30, ఆగస్టు 2015, ఆదివారం

తాళం చెవి


 తాళం చెవి పోయింది

తెలుసు .. ఆనందమంతా అందులోనే ఉందని

నిర్లిప్తత నిరాశ కాని బద్ధకమేదో 

వెతుక్కోవడానికి కాలికి అడ్డం పడుతుంటాయి

మస్తిష్కాన్ని తొలిచే ప్రశ్నలెన్నెన్నొ

తీరాన విరిగిపడే కెరటాలవుతాయి

నీటిమీద వ్రాసిన రాతలు

ఆకాశపు పలకపై రాసిన అక్షరాలై పోతాయి

అంతుపట్టని రహస్యాలని

అశరీరవాణి గుసగుసగా చెప్పి వెళుతుందేదో

భద్రంగా మనసు మూటలో ముల్లె లా దాచేస్తా

నాలో నే శత్రువు నాలోనే మిత్రువు

ఇక తాళం చెవితో పనేముంది

చీకట్లో ఉండి నా నీడ ని వెతుకుతున్నా

వెలుగులోనున్న వేరొక నీడని హత్తుకోవాలనుకున్నా

సత్యమసత్యాల వెనుక

మానసిక సమాజాన్ని గెలవలేని భీరువు ని

రెక్కలు తెగిన పక్షిని తెరచాప తెగిన నావని

కబోదిలా వేలాడటం అలవాటై

కొత్తతావంటే వెరుపు

కావాలని మరుపు నాశ్రయింపు

ఇక తాళం చెవితో పనేముంది

నిలువుగా పెరుగుదామనుకుంటే

తలని త్రుంచినట్లు త్రుంచేసాక

సాఖోప శాఖలుగా విస్తరించక మానలా

నదిలా సూటిగా సాగాలనుకున్నా

కొండల్లా అడ్డు నిలిచి

పాయలుగా పాయలుగా చీల్చినా

సస్యశ్యామలం చేయక మానలా

ద్రవం లాంటిదాన్నని అర్ధమయినందుకేమో

అవలీలగా పాత్రలలో మారుతుంటానంతే !

ఇక తాళం చెవితో పనేముంది !?


25, ఆగస్టు 2015, మంగళవారం

బహుమానానికి పుస్తకం కొలమానం

మా అబ్బాయి పెళ్ళికి  వచ్చిన అతిధులకి రిటర్న్ గిఫ్ట్ గా  ఏవైనా ఇవాలనుకున్నప్పుడు నాకు మెదిలిన ఆలోచన నా కళ్ళ ముందు అలా మెరుపులా మెరిసింది  పుస్తకం .  "పుస్తకం హస్త భూషణమ్ "

అబ్బ ! ఏ స్టీల్ డిషో , టప్పర్ వేర్ డబ్బానో లేదా  గాజు  వస్తువులు లాంటివి  కాకుండా పుస్తకాలు ఏమిటీ ? అన్నట్టు మా వాళ్ళ చూపులు. అదిగో .. పులిపాక వాళ్ళు చూడు .. గాజు తాబేలు దానిని ఉంచే గాజు ట్రే ఇచ్చారు .  ఆ ట్రే లో నీళ్ళు పోసి తాబేలు ని ఉంచి ఇంట్లో ఈశాన్యభాగంలో  పెట్టుకుంటే మంచిదట . అలాంటిది చూడకూడదు అన్నట్టు  మా అత్తమ్మ సూచన.

ఈ మంచి ఏమిటో చెడ్డ ఏమిటో .. ఈ వస్తు వ్యామోహం ఏమిటో ,,  నిజం చెప్పొద్దూ .. నాకు  తిక్క  వచ్చేసింది . ఏమీ మాట్లాడలేదు .

ఇక మా ప్రాంతం వైపు సాధారణంగా ఉండే లగ్న పత్రిక  పంపడం అనే ఆచారమో, సంప్రదాయమో దాని గురించి పెద్దగా నాకు అవగాహన లేదు కానీ ఎవరైనా బంధువులు   జరగబోయే అబ్బాయి పెళ్లి శుభవార్త చెప్పి రకరకాల స్వీట్స్ , ఒక హాట్, పండు తాంబూలం తో పాటు కానుక గా ఒక వస్తువుని పంచడం అలవాటు . అలా పంచిన వస్తువులని అలమరలలో సర్ధలేక , మనఃస్పూర్తిగా పని వాళ్లకి పంచలేక బస్తాలు కట్టి అటకపై కొన్నాళ్ళు ఉంచి మళ్ళీ తీసి కాస్త ఉదారంగా పని వాళ్లకి ఇచ్చేసి మిగిలిన వాటిని తూకం లెక్కన అమ్మేసిన విధం గుర్తుకు వచ్చినప్పుడల్లా  నాకు మనసు చివుక్కుమనిపిస్తూ ఉండేది . పాపం అమ్మాయి పెళ్ళికి అత్తవారింటి బంధువులకి స్నేహితులకి కానుకలు ఇవ్వడానికి కూడా అమ్మాయి తల్లిదండ్రులు మోయలేని భారం మోయాల్సిందే! మాకు ఖరీదైన గిఫ్ట్ లు పంపాల్సిందే అని మొండి పట్టుదల పెట్టుకు కూర్చున్న అబ్బాయి తరపు వాళ్ళని చూసాను . అందుకనే మా అబ్బాయికి వివాహం నిశ్చయం చేసుకోగానే మా వియ్యాలవారితో చెప్పేసాను మాకు లగ్న పత్రిక ,గిఫ్ట్ లు ఏమీ వద్దండీ ! అలాంటి ఆచారం ఉంటే  వాటికి స్వస్తి చెప్పడానికి  మనమే పూనుకుందాం అని . అందుకు వాళ్ళూ  సంతోషించారు .

నేను ఈ విషయమే మా ఇంట్లో చెపితే అందరూ గిఫ్త్స్ ఇస్తే తీసుకుని ఇప్పుడు నువ్వు ఇవ్వకుండా తప్పించుకుని డబ్బు మిగుల్చుకుంటున్నారు   అంటూ  విమర్శలు వస్తాయి .. ఆలోచించుకో అని హెచ్చరించారు .

