20, సెప్టెంబర్ 2017, బుధవారం

కంటి పచ్చ మనసు పచ్చ

ఓ ప్రభాత సమయాన .. 

చుక్కల తోటలో విహరిస్తున్న నన్ను పరిమళపు వాన తడిపేసింది 

అప్పుడు తెలిసింది అమవాస్య నిశిలో ఓ జాజి పొద ప్రక్కనే నిదరనుండి మేల్కొన్నానని.

అప్పటికే ఆకులే దోసిలై రాలుతున్న పారిజాతాలని పట్టి దేవదేవునికి హారతిస్తున్నాయి 

మసక వెలుగులో ఆకశంలో ఎగురుతున్న తూనీగలు నీటి అద్దంలో తమ ముఖాన్ని చూసుకుంటున్నాయి


రెమ్మలన్నీరాల్చిన కాడలు మునపటి సౌందర్యాన్ని నేల మీద వెతుక్కోమంటున్నాయి

అక్కడ పక్షులతో పాటు తుమ్మెదలు సీతాకోకచిలకలు పాటలు పాడుతుంటే

సిగ్గిల్లి తనూ గొంతు శృతి చేసుకోబోయి విఫలమవుతుంటుంది


రంగులన్నీ వెళ్లి కొమ్మలకి అతుక్కుని రుతువులు మారిన విషయాన్ని గుర్తుచేస్తుంటే

చెంపలెమ్మట వెలిసిపోయిన జుత్తుకి నల్ల రంగుని విసర్జించాలనే సృహ పెరిగింది

పలవరింతో పులకరింతో .. నీళ్లాడే తీర్ధం ఎదురైనట్టు ఓ పచ్చని చేను కంటిముందు ప్రత్యక్షమైతే చెట్లు లేక వెలిసిపోయిన మరు భూమి లాంటి ఎడద పై లేత పచ్చని తివాచీ పరిచినట్టు ఉంటుంది


అమ్మ ఒడినుండి జారుకుని మెల్లి మెల్లిగా దొంగలా బయటకొచ్చి తొట్లో నీళ్ళని తప తప కొడుతూ ఆడుకునే పిల్లాడిలా అయిపోతుంది మనసు. 


పేరుకు పోయిన గుట్టల గుట్టల అసహనం ఆహ్లాదపు గాలికి చెదిరిపోతుంది నిలువెత్తు పెరుగుతున్న విసుగు గోడలన్నీతృటిలో కూలిపోతాయి.


యంత్రాల్లాంటి మనుషుల యాంత్రిక భాషకి అలవాటైపోయిన మనిషికి పైరగాలి ఊసులని పెడచెవిన పెట్టిన పట్నవాసికి నగర జీవనం దీపాల వెలుగులో మిడిసిపడే మురికి కూపం అని తెలిసొస్తుంది కాస్త ఆలస్యంగానైనా! .








కామెంట్‌లు లేవు: