8, ఫిబ్రవరి 2022, మంగళవారం

ఎల్లలెరుగని మాతృ హృదయం

 బహుళ త్రైమాసిక పత్రికలో “నిగమ” పేరుతో నేను వ్రాస్తున్న శీర్షిక “రసోత్కృష్టమ్”

ఫిబ్రవరి సంచికలో ఈ కథ….

ఎల్లలెరుగని మాతృ హృదయం

లిలిక నకోస్  

గ్రీకు నవలాకారిణి కథా రచయిత జర్నలిస్ట్

(1903- 1989)

 ఈ కథ కేరళ రాష్ట్రంలో  పాఠశాల విద్యార్దులకు తొమ్మిదో తరగతి ఆంగ్ల పాఠ్యాంశంగా వుంది. రచయిత 16 వ సంవత్సరాల వయస్సపుడు  మూడు నాలుగేళ్ళపాటు గ్రీక్ టర్కీ యుద్ద వార్తల మధ్య భయం భయంగానే పెరిగారు. తర్వాత కాలంలో కూడా టర్కీ ప్రభుత్వం ఆర్మేనియన్ లపై మారణకాండ జరిపింది. ఆ ఊచకోత పదివేలకు పైగా మంది ఉరితీయబడ్డారు. అనేక స్త్రీలపై అత్యాచారాలు జరిగాయి. ఆ దారుణకాండ జరిగినకాలంలో ఆర్మేనియన్ ప్రజలు స్వస్థలాలు విడిచి చెట్టుకొకరు పుట్టకొకరు తరలిపోయి ఇతరప్రాంతాలలో కాందిశీకుల క్యాంప్ లలో తలదాచుకున్నారు. ఆ విషయాలను స్పురింపజేస్తూ యుద్ద వాతావరణ నేపధ్యంలో జరిగిన కథగా  ఈ కథను చిత్రించారు.  కథ చదువుతున్న పాఠకుడికి ఇది వాస్తవ చిత్రీకరణేమో అని అనిపించకమానదు. 

దేశాల మధ్య అంతర్యుద్దాల మూలంగా ప్రజలు ఎన్నో ఇక్కట్ల పాలవుతారు. గూడు విడిచిన గువ్వలై   ప్రాణాలు అరచేతపెట్టుకుని తమది కాని ప్రాంతానికి ఎక్కడికో పరుగులు తీస్తారు.లేదావిసిరివేయబడతారు.

తలదాచుకోవడానికి ఇంత నీడ కరువై ఆకలిదప్పులతో అలమటిస్తారు.  అగమ్యగోచరమైన బతుకీతలో తుఫాను గాలికి అలల్లాడిపోతున్న నావలా కొట్టుమిట్టాడుతుంటారు. 

ఆర్మేనియన్ క్యాంప్ లో తలదాచుకుంటున్న  పద్నాలుగేళ్ళ బాలుడు “మికిలీ “ తల్లి చనిపోతూ అతనికి అప్పజెప్పిన చిన్నారి తమ్ముడిని కాపాడుకోవడానికి ఎంత యాతన అనుభవించాడో! బక్కచిక్కి ఎముకులపోగులా మారి వికారంగా మారిన ఆ పసివాడికి ఇన్ని పాలు కుడిపేవాళ్ళు కరువై పైగా అసహ్యానికి గురై.. దూరంగా నెట్టబడుతున్నప్పుడు ఆపద్బాందవుడులా ఎదురైన ఒక చైనా యువకుడు అతని భార్య మానవత్వ పరిమళాలను పూయించిన వైనమే ఈ కథ. మనుషుల్లో  సహజంగా వుండే దయ కరుణ సానుభూతిని ప్రదర్శించి తోటి మనిషికి మనిషి పట్ల జీవితంపట్ల  కాస్తంత నమ్మకాన్ని మిగిల్చిన అపురూపమైన కథ ఇది. కథను చదివి ఎవరికివారు అనుభూతిని పొంది తీరవలసిందే తప్ప భావాన్ని చెప్పడానికి భాష కోసం తడుముకోవాల్సిన కథ. 

మానవుడు ఎక్కడైనా మానవుడే! దేశాలు ప్రాంతాలు సంస్కృతి వేరు కావచ్చునేమో కానీ జీవితాలు స్పందనలూ భావనలూ భావోద్వేగాలు అందరిలోనూ ఒకటిగానే వుంటాయని ఆ మాతృమూర్తి నిరూపించింది. మనిషి అంతరంగం కరుణాసముద్రం. ఆ కరుణ అందరిలోనూ వుంటుందని చెప్పలేం. దయ గల హృదయమే దేవాలయం మందిరం మసీదు గురుద్వారా.. అన్నీనూ.  ఈ కథ తోటి మానవుల పట్ల కాస్త దయను సానుభూతిని ప్రదర్శించి మనిషితనం చాటుకోమని ఉద్బోదిస్తుంది. ఎల్లలు లేని మాతృ హృదయానికి శిశువు రూపంతో కానీ జాతి మతాలతో కానీ పనిలేదని మాతృ హృదయం మాతృ హృదయమేనని చాటి చెబుతుంది. సాహిత్యం ఇరుకు మనసులను  విశాలత్వం చేస్తుంది.  సంకుచిత స్వభావం కలవారిని మార్చడానికి ఇతోధికంగా తోడ్పడుతుంది. మన చుట్టూ వున్న ప్రపంచాన్ని బాగా అర్దం చేసుకోవడానికి ఉపకరిస్తుంది.  ముప్పేటలా కలగలిపిన భావాల వల్ల ఉక్కిరిబిక్కిరి అవుతున్న సగటు మనిషికి సరైన త్రోవ చూపించి మనీషిగా మిగల్చడానికి చేయూతనిచ్చి నడిపిస్తుంది. అందుకే మంచి మంచి కథలను మనం చదువుకోవాలి. ఆ కథలను ఇతరులతో పంచుకోవాలి. అందుకోసమే ఈ కథా పరిచయం.       

