26, సెప్టెంబర్ 2017, మంగళవారం

కుల వృక్షం
యాసిడ్ సీసా,పెద్ద బ్రష్, చంకలో చీపురుకట్టతో పొద్దున్నే ప్రత్యక్షమయ్యాడు అప్పారావు.
"మూడొందలు ఇవ్వాల్సిందేనా, ఓ వంద రూపాయలు తగ్గించుకో "మా అత్తగారి బేరం.
"తప్పమ్మా అట్టా బేరాలాడకూడదు, చేసేది రోత పని. అడిగినంత ఇచ్చేస్తే రెండోసారి పిలిచినప్పుడు కాదనకుండా మర్యాదగా వస్తాను" మెత్తగా చెప్పినా ఖచ్చితంగా చెప్పాడు.
"ఎవరైనా అంతే తీసుకుంటున్నారు, అతన్ని రానివ్వండి" అన్నాను అత్త గారితో. "నువ్వు తెచ్చిన యాసిడ్ ఘాటైన  వాసనొస్తుంది. అదొద్దు ఇది వాడుకో" అంటూ నేను తెచ్చిపెట్టిన యాసిడ్ బాటిల్ ఇచ్చాను. మధ్య మధ్యలో ఎలా శుభ్రం చేస్తున్నాడోనని చూసా. నేలమీద కూర్చుని కొద్ది కొద్దిగా యాసిడ్ చల్లుకుని బ్రష్ తో రుద్దుతూ మురికి  పట్టిన టైల్స్ ని పాల రంగులోకి మార్చడానికి శరీరాన్ని అరగదీసుకుంటున్నాడు. అప్పారావు వయసు యాబై ఏళ్ళు కూడా ఉండట్టు లేవు. నిత్యం రసాయనాల వాసన పీలుస్తూ ఉండటం వల్లనేమో  చూపులకి అరవై ఏళ్ళు దాటిన వాడిలా కనబడతాడు. జాలేసింది, "కాసిని టీ తాగుతావా" అడిగాను. "వద్దమ్మా! తాగితే పని చేయలేను".  
రెండు గంటల్లో మూడు బాత్ రూమ్ లు శుభ్రం చేసేటప్పటికి  ఇల్లంతా యాసిడ్ వాసన. పాపం ! ఎలా తట్టుకుంటున్నాడో  అనుకుంటూనే  వండిన పదార్ధాలతో లంచ్ బాక్స్ సర్దుకుని స్కూల్ కెళ్ళడానికి  రెడీ అయిపోయాను. నోటికి ముక్కుకి కలిపి కట్టుకున్న గుడ్డని విప్పుకుంటూ "శుభ్రంగా మెరిసిపోతున్నాయండి చూసుకోండి" అన్నాడు. ఐదొందల నోటు ఇస్తే పొద్దు పొద్దునే "నా దగ్గర చిల్లరెక్కడ ఉంటుందమ్మా ? మీరే చిల్లరీయండి"అన్నాడు.
"ఉంటే ఇవ్వడానికేం, సరే ఒకపని చేయి. నా వెనుకనే చోడవరం రా. అక్కడ స్కూల్ లో రెండు బాత్రూమ్స్ కడగాలి" అన్నాను.
"అంత దూరం నేను రానమ్మా, వేరే ఎవరినైనా పిలుచుకోండి" అంటూ జేబులోనుండి రొండొందలు తీసిచ్చాడు.
"పని చేయడానికి ఎక్కడైతే ఏమైంది, పని కావాలి కానీ" అంది మా అత్తగారు.
"అదేమన్నా ప్రభుత్వ ఉద్యోగమా ? ఎక్కడైనా చేయడానికి" అంటూనే  టిఫిన్  నోట్లో కుక్కుకుని బేగ్ తగిలించుకుని  బండి కీస్ తీసుకుని లిఫ్ట్ దగ్గరికి వచ్చేసరికి కరంట్ పోయింది. అసలే ఆలస్యం అవుతుందనుకుంటే ఇదొకటని  విసుక్కుంటూ గబగబా మెట్లు దిగుతూ  సరిత టీచర్ కి లిఫ్ట్ ఇస్తానని చెప్పాను. సెంటర్ లో వెయిట్ చేస్తూ ఉంటుందీపాటికే అనుకున్నాను.