ఓహ్ .. గిఫ్టే కదా ఇవ్వాలి అనుకున్నప్పుడు  పుస్తకాలు ఇవ్వాలి అని అనిపించింది , పుస్తకాలివ్వాలి అన్నప్పుడు  ఏ రామాయణమో , మహాభారతమో , భాగవతమో కాకుండా (ఇవ్వకూడదని కాదు ) కాస్త నా అభిరుచికి తగ్గట్టుగా  మనిషికి వికాసం కల్గించే విధంగా అందరికి అర్ధమయ్యే విధంగా ఉండే కథల పుస్తకం ఇవ్వాలని పించింది .
వెంటనే అప్పుడే ఆవిష్కరింప  బడుతున్న "కథ ప్రాతినిధ్య 2014 "  కనబడింది . వెంటనే సామాన్య కిరణ్ పౌండేషన్ సామాన్య గారికి కాల్ చేసి ఆమె అనుమతి తీసుకుని ఆ పుస్తకం అచ్చేస్తున్న శ్రీ శ్రీ ప్రింటర్స్ వారికి  500 ప్రతులకి  ఆర్డర్ పెట్టాను .

 ఆ ఒక్క పుస్తకమేనా .. నాకు మనసులో అసంతృప్తి .. వెంటనే "జుమ్మా" నా కళ్ళ ముందు మెదిలింది. పేస్ బుక్ లో నా ఫ్రెండ్స్ లిస్టు లో ఉన్న షరీఫ్ గారికి మెసేజ్ పెట్టాను . మీ "జుమ్మా" పుస్తకాన్ని మా అబ్బాయి వివాహ సందర్భంగా వచ్చిన అతిధులకి బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను అని . వారు చాలా సంతోషించారు.  అలా నేను చేసిన బహుమతి ఎంపిక చాలామంది హృదయాలకి చేరింది .  ఈ రెండు పుస్తకాలు నేను ఎంపిక చేసుకోవడం వెనుక.. " జుమ్మా" కథల సంపుటి లో కానీ "ప్రాతినిధ్య కథ 2014 "  సంపుటి లో కానీ  వచ్చిన కథలు . ఆ కథలు నాకు ఎందుకు నచ్చాయన్నది ... వివరంగా ఒక సమీక్ష రూపంలో ఇంకో పోస్ట్ లో వ్రాస్తాను .

అసలు నేను అనుకున్నది ఒకటి . మా విజయవాడ పరిసర ప్రాంత రచయితలని, కవులని  అందరిని ఆహ్వానించి "జుమ్మా "రచయిత వేంపల్లి షరీఫ్ గారిని, సామాన్య గారిని కూడా  ఆహ్వానించి .. ఒక అరగంట సమయం లోముగిసే విధంగా ఒక పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేద్దామనుకున్నాను . విపరీతమైన ఎండలు, నిశ్చయతాంబూలాలకి వివాహానికి మధ్య  కేవలం వారం రోజుల సమయమే ఉండటం మూలంగా చాలామందిని ఆహ్వానించ లేకపోయినట్లే  షరీఫ్ గారిని, సామాన్య గారిని కూడా ఆహ్వానించలేకపోయాను.  కానీ నా ప్రయత్నం మాత్రం చాలా విజయవంతమైంది. వేదిక వద్ద బుక్ స్టాల్ పెట్టగానే మొదటి అరగంట సమయం లోనే 250 జుమ్మా ప్రతులు అయిపోయాయి . చాలా మంది కావాలని అడిగారు కూడా ! అలాగే "ప్రాతినిధ్య కథ 2014" కూడా అయిపోయాయి.
వివాహ వేదిక వద్ద అమర్చిన స్థలంలో నేను ఓ రెండు  నిమిషాలు మాత్రమే  ఉండి ఇద్దరికీ ముగ్గురికో పుస్తకాలని బహుమతిగా అందించాను. అదీ ఆఖరి సమయంలో . తర్వాత కూడా .. మీరు పుస్తకాలు బహుమతిగా ఇచ్చారట కదా ! మేమ్ము పెళ్ళికి రాలేక పోయాం .. మాకు ఇవ్వండి బుక్స్ అంటూ అడిగి తీసుకున్న వాళ్ళు ఉన్నారు . నేను పెళ్ళికి రావడం లేదు .. నా బుక్స్ నాకు ఉండనివ్వు  అని ఆర్డర్   వేసిన  ఫ్రెండ్స్ ఉన్నారు . వారి కోసం ఒక అయిదు జుమ్మా ప్రతుల్ని దాచి ఉంచాను .  ఇప్పటికి అడుగుతున్న వారు ఉన్నారు.  నేను  బహుమతిగా  ఏమి ఇవ్వాలి..  అనుకున్నప్పటి  ఆలోచన తీసుకున్న నిర్ణయం   చాలా సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చింది.  కానీ  ఆ సందర్భాన్ని    ఒక వేడుకగా,  ఇష్టంగా  భద్రపరచుకోవాలి అన్న నా కోరిక  తీరలేదు . కెమెరాలో అనుకున్నంత బాగా షూట్ చేయలేకపోయారు   ఫోటోగ్రాఫర్ కూడా .. ఇక్కడ శీతకన్ను వేసాడు .  ఆఖరిలో నేను వెళ్ళి దాచిన జుమ్మా ప్రతుల్ని బయటకి తీసి   మొబైల్ లో కొన్ని చిత్రాలు తీయించుకున్నాను ఇలా ! :)
అప్పటి చిత్రాలు ఇవి .