 -నిగమ

మాతృత్వం

(MATERNITY)

-- లిలికా నకోస్ (గ్రీక్ రచయిత)

“మార్సెయిల్‌”' పట్టణపు శివార్లలో నెలరోజుల పైబడి “ఆర్కేనియన్‌”కాందిశీకులు విడిది చేసి ఉండడంతో అది ఒక చిన్నపాటి గ్రామసీమగా రూపుదిద్దుకుంది. ఎవరెక్కడ చోటు దొరికితే అక్కడ స్థిరపడిపోయారు. డబ్బున్న కాందిశీకులు గుడారాలు వేసుకున్నారు. మిగిలిన వారిలో కొందరు ఊడిపోతోన్న రేకుల షెడ్ల క్రింద కాలక్షేపం చేస్తున్నారు.

అయితే అధిక సంఖ్యాకులు మాత్రం ఉండడానికి దిక్కుతోచక గోనె బరకాలని వెదురు కర్రల మీది ఛాందినీలా నిలబెట్టి దానికింద కాలం వెళ్ళమారుస్తున్నారు. ఏదేనా ఒకటి రెండు రేకులు దొరికి గోడల్లా ఏర్పాటు చేసుకోగలిగిన వాళ్ళు మహా అదృష్టవంతులేనన్నమాట.

 ఎంతదృష్టవంతులంటే స్వంతంగా పోష్ ‌లోకాలిటీలో ఒక స్వంతభవనాన్ని నిర్మించుకున్నంతటి ఆదృష్టవంతుల కింద లెక్క. ఎవరికి ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ వచ్చిందాంతో కలో గంజో తాగి కాలక్షేపం చేస్తున్నారు.పిల్లలు కూడా మరీ మలమల మాడిపోకుండా ఓ డొక్క ఎండినా ఏదో కొంత తినగలుగుతున్నారు.

అయితే అణగారిన వాళ్ళలో కూడా అతి దరిద్రులూ దౌర్భాగ్యులో వున్నట్లే ఈ కాందిశీకుల్లో కూడా ఉన్న ఓ నికృష్టజీవి “మికలీ”. “మికలీ” పనైతే చేయలేడు కాని ఆతనికి కూడా అందరిలాగా ఆకలి వుంటుందిగా! వాళ్లూ వీళ్ళూ కనికరించి విసిరేసిన రొట్టె ముక్కలు తిని కడుపు నింపుకుని కాలక్షేపం చేసేవాడు, అయితే అతని శరీర తత్వాన్నిబిట్టి ఎంత ఎంగిలి రొట్టెముక్కలు తిన్నా శరీరం తెగబలిసిపోయింది. ఇంతకీ “మికలీ" కి పద్నాలుగు సంవత్సరాలు. ఆతను పని చెయ్యాలంటే వచ్చిపడ్డ మరో ముఖ్యమైన అవరోధం ఏమంటే వాళ్ళమ్మ కళ్ళు మూస్తూ, మూస్తూ వదిలిపెట్టి వెళ్లిన పసికందు భారం ఒకటి అతని మెడకు చుట్టుకుని ఉంది. అయితే ఈ పసికందుకు విపరీతమైన ఆకలి ఎడతెరిపి లేకుండా గాడిద ఓండ్ర పెట్టినట్టు ఏడుస్తూండడంవల్ల అతనిని ఆ చుట్టుపక్కల్నించి తరిమేశారు.నిద్రాభంగమైతే ఎంత సహృదయాులైతే మాత్రం భరించగలరా?

ఆసలు ఈ పసికందు హోరెత్తించే ఆకలి గోలకి మికలీ కి పేగులు తోడేసినట్టుండేది, ఆయితే అతని తల్లి అతని భుజస్కంధాలపై ఉంచిన బాధ్యత భారాన్ని వదలించుకోవడం ఆంత సులభంగాదు కదా! ఏడుపు విని వినీ అతని బుర్ర పూర్తిగా దిమ్మెక్కిపోయి పిచ్చెక్కినవాడిలా తిరగడం మొదలెట్టాడు. తానెక్కడెక్కడ తిరుగుతున్నా చెవులు హోరెత్తించే కర్ణకఠోరమైన ఈ పిల్లాడి ఏడుపు కూడా వుంటూండడంతో అందరూ  మికలీని అసహ్యించుకోసాగారు. ఏడ్చి ఏడ్చి ఆ పసికందు ఎప్పుడో ఒకప్పుడు హరీమనాలని మనస్ఫూర్తిగా వాంఛించసాగారు.

ఆయితే అటువంటిదేమీ జరగకపోగా ఈ “న్యూసెన్స్‌” విపరీతం కాసాగింది. ఈ కొత్తగా పుట్టిన శిశువు కరువు కాటకాలకు, ఆకలికి వాడు విపరీతంగా ఏడ్చి ఏడ్చి బతకాలని నిశ్చయించుకున్నట్లు తోస్తోంది. కరువును మించినట్టుగా భూనభాలు అదిరిపోయేలా రోదిస్తున్నాడు. ఇవన్నీ వినలేని మాతృమూర్తులు చెవుల్లో  దూది కుక్కుకుని మరీ తిరుగుతున్నారు. మికలీకి ఇంచుమించు పిచ్చెక్కినంత పనిగావుంది. తాగినవాడి స్థితిలో తిరగసాగాడు. పాలు కొని పడదామంటే అతని దగ్గర చిల్లిగవ్వయినా లేదు.

