పొద్దస్తమానం టివీ తో కాలక్షేపం చేయలేక దానికి కాస్త విశ్రాంతినిచ్చి డాబా పై భాగం కి చేరాను . శీతాకాలం చల్లదనం ఒక్కసారిగా ఒళ్ళంతా తాకింది . . వెంటనే చీర చెంగు ని భుజాల చుట్టూ కప్పుకుని చుట్టూరా చూసాను
అభివృద్దిసూచకంగా మా చుట్టూరా బహుళ అంతస్తుల భవనాలు నియాన్ లైట్ల కాంతులలో మెరిసిపోతూ ఉంటే అక్కడక్కడా పురాతనమైన పూరి గుడిసెలు మినుకు మినుకు మంటూ మేమున్నామంటూ ఆ మాత్రం ఉనికిని చూపకపోతే ఎలా? అన్నట్టు ఉన్నాయి .
ఆ గుడిసెల మధ్య ఏదో గలాటా జరుగుతున్నట్లు ఉంది. గుంపు మధ్యలోనుండి అప్పుడప్పుడు సాంబ మాట ఏడుపుతో కలసి వినబడుతుంది. మా ఇంట్లో పని చేసే అమ్మాయి వాళ్ళ అమ్మ సాంబ భర్త రాంబాబుతో కలసి ఉంటుంది. . ఆ ప్రక్కనే ఉన్న గుడిసెలో రమణ వాళ్ళు ఉంటారు ఇరవై ఏళ్ళ నుండి వారి చిరునామా అక్కడే! మూడు తరాల వాళ్ళు చుట్టుప్రక్కల ఇళ్ళల్లో పాచిపని చేసుకుని బతుకుతూ ఉంటారు వారిది ఎవరితోనూ గొడవపడే మనస్తత్వం కాదు కాని వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే నోరేసుకుని పడి వాళ్ళ పని పడతారు . వాళ్ళ నోట్లో నోరు పెట్టి ఎవరు మాటల్లో గెలిచిన ఆచూకీ లేదు. చుట్టుప్రక్కల వాళ్ళు ఆ మాటలు వినలేక ప్రక్క వాళ్ళ ముఖాలు కూడా చూడలేక తలుపులు బిడాయించుకుంటారు. అదీ వాళ్ళ నోటివాటం. అలాంటిది సాంబ ఏడుస్తూ మాట్లాడుతుందంటే ఏదో తప్పు ఉండే ఉంటుంది రేపు రమణ పనికి వచ్చినప్పుడు విషయం ఏమిటో కనుక్కోవాలనుకుని ఇంకాసేపు అక్కడ ఉంటే దోమలు పీక్కు తింటాయని భయపడి ఇంట్లోకి వచ్చేసాను
తెల్లవారి రమణ రాగానే "ఏంటి నిన్న మీ ఇంటి ముందు అంతమంది జనం ఉన్నారు . మీ అమ్మ ఏడుస్తుందెందుకు? ఆరాగా అడిగాను
. .
"ఏముందమ్మా మళ్ళీ మా బాబాయి మా అమ్మని నిలువునా ముంచేసి ఎల్లిపోయాడు . అప్పులిచ్చిన వాళ్ళందరూ నీకు తెలియకుండా ఎక్కడికెళతాడు . అందరూ కలసి నాటకాలాడుతున్నారా? డబ్బులు కట్టాల్సిందేనని గొంతుమీదకూర్చున్నారు. వాళ్ళు అడిగే మాటలకి మా అమ్మ ఇంకా ఎందుకు బతికుందా అనిపిచ్చిదమ్మా. మా పిల్లలని కూడా ఇంటికి చేరనిచ్చేవాడు కాదు ఆళ్ళకి ఏమి పెట్టనిచ్చేవాడు కాదు . ఆడు చూడకుండా ఎప్పుడన్నా ఓ పదో పరకో ఇచ్చేది. ఆడు మాత్రం సొమ్మంతా వేసుకెళ్ళి పెళ్ళాంపిల్లకి ఇచ్చి వచ్చేవాడు. ఇప్పుడు అక్కడకే ఎల్లి ఉంటాడు. ఇప్పుడెల్లి అక్కడుండాడేమో చూసి లాక్కు రావాలి " అని చెప్పుకొచ్చింది. హడావిడిగా పని చేసుకుని వెళ్ళిపోయింది .