వివాహ వేదిక పై నేను నా కొడుకు 


ప్రాతినిధ్య 2014 కవర్ పేజీ తర్వాత లోపలి  పేజీలో మా ఇంటి దీపాలు  


21, ఆగస్టు 2015, శుక్రవారం

హాంగోవర్

హాంగోవర్

తల పగిలిపోతుంది
రక్త నాళాలు చిట్లిపోతున్నట్లు బాధ
యాపిల్ ని కత్తితో కొస్తే రెండు చెక్కలైనట్లు
మెదడు రెండు ముక్కలైతే బావుండును
నా నుండి నేను  పాయలుగా చీలిపోతున్నట్లు
శాకోపశాఖలుగా విస్తరించినట్లు
అంతర్వేదన బహిర్వేదన
ఏది ఎక్కువో ఏది తక్కువ చెప్పడానికి లేదు
హృదయాన్ని  పిండేస్తున్నబాధ
నిజ జీవిత శకలాలని చూసి చూసి
హృదయాన మోసి మోసి
మెదడు ఆలోచించి ఆలోచించి
బాహ్య ప్రపంచపు బాధలన్నీ అంతః ప్రపంచ బాధలుగా
తిష్ట వేసుకుని కూర్చుంటే కనబడని రక్తస్రావాలెన్నెనో
కళ్ళ ముందు చీకటి పొరలు లోకం తాలూకు  పసిరకలు
కొన్ని వెలుతురు  మరకలూ
నన్ను వ్రాయి నన్ను వ్రాయి అంటూ
పాత్రలు యుద్ధం చేయడం మొదలెడతాయి
అందులో ముసుగేసుకున్న పాత్రలు కొన్ని
 వేదిక ఏదైనా సన్నివేశం రక్తి కట్టించాలి
పాఠకుల హృదయం తడిసి ముద్దై పోవాలి
అంతా నిజమే వ్రాయాలంటే అసలు కుదరదు
రక్తి కట్టాలంటే అబద్ధాలు వ్రాయాలి
అబద్ధం వ్రాయడానికి ఆలోచన కావాలి
మనసుతో అసలు పని లేదు
కాస్త కాఫీ అన్నా పడితే బాగుండును  చురుకు పెరుగుతుంది
చిక్కటి కాఫీ లోకి పంచదారలో చీమ బలై పోయింది
ఓపిక లేదు వాటిని దులిపేందుకు అదో ఎస్సెం టయిల్
పాపం చీమ ! అసలెందుకు రావాలి అక్కడకి .
కాఫీతో కాస్త కవిత్వమైనా నంజుకుందాం
అయినా ఎక్కడుంది కవిత్వం
యాక్ .. వాంతోస్తుంది
కవి అనుభవిస్తాడు కథకుడు అభినయిస్తాడు
 మూడు కవితలు  ఆరు కథలు ఎందుకయ్యాయో
అని ఆలోచిస్తా .. ఆ ... అర్ధమయ్యింది
కథే నయం  ఏ పాత్రకి ఏ రంగేయాలో
ఏ మాటలు మాట్లాడాలో తూకం వేయాలి
అయినా ఏదో వైపు మొగ్గు జూపుతూనే ఉంటుంది
ధర్మబద్దంగా వ్రాద్దామంటే  ఎడిటర్ ఈడ్చికోడతాడు
కొందరి మనోభావాలు దెబ్బ తింటాయంటాడు
చాప క్రిందకి నీరోచ్చినా పట్టు చీర తడవకుండా కూర్చునేందుకు
పీట  తానిస్తానంటాడు.
తల నొప్పి బిళ్ళలేసుకుని
తలనొప్పి కలిగించకుండా వ్రాయాలంటాడు
ఇంకోసారి కాఫీ .. లాభం లేదు .
సెన్సర్  లోషన్ సెన్సార్ కన్నా ఎక్కువ పని చేస్తుంది కానీ
 అదీ  చాలడంలేదు ఎందుకో !
దాహంగా ఉంది కాస్తంత సంగీతాన్ని తాగాలిప్పుడు
ఎమ్ పీ త్రీ సముద్రపు ఒడ్డున వాలిపోయా
 అష్టాదశ వత్సరాల క్రితం  ఏ లోకాలకో వెళ్ళిన అమ్మ వచ్చి
కర్పూర తైలాన్ని కను రెప్పల పై వ్రాసి సున్నితంగా మర్దన చేసింది
లోకంలో బాధలన్నీ నీకే  కావాలా   అంటూ ప్రేమగా కోప్పడింది .
నా బాధ లోకం బాధ ఒకటే కాదా అంటే నవ్వి దూది పింజేలా తేలిపోయింది
కల్మషాలు ఉండకూదంటూ కన్నీరు చెక్కిలిని తడిపేసింది
ఖండాంతరాలలో  ఉన్న నా ప్రియపుత్రుడొచ్చి
మెత్తగా నా పాదాలొత్తుతూ "పిచ్చి అమ్మా " అంటాడు
రాళ్ళ మీద నడిచొచ్చిన బాధ గుర్తే రాదసలు .
ఒంటరితనం నాకు లభించిన వరమో
ఒంటరితనానికి నేను లభించిన శాపమో  కానీ
 అక్షరాలలో ఉన్న కథకి ప్రాణం వస్తుంది అప్పటికప్పుడు
కథ  కంచికి చేరుతుందో లేదో కానీ ..
కథ  వ్రాసినప్పటి హాంగోవర్  నన్ను అంటిపెట్టుకునే ఉంటుంది
ఇంకోసారి కాఫీ
మొండిచెయ్యి చూపిన పాల బుట్ట  
శ్రావణ లక్ష్మి కోసం ఇల్లాళ్ళ ఆరాటం
బర బర మంటూ  చీపురు మోతలో  వినిపిస్తుంది
అర్జంట్ గా   ఇల్లంతా తిరిగే మనిషిని కావలప్పుడు
మధ్యాహ్నం కయినా మంచి కాకరకాయ కూరనవ్వాలి

(కథ  మిగిల్చిన హాంగోవర్ రూపం ఇది )

   

19, ఆగస్టు 2015, బుధవారం

లాఠీ కర్ర

లాఠీ కర్ర 


"మూరెడు పూలమ్మితే రూపాయే గందా  వచ్చేది . అదే ఒక్క పేకెట్ అమ్మితే పది రూపాయలు కళ్ళచూడొచ్చు.  రైలు మారేపాటికి నేనొచ్చి నీకు పేకెట్లు  అందిచ్చేస్తా, గట్టిగా అమ్మినావంటే రోజుకినాలుగొందలు మిగులుద్ది . అట్టా నాలుగునెల్లు సంపాయిచ్చామంటే లచ్చాధికారి అయిపోతాం . హాయిగా బతికేయోచ్చే రమణా.. నా మాట వినవే"  బతిమిలాడుతున్నాడు వేంకటేశు.  


"ఏమో బావా ! నువ్వట్టాగే చెపుతావ్ ! పోలీసాళ్ళ కళ్ళన్నీ పహారా కాస్తా ఉంటాయి .  బుట్టలో అడుగుదాకా పూలేనా, పేకెట్లు కాని పెట్టుకోచ్చావా అని పట్టి పట్టి చూత్తన్నారు. ఆళ్ళ కళ్ళ గప్పి  బండిలోకి ఏసుకెళ్ళెది ఎట్టా? అమ్మేది ఎట్టా ? " సందేహం వెలిబుచ్చింది రమణ. 