అసలే పరీక్షల రోజులు దగ్గరలో ఉన్నాయి,నిమిషం ఆలస్యమైనా హెడ్ మాస్టర్ మాటల బెత్తం ఝుళిపించి  అవమానపు వాతలు పెడతాడు.మీకు పేస్బుక్ లో ఉప్పరసోది చెప్పుకోవడానికి వాట్సాప్ గ్రూప్ లలో చీరలు,డిజైనర్ బ్లౌజ్ పిక్స్  షేర్ చేసుకోవడానికి టైమ్ ఉంటుంది కానీ కాస్త ముందుగా బయలుదేరి సమయానికి బడిలో ఉండాలనుకోరని నిన్ననే   క్లాస్ తీసుకున్నాడు. పాపం సరిత బిక్కచచ్చిపోయింది. అలా స్కూల్ విషయాలు  గురించి ఆలోచిస్తూ ఎప్పుడు బండి స్టార్ట్ చేసిందో . రెండు కిలోమీటర్లు ఎలా నడిపిందో క్రాస్ రోడ్డుకి వచ్చి సరిత టీచర్ ముందు బండి ఆపేవరకు బాహ్యప్రపంచంలో జీవించిన సృహే లేదు .
"ఈ రోజు టాయ్లెట్ క్లీన్  చేసే వంతు మనదే కదా ! ఎవరైనా దొరికారా మేడమ్" అడిగింది
"లేదు సరితా, ఈ రోజు ఉదయాన్నే మా ఇంట్లో టాయ్లెట్స్ శుభ్రం చేయడానికి ఒకతను వచ్చాడు. అతన్నే రమ్మని అడిగాను,కానీ రావడం కుదరదన్నాడు. మనకి తప్పేటట్లు లేదు అన్నానుచిరాకుగా.
"ఈ స్కూల్ లోనూ తగినంత  బోధనా సిబ్బంది, అటెండర్, స్వీపర్ కొరత ఎప్పుడూ ఉండేదే ! పదిహేను గదులున్న పాఠశాల శుభ్రం చేయడానికి ప్రభుత్వం ఇచ్చే డబ్బులు రెండున్నరవేలు. మెయింటెనెన్స్ నిధుల నుంచి కొంత , ఆర్‌ఎంఎస్‌ఏ నిధులలో నుంచి మరికొంత తీసి ఇచ్చినా  ఆ జీతానికి గదులని వరండాలని శుభ్రం చేసి కుండల్లో మంచి నీళ్ళు పెట్టి వెళతాను అంతకన్నా ఎక్కువ పనిచేయను ఇష్టమైతే చేయించుకోండి లేకపోతే లేదు అని  తెగేసి చెపుతుంది  కాంతమ్మ. అందుకే ఎప్పటినుండో వంతులేసుకుని మరుగు దొడ్లు శుభ్రం చేసుకుంటున్నాం, మీరు ఈ స్కూల్ కి కొత్తగా వచ్చారు కాబట్టి మీకవన్నీ తెలియవు" అంది,
"మన టాయిలెట్స్ సంగతి అలా ఉంచండి, ఇవాళ  పిల్లల టాయిలెట్ శుభ్రం చేసుకునే వరుసలో సిక్స్త్ క్లాస్ స్తూడెంట్  కృష్ణ ఉన్నాడనుకుంటా కదా ? మిగతా పిల్లల తల్లిదండ్రులతో పెద్దగా  ఇబ్బందేమీ లేదు వచ్చిన గొడవల్లా  ఆ కృష్ణ వాళ్ళమ్మ ఆ నరసమ్మ తోటే ! పోయినసారి కూడా పెద్ద గొడవ చేసింది. కావాలంటే మా పిల్లడు ఇంటికొచ్చి వెళతాడు దొడ్లు కడగడానికి వీల్లేదని గట్టి గట్టిగా అరుస్తుంటే  మరుగుదొడ్లు  వాళ్ళ చేతనే శుభ్రం చేయిస్తున్న సంగతి బయటకి తెలిసి పోయి  ఏ మీడియా వాళ్ళో చిత్రీకరించి జనంలో ఏకి పెట్టేస్తారన్న భయమేస్తుంది" అన్నాను .