ఏ మాతృమూర్తి అయినా దయదల్చి తన స్థన్యాన్ని అందిస్తుందేమోనంటే ఏ తల్లికీ ఆ వాత్సల్యమూ లేదు, ఉన్నా ఆ మాతం క్షీరసంపదా ఉన్నట్టు తోచదు.ఇది చాలదా మనిషిని పిచ్చెత్తించడానికి ?

ఇది పని కాదని మికలీ ఆవలి వైపున ఉన్న క్యాంపుకి వెళ్ళేడు

ఆక్కడ ఆంటోలియన్‌ కాందిశీకులు ఉన్నారు. వాళ్ళూ ఆర్మేనియన్‌ కాందిశీకులాగే ఆసియా మైనర్‌లో తురుష్కుల మూకుమ్మడి హత్యాకాండకి ఝడిసి ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని పారిపోయి వచ్చినవాళ్లే.

వాకబు చేయగా చేయగా మికలీకి ఆ క్యాంప్‌లో దయామయులైన తల్లులున్నారని వారిలో దయ ఎంత నిండుగా వుందో స్తన్యం కూడా ఆంత ఉదారంగానూ వున్నదని, వారు అనాధలైన శిశువుల ఆకలిని తమ స్తన్యంతో తీరుస్తారని తెలిసింది- ఈ చిన్నారి పాపడిని కూడా ఆ తల్లులు అనుగహిస్తే తాత్కాలికంగానైనా ఈ ఆకలి రోదన శమించవచ్చని ఆశపడ్డాడు మికలీ. మనిషిని జీవింపజేసేది ఆశే కదా!

అయిశే ఆ క్యాంపూ ఆర్మేనియన్‌ క్యాంపంత హృదయవిదారకంగానే వుంది.ముసలివాళ్ళు కటిక నేలమీద పరున్నారు. వాళ్ళ కాళ్ళకి ఏ ఆచ్చాదనా లేదు. చిన్నపిల్లలు మురికి నీటి చెలమల్లో ఆడుకుంటున్నారు. ఇతన్ని చూస్తూనే వృద్దురాళ్ళు లేచి కూర్చుని సానుభూతిగా -

“ఏంకావాలి బాబూ? అని అడగసాగారు.తను వచ్చిన పనిని ముసలమ్మలకి చెపితే మాత్రం వాళ్ళేమైనా ఆర్బగలరా తీర్చగలరా? అందుకే తిన్నగా మేరీమాత గుర్తు జండా ఎగురుతున్న ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేడు. ఆ టెంటు లోపలనుంచి చిన్నారి శిశువుల రోదనలు శ్రావ్యంగా వినిపిస్తున్నాయి. బహుశః  ఈ టెంటులో దయార్ద్ర హృదయులైన మాతృమూర్తుల ఉండి వుండవచ్చు, అందుకే ధైర్యం చిక్కబుచ్చుకుని..

“పవిత్రమైన మేరీమాత స్వరూపాన్ని ధరించిన ఈ టెంట్‌లోని దయామూర్తులెవరో ఈ ఆకలితో అలమటిస్తోన్న ఈ దిక్కూమొక్కూ లేని మాతృహీనుడికి పాలను ఇచ్చి ఆకలి బాపండి తల్లీ! నేను ఆర్మేనియన్ కాందిశీకుల క్యాంప్‌ నుంచి వస్తున్నాను అని హృదయ విదారకంగా కేకవేసాడు మికలీ,

ఈ అభ్యర్థనకు జవాబుగా ఒక అందమైన, నల్లటి పడతి వచ్చింది. ఆప్పటికే ఆమె చేతులలో అరమూతగా కన్నులు మూసుకుని పాలుగోలుతోన్న శిశువు వున్నది

మికలీ హృదయం ఆనందపరవశంలో నాట్యమే చేసింది. దాహార్తితో విలవిలలాడే ఎడారి పయాణీకుడికి ఒయాసిస్సు కనిపిస్తే కలిగేలాటి ఆనందం అది. ఈ ఆనందంతో అతని శరీరం గజగజావణికి పోసాగింది, చుట్టుపక్కల వారు కూడా కొందరు ఆతృతగా ముందుకి వచ్చి మికలీ భుజంమీద దుప్పటిలో చుట్టబెట్టుకువున్న ఆ ఏడ్చే శిశుశువును (మికలీ చిన్నారి తమ్ముడుని) బయటకి తీసి చూడబోయారు.

"ఏదీ ఈ ఆకలిగావున్న శిశువును చూపించు, ఇంతకీ ఇది అబ్బాయా? ఆమ్మాయా!'” దయ ఉట్టిపడే మధురన్వరంతో అడిగింది ఆ పడతి.

హృదయ విదారకంగా కేకలు వేయడం ఇప్పుడు వారి వంతు అయింది. ఆది శిశువా? శిశువు అనేకంటే నరరూపంలో వున్న ఒక దెయ్యపు పిల్ల అంటే సరిపోతుంది. ఎముకల పోగులాటి  బక్క పల్చటి శరీరం మీద దెయ్యం తలకాయ లాంటి పెద్ద తల. ఇప్పటిదాకా చప్పరించడానికి ఏమీ దొరకక  దాని బొటనవేలిని అది చప్పరించిందేమో ఆ వ్రేలు రుబ్బుడు పొత్రమంత సైజుకి ఉబ్బిపోయి వుంది. తన చిన్నారి తమ్ముడు ఇంత ఏహ్యంగా, జుగుప్సాకరంగా తయారయి వుంటాడని ఊహించని మికలీకే ఒక్కసారి షాక్‌ తిన్నట్టయింది.