"ఓసి పిచ్చిదానా ! పోలీసులకి కనబడేటట్టు  పూలబుట్ట లో పేకెట్ లు పెడతామా ఏంటి ? ఇదిగో నీ కోసం ఇది తెచ్చా చూడు ".అంటూ  ప్లాస్టిక్ కవరులో నుండి బయటకి తీసి చూపిచ్చాడు. రమణ దాని వంక ఆశ్చర్యంగా చూసింది . అది ఆడాళ్ళు కట్టుకునే లోపలి లంగా, పైకి మాములుగా కుచ్చీళ్ళు లంగా లాగానే ఉంది కానీ దాని లోపల వైపు వేలు పట్టే  సందు కూడా లేకుండా ప్రక్కప్రక్కనే జేబులు కుట్టేసి ఉన్నాయి . మొగుడి తెలివితెటాలి నోరెళ్ళ బెట్ట చూస్తూండగానే "ఒసేయ్ ఎర్రి మొహమా ! ముయ్యవే నోరు, ఈగలు కూడా పోతూండాయి " అని ఎకససెకాలు పడుతూనే .. ఈ లంగా నిండా పేకెట్ లు కూర్సేసి ఎసేసుకున్నావనుకో  వీటిని కనిపెట్టడం బ్రెహ్మ తరం కూడా కాదు. సారా నిషేధం పెట్టాక చుక్కేసే అలవాటు వుండాళ్ళందరికి నోరు పిడచ కట్టుకుపోయి ఛత్తా ఉండారు. సరొద్దులు దాటిపోయి తాగి రాలేరుగా, వున్న మారాజులకి వచ్చే దారిన మందు వస్తానే వుంది. ఎటుగాక చచ్చేది పేదాడే ! వాడికే పది రూపాయలది ఇరవై రూపాయలకి అమ్మి మనం సొమ్ము చేసుకోవాలె, మనం ఎంతెక్కువమ్మితే అంత డబ్బులు ఇస్తానని బట్టీ ఆయన చెప్పాడు ... వొప్పుకోవే ! కోడిని దువ్వినట్లు దువ్వి రమణని వొప్పించాలని ఆరాటపడ్డాడు . 


ఏమో, నువ్వు భయమేమి ఉండదని అంటన్నావ్  కాబట్టి  'ఊ ' అంటన్నా యేదన్నా అయ్యిందంటే  నేను ఎట్టో బడి దూకి చావడమే ! తర్జనగా వేలు చూపిస్తూ చెప్పింది . నేనున్నా కదా ! ఇశయాలన్నీ నేను చూసుకుంటా నన్నా కదమ్మీ ! ఇక పడుకో తెల్లారఝామున లేచి  రైలందుకోవాలి. అని నేలపై పక్క పరిచాడు. ఒళ్ళో  ఉన్న బిడ్డని  పక్కపై పడుకోబెట్టి  తను పడుకుని కళ్ళు మూసుకుంది. వెంకటేశం బస్తాలో ఎసుకోచ్చిన సారా పేకెట్ లని తీసి ఒక్కోకటిని ఒక్కో అరలో  పెట్టి  ముడతలు లేకుండా సవరదీసి సర్ది పెట్టాడు.    


 కోడి కూయక ముందే నిదర లేచి అన్నం కూర ఒండి మొగుడికి, తనకి బాక్సులకి సర్దింది రమణ.   అంత చలిలోనూ రెండు చెంబులు నీళ్ళు  గుమ్మరించుకుని వచ్చి  వేసుకునే చీర జాకెట్  తీసుకుని  జాకెట్ తొడుక్కుని వెంకటేశం  తయారు చేసిన లంగా చేతిలోకి తీసుకుని ఆ బరువుని మోయలేక కిందకి వదిలేసింది. టప్ మన్న చప్పుడుతో  వెంకటేశం  నిద్ర నుండి లేచి అప్పుడే తెల్లారిపోతుందా, మొద్దు నిద్దర పట్టేసింది. అంటానే కిందబడ్డ లంగా వైపుకి చూసి "ఇట్టా  కిందబడితే పేకెట్లు చిరిగిపోతాయి  చుక్క మందు బయటకి ఒచ్చేసిందా పోలీసు నాయాళ్ళు  వాసన పసి కట్టేస్తారు. జాగ్రత్తగా ఉండాలి"  .. అంటూ  " ఇటురా  నేను లంగా కడతా " అంటూ .. చొరవగా ముందుకొచ్చాడు. మొగుడు పెళ్ళాం  ససరసాలాడు కుంటున్నప్పుడే  మొగుడు ముఖం చూడటానికి సిగ్గు పడే రమణ వెంకటేశానికి యెదురుగా తాడిచెట్టల్లె నిలబడింది . రమణ  సృహలో లేకుండా ఎక్కడో ఆలోచిస్తుందన్నది అర్ధమై కదిలిస్తే యెక్కడ మొదలుకే మోసం వస్తుందని గ్రహించి రమణ తలమీద నుంచి లంగా తొడిగి ఒంటిమీదన్న పాతచీరని తీసి తన భుజం పై వేసుకుని  బొందులు లాగి ముడివేసాడు. 

రమణ కైతే ఓ పెద్దనాయకుడిని చంపడానికి ఆడమనిషికి నడుంకి బాంబులు కట్టుకుని వెళ్ళిందని చెప్పుకున్న విషయమే గుర్తుకొచ్చి ... ఇట్టాగే కట్టారు కాబోలు అనుకుంది. రమణ చీర కూడా చుట్టుకోకుండా ఆలోచిస్తానే ఉందని తనే చీర చుట్టి కుచ్చెళ్లు పోసి ఇచ్చి .. "ఇక ఆలోచిచ్చింది చాల్లేవే ! కుచ్చీలు దోపుకుని అటు ఇటూ నడిచి చూడు" అని గదమాయించాడు .   


అలవాటులేని పని బెరుకు బెరుకుగా మొదలెట్టి    రెండుమూడు నెలలకే   రోజుకి  వంద సారా పేకెట్లు అమ్మడంలో ఆరితేరిపోయింది రమణ. అసలు దారి మూసేస్తే ప్రక్కదారులు వెదుక్కున్నట్టు అదివరకటి కన్నా  యెక్కువగా సంసారం గుల్ల చేసుకుని మరీ తాగే సారా ప్రియులు, అందుబాటులో లేని ఖరీదైన మందు దొరక్క నాటు రకానికే మళ్ళిన డబ్బున్న తాగుబోతులు రమణకి రోజువారీ కస్టమర్లు అయిపోయారు. డబ్బు రుచి ముందు రమణ బెరుకు,భయం అన్నీ పోయాయి. 