"పరిసరాల పరిశుభ్రత మన జీవితాల్లో ఒకభాగం అని పిల్లలకి అర్థమయ్యేటట్లు చెప్పి వంతులవారీగా శుభ్రం చేసుకోవడమే! ఎవరూ దొరకకపోతే మనింట్లో  మనమే శుభ్రం చేసుకోవడంలేదా అలాగే ఇది" అంది సరిత
వినడానికి బాగానే ఉన్నా నాలో  ఏదో  అయిష్టత. "సరితా! నాకెదురైన అనుభవాలు మీకు ఉన్నాయో లేదో పోస్టింగ్ వచ్చిన కొత్తల్లో బాగా వెనుకబడిన కుగ్రామం. అప్పటికి ఆ వూరిలో  ఉన్న టాయ్లెట్స్ ని వ్రేళ్ళ మీద  లెక్కించవచ్చు.స్కూల్ లో ఒక్క మరుగు దొడ్డి లేదు. నాకొలీగ్స్  ముగ్గురు పురుషులే కాబట్టి వారు ఎక్కడో ఒకచోట మరుగు చూసుకుని పని  కానిచ్చేసే వారు. నేను వెళ్ళాక సమస్యని సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్ళాను. ఆయన ఏదో  తాత్కాలికంగా గుంజలు నాటి పరదాలు కట్టి దొడ్డి ఏర్పాటు చేసారు. ఆ వూరికి నీటి సౌకర్యం కూడా అంతంత మాత్రమేఅందరికి అన్నింటికీ  చెరువు నీళ్ళే. తాగాడానికంటే ఇంటిదగ్గర నుండి నీళ్ళు పట్టికెళ్ళేదాన్ని కానీ బాత్ రూమ్కి వెళ్ళినప్పుడు ఆ చెరువు నీళ్ళే వాడటం వల్ల ఇన్పెక్షన్ వచ్చింది ఎన్ని మందులు వాడినా తగ్గలేదు.అప్పటి నుండి ఇంటిదగ్గర బయలుదేరే ముందు వెళ్ళడం  ఇంటికి వచ్చాకనే పొట్ట బరువు తీర్చుకోవడం. ఎక్కడ పనిచేసినా మరుగుదొడ్ల కోసం పోరాటంతీరా ఆ పోరాటం ఫలించి అవి నిర్మించే టప్పటికి బదిలీ అయ్యేదిఎక్కడైనా  విద్యార్దులకే కాదు స్టాప్ క్కూడా  మరుగుదొడ్ల సమస్యే "అన్నాను విసుగ్గా.  

"తరగతి పుస్తకాల్లో   గాంధీ గారు మరుగు దొడ్లు శుభ్రం చేసేవారు, కుష్టు వ్యాధి గ్రస్తులకి సేవ చేసేవారు అని చెపుతుంటే వినడం బాగుంటుంది కానీ ఆ పనులు స్వయంగా చేయాలంటే ఎంత అసహ్యించుకుంటామో ఇప్పుడు తెలుస్తుంది కదా! నా అనుభంలోనూ ఒక వాస్తవ జీవిత కథ ఉంది చెపుతాను వినండి" అంది
పాఠాన్నే కాదు ప్రతి విషయాన్ని కథలా  చెప్పే ఆమెకి రాసే ఉత్సాహం కూడా ఉంది,నాకున్న చదిలే అలవాటు మా ఇద్దరికీ నెయ్యానికి పునాది అయింది. సరిత అనుభవాన్ని వినడానికి ఆసక్తిగా చెవి వొగ్గాను.