“ఓయి దేవుడా! ఇది మనిషి పిల్లకాదు.ఇది మనుషుల రక్తాన్ని పీల్చే ఒక రకమైన గబ్బిలం, నిజంగా

 నా వక్షం నిండా పాలున్నా ఇలాటి తురుష్కుజాతి గబ్బిలానికి పాలిచ్చి దైవాపచారం చెయ్యలేను...”

“అవును... ఇది దైవాపచారమే....ముమ్మాటికీ దైవాపచామరే” శృతి కలిపారు మిగిలిన వాళ్ళు.

“ఏమిటేమిటి?.... ఏదీ చూడనియ్‌.... గబ్బిలంకాదర్రా....ఇది

సైతాను భూతపు మరో రూపమే.... ఒరే అబ్బాయి,వెంటనే ఈ క్యాంపు

లోంచి మొహం కనబడకుండా పోతావా చితకొట్టమంటావా? నువ్వు అడుగెట్టినచోట పంచమహాపాతకాలు చుట్టుముడతాయి" అంటూ మికలీని దూరంగా తరిమేశారు. ఏం చేయగలడు? నిస్సహాయుడు నిరాధారుడు. కనీసం సానుభూతి చూపేవాళ్ళైనాలేరు. గుడ్లనిండా నీళ్ళు కుక్కుకుని..

“ఆదరించువారే లేరా ఈ వనిలోన? మమ్మాదరించు దాతలు లేరా ఈ ధరలోన” అని వాపోతూ తిరగసాగాడు. అతని ఆకలిదప్పుల మాట దేవుడెరుగును? ఈ శిశువును ఆకలి రక్కసి కోరలు నుండి కాపాడడం అతనికి తక్షణ సమస్య అయి కూర్చుంది.అయితే తను ఏం చేయగలడట! ఈ శిశువు ఏడ్చి ఏడ్చి ఎంత త్వరగా మరణిస్తే ఎంత బాగుండును అనిపిస్తుంది. నాగరికులమైన మనకైతే పాపం అతడు అజ్ఞాని అందుకే అతడు మనంత నాగరికంగా ఆలోచించ లేకపోయాడు అనుకుందుము. అతడు ఏకాకి.అన్నీ పోగొట్టుకున్నవాడు. ఇంతసేపు అతను మోస్తున్నది ఆకలితో అలమటిసోన్న ఒక చిన్నారి శిశువును కాదని.... నర రూపంలో ఉన్న ఓ దెయ్యపు పిల్లనని అనిపించేసరికి వెన్నులోంచి వణుకు పుడుతోంది. అయినా అతనిలో లవలేశంగానైనా మిగిలివున్న బాధ్యత, మానవత్వం ఆ శిశువుని అలా మోయిస్తూనే వున్నాయి. అయ్యో పాపం పసివాడు.మికలీ ఒక షెడ్డు నీడలో చేరాడు, బయట వేడిగా వుంది. షెడ్డు లోనూ వెచ్చదనం పరుచుకుని వుంది. అతనికి తన కడుపులో ఎలకలు పరిగెడుతున్న సంగతి గుర్తువచ్చింది. వీధులలో సగం సగం తిని పడేసిన పదార్దాలనో, అవ్వీ దొరకకపోతే పెంట కుప్ప మీద పడి వున్న పదార్థాలను కుక్కలతో పోటీ పడోతినాలి. తప్పదు. అప్పుడు మొదటిసారిగా అతనికి జీవితం అతి భయంకరమైన దానిగా తోచ సాగింది. తోస్తేమాత్రం ఏం చెయ్యగలడు!

చేతుల్ని ముఖానికి అడ్డుపెట్టుకుని వెక్కి వెక్కి ఏడవనారంభించాడు. ఎవరు వింటారు. ఈ దీనుడి ఏడుపు? ఎవడికి కావాలట. ఎవరు ఎలా పోతే మాత్రం?? తొందరపడి ఆలా అనెయ్యకండి. సర్వసాక్షికి ఇవేమీ తెలియవనే అంటారా?....ఏమో !

మికలీ తలెత్తి చూసేసరికి అతని ముందు ఒక చైనా యవకుడు నిలబడివున్నాడు,  మికలీ ఆతన్ని ఆ క్యాంపులో చాలాసార్లు చూసాడు కాని అంతగా గమనించలేదు అయితే ఆ చైనీయడు మికలీని ఆతని అవస్థనూ నిత్యం చూస్తూనేవున్నాడు, అతగాడు ఈ క్యాంపులో పేపరుతో చేసిన రక రకాల ఆటవస్తువులూ ఏవేవో గమ్మత్తు వస్తువులు అమ్మి వ్యాపారం చేద్దామని వస్తూండేవాడు. ఆయితే అతని దగ్గర ఎవ్వరూ ఏమీ కొనేవారుకాదు.ఈ చైనా వాడు చింతాకుల్లాటి కళ్ళతో, తప్పడముక్కుతో, పచ్చగా, కుదమట్టంగా వుండడంతో క్యాంపులోని పిల్లలు ఆటపట్టిస్తూ ఉండేవారు.పైగా

“వీలింగ్‌, స్టింకింగ్‌ చింక్‌* అని పిలుస్తూ హేళన చేసేవారు.