ఈ ఆడాళ్ళందరూ మొగుడి మాటలు నమ్మి బాధ్యత మీదేసుకుని అప్పులెందుకు చేస్తారో! ఆ డబ్బుని వ్యాపారం పేరుతొ జల్సాగా ఖర్చు పెట్టో, లేకపోతే నష్టం వస్తేనో ఆడబ్బు కట్టకపోతే అప్పులిచ్చిన వాళ్ళతో మాటలు పడేది అవమానించబడేది ఆడవాళ్లే !
మొన్నెప్పుడో ఒకసారి తన భర్త వ్యాపారంలో చేయి తిరగడం లేదని మరి కొంత పెట్టుబడి పెట్టదానికి అప్పు చేయాలసివచ్చింది ప్రో నోట్ రాసి బ్లాంక్ చెక్ లు ఇచ్చినా కూడా విషయం తనకి తెలిసినట్లుగా ఇద్దరినీ కలిపి ప్రోనోట్ పై సంతకం చేయమని అడిగారు. సంతకం చేయడానికి ఆలోచించాల్సి వచ్చింది . ఎంతో అవసరమైతే తప్ప అప్పు చేయకూడదు భర్త ఒత్తిడి చేసినా ఆడవాళ్ళు అసలు అప్పు చేయకూడదు. అలా అప్పులు చేయడంవల్ల డబ్బు కట్టలేని పరిస్థితుల్లో .అవమానింపబడతారు. అలాగే కుటుంబ ఆర్ధిక విషయాల గురించి తెలుసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని అమ్మ ఎప్పుడూ చెపుతూ ఉండేది . నాన్నవ్యాపారం చేయడానికి డబ్బు అవసరం అయినప్పుడల్లా అమ్మనే అప్పు తెమ్మని నాన్న ఒత్తిడి చేసేవారు. బంధువులు స్నేహితుల దగ్గర అమ్మకున్న మంచితనం వల్ల అడగగానే అప్పు ఇచ్చేవాళ్ళు. తీరా నిండా అప్పుల్లో మునిగిపోయాక కాని ఆ అప్పులు తీర్చడం ఎంత కష్టమో తెలిసి రాలేదు . ఉన్న భూమి అమ్ముడయి అప్పులు తీర్చే లోపు ఎన్ని అవమానాలు ఎదుర్కోవలసి వచ్చిందో జన్మలో మర్చిపోలేదు. తనకున్న అనుభవంలాంటిదే అందరి ఆడవాళ్ళకి ఉండకపోవచ్చు . పై పెచ్చు ఆడవాళ్లే అప్పులు తెచ్చి జల్సాగా ఖర్చు పెట్టేసి అప్పు అడగడానికి వచ్చిన వాళ్ళపై ఫాల్స్ కేస్ లు పెట్టడం వింది . అలాగే వ్యాపారం పేరుతొ ఉన్న ఒకే ఆస్తిని ప్రక్క ప్రక్కనే ఉన్న బ్రాంచీలలోనే తనఖా పెట్టి లోన్ ద్వారా లక్షలు అప్పులు తీసుకుని బ్యాంక్ లకి టోకరా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, భార్యల పేరున ఆస్తులన్నీ రాసేసి జనాన్ని ముంచిన వాళ్ళు ఉన్నప్పుడు అప్పిచ్చేవాడు జాగ్రత్త పడటంలో తప్పులేదు" మనసులో అనుకుంటూ సంతకం చేసేసింది.
సాంబ మొగుడు కూడా ప్రతి ఆదివారం గొర్రెల్ని కోసి మాంసం అమ్మేవాడు . శుక్రవారం కొనుగోలు కెళ్ళేటప్పుడు పెట్టుబడి పెడితే ఆదివారం కిలో మాంసం ఫ్రీగా ఇచ్చి సాయంత్రానికి డబ్బులు ఇచ్చేస్తాం,మీరు కూడా పెట్టుబడి పెట్టండి.అంటూ రమణ రెండు మూడు సార్లు అడిగింది . మేము మాంసం తినం , పెట్టుబడి పెట్టను అని సున్నితంగా తప్పుకోవడం మంచిదయింది . లేకపోతే తను ఇరుక్కుని ఉండేదాన్ని అనుకున్నాను . ..