"నా క్లాస్మేట్ పద్మ వాళ్ళమ్మ పారిశుధ్య కార్మికురాలు వీధులు మరుగుదొడ్లు  శుభ్రం చేసే పని చేసేది. వాళ్ళ నాన్న సైకిల్ షాపు పెట్టుకుని రిపేర్లు చేస్తూ, సైకిళ్ళు అద్దెకిచ్చుకుంటూ ఉండేవాడు.అతని చేతి క్రిందే నలుగురు కుర్రాళ్ళు పనిచేస్తూ ఉంటే పద్మ వాళ్ళమ్మ ఎందుకు అలా వీధులు ఊడ్వడం అనుకునేదాన్ని. పద్మ వాళ్ళమ్మ చక్కటి సిల్క్ చీరెలు కట్టేది, మేచింగ్ బ్లౌస్ వేసుకుని తలలో ఫ్రెష్  గా  ఉండే పూలు పెట్టుకుని మంచి చెప్పులు ధరించి మూతికి అడ్డుగుడ్డ కట్టుకుని వీధుల్నిమరుగుదొడ్లుని  శుభ్రం  చేస్తూ ఉండేది . పద్మ నా ఫ్రెండ్ కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళింటికి వెళుతుండేదాన్ని. వాళ్ళది బెంగుళూరు పెంకుటిల్లు  ఇంటా  బయటా అంతా నాపబండలు వేసి  శుభ్రంగా ఉండేది .నిజం చెప్పొద్దూ  మాకు ఎకరాలు,బండ్లూ, నగలూ నాణాలు ఉండాయన్నమాటే కానీ వాళ్ళిల్లు ఉన్నంత శుభ్రంగా, షోకుగా మా ఇల్లు ఉండేది కాదు . మా అమ్మ పాతిక రూపాయల కృష్ణలంక కల్పన కాటన్ చీరలు.కట్టటం తప్ప మంచి సిల్క్ చీరలు కట్టడం చూడలేదు ,పెళ్ళికో పేరంటానికో వెళ్ళేటప్పుడు పట్టు చీర. నేనెప్పుడు పద్మ  వాళ్ళింటికి వెళ్ళినా నాన్వెజ్ తో భోజనం వడ్డించేది ఆమె, వాళ్ళింట్లో భోజనం చేసినట్లు మా అమ్మకి తెలిసి విరగకోట్టింది నన్ను. క్లాస్ లో చాలామంది కన్నా  పద్మ మంచి బట్టలు వేసుకునేది. స్కిన్ కి అంట కుండా గోళ్ళ రంగు వేసుకునేది, బాగా చదివేది కూడా ! చాలామంది ఆమెని కులం కారణంగా దూరంగా ఉంచి తమ ఈర్ష్య ని ఇంకోవిధంగా చూపించేవారు.నేను మా కులాన్ని వృత్తిని   వారి  కులాన్ని వృత్తిని వేరు వేరుగానో  గొప్పగానో  హీనంగానో భావించలేదు అలా అనుకోవాలని నాకప్పటికీ తెలియదు కూడా ! ఆలోచనలు వికసించే  కొద్దీ వారి వృత్తి ఎందుకు హీనమైందో అర్ధమైంది. ఇప్పటికీ  పద్మ వాళ్ళమ్మ ఆ పని చేస్తూనే ఉంటుంది.