మికలీ కేసి ఆ చైనా యువకుడు చాలా దయగా చూశాడు.అంత చిన్నకళ్ళల్లోనూ విశ్వమంత విశాలమైన దయ ఉబికి ఉబికీ తన్నుకు వస్తూ కనబడుతోంది.

“అలా ఏడవకూడదమ్మా అబ్బాయ్‌...” అన్నాడు ఎంతో సిగ్గుతో ముడుచుకుపోయినవాడిలా  వున్న మికిలీతో. “రా అమ్మ రా! నాకూడా రా.” అన్నాడు.

నేను రాను. అన్నట్టు తల అడ్డంగా వూపడం ఈ మాటు మికలీ వంతయింది....మికిలీ అక్కణ్తించి వేగంగా పారిపోదామని కూడా భావించాడు. ఈ ప్రాచ్యదేశస్టుల క్రూరత్వాన్ని గురించి మికలీ వాళ్ళ దేశంలో వున్నప్పుడు ఎన్నో రకాల కథలు విన్నాడు. వాళ్ళ దేశంలోనేకాదు ఈ క్యాంపులోకూడా తరచు వినబడేదేమంటే....ఈ చైనావారూ జపాన్‌ వారూ క్రైస్తవ పిల్లల్నిఎత్తుకుపోయి....యూదుల్లా వారి రకాన్ని పిండుకుని కడుపునిండా తాగుతారట.

అయితే ఆ చైనీయుడు ఒక అంగుళమయినా కదలకుండా అలాగే నిలబడివున్నాడు. నిండా మునిగిపోయేవాడిలో గడ్డిపోచయినా ఆశని కల్పించినట్టు చావుకి ఇన్ని చావులుండవుకదా అని అతని కూడా బయలుదేరి వెళ్ళాడు. పొలంగట్టు మీంచి నడిచి వెళ్ళటంతో చేతుల్లో పిల్లాడితో సహా తూలిపడిపోయాడు మికలీ.

అయితే చైనా యువకుడు మికలీ చేతిలోని శిశువును తానే అందుకుని తన గుండెలకు సుతారంగా హత్తుకుని ముందుకు నడవసాగాడు.

వాళ్ళు  అనేకమైన కాళీ ఇళ్ళని దాటుకుంటూ వెళ్ళారు. చివరికి ఒక తోట మధ్యలో వున్న కర్రలతో కట్టిన ఒక ఇంటి ముందు ఆగేరు, 

తలుపు మీద సున్నితంగా రెండు మూడు సార్లు తట్టాడు. ఒక చిరుదీపం దాల్చిన ఓ చిన్నపాటి యువతి వచ్చి తలుపు తీసింది. ఈ చైనా యువకుని చూడగానే ఆ అమ్మాయి కొద్దిగా సిగ్గుపడింది,బుగ్గలు ఎరుపెక్కాయి ఆయినా చిరునవ్వుతో వారికి స్వాగతం పలికింది. మికలీకి ఇది కలో నిజమో అర్థం కావడం లేదు. లోపలికి వెళ్లాలంటే భయం, ఆందోళన ఏవేవో ఉద్వేగాలు అందుకే తడబడుతూ నిలబడ్డాడు.

“నందేహంలేదు....లోపలికి రావోయ్‌....ఈమె నా భార్యే…

“కానున్నది కాకమానదు"” అనుకుంటూ లోపలికి ఆడుగేశాడు మికలీ.

అది పెద్దగదే....అయితే దానివి కాగితాలు అంటింపుతో రెండు భాగాలుగా చేసారు...బీదరికం కనపడుతున్నా ఆ ఇంట్లో ఆరోగ్యం ఉట్టిపడుతూ వుంది. సౌజన్యం సరేసరి. 

 “ఇది మా పాప... అంది ఉయ్యాలలో ఆడుకుంటూన్న ముద్దు పాపాయిని చూపిస్తూ. ఆ పాపాయి ఎంతో ముద్దుగా వున్నాడు.ఇంతటి ఆందోళనలోనూ మికలీ పాపాయి దగ్గరిగా వెళ్లి బుగ్గగిల్లి అభినందించకుండా వుండలేకపోయాడు. కడుపునిండా పాలుతాగినట్టున్నాడు. హాయిగా

నిద్రపోతున్నాడు.

భర్త భార్యను సంజ్ఞచేసి పిలిచాడు.చాపమీద కూర్చోమన్నాడు. కూర్చోపెట్టి ఈ దెయ్యపు(లాటి)శిశువును చేతికందించాడు. చూడగానే ఆమెకూడా వెర్రికేక పెట్టింది.అయితే భయంతోనో ఏహ్యభావంతోనో వేసిన కేకకాదు.దయ చిప్పిల్లి  వేసిన సానుభూతి చిహ్నమైన కేక. ఆ శిశువును గుండెలకదుముకుని  పాలు కుడుపసాగింది. ఆమె పాలిండ్లు ఆర్ద్రమై పాలను ఎగచిమ్మేయి. ఆకలిగొన్న శిశువు ఆవురావురని పాలు తాగసాగింది,

7, ఫిబ్రవరి 2022, సోమవారం

తల్లి

రసోత్కృష్టం - నిగమ

కథల ఒడ్డున.. కాసాపు ఆగుదామా! 