 ఒకరోజు ఆలస్యంగా బయలుదేరి  హడావిడిగా కదులుతున్నరైలేక్కేసింది . తీరా చూస్తే అది  ఎసి బోగీ. వెంకటేశం యెనకనే వున్న బోగీ ఎక్కేసాడు కానీ  అతని చేతి సంచీలోనే సారా పేకెట్ లు  వుండిపోయాయి. రైలు నెమ్మెదిగా బ్రిడ్జీ దాటుతుంది. చెక్ చేస్తూ వస్తున్న రైల్వే పోలీస్ రమణని కనిపెట్టాడు . రైలాపి ఆమెని స్టేషన్ కి లాక్కెళ్ళి కూర్చోబెట్టి వివరాలు అడుగుతూ అసలు విషయం కనిపెట్టేసాడు.  


 సమయం రెండు గంటలవుతుంది. పోలీస్ స్టేషన్ లో పొద్దుటినుండి  నుంచుని నుంచుని కాళ్ళు పీక్కుపోతున్నాయి. అయినా క్షణం క్షణం గది గుమ్మం వైపు చూస్తూనే వుంది. గుమ్మం బయట మనుషులు చీమలబారుల్లా  తిరుగుతూనే ఉన్నారు అందులో వెంకటేశం ఉంటాడేమో నన్నఆశ,  సీజన్ టికెట్ తీసుకుని వచ్చి  చూపించి   తనని తీసుకుపోతాడనే ఆశతో  కళ్ళు కాయలు కాసిపోతున్నాయి. అయినా అతను  రావటం లేదు. నీరసం ముంచుకొచ్చింది  రమణకి. 


 హెడ్ కానిస్టేబుల్  రాక్షసుడిలాఎదురుగా  కూర్చుని తినేసేటట్టు చూస్తూనే వున్నాడు. వాడి చూపులు ఒంటి మీద  త్రేళ్ళు, జెర్రులు ప్రాకినట్టే ఉండాయి. చీర కొంగుని భుజంచుట్టూ కప్పుకుని నిలబడిన చోటే సత్తువలేనట్టు  జారగిలబడి నేలపై కూర్చుని  గోడకి చేరగిలబడింది. కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతున్నాయి. క్యాంటీన్ నుండి సర్వర్ కృష్ణుడు  టీ  తీసుకొచ్చి హెడ్ కి ఇచ్చాడు. ఆఫీసులో పనిచేసే వారికీ ఇచ్చాడు . ఇంకోటి మిగిలిపోయింది . ఏం  జేయను సార్ ! అడిగాడు . వెనక్కి తీసుకుపోయి లెక్కలో ఒకటి తగ్గించి రాయి  చెప్పాడు . 


"పొద్దుటి నుంచి ఈ ఆడ మనిషి ఇక్కడే కూర్చుని ఉంది. మగాళ్ళని కూడా నలుగురైదుగురిని తీసుకొచ్చారు కదా ! వాళ్లేరి ? ఈ మనిషి ఇక్కడే కూర్చోబెట్టారు ,   ఈమెని విడిచి పెట్టనూ లేదు  స్టేషన్ కి పంపలేదు ఇక్కడే ఉంచారు? " ఏం  తప్పు చేసింది సార్ అనడిగాడు కృష్ణుడు . 


" ఈ  ముండ " రోజూ  పూలు అమ్ముతున్నట్లు నమ్మించి సారా పేకెట్ లు అమ్ముతుందిరా! పైగా టికెట్ కూడా కొనడం లేదు అందుకే  తీసుకొచ్చి లోపల పడేసా, ఎనకమాల బోగీలోమొగుడు రైలెక్కి వుంటాడు.  ఆడి జేబులో సీజనల్ పాస్ ఉంది  ఆడు వస్తాడు చూపిస్తాడని  బొంకు మాటలు చెపుతుంది. దీని మాటలు ఎంత నిజమో ! సరే  వాడొచ్చేదాకా చూద్దామని చూస్తున్నా. అందుకే కేసు రాయలేదు.  ఈ కేసు సంగతి చూస్తే గాని ఇంటికి వెళ్ళను. డ్యూటీ అంటే అంత సిన్సియర్ గా చేయాలి, చేస్తానని పేరు కూడా ! నీకు తెలియనిది ఏముంది ? అన్నాడు.  


"అవునండీ .. మీరు ఎంత సిన్సియరో నాకు తెలియకపోతే కదా, మీరు అంత గొప్పగా ఉండబట్టే ఇక్కడ స్టేషన్ లో  దొంగతనాలు తగ్గాయి, రౌడీల పెత్తనం తగ్గిపోయింది. మీకు మీకు ఉన్న అండర్ స్టాండింగ్ లు అలాంటివి మరి .  అయినా  లంక చేలల్లో బట్టీలు  పెట్టి  సారా కాసే వాళ్ళని, మధ్యనుండి  సరుకేసే దళారీలని వదిలేసి అమ్ముకునే వాళ్ళని పడితే ఏమొస్తుంది. పడితే తిమింగాలనే పట్టాలి గానీ " అంటూ చురకేసి   "ఇదిగోమ్మా ! కాస్త వేడి వేడిగా  ఈ టీ  తాగు. మీ అయన వచ్చేస్తాడు లే ! నిన్ను తీసుకుని పోతాడు భయపడకు"  అంటూనే  " ఇదిగొ హెడ్ గారు ఈ టీ  మీ లెక్క లోకి రాదులే ! నా లెక్కలో రాసుకుంటాను." అన్జెప్పి  వెళ్ళిపోయాడు.  


ఆలోచిస్తూనే బెరుకుగా ఆ టీ తాగాలా వద్దా అన్నట్టు చూసి అనుమానంగా హెడ్ వైపు చూసింది రమణ.  తనవైపుకి చూపులు మరల్చ గానే అప్పటిదాకా రమణ నే తినేసేటట్టు చూస్తున్న హెడ్ చప్పున పేపర్ లో తల దూర్చాడు.    ఈగలు ముసురుకోబుతున్న ఆ టీ  గ్లాస్  వైపు  కాసేపు చూసి నెమ్మదిగా చేతిలోకి తీసుకును టీ తాగింది   


 ఎనిమిది దాటిపోయింది."అయ్యా !  బయటకెళ్ళి కాసిని నీళ్ళు తాగి వస్తాను " దాహంగా ఉంది అడిగింది హెడ్డు ని . 