ఆ తెల్లవారి రమణ వచ్చి రాగానే "రమణా ! వడ్లపూడి వెళ్ళారు కదా ! మీ బాబాయి కనబడ్డాడా? ఏమంటున్నాడు ". ఆసక్తిగా అడిగాను . .
నిన్న ఇక్కడి నుండి ఎల్లాక అన్నం కూడా తినకుండా ఆదరాబాదరా బయలుదేరి నేను, మా అమ్మ ఎల్లాం. మేము ఎల్లేటప్పటికి ఆమె ఆకు కూరలేసుకుని బయటకెళ్ళ బోతుంది. మంచినీళ్ళు తాగుతారా అనైనా అడగలేదు. "ఏంటే ..రమణా.. ఇల్లు ఎతుక్కుంటూ వచ్చావ్ ? నీకు మర్యాదలు చేయడానికి నేను ఇంటిపట్టున ఉండే ఈలు లేదుకదా! బేరం చేసుకోవాలి, పొట్ట బోసుకోవాలి .. విషయం ఏంటో చెపితే నేను ఇనేసి బయటకి పోవాలి " అని ముళ్ళ మీద నించున్నట్టు అడిగింది.
"బాబాయ్ ! ఎక్కడికెళ్ళాడు పిన్ని." అని అడిగాను .
"నిన్న రాత్రి వచ్చాడు తెల్లారే పోయాడు. ఎప్పుడోత్తాడో ఎప్పుడు పోతాడో ! ఆడికి నాకు మంచి సెబ్బర మాటాడుకోడానికి ఏమన్నా ఉంటే కదా ! నేను ఇవరంగా చెప్పడానికి వాడు చేయడానికి . .ఇరవై ఏళ్ళనాడే మంది ముఖాన కొట్టి ముండమోసినదానిలా బతుకుతున్నా. చుట్టాల్లెక్క వచ్చి పిన్నీ గిన్నీ అని వరసలు కలిపి ఐస్ చేద్దామానుకున్నావేమో.. అయన్నీ ఇక్కడ కుదరవ్..ఎందుకొచ్చావో అది చెప్పు" అని దులిపేసింది
ఆమె అట్టా మాట్టాడటంతో చానా బాదేసింది ఆమె మాటల్లో నిజముంది కదా అనుకుని తమాయించుకుని " అక్కడ అందినచోటల్లా అప్పులు చేసి కనబకుండా పోయాడు. ఇక్కడికి వచ్చాడని తెలిసింది, మాట్టాడి డబ్బులు ఎప్పుడు కడతాడో కనుక్కుందామని వచ్చాం ".అన్నాను
".ఇక్కడికొచ్చి మాత్రం ఆడేమన్నా మా కష్టం సుకం చూత్తన్నాడా? వస్తాడు తింటాడు పోతాడు . ఏడికి పోయేది ,ఎక్కడ ఉండేది మాకేం తెలుస్తాది ఆడికి ఊరూరా దుకాణాలు పెట్టడం అలవాటు. అప్పులే చేత్తాడో, దొంగతనాలే చేత్తాడో.. ఏయే ముండకి పోస్తాడో ..నాకేం తెలుసు . ప్రతి ముండా నా ఇంటి ముందుకొచ్చి ఆడి గురించి ఆరా తీయడం, ఆళ్ళ సొమ్మంతా తెచ్చి ఇక్కడ ధారపోసి మేడలు మిద్దెలు కట్టినట్టు నన్నొచ్చి అడుగుతా ఉంటారు . నా సవతుల్లారా.. ఏ దొంగ నా సవితోచ్చి నన్నడుగుతారో అడగమనండి. ముండలు కాపరం కూల్చి ఆడినేసుకుని దేశం మీదకి పోయినప్పుడు తెలియదా ? ఈ ఇంటికి సంబంధం లేకుండా ఆడిని ఏసుకునిపోయామని. అప్పుల్జేసిన పతిసారి వచ్చి నా గుమ్మానికి ఏలాడతారు. ఎదవ సంత..ఇంకోసారి నా ఇంటిముందుకొచ్చి అడిగారంటే ఒక్కోదాన్ని కిందా పైనా చీల్చి పంపుతా నేమనుకుంటూన్నారో.." అని ఎదురుతిట్టడం మొదలుపెట్టింది.