ఒక కొడుకు సైకిల్ షాప్ బదులు మెకానిక్ షాప్ నడుపుతుంటే మిగతా పిల్లలు  మంచి ఉద్యోగాలు చేసున్నారు.వాళ్ళమ్మని ఆ పని చేయడం మానేయమని వత్తిడి చేస్తారు. పని చేయడంలో తప్పేముంది మన పనే అది కదా అంటుందట.నిష్కామకర్మగా  చేసే పనిలో ఆనందం వెదుక్కుంటుంది. మా ఐదుగురు పిల్ల్లలని ఆ వృత్తి చేయమని అనలేదు, వద్దని అనలేదు. మా ఇష్టాలకే వదిలేసింది అని తన తల్లి గురించి పద్మ  గర్వంగా చెపుతుంది "అంటూ  వాస్తవ కథని  ముగించింది

"ఏ వృత్తికావృత్తి గొప్పవే కావచ్చు కానీ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయడం, మరుగుదొడ్లు కడగడం,డ్రైనేజీలు శుభ్రం చేసే పని మాత్రం కర్మచారి సఫాయిలకే  పరిమితం అయిపొయింది? వాళ్ళకి ఆ పని ఇష్టం లేకపోయినా బ్రతకడానికి  ఇంకో పని దొరక్క అయిష్టంగానే ఆ పని చేసేవాళ్ళున్నారు. వాళ్ళ పిల్లలు చదువుకుని  అవకాశాలని ఉపయోగించుకుని  వేర్వేరు ఉద్యోగాలలో సెటిల్ అవుతున్నారు కదా,పద్మ వాళ్ళ కుటుంబం అలాగే కదా ఆ వృత్తిలో నుండి బయటపడింది, మిగతా వారిలోనూ   కాలక్రమేణా మార్పు వస్తుందిలే " అన్నాను .అంతలోకి స్కూల్ వచ్చింది.మాటలు,బండి రెండూ ఆపాము. .   
నరసమ్మ మధ్యాహ్నం భోజనం డబ్బా తెచ్చి కొడుక్కిచ్చి రోజూలా  వెళ్ళిపోకుండా స్టాఫ్ రూమ్ దగ్గరకి వచ్చింది నాతో మాట్లాడాలని. అందరూ భోజనాలు తిని క్లాస్స్ లకి వెళ్లిపోయాదాకా ఆగి తర్వాత "టీచరమ్మా ! నా కొడుకుని దొడ్లు కడిగే పని చేయమన్నారంటపిల్లాడ్ని చదువుకోడానికి పంపిచ్చాము కానీ దొడ్లు కడగడానికి పంపిచ్చామా ఏమిటీ ?" అంది తీవ్రంగా.
"ఎవరి కంచం వాళ్ళు కడుక్కున్నట్టు ఎవరి బట్టలు వాళ్ళు ఉతుక్కున్నట్టు ఎవరి మరుగుదొడ్లు వాళ్ళు కడుక్కోవడంలో తప్పేం ఉంది? మా టీచర్లు మాత్రం ఎవరి వంతు వాళ్ళు వచ్చినప్పుడు కడగడం లేదూ" అని  సరిత టీచర్ క్లాస్ కి వెళ్ళిపోయింది .