 సృష్టిలో ఉత్కృష్టభావాన్ని భాగాలుగా విడగొడితే అందులో మాతృప్రేమకే అగ్రస్థానం లభిస్తుంది. అది పశువైనా శిశువైనా సరే. జంతువులు పశుపక్ష్యాదులు అనేక కీటకజాతులలో మాతృప్రేమ సొంతంగా మనుగడ సాగించేంతవరకే పరిమితంగా వుంటుంది. తర్వాతంతా ఆ సంతతి ప్రకృతిలో తమలాగానే ఇంకొకటిగా అనుకుంటూ మనుగడ సాగిస్తాయి. 

ప్రత్యేకంగా మనిషికి మాత్రమే కొన్ని బంధాలు అనుబంధాలు జీవితాంతం పెనవేసుకుని వుంటాయి.
అందులో ప్రతి మనిషికి అమూల్యమైనది మాతృప్రేమ. మాతృ ప్రేమకు మించిన ప్రేమ ఉంటుందా లోకంలో అని ఆశ్చర్యపడటం వింతేమి కాదు కూడా. 

ఇటీవల కాలంలో  అప్పుడప్పుడూ మాతృత్వ లక్షణం మసకబారుతున్నదా అనే అనుమానాలు పొడజూపినట్లనిపించినా.. అనేకానేక ఉదంతాలు విన్నా చూసినా చదివినా హృదయం చెమరిస్తుంది. అమ్మ ప్రేమకు మన అణువణువు అంజలి ఘటిస్తుంది. 
 
చాలాకాలం క్రిందట ఒక ఉర్దూ కథ చదివాను. ఆ కథ చదివిన పిమ్మట చాలా దుఃఖం కల్గింది. ఆ దుఃఖాన్ని అనుభవించడం ప్రతి మనిషికీ చేతనవును కూడా మరీ హృదయం అంత పాషాణం కాకపోయినట్లైతే!

మనకుతల్లి లేదా అమ్మ అనే భావనే అపురూపం. తల్లిబిడ్డలది నాభీసంబంధం. ఎక్కడో  దూరంగా బిడ్డకు ఇసుమంత కష్టం కల్గినా నొప్పి కల్గినా.. అది అమ్మ మనసుకు తెలిసిపోతుంది. బిడ్డ క్షేమం కోసం తల్లడిల్లుతుంది. వీలైతే ఆ బాధ తాను భరించి బిడ్డకు ఆ బాధనుండి విముక్తి కల్గించాలని తపన పడుతుంది. కానీ దేహమానసిక బాధలు ఎవరివి వారే భరించాల్సిరావటం ప్రకృతిచ్చిన శిక్ష. 

ఈ కథలో తల్లి అత్యంత సాధారణమైన తల్లే. ఆమెలో ఏ ప్రత్యేకతలు లేవు. అయితే మాత్రమేం.. ఆమె నిరంతర ఆలోచనా స్రవంతి కొడుకు చుట్టూనే. అతని బిడ్డల చుట్టూనే. ఏనాడు చిన్న ఆరోపణ కూడా చేయని ఆమె తల్లి ప్రేమ మనల్ని వెక్కివెక్కి ఏడిపిస్తుంది. ఎన్నో ఏళ్ళ తర్వాత తనను చూడవచ్చిన బిడ్డకు రాచమర్యాదలు జరిపించాలని ఘనమైన అతిధి సత్కారాలు చేయాలని అతనికీ అతని బిడ్డలకూ కానుకలనివ్వాలని తపించిపోయింది. ఆ కొడుకుతో పాటు కథ చదువుతున్న మనం కూడా  ఉద్విగ్నతకు గురవుతాం. కొడుకు పశ్చాతాపంతో మొదలైన కథ ముగింపుకొచ్చేసరికి అణువణువును కరిగించి కన్నీటి వర్షంలో తడిపేస్తుంది. ఒక స్త్రీ రచయితగా మరొక స్త్రీ అంతరంగ చిత్రణను అద్భుతంగా ఆవిష్కరించిన కథను అందరూ చదివితీరాలనే ఆకాంక్షతో ఈ కథను పరిచయం చేస్తున్నాను.. 

మీరూ  ఈ కథను చదవండి. మనలో ఆవిరైపోతున్న మానవత్వ విలువలను మేలుకొలుపుతుందీ కథ. మనని కనిపెంచిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదని మనను సున్నితంగా హెచ్చరిస్తుంది.

 రుకైయ్యా రీహానా వ్రాసిన “తల్లి"  కథను నేను చదివిన ఉత్తమకధలలో ఒకటిగా బహుళా త్రైమాసిక వెబ్ సంచికలో పరిచయం చేస్తున్నాను చదవండీ. 
                                                     -నిగమ

రచయిత పరిచయం


రుకైయ్యా రీహానా ఉన్నత విద్యావంతురాలు. స్త్రీ జీవితాన్ని చిత్రించడంలో అసమానమైన ప్రతిభావంతురాలు. ఉర్దూ కధాసాహిత్యంలో విశిష్టస్థానాన్ని సంపాదించుకొన్నది. ఆమె రచనలలో మానవహృదయంలోని ఆంతరంగిక వేదనా, మాతృత్వ, నారీత్వములలోని తీపి, ప్రధానస్థానాన్ని ఆక్రమిస్తవి. “తల్లి" ఆమె ఉత్తమకధలలో ఒకటి.