"అదికాదు పిన్ని చీటీలు పాడుకుని, రోజువారి చీట్లు తీసుకుని మనిషి అయిపుఅజా లేకుండా పొతే లక్ష రూపాయలు దాకా మా అమ్మ ఏడనుంచి తెచ్చి కట్టుద్ది . అన్నిచోట్లా మా అమ్మ చేత ఏలిముద్రలేపిచ్చి ఇరికిచ్చి వచ్చాడు . నాలుగిళ్ళలో పాచి పన్జేసుకునేది అన్ని డబ్బులు ఎట్టా కట్టుద్ది? " అని గట్టిగానే అడిగాను.
"ఎట్టా కట్టుద్దో..అయన్నీ నాకేం తెలుసు. గొర్రె కసాయాడిని నమ్మినట్లు తెలివితక్కువాళ్ళని నిండా ముంచేసిపోతున్నా తెలుసుకోలేకపోతే అది ఆళ్ళ ఖర్మ. దానికి నేనేమి చేస్తాను. మరోమారు ఇట్టా ఆడిని వెతుక్కుంటూ నా ఇంటికిరాకండి . ఇయన్నీ నా బిడ్డకి తెలిస్తే బాధపడుద్ది.. అంటూ ఇంటికి తాళం పెట్టుకుని ఎల్లిపోయింది. " ఆ ఇంటో పెద్ద టీవి, బీరువా, పిల్లకి మీ బండి లాంటి బండి, రెండేలరూపాయల డ్రస్సులు.. ఖరీదైన సెంట్లు ఇయన్నీ ఈడేసుకేల్లి ఇచ్చి వచ్చినయి కాదా .. అయ్యన్నీ మాకు తెలియదనుకుంటుంది. ఇంటో పెట్టి దాచేసి లేడని అబద్దం చెపుతుంది" ఆరోపణ గా చెప్పింది .
"అలా ఎందుకు చెప్పుద్ది లేవే? నిజంగానే అతనక్కడ లేడేమో.. అయినా నేను చెప్పాను కదా అక్కడికెళితే అలాంటి సమాధానం వస్తుందని. అయినా వినకుండా ఎగరేసుకుని వెళ్ళారు. మీ బాబాయి ఆమెని వదిలేసి ఇరవై ఏళ్ళు అయింది అంటున్నారు. ఆకుకూరలమ్ముకునో, కూరగాయలమ్ముకునో బిడ్డని పెంచుకుంది,చదివించుకుంది ఆ పిల్ల ఉద్యోగం చేస్తుందిగా, సంపాదించుకున్న డబ్బుతో అన్ని కొనుక్కుని ఉండొచ్చు కదా! ఆలోచించు " అన్నాను నేను
నేను చెప్పిన మాటలకి అయిష్టంగా ముఖం పెట్టి ..
"లేదమ్మా .. ఇక్కడ అప్పులు చేసిన సొమ్మంతా ఆ దొంగ నా బట్ట అక్కడికే చేర్చాడు. ఆడిని పట్టుకోవాలంటే ఒకటే దారి . ఆడికి అప్పులిచ్చిన వాళ్ళందరితో చెప్పి ఆడి మీద పోలీస్ కేస్ పెట్టి వాడిని బయటకిలాగి వాడి చేతే డబ్బు కట్టియ్యకపోతే నా పేరు రమణే కాదు ". అంటూ కోపమంతా పని మీద చూపెట్టింది. ఓ రెండు మూడు రోజులు పోన్ల మీద వాళ్ళ బాబాయి ఆచూకీ కనిపెట్టే ప్రయత్నం చేసింది.