అందంతా చూస్తున్న కాంతమ్మ  నోటిమీద వేలుంచుకుని ఆశ్చర్యంగా చూసి చూసి  "అదేంటే  నరసమ్మా అంత  మిడిసిపాటు ఎందుకే  నీకు? మీ ఆయన  సిటీలోకి వెళ్లి  దొడ్లు కడిగే పనేగా చేసేది" అంది
"నువ్వూరుకో కాంతమ్మా! మీ ఆయన కల్లు గీత గీస్తే  నీ కొడుకు కల్లు అమ్ముకుంటున్నాడా ? మెకానిక్ పని చేయట్లా ? ఆ కుండలు చేసే ఆయన కొడుకు కుండలు చేస్తున్నాడా నా కొడుకుని ఎందుకమ్మా దొడ్లు కడగాలని చెపుతారు నా కొడుకు ఆ పని  చేయడు గాక చేయడు కావాలంటే నూట యాభై కాకపోతే రెండొందలు ఇస్తాను ఎవరితోనైనా కడిగిచ్చుకోండి అంటూ కొంగు ముడి విప్పి డబ్బు తీసి టేబుల్ పై పెట్టి కుల వృత్తి  అంట,   కులం  అంటా ? దాని పీక మీద  కాలేసి  నొక్కి పడెయ్యాలి , నా  కొడుకు  బాగా చదువుకుని కలక్టర్ అవ్వాలి,ఏ నా కొడుకన్నా అప్పుడూ కులం గురించి  వృత్తిని గురించి మాట్టాడాలి చెపుతా ఆళ్ల పని, గంగానమ్మకి దున్నపోతుని బలి ఇచ్చినట్టు నరుకుతా ఒక్కొక్కళ్ళనిఅనేసి   విసురుగా వెళ్ళిపోయింది
స్టాఫ్ రూమ్ అంతా నిర్ఘాంతపోయింది. ఎవరికీ నోరు పెగల్లేదుతేరుకున్నాక  కాంతమ్మని "కృష్ణ వాళ్ళ నాన్న పేరేమిటి" అడిగాను    "అప్పారావు అండీ,   కృష్ణ కి  ఓ అన్న ఉండేవాడు. వన్ టౌన్ లో మురుగుకాల్వలోకి పనిచేయడానికి దిగి చచ్చిపోయాడు.అప్పటి నుండి నరసమ్మ  అలా తయారయింది" అయ్యో పాపం ! అంటూ అందరిలో కాసేపక్కడ  విచారం కమ్ముకుంది 
 నాకొకటి అర్ధమైంది పిల్లల చేత  గ్రౌండ్ శుభ్రం చేయించినంత సులభం కాదు మరుగుదొడ్లు శుభ్రం చేయించడం అంటే అనిటేబుల్ పై నరసమ్మ పెట్టెల్లిన డబ్బునే చూస్తూ ఆలోచించసాగాను. అయినా ఈ  నరసమ్మకి అర్ధం కావడంలేదా? కృష్ణ ఒక్కడి చేత దొడ్లు శుభ్రం చేయించడంలేదు రోజుకి కొంత మంది పిల్లలు ఆ పని పంచుకుంటున్నారని. ఒకవేళ  విషయం  అర్ధమైనా అర్ధంకానట్టు ఉంటుందేమో! కిటికీలో నుండి తెల్లటి  కిరణం చీల్చుకునివచ్చి కళ్ళలో పడి గుచ్చుకుంటుంది. కళ్ళు నలుపుకున్నట్టు  మనసుని  ఆలోచనని  నలుపుకుంటే కొంచెం కొంచెంగా  నరసమ్మ  అర్ధమవుతుంది. తరతరాలుగా వాళ్ళని అంటిపెట్టుకున్న  వృత్తి పట్ల విముఖత,అసహ్యం, ఒక కొడుకుని పోగొట్టుకోవడం, సమాజం చూసే చిన్న చూపు  అన్నీ కలిసి ఆమె మనసులో బలమైన ముద్ర వేసాయని పించింది .ఆమె అన్నట్టు ఎవరి కులవృత్తులు వాళ్ళు చేస్తున్నారా ? ఆ కాలం ఎప్పుడో పోయింది. తన తండ్రి వ్యవసాయం చేసేవారు తను ఉపాధ్యాయ వృత్తి, కొడుకు సాఫ్ట్వేర్. అయినా ఈ మధ్య సరదాగా కుండలు చేయడం నేర్చుకుంటానని పట్టుబట్టి ఆ కోర్స్ లో చేరి ఇప్పుడు సారె పెట్టి కుండలు చేయడంలేదు. హెయిర్ సెలూన్ నడుపుకునే  ప్రకాష్ వాళ్ళ అన్నయ్య మెడలో జంధ్యమేసుకుని  హైదరాబాద్ లో అమ్మవారి  గుడిలో పూజారిగా చెలామణి అయిపోవడంలేదూ లాంటి విషయాల గురించి ఆలోచిస్తూ ఒక పిరియడ్ గడిపేసా.