“తల్లి"

మాష్టరు హమీద్ ఢిల్లీలో బారహటోటేలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు. అతడి అసలు నివాసస్థానం రషీదాబాదులోని వహాడీ మొహల్లా, అతని తండ్రి రషీదాబాదులో కంచరి పనిచేస్తూఉండేవాడు. హమీద్ బాల్యంలో తన పేటలోని మసీదులోనూ, తరువాత కొద్ది రోజులు ముల్లా సాహెబు బడిలోనూ, ఆ తరువాత తండ్రిగారి ఇష్ట ప్రకారం కొంతకాలం తాలూకా స్కూలులోనూ చదువుకొన్నాడు. హమీద్ ఉర్దూ ప్యాసయిన రోజుల్లో రషీదాబాద్ లో ప్లేగువ్యాధి వ్యాపించి హమీద్ తండ్రిని బలిగొన్నది. ఆయన అంత్యకర్మలన్నీ పూర్తి చేసిన తరువాత హమీద్ తల్లి దగ్గర లెఖ్ఖ చూచుకొంటే డెబ్బయి రూపాయలు మిగిలినవి. మిడిల్ ప్యాసయిన తరువాత హమీద్ కు ఇంగ్లీషు గూడా చదువు కొందామని అభిలాష కలిగినది. కాని ఎలాగా చదువుకోవడం?

వీరి పేటలో ఉండే ఒకాయన ఢిల్లీలో పోలీసుగా ఉండడంవల్ల హమీద్ రెండు మూడు సార్లు ఢిల్లీని గురించి విని ఉన్నాడు. అందువల్ల తల్లి దగ్గర పది హేను రూపాయలు తీసుకొని మెల్లగా ఢిల్లీ చేరుకొన్నాడు.

పోలీసు కానిస్టేబుల్ నసరుల్లాఖాన్ ఇల్లు ఎలాగ తెలుసుకోవడం, చచ్చి చెడి అతని ఇల్లు తెలుసుకొన్నాడు. నసరుల్లాఖాన్ హమీద్ తండ్రిని బాగా ఎరుగును. అందువల్ల అతను హమీద్ ను ఆదరించి తన ఇంట్లో ఉండి చదువుకోడానికి అవకాశం కలుగజేశాడు. నసరుల్లాఖాన్ ఇంట్లోనే ఉంటూ హమీద్ మూడు సంవత్సరాల్లో పదో క్లాసుకు వచ్చాడు. లెఖల్లో హమీద్ నిధి. ఒక సహాధ్యాయుడికి పాఠం చెప్పడం ప్రారంభించి నెలకు ఏడు రూపాయలు సంపాదించడం ఆరంభించారు. ఏడు రూపాయలు తన భోజనానికి సరిపోతవి గనుక వేరుగా ఉంటానని తాను ఎంత బ్రతిమి లాడినా నసరుల్లాఖాన్ అంగీకరించనందున, హమీద్ విధిలేక అక్కడే ఉండిపోయినాడు.


‘ఆ విధంగా పది నెలల్లో హమీద్ డెబ్బయి రూపాయలు రొట్టం నంపాదించాడు. తల్లి దగ్గరనుండి తెచ్చినవి పది రూపాయలు మిగిలి ఉన్నవి. ఒకసారి తల్లి రెండు రూపాయలు మనియార్డరు పంపించింది. మొత్తం అతని దగ్గర ఎనభయి రెండు రూపాయలు పోగుపడినవి. స్కూలుకు వేసవికాలపు సెలవులిచ్చారు. నసరుల్లాఖాన్ గూడా సెలవు బెట్టాడు. ఇద్దరూ కలిసి రషీదాబాద్ వచ్చారు.


అప్పటికి హమీద్ తల్లి దగ్గర భర్త అంత్యక్రియలు చేయగా మిగిలిన డబ్బు పన్నెండు రూపాయలు మిగిలి ఉన్నవి. ఇంటిముందున్న పనసచెట్టు అమ్మడంవల్ల ప్రతి సంవత్సరం పాతిక రూపాయిల ఆదాయం వస్తూ ఉండేది. ఇంటికి పోయేటప్పటికి తల్లి హమీద్ కు వివాహసంబంధం మాట్లాడి సిద్ధంచేసి పెట్టింది, ఆ డబ్బు హమీద్ దగ్గర ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టి ఏదోవిధంగా హమీద్ వివాహం పూర్తిచేసింది. పెళ్ళి అయిన ఏడోరోజున తిరిగి హమీద్ ఢిల్లీ వెళ్ళాడు. ఆ సంవత్సరం పరీక్షలో కృతార్థుడు అయినాడు.


ఇక ఉద్యోగం ఒక ప్రైవేటు స్కూల్లో కొద్దిరోజులు నౌకరీ కుదిరింది. తరువాత ఇంకొక స్కూళ్ళో ఆ తరువాత ఇంకొక స్కూళ్ళో -చివరకు ఒక స్కూళ్ళో అతని పని చూసి సంతోషించి ఆ స్కూలు ప్రధానోపాధ్యాయుడు అతడి ఉద్యోగం ఖాయంచేశాడు.నెలకు ఇరవయి రూపాయల జీతం. ఇక వేరే కాపురం పెడతానని హమీద్ నసరుల్లాఖాన్ ను అడిగారు.


ఒంటరిగా కాదు. భార్యనుగూడా తీసుకొనిరమ్మని నసరుల్లాఖాన్ మూడు రూపాయలు అద్దెకు ఒక చిన్న ఇల్లు కుదిరించి పెట్టారు. హమీద్ ఖాన్ రషీదాబాద్ వెళ్ళి భార్యను తీసుకొచ్చి ఆ ఇంట్లో కాపరం పెట్టాడు. రషీదాబాద్ లో తల్లి ఒంటరిగా ఉండిపోయింది.