 రమణని బయటకి పంపితే ఆమె  కోసం వెదుకుతున్న వాళ్ళ కంటబడితే తను అనుకున్న పని నెరవేరదు, అదీ గాక ఇది తప్పించుకుని పారిపోవచ్చు అనుకుని " ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, అక్కడే కూర్చో నేను నీళ్ళు తెప్పిస్తా " అని గదమాయించాడు . తనే బయటకి వెళ్లి  క్యాంటీన్ సర్వర్  కృష్ణుడు తోనే నీళ్ళు పంపించాడు . 


నీళ్ళు ఇస్తూ చెప్పాడు . మీ ఆయన అనుకుంటానమ్మా ! మధ్యానం  నుండి ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు.  నీకు కనబడాలని గుమ్మం తిన్నగా వచ్చి పట్టాల మీద నిలబడుతున్నాడు. లోపలి రాడానికి దైర్యం చాలడంలే ! ఈ ఆంబోతు  హెడ్డు గాడు  ఏ ఇనప కమ్మీలు దొంగతనం  చేసాడనో  కేసు బనాయించి లోన వేస్తాడని బయపడుతున్నాడు . నీ కోసం వరంగల్ దాకా పోయోచ్చాడు అంట . మీ అమ్మ వాళ్లంటికి పోయోచ్చాడంటా, ఎక్కడా లేదు యేమైపోయిందో అని కలవర పడుతుండగా  మీ పూలాళ్ళే  చెప్పారంట  నువ్వు యిక్కడ వుండావని . ఏం చేయాలో తెలీక చతికిలబడ్డాడు . ఏదో అదృష్టం జరగాలి మీరు బయటపడాలంటే . ఈ హెడ్డు గాడి ఆకలి సామాన్యం కాదు . బాగా మేపితే కాని బయటకి వదలడు. కాసేపాగినాక ఏదో ఒక టిఫిన్ పట్టుకొస్తాను .  కాస్త తిని నెమ్మదిగా పడుకో ! అన్నింటికీ  ఆ దేవుడే అండ  అంటూ వెళ్ళిపోయాడు . ఇంతలో ఎక్కడినుండో కూతురు ఏడుపు వినిపిన్చినట్లనిపించింది.   గొంతు ఎండిపోతున్నానీళ్ళు ఎదురుగా వున్న  గొంతు  తడుపుకోవాలన్న సంగతి కూడా మర్చిపోయి గబాల్న లేచి గుమ్మం ముందు కొచ్చి అటు ఇటు చూసింది. ఎక్కడా వెంకటేశం కానీ, కూతురు కానీ  కనబడలేదు లాటీ ఊపుకుంటూ  హెడ్ వస్తూ కనబడ్డాడు. . 


గబుక్కున లోనికోచ్చింది. ఏంటే  పారిపోదామని చూస్తున్నావ్,   ఆడదానివని  కూడా చూడకుండా మక్కె లిరగదంతాను . లోపలి పద అంటూ రమణ  జుట్టుని బలంగా ఒడిసి పట్టుకుని  ఈడ్చి మూలకి తోసాడు ." టప్"  మని మూలకి కొట్టుకుని  సృహ తప్పి పడిపోయింది రమణ.


 " సర్  ఆ మనిషికి ఏదైనా అయితే మనకి  మూడుద్ది . ఈ సారి ఆధారాలతో సహా పట్టుకుందాం, ఇప్పుడు వదిలేద్దాం సర్ ! కానిస్టేబుల్ నచ్చజెప్పబోయాడు . 


"ఆ విషయం నాకు తెలుసు నీ డ్యూటీ టైం  అయిపోయినట్లు  ఉందిగా నువ్వెళ్ళు, నా రిలీవర్ వచ్చాక నేను వెళతాను " అంటూ తరిమేసాడు.      .  


కాసేపటి తర్వాత  రమణ  సృహలోకి  వచ్చింది.    నెమ్మెదిగా  లేచి హెడ్ ముందుకొచ్చి నిలబడి   "బాబూ ! నన్ను వొదిలి పెట్టయ్యా ,  నేను నిజంగా పూలే అమ్ముతున్నాను సారా పేకెట్ ల సంగతే తెలియదు .  సీజన్ టికెట్ కూడా కొనుక్కున్నాం . మీరు ఇప్పుడు వదిలేస్తే రేప్రొద్దున అది కూడా తీసుకొచ్చి చూపిస్తాను. ఇంటిదగ్గర పసి బిడ్డ  కూడా ఉంది " ప్రాదేయపూర్వకంగా  అడిగింది .   


ఏం  తింటావ్ చెప్పు ?  నాకు "బిర్యానీ " ఆర్డర్ చెపుతున్నా . నువ్వు కూడా తింటానంటే తెప్పిచ్చి పెడతా  అంటూ వంకర నవ్వొకటి  నవ్వాడు . హెడ్ వైపు అసహ్యంగా చూసింది రమణ.

  టైం చూస్తే  తొమ్మిదవుతుంది. ప్లాట్ పారం పై సందడి కూడా తగ్గుతుంది . ఈ హెడ్ ఎప్పుడు డ్యూటీ మారిపోతాడో ఇంకెవరు వస్తారో ? ఆ వచ్చే వాడు వీడు లాగానే ఉంటే, గుండెల్లో భయం  ముంచుకొచ్చింది. మొగుడిపై కోపం తన్నుకొచ్చింది. ఈ ముదనష్టపు సారా పేకెట్ లు అమ్మొద్దు అంటే వినలేదు. వాటిని  అమ్మిన పాపానికి  ఈ హెడ్ ఇప్పుడు పట్టుకుని సాదిస్తున్నాడు.  భగవంతుడా, నన్నీడ నుండీ బయటపడేయి ! కనిపించని దేవుళ్ళకి  మొక్కుకుంది . 


హెడ్ బిర్యానీ తెప్పించుకున్నాడు . దానితో పాటే సారా  పేకెట్ లు కూడా.  తింటున్నాడు ,తాగుతున్నాడు . మధ్య మధ్యలో రమణ వంక  ఆకలి చూపులు చూస్తున్నాడు . ఆ చూపులు అర్ధమై  రమణకి పై ప్రాణాలు పైనే పోతున్నాయి.. హెడ్ తినడం ముగించి చేతులు కడగడానికన్నట్లు లేచాడు.  పారిపోవడానికి అదే అదనుగా అనిపించింది. పారిపోయినా  ఎంత దూరం  పోగలదు ? వెంటనే చిక్కిపోవడం  ఖాయం అనుకుంది.  అలా నిమిషాలు గడుస్తూ వుండగానే హటాత్తుగా గుమ్మం దగ్గర  కూతురు కనబడింది. ఆ పిల్లని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించి ఒక్క వుదుటున  పిల్లని తీసుకుని వొళ్ళో పొదువుకుంది.  శృతీ  "నిన్నెవరు తీసుకొచ్చారమ్మా " అడిగింది .. ఆ పిల్ల నాన్న అంటూ గుమ్మం వైపు చూపింది రమణ.  మళ్ళీ గుమ్మం  దగ్గరికి వచ్చి బయటకి చూసింది . ఈ సారి కూడా భర్త కనబడలేదు  కానీ, యిక్కడే ఎక్కడో ఒక చోట దాక్కుని ఉంటాడని అర్ధమై ... దైర్యం వచ్చింది. పొద్దుటి నుంచి తల్లి కనబడని పిల్లకి తల్లి వొడి దొరకగానే ఆకలి గుర్తొచ్చింది. తల్లి గుండెలపై ఉన్న పైటని  ప్రక్కకి తోసి జాకెట్ పైకి లేపి స్తన్యం దొరక పుచ్చుకుని ఆనందంగా పొట్ట నింపుకోసాగింది .


పిల్లతో పాటు నాకు పాలు ఇస్తావా, అమ్మ పాలు అప్పుడెప్పుడో తాగా .. మళ్ళీ ఒకసారి రుచి చూడాలనిపిస్తుంది ... వచ్చి మోకాళ్ళపై రమణ ముందు కూర్చున్నాడు . " తూ.. నీ యమ్మ " యేమడుగుతున్నావ్ రా ! కాలితో ఎగిరి తన్నానంటే బొక్క బోర్లా పడతావ్, ఊరుకుంటున్నానని వెకిలివేషాలు  యేస్తన్నావ్?  అంటూ  సివంగిలా పైకి లేచింది.  


ఏంటే నోరు లేగుస్తుంది . నేను తల్చుకున్నానంటే  నిన్ను నీ మొగుడిని లోపలేసి అయిదారేళ్ళు శిక్ష  వేయిస్తా ఉగ్రంగా పైన పడబోయాడు . 


 అంతలో రమణ వేడుకోలువిన్న దేవుడే పంపినట్లు  "స్టాపిట్ స్టాపిట్ ఏం జరుగుతున్దిక్కడ     అంటూ  స్టేషన్ ఎసై   వచ్చాడు. హెడ్ వైపు కోపంగా చూస్తూ .., మీ గురించి ఇప్పటికే ఎన్నో పిర్యాదులున్నాయి . అక్రమంగా  ఆడవాళ్ళపై కేసులు బనాయించి వాళ్ళపై అత్యాచారాలు చేస్తున్నావని . అలాగే అమాయుకులపై దొంగతనాల కేసులు బనాయించి అసలు దొంగలని దాటేస్తున్నావని . మీకింతకు ముందే ఒకసారి వార్నింగ్ ఇచ్చాను  అయినా మీకు బుద్ది రాలేదు .  ఇప్పుడు సాక్ష్యంతో సహా దొరికిపోయావ్ ! మీకు సస్పెన్షన్ తప్పదు " అన్నాడు . మళ్ళీ వెంటనే   "ఎందుకు తీసుకు వచ్చావ్ ఈమెని" అని ప్రశ్నించాడు. . 


" పూలు అమ్ముతున్నానని సారా పేకెట్ లు అమ్ముతుందండి, టికెట్  కూడా లేదు, అడిగితే సీజన్ టికెట్ అంటుంది. అలాగే దీని మొగుడు జేబులు కొట్టేస్తున్నాడని కంప్లైంట్ ఉంది " అందుకే లాక్కొచ్చాను . ఇంత  వరకు  ఎవరు రాలేదు, అందుకే స్టేషన్ లోనే  ఉంచాను "  హెడ్ సంజాయిషీ యిచ్చాడు.


"ఎవడికి వాడు  సమాజాన్ని జలగల్లా పట్టి తాగేస్తున్నారు,  వ్యవస్థని  నాశనం చేసి పారేస్తున్నారు .నిజాయితీగా పనిచేసేవాళ్ళు, మంచి చెడు ఆలోచించే వాళ్ళే లేకుండా పోతున్నారు.  ప్రభుత్వం  ప్రజల సంక్షేమం కోసం ఎన్ని నిషేధాలు పెట్టినా వాటిని ప్రజలే అమలవనివ్వరు. ఇంకెందుకీ నిషేధం, పందికొక్కుల్లా కొందరు బొక్కడానికి, పేదవాడు ఇంకాస్త పతనమవ్వడానికి తప్ప "   పైకే అనుకుంటూ అసహనంగా  సీట్లో కూర్చున్నాడు ఎస్సై .    


ఓ రెండు నిమిషాలు ఆలోచించి రమణ వైపు చూపి   " నువ్వెళ్ళు"    అంటూ రమణ కి చెప్పగానే ఆమె  కృతజ్ఞతగా చేతులు జోడించి  బయటకి వెళ్ళింది. ఆమె పదడుగులు వేసిందో లేదో " ఏయ్ ఆగు "అంటూ వెనకనుంచి .. కేకేసాడు ఎస్సై . 


రమణ ఆగింది.  దగ్గరకి వచ్చి "నిజంగా నువ్వు పూలే అమ్ముతున్నావా?" అడిగాడు . 


"అవునండీ ! " అబద్దమే చెప్పింది ఈ సారి కూడా .  

  

ఎస్సై అసహనంగా   రమణ దగ్గరికి వచ్చి జుట్టు పట్టుకుని ముందుకి వొంచి  లాటీ కర్రతో వీపుమీద ఒక్కటిచ్చాడు  


"చచ్చాన్రో బాబోయ్ "  అంటూ రమణ కేక పెట్టి కూలబడిపోయింది.   


(విహంగ వెబ్ మాస పత్రిక లో 08/2015 లో ప్రచురితం ) ప్ర ర వే  అనేక ఆకాశాలు  లో  వచ్చిన కథ. 




 


10, ఆగస్టు 2015, సోమవారం

నమ్మకమీయరా స్వామీ !


ఒక నెల రోజుల క్రిందట నా కొడుకు అమెరికా ప్రయాణానికి కావాల్సినవన్నీ సర్దుతూ ఉన్నప్పుడు కానీ ..విమానం ఎక్కించడానికి విమానాశ్రయం వద్దకి వెళ్లినప్పుడు కానీ నేను కళ్ళనీళ్ళు పెట్టుకోలేదు జంటగా ఇంకొకరిని ఇచ్చి పంపానుకదా! మీరిరువురూ కష్టసుఖాలలో ఒకొరికొకరు తోడుంటూ ... లోకాలని ఏలండి బంగారు .. అని మనసులో దీవించాను, వారిని చల్లగా చూడమని భగవంతుని ప్రార్దించాను.


మళ్ళీ నెల రోజుల తర్వాత అలవాటుగా  ఈ రోజు వీడియో కాల్ లో నా కొడుకుతో మాట్లాడుతూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను. ఎందుకంటే ..  అప్పుడే ఇక్కడ ఒక ఉద్యోగం దొరికి ఉంటే, లేదా చిన్నపాటి వ్యాపారం చేసుకోవడానికి సరిపడా బ్యాంకు లోన్ లభించి ఉంటె నా కొడుకుని విదేశం వైపు కన్నెత్తి చూడనిచ్చేదాన్నే కాదు . నిజం . (నా బిడ్డని నేను చూడాలనుకున్నప్పుడు ఒక పూట లేదా ఒక రోజు ప్రయాణంలో కలిసే విధంగా ఉంటె బాగుండును అని నేను అనుకుంటాను . ఎన్నో ఆంక్షల మధ్య వేరొక దేశంలో ఉన్న నా కొడుకు ఇంటికి అతిధిగా వెళ్లాలని నేను అస్సలు అనుకోను ).

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకి వాళ్ళ వాళ్ళ బ్రతుకులపై, భద్రతపై, జీవనోపాధి పై భరోసాలేదు. పిల్లలకి చదువులు లేవు, చదువులుంటే సరైన ఉద్యోగాలు లేవు, వ్యవసాయం లేదు, పరిశ్రమలు లేవు .. ఉన్నదంతా ఒకటే పెట్టుబడిదారి వ్యవస్థ. లంచగొండితనం, రాజకీయనాయుల స్వార్ధం. నాలుగేళ్ళ తర్వాత ఇక్కడికి వచ్చిన నా బిడ్డ ఇక్కడ పరిస్థితులని చూసి తను అమెరికా వెళ్ళే నాటి పరిస్థితులని తలచుకుని బేరీజు వేసుకుని అప్పటికన్నా మరీ అధ్వానంగా తయారయిన రాష్ట్రాన్ని, దేశాన్ని, ముఖ్యంగా మా బెజవాడ వీధుల్ని, రహదారులని చూసి, భూబకాసురాలని, చిన్నాభిన్నమైన ఆర్ధిక పరిస్థితులని చూసి దిగులుపడ్డాడు . వెళ్ళాలి కదా, వెళ్ళక తప్పదు కదా! అన్నాడు . బ్రతుకు పోరాటం అంటే అదేనేమో ! ఇక్కడ వ్యక్తిగతమైన ఇబ్బంది కన్నా సామాజిక పరిస్థితులని బట్టి భీతిల్లిపోయాడు . ఇంకో అయిదేళ్ళు చూస్తానమ్మా ! ఇక్కడ ఇలాగే ఉంటె .. నేను ఇక ఇండియా రాను, అక్కడే సెటిల్ అయిపోతాను అన్నాడు .

నా కొడుకే కాదు మా బంధువులబ్బాయి నాణ్యమైన విద్య చదువుకుని మంచి మార్కులతో ఇంజినీరింగ్ చదువుకుని క్యాంపస్ సెలక్షన్స్ లో ఎంపిక కాక సంవత్సరం పాటు చిన్నపాటి ఉద్యోగం దొరకక .. అమెరికాకి ప్రయాణమయ్యాడు. ఇలా ఈ ఆంధ్రప్రదేశ్ నుండి  గత నెల రోజుల కాలంలో  ఎన్ని వేలమంది అమెరికాకు ప్రయాణ మయ్యారో ! ఇక్కడ జీవించే బలహీన వర్గాలకి ఎలాగు భరోసాలేదు . ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి భరోసా లేదు . ఎవరు కల్గించగలరు .. ఇక్కడ జీవించడానికి భరోసా ?

విశ్వకవి ఠాగూర్ వాక్యాలు గుర్తుకొస్తున్నాయి.

ఎక్కడమనస్సు నిర్భయంగావుంటుందో,

ఎక్కడమానవుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో,

ఎక్కడవిజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో,

ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోవదో,

ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుంచి బాహిరిల్లుతవో,

ఎక్కడా విరామమైన అన్వేషణ,పరిపూర్ణత వైపు చేతులుచాస్తుందో,

ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మృతాంధ విశ్వాసపుటెడారిలోఇంకిపోదో,

తలపులో పనిలో నిత్య విశాల పథాలవైపు ఎక్కడ మనస్సు పయనిస్తుందో-

ఆ స్వేచ్ఛాస్వర్గంలోకి, తండ్రీ! నా దేశాన్ని మేల్కాంచేట్టు అనుగ్రహించు'


నమ్మకమీయరా స్వామీ నిర్భయమీయరా..స్వామీ .. (చంద్రబోస్ సాహిత్యం గుర్తుకొచ్చింది }

నమ్మకమీయరా స్వామి

నిర్భయమీయరా స్వామి

సన్మార్గమేదో చూపరా స్వామీ

సుజ్ఞాన సూర్యున్ని మాలో వెలిగించరా

చెడుకు ఎదురు పోరాడే

మంచినెప్పుడూ కాపాడే

పిడుగు దేహమీయరా ప్రభూ

ప్రేమతో పాటు పౌరుషం పంతం తేజం రాచగుణం ప్రభూ

వినయం విలువలనీయరా

లోన నిజం గుర్తించే

పైన భ్రమను గమనించే

సూక్ష్మ నేత్రమీయరా స్వామీ

సర్వమందించు నీ ప్రియగానం స్మరణం ప్రార్థనకై

స్వామీ సమయం స్వచ్ఛతనీయరా