క్లాస్ నుండి వచ్చిన సరితకి విషయం చెప్పి నా ఆలోచనలు పంచుకున్నా.  "చేసే పనిని బట్టి మనిషికి గౌరవం ఇవ్వడం కాదు, ప్రతి ఒక్కరికి పనిపట్ల గౌరవం ఉండాలి. దురదృష్టం ఏమిటంటే పనిని రోతగా చూస్తూ ఆ పని చేస్తున్న మనిషిని అవమానపరుస్తుండటం ఎందుకో ?ఇది మారాలి "అన్నాను
 సరిత ముఖం  ఎర్రబడుతుండగా,ఆలోచనల్లో  ఆవేశం  కదం త్రొక్కుతుండగా   "సమాజంలో కులవృక్షం ఊడలు దిగి ఉంది  ఆ వృక్షాన్ని వృత్తుల పేరిట ఇంకా పెంచి పోషించకూడదు. తరాలనుండి  జిడ్డులా అంటుకున్న వృత్తులని  విసర్జించి  ఎవరికిష్టమైన పని  వాళ్ళు చేసుకోవాలి, ఎవరి అవసరాలకి తగ్గట్టు వాళ్ళే పని  చేసుకునేటట్లు తర్ఫీదు పొందాలి. కుల వృక్షాలని నేలకూల్చాలంటే  ఇదే మార్గం. ఉపాధి  కోసమే  పని కాకుండా   అభిరుచి ప్రకారం పని, తృప్తి కోసం పని చేయడం జరగాలి కానీ ఎవరిని ఈ పని నువ్వే చేయాలని బలవంత పెట్టకూడదు. ఆఖరికి కృష్ణని కూడా వంతులు వారీగా మరుగు దొడ్లు శుభ్రం చేసుకునే క్రమంలో కూడా బలవంతపెట్టకూడదు మేడమ్" అంది.
నా మనసుకి పట్టిన మురికి వదిలినట్లయింది. కొద్దిసేపు సరితని విస్మయంగా చూసినా మరుక్షణమే   హృదయానికి హత్తుకుని  మనఃస్ఫూర్తిగా అభినందించాను. తర్వాత పిరియడ్ లో ఎవరి క్లాస్స్   పిల్లలకి   వాళ్ళు పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొనేటట్లు  చేయాలని   ఆ విధంగా సందేశాలని ఇవ్వాలని నిర్ణయించుకున్నాం.

లాంగ్ బెల్  మ్రోగగానే "పదండి ముందుకు, సెలబ్రిటీ లు పట్టుకున్నట్టు కాకుండా చిత్తశుద్ధితో చీపురు, చేట, బకెట్ పెట్టుకుందాం మనం కూడా ! " అని లేచి నిలబడ్డాను. స్టాఫ్ రూమ్ నుండి కొంత మంది ఉత్సాహంతోనూ,కొంతమంది అయిష్టంగానూ గ్రౌండ్ వైపుమరుగుదొడ్లు వైపు కదిలారు.   అప్పటికే  పుస్తకాల సంచీ భుజాన తగిలించుకుని గేటు దాటుతూ కనిపించాడు  కృష్ణ .  

*సమాప్తం*
( ఈ కథ సాహితీ ప్రస్థానం సెప్టెంబర్ 2017 సంచికలో "మారాలి లోకం " పేరుతో ప్రచురణ )  ఈ లింక్ లో చూడండి .

ఈ కథ "మల్లె సాల " కులవృత్తుల కథసంకలనంలోనూ ... మరియు  ఆస్ట్రేలియా నుండి వెలువడే "వీధి అరుగు " మాస పత్రిక జనవరి 2023 సంచికలో ఆణిముత్యాలు శీర్షికన  ప్రచురితం

కామెంట్‌లు లేవు: