ వి పాజిటివ్ వ్యక్తులని తమ మధ్య మసలడానికి కూడా ఒప్పుకొని సభ్య సమాజంలోనే మనం ఉన్నాం . వారిని వారి నిత్య జీవితంలో జీవించనీయకుండా పశువుల కొట్టంలోకి, వూరి చివర పాకల్లోకి వారిని బలవంతంగా ఈడ్చి పారేస్తున్నారు మానసికంగా బలహీనం చేసి వారిని త్వరితగతిన కాటికి చేరుకునేటట్టు చేస్తున్నారు . 


 స్వీయ తప్పిదాల వల్ల, ఇతరుల అజాగ్రత్త వల్ల హెచ్ ఐ వి బారిన పడుతుంటారు అలాగే స్త్రీల విషయాలకి వస్తే వారి భర్తల వల్ల ఈ మహమ్మారి బారిన పడుతున్నవారే అధికం . స్త్రీతో పాటు వారి బిడ్డలు కూడా ఏ  తప్పిదం  చేయకుండానే వారి వారి శరీరం వ్యాధిగ్రస్తమయి సమాజ నిరాదరణకి గురి అవుతున్నారు . వారు తల్లిదండ్రులని కోల్పోయి అయినవారు ఉండి కూడా ఆదరించక ఆనాద ఆశ్రమాలలో ప్రేమ రాహిత్యంతో ,సమాజం పై కసితో పెరుగుతున్నారు. వారికి సమాజంలో బ్రతికే హక్కు ఉంది ఆ హక్కుని కాలరాస్తూ  . వారిని బడికి వెళ్లి చదువుకోవడానికి అనుమతి నివ్వని పాఠశాలలు ఉన్నాయని వింటే ఆశ్చర్యం కల్గుతుంది 
ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలోనూ , స్వచ్చంద సేవా సంస్థలు కలసి హెచ్ ఐ వి పాజిటివ్ వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వారికి  ఉచితంగా మందులు ఇప్పించడంతో  పాటు జీవితం పై ఆశ కల్గిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు . అందులో భాగంగా పాజిటివ్ వివాహ వేదికలని నిర్వహిస్తున్నారు  వారు కోరితే వారి వివరాలని రహస్యంగానే ఉంచుతూ వారికి అవసరమైన సలహాలు ఇస్తూ వారు జీవించడానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అయితే మార్పు రానిదిమాత్రం వ్యాధి గ్రస్తుల కుటుంబం బంధువుల మధ్య మాత్రమే!   మానవత్వం లోపించి వారిని చీత్కారిస్తూ బతికి ఉండగానే  ప్రత్యక్ష నరకం చూపుతారు. 

గురుదేవోభవ అని పూజించే  ఉపాద్యాయులు కూడా వాళ్ళు చదివి ఎవరిని ఉద్దరించాలి అనే భావనతో .. వారిని తరగతి గదుల్లోకి ప్రవేశించడానికి అభ్యంతరం చెపుతూఉండటం గమనార్హం. కళాశాలల్లో, మురికివాడల్లో , గ్రామీణ ప్రాంతాలలో అన్ని చోట్లా .. అవగాహన తరగతులు నిర్వహిస్తూ పాజిటివ్ వ్యక్తుల పట్ల వివక్షన రూపుమాపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే వివాహ వయస్సు దృవీకరణ తో పాటు .. హెచ్ ఐ వి టెస్ట్ కూడా తప్పనిసరి నిబంధన అమలుపరచాలి అప్పుడైనా చాలామంది జీవితం బుగ్గిపాలు కాకుండా కాపాడుకోవచ్చు .భూతం బారిన పడకుండా  ఇలాంటి జాగురుకత అవసరం  .  

ఎయిడ్స్ నియంత్రణ  కన్నా మనుషుల మనస్తత్వంని  మార్చడమే చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది  ఎయిడ్స్ కంట్రోల్  ప్రాజెక్ట్స్ అధికార గణం, రెడ్ రిబ్బన్ సంస్థలు  మాత్రమే కాదు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా  హెచ్జీ ఐ వి పాజిటివ్ వారిని ఎయిడ్స్ వ్యాది గ్రస్తులని తోటి మనిషిగా అంగీకరిస్తూ వారు జీవించి  ఉండటానికి చేసే పోరాటానికి చేయూత నివ్వాలి .  తోటి మనుషుల పట్ల ప్రేమ, కూసింత సానుభూతి, నాలుగు మంచి మాటలు, మనకి ఉన్నదానిని ఇవ్వడం లో చూపే ఉదారం   అవసరం అయినప్పుడు చేసే ఉడతా సాయం మనం మనుషులమే అన్నదానికి నిదర్శనంగా నిలిస్తే బావుండును .

(ఎయిడ్స్ నియంత్రణా దినోత్సవం డిసెంబర్ 1 సందర్భంగా ఈ వ్యాసం )