నాలుగు రోజుల తర్వాత రమణ అమ్మమ్మ సుబ్బమ్మ వచ్చి "యాబై వేల రూపాయల చీటీ రెండోదే పాడుకుని పోయాడు . ఇప్పుడు ఆళ్ళకి డబ్బులు కట్టాలి. బ్యాంకీ లో ఈ డబ్బులు యేసి పెట్టుకున్నాను . ఎంత వస్తాయో కాస్త చూసి చెప్పమ్మా? అంటూ అడిగింది. ఆమె వయస్సు అరవై పైనే ఉంటుంది . బక్కగా నడుం ఒంగిపోయి ఉంటుంది. అయిదారిళ్ళల్లోపనులు చేసుకుంటూ ఉంటుంది. చక చకా నడుస్తూ సూరీడుతో పోటీ పడుతూన్నట్లు ఆరు గంటలకల్లావచ్చి వాలుద్ది. అలా పనులు చేసుకుని నెలకింత పోస్టాపీస్ లో రికరింగ్ డిపాజిట్దు లో మదుపు జేసుకుని వాటిని తీసి మళ్ళీ బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుని ఉంది ." ముసలాడు చస్తేనో, నేను చస్తేనో..తగలెయ్యడానికి ఖర్చులకైనా ఉంటాయమ్మా! బిడ్డలు బతికుండంగా ఇంత ముద్దైనా ఏయనాళ్ళు చచ్చాక మాత్రం తిట్టకుండా కాటికీడుస్తారా? చచ్చాక ఖర్చులకైనా వస్తాయని ఇట్టా దాచి పెట్టుకున్నా." అని చెపుతూ బాండ్ పేపర్ లు నా చేతికిచ్చింది.
అవి తీసుకుని చూస్తే ఒకటి మూడేళ్ళకి,ఇంకోటి అయిదేళ్ళ కాలానికి డిపాజిట్ చేసి ఉన్నాయి . మెచ్యూర్ కాకుండానే తీసుకుంటే తక్కువ వస్తాయి చాలా నష్టపోతారని చెప్పాను.
"ఏం చేద్దామమ్మా? ఎంతో కొంత! వచ్చినయి తీసేసుకుని బాకీల వాళ్ళకి కట్టాలి. ఆళ్ళు రోజు ఇంటి చుట్టూ తిరిగి నానా కూతలు కూసి పోతున్నారు . అదేమో ఒకటే ఏడుస్తూ కూడు నీళ్ళు లేకుండా పడిఉంటంది. కన్న పేణం చూత్తా..చూత్తా ఎట్టా ఊరుకోను? " అంది బాధగా .
"అన్ని బాకీలు తెలిసే ఎందుకు చేయనిచ్చింది, తనెందుకు పూచీకత్తు ఇచ్చింది బుద్ది లేదు? " అడిగాను కోపంగా
"నిజంగానే దానికి బుద్ది లేదమ్మా! ఇంత జరిగినా వాడు అప్పుడప్పుడు వస్తానే ఉన్నాడు, ఊరంతా సద్దుమణిగాక దొంగలా ఇంటికి చేరతాడు. "ఆకలవుతుందమ్మే" అంటాడు వాడువస్తాడని అన్నం కూర వేడి వేడిగా వండుకుని కూర్చుంటదికదా! కరిగిపోయి కొసరి కొసరి తినబెట్టుద్ది. సుష్టుగా తిని అలవాటుగా దాన్నిపక్కలో వాడుకుని తెల్లవారుఝాము బసెక్కి పోతాడు. ఎల్లేటప్పుడు చార్జీలకి డబ్బులుకూడా ఇదే ఇచ్చి పంపుద్ది. పగలంతా ఇంటి చుట్టూ తిరిగే బాకీలోళ్ళతో అమ్మనా బూతులు కూపిచ్చుకుని ఏడుస్తా కూర్చుండే సంగతే మర్సిపోయి ఆడితో సరసాలడుద్ది. ఇదెక్కడి ఆడదో నాకు ఇసుమంతైనా అర్ధమవట్టల్లె! ఈ ఇసయం దాని పిల్లలకి తెలిస్తే చీదరిచ్చుకుంటారని కూడా లేదు. ఆడంటే దీనికి ఎర్రిప్రేమ. అదలుసుకి తీసుకుని ఆడు అట్టా అడ్డంగా దీని వాడుకుని నూకుతాడు" కచ్చగా చెప్పింది "దురగ ఏణర్ధం పిల్లప్పుడు మొగుడిని, ఇద్దరు పిల్లలని వదిలేసి ఆడితో వెళ్ళిపోయింది . ఆర్నెల్లపాటు ఎతికెతికి పట్టుకున్నాం . చిల్లకల్లు దగ్గర హోటల్లో పనికి పెట్టాడు. ఆడేమో ఏ పని చేయకుండా కూచుని తినేవాడు. మొగుడితో చెల్లుచీటిఇప్పిస్తామని చెప్పి బతిమలాడి ఇంటికి తీసుకొచ్చాము. పంచాయితీలో మూడేలు తప్పు కట్టి పెళ్ళి రద్దు చేపిచ్చాము. తల్లి బిడ్డలని ఇంటో పెట్టుకున్నాం. ఆడు ఇష్టమైతే ఇక్కడుండేవాడు, లేకపోతే దీన్ని తీసుకుని ఆ ఊరు ఈ వూరు తిరుగుతా ఉండేవాడు . ఎక్కడ చూసినా బాకీలు చేయడం ఎగ్గొట్టి రాత్రికిరాతే మూటాముల్లె సర్దుకుని వచ్చేయడం .దీన్ని ఇక్కడ ఒదిలి అసలు పెళ్ళాం దగ్గర కూసుంటాడు. ఆ బాకీలాళ్ళు వచ్చేమో దీని జుట్టు పట్టుకుంటారు . ఎక్కడ చచ్చేమమ్మా ! ఇట్టా ఎన్నిసార్లో, ఈ ముండకి బుద్దిరాదు.." ముక్కు చీది పమిటచెంగుతో కళ్ళు తుడుచుకుంది సుబ్బమ్మ .
అదేరోజు పిక్సిడ్ డిపాజిట్ చేసుకున్న డబ్బు తీసి గొంతుమీద కూర్చున్న వాళ్ళందరికీ కట్టేశారు .చూస్తున్న నాకైతే చాలా బాధేసింది ముసల్దాని కష్టార్జితం అంతా అలా బుగ్గిపాలైపోయిందే అని.
ఒక నెల రోజుల తర్వాత రమణ సంతోషంగా ఒక వార్త మోసుకొచ్చింది .
మా బాబాయి పాతూరు అడ్డరోడ్ దగ్గర కాలేజీలో వాచ్మెన్ పని చేస్తున్నాడట. అర్జంటుగా వెళ్లి వాడిని పట్టుకుని ఎంతో కొంత డబ్బు గుంజుకు రావాలి, నేను తొందరగా వెళ్ళాలి గబా గబా పని కానివ్వండమ్మా అంటూ హడావిడి పెట్టింది. ఆశగా అక్కడికి వెళ్ళిన వారికి చేదు అనుభవమే ఎదురయిందని తిరిగొచ్చిన రమణ చెప్పింది
"ఏం డబ్బులే ! నేనెందుకు కట్టాలే! అక్కడ అప్పులు జేసినయన్నీ నువ్వు నీ కూతుళ్ళు, నీ అమ్మ అయ్యే తినేశారు, నాకేం సంబంధం లేదు . మూసుకుని ఇక్కడనుండి పో ! నేను పని చేసుకునే చోటుకొచ్చి దొంగ నాటకాలేసి డబ్బులు గుంజే వేసమేత్తన్నావేమో, నరికి ముక్కలు జేస్తా ..పో అని జుట్టు పట్టి బయటకి తోసేసినాడు. ఆడికి మా ఉసురు గొట్ట. ఆడు సర్వ నాశనం అయిపోతాడు ఆ దొంగ నాయాల మట్టి కరసుకుకుపోతాడు" .. అని మెటికలు విరుస్తూ తిట్టిపోసింది
"అందుకే అంటారు తాటి చెట్టు నీడ నీడా కాదు తగులుకున్నాడు మొగుడు కాదు అని చెపితే మా అమ్మ ఏ మాత్రం ఇనలా.. ఆడు ఏమి చేయమంటే అది చేసింది పది రూపాయల వడ్డీకి కూడా అప్పులు జేసి ఇచ్చింది వాడేమో అక్కడ హాస్టల్ లో మెస్ లో పని జేసే ఆమెతో సంబంధం పెట్టుకుని కొత్త కొత్త చీరలు కొనిచ్చి సినిమాలకి షికారులకి తిరగడం మొదలెట్టాడంట. ఇంకెక్కడి డబ్బు ఇక ఆడి దగ్గరనుండి పైసా డబ్బులు కూడా రావమ్మ సంకనాక్కుంటా .. మా అమ్మ కష్టపడి కట్టాల్సిందే."అంటూ విచారంగా చెప్పింది.
"ఇక మీ బాబాయి రాడంటావా ? అది నిజమేనా ? "అడిగాను
"ఎందుకు రాడు ఆ ఉంచుకున్న దానిపై మోజు తీరిపోయాక లేకపోతే ఇట్టాగే అప్పులు జేసి ఆళ్ళని ముంచేసి ఎదో ఒకనాడు మా అమ్మ ఇంటి కొచ్చి పడతాడు.అప్పుడిది ఆడు చేసినవన్నీ మర్సిపోయి కావిలిచ్చుకుని ఇంటో పెట్టుకుంటుంది. ఆడంటే మా అమ్మకంత పిచ్చి. ఆడు ఎన్ని చేసినా మా అమ్మ మారదంతే! వాడి మూలంగానే నేను, దుర్గ అనాధలా పెరగాల్సి వచ్చింది. అమ్మ ఉండి లేనట్టు , నాన్నేమో మమ్మల్ని వదిలేసిపోయి ఇంకో పెళ్ళి చేసుకుని మా అమ్మమ్మ తాతయ్య పెంచితే పెరిగాం. ఎదో ఇట్టా అత్తెసరుబతుకులు బతుకుతున్నాం " ఆవేదనగా చెప్పింది
వింటున్న నాకు సాంబమ్మ పై జాలి,అసహ్యం రెండు కల్గాయి. ఈ ఆడాళ్ళంతా ఇంతే! తెలిసి తెలిసి కూడా మోసపోతారు. వాడు దుష్టుడని తెలిసి కూడా క్షమించేస్తారు. వీళ్ళని ఎవరు మార్చలేరు చూసి చూసి ఇతరులకి విరక్తి కలగాలి తప్ప అనుకున్నాను .
సాంబ ఒంటిపై బంగారమమ్మి, పని చేసే ఇళ్ళల్లో అపు తెచ్చి బాకీలు కట్టేసింది
రెండు నెలలు గడిచాక రమణ నవ్వుకుంటూ వచ్చి" మీకొక షాకింగ్ న్యూస్ అమ్మా! మా బాబాయి వచ్చిఅమ్మ ఇంటిముందు పడున్నాడు ఒళ్ళంతా విరగబొడిచి వదిలి పడేసారు ఒంటి మీద సోయ లేకుండా పడిపోయి ఉన్నాడు. ఆడినెవరో చితక తన్ని ఇక్కడ పడేసి పోయారో, లేక ఆడే వచ్చి పడ్డాడో తెలియదు కాని ఇప్పుడు మళ్ళీ మా అమ్మ పాలబడ్డాడు. అంటూ చెప్పింది
." మీ అమ్మ అతన్ని లోపలి రానిస్తుండా" అడిగాను . ఆడిని చూసి కూడా చూడనట్టే పనిలోకి వెళ్ళిపోయింది ఏం చేస్తదో చూడాలి ఈ సారి గాని ఆడిని రానిచ్చిందా, మేమందరం దాని వదిలి పారేత్తాం దాని సంగతే పట్టించుకోము " అని చెపుతూ "మా ఇంటికాడ ఏదో గోల వినబడుతుంది నేను ఇంటికి పోతున్నా.. మీరు ఒకసారి డాబా పైకెక్కి చూడండమ్మా" అంటూ తొందర పెట్టి అది పరుగులు తీసింది
సాంబ పనికెళ్ళి నాలుగైదు గంటల తర్వాత ఇంటికొచ్చి చూస్తే కూడా రాంబాబు అలాగే పడి ఉన్నాడు. వాడిని చూసి ఆమెకి కోపం తన్నుకొచ్చింది. "ఈ లంజ కొడుకు నా కొంప ముందుకొచ్చి పడ్డాడు . ఇప్పుడు దాకా ఈడితో పడింది చాలదా .. ఈడిని ఈ పంచన జేరనీయనే కూడదు అంటూ రాంబాబుని జుట్టు పట్టి తల పైకి లేపి .. "రేయ్! ఎందుకొచ్చావురా ఇక్కడికి ? నువ్వుంచుకున్న లంజ ముండ మొగుడు కొట్టిచ్చాక గాని నా ఇల్లు గుర్తు రాలేదంటరా? నేను గాక ఇంకోటి కావాల్సోచ్చిందంటారానీకు ? దొంగనా బట్ట , నీ నోట్లో నా సాడు పొయ్య . ఊరూరికి ఒకదానిని మరిగి ఇక్కడ అప్పులు జేసి నన్ను ఇరికిచ్చి పోతావంటారా! రోజూ సట్టిలు సట్టిలు మాసం కూరలు వండిచ్చుక్కుని తిని, తెగ తాగి అడ్డంగా నన్ను వాడుకుని నడి వీధిలో నన్ను నిలబెట్టి పోతావంటారా ? చావు దొంగ నా కొడకా .. అంటూ కాలితో ఆడి డొక్కలో కుమ్మేయడం మొదలెట్టింది .
సాంబా ! ఆగవే, చెట్టంత మగాడిని అట్టా కాలితో కుమ్ముతున్నావే? నీ వరసేమి బాగోలేదు. తప్పు చేసిన మొగాడు ఇంటికొత్తే కనికరించి కడుపులో దాచుకోవాలే తప్ప రోడ్డున పడేసి కొడతావా? అంటూ అడ్డం వచ్చాడు సాంబ అన్న వెంకటేశ్వర్లు
చాల్లే ఆపరా నీ సుద్దులు . నన్ను అప్పులాళ్ళకి అప్పజెప్పి మొహం చాటేసి ఇంకో ఆడదానింటిలో కులుకాతా ఉంటే ఫలానా చోట ఆడుండాడని తెలిసి కూడా చెప్పకుండా దాచేసింది నువ్వు గాదు, అయినా ఆడు నా మొగుడేంటిరా? కట్టంలో ఉన్న ఆడడానికి నాలుగు మాయమాటలు జెప్పి మొగుడి నుండి పెళ్ళాని విడదీసి ఎడా పెడా వాడుకుని వదిలేసే ఈనాకొడుకు నాకు మొగుడేంటిరా..నా బట్ట.!ఈడిని ఇయ్యాల చితకతన్ని కువ్వలా పడెయ్యకపోతే నేను ఆడదాన్నే కాదు . ఆడదంటే నీకు అంత అలుసంటారా? అవసరానికి వాడుకుని పారేసే బొమ్మంటారా? అంత దగా చేస్తావా? నిలువునా దోపిడీ చేస్తావా, ఇంకా నీ ఆటలు సాగానిస్తానా ?అంటూ మొహమ్మీద పటా ఫట్ న కొడుతుంది అపర కాళికలా. ఆ ఆవేశంలోనే రాంబాబు జుట్టుపట్టుకుని బయటకీడ్చి.. తూ..అని వాడి మొహమ్మీద ఉమ్మేసింది.
సాంబలో అంత చైతన్యం వచ్చినందుకు నాకు ఆశ్చర్యం వేసింది రమణ కూడా నా వైపు చూస్తూ ఆనందంతో చెయ్యి ఊపింది .
(భూమిక లో ప్రచురితం )
5 కామెంట్‌లు:
శెభాష్,ప్రతి ఆడదానిలోనూ ఈ తెగువ రావాలి.
వనజా సహజమైన మీ శైలికి నా అభినందనలు,
ఇలాంటి గాదలు మీ కలమే రాయగల్దు.
ilantivi chalaa chustunnamu kaani inta baaga visleshinchina meeku thanks
Meraj Fathima థాంక్ యూ సో మచ్ మెరాజ్
Rama Krishna గారు ధన్యవాదములు .
This problem of taking hand loans will hurt any family.
కామెంట్‌ను పోస్ట్ చేయండి