హమీద్ భార్యను ఢిల్లీ తీసుకొనివచ్చి ఏడు సంవత్సరాలు గడిచింది. అతనికి ముగ్గురు మొగపిల్లలూ, ఒక ఆడపిల్లా పుట్టారు. వారిలో ఒక మొగపిల్లవాడూ, ఆడపిల్లా చనిపోయినారు. హమీద్ భార్యకు గూడా చాలా జబ్బు చేసింది. ఒకసారి హమీద్ కు ఎండదెబ్బ తగిలి పది హేను రోజులు మంచంలోనే ఉండిపోయినాడు. అటుస్కూల్లో పని పెరిగి పోయింది. ఇటు జీతం ముప్ఫయి రూపాయలయింది. పదిరూపాయలు ప్రైవేటు చెప్పి సంపాదించేవాడు. కాని ఢిల్లీ లో ఆ డబ్బు అతనికి ఏమాత్రమూ సరిపోయేది కాదు. తల్లి రషీదాబాద్ రమ్మని ఉత్తరాలమీద ఉత్తరాలు వ్రాసేది. కాని డబ్బులేక తల్లిని చూడవలెనని ఎంత కుతూహల మున్నా హమీద్ రషీదాబాదు పోలేకపోయినాడు.


రోజూ ఉదయమే లేచి మసీదుకు  పోయి నమాజు చేసుకోవడం, ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఖురాన్ లోనుండి ఒక అధ్యాయం పారాయణం చేయడం అతనికి అలవాటు. మసీదు నుంచి ఇంటికి వస్తూ ఉన్నప్పుడు రోజూ ముసలి చాకలిది జానకి నడుము వంగిపోయి కర్రపోటు వేసుకొంటూ చాకిరేవుకు పోతూ కనపడేది, కాని ఎందువల్లనో ఐదు రోజులనుండి జానకి కనపడడం లేదు, హమీద్ కు ఆశ్చర్యం వేసింది. జానకి కనపడని రోజు లేదే: ఎందువల్ల ఐదు రోజులనుండి కనపడడంలేదో తెలుసుకుందామని జానకి ఇంటికి వెళ్లాడు, జానకి ఏమైందని అక్కడివాళ్ళను ప్రశ్నిస్తే విన్నరాత్రి చనిపోయిందని వాళ్ళు జవాబు చెప్పారు.


జానకి చనిపోయిందని వినగానే హమీద్ గుండె గుభీలుమన్నది. జానకికి హమీద్ కు ఏమి సంబంధమున్నదో భగవంతునికి తెలియాలి , స్కూలుకు పోయినాడు. అక్కడ అతనికి ఏమీ తోచలేదు. ఏదోవిధంగా కాలక్షేపం చేసి స్కూలు వదలి పెట్టగానే ఇంటికి చేరాడు. భార్య “శరీరం బాగాలేదా ?" అని అడిగింది. ఏమీ వినిపించుకోలేదు. తెల్లవార్లూ అతనికి నిద్ర పట్టలేదు. మర్నాడు బక్రీదు. స్కూలుకు సెలవు. స్టేషన్ కి పోయి రషీదాబాద్ కు టిక్కెట్టు కొన్నాడు. రైల్లో పడ్డాడు. బక్రీదురోజు పగలల్లా రైల్లోనే గడిచింది. నమాజులేదు. కుర్బానీ లేదు. ముసలితల్లి ధ్యాసే. కళ్ల ముందు ముసలితల్లి కన్పించడమారంభించింది. తెల్లబడిపోయిన వెంట్రుకలు, ముడతలు పడిపోయిన శరీరం, వంగిపోయిన నడుము.

 

భార్య, పిల్లలమీద మక్కువవల్ల హమీద్ ముసలి తల్లిని మర్చిపోలేదు. నాలుగైదుసార్లు ఏడెనిమిది రూపాయలు తల్లికి మనియార్లరు గూడా పంపించాడు. ఆ డబ్బు పంపినప్పుడల్లా తనూ, తన పిల్ల లూ చాలా ఇబ్బంది పడే వాళ్ళు, తన తల్లికి ఉత్తరాలు వ్రాసినప్పుడు పిల్లలచేత గూడా ఆ ఉత్తరాల మీద ఏవో గీతలు గీయించేవాడు. ఆ పిచ్చిగీతలు చూసి తన తల్లి సంతోషించవలెనని అతని అభిప్రాయం. అతని భార్య గూడ వ్రాయడం నేర్చుకొన్నది. అత్తగారికి సలాములు తెలియపరుస్తూ ఉండేది. అటునుండి తల్లి మాటమాటకి రమ్మనీ పక్క ఇంటి దర్జీఆమె చేత ఉత్తరాలు వ్రాయిస్తూ ఉండేది. వచ్చే సంవత్సరం పంట రోజుల్లో తప్పక వస్తానని వ్రాసేవాడు. కుటుంబంతో పోవాలి. చేసేది ఉద్యోగం గనుక యేవోకానుకలు తీసుకొనిపోవాలి. పళ్ళు ఫలాలు తీసికొనిపోవాలి. అందుకు డబ్బుగావాలి. వచ్చే జీతంతో తిండి గడవడమే కష్టంగా ఉండేది. అందువల్ల ఎప్పటికప్పుడు ప్రయాణం ఆపుకొనేవాడు. కాని జానకి మరణవార్త వినిగుండె పగిలినట్లయి ఆగలేక ఒంటిరిగా బయలుదేరాడు.


బక్రీదునాడు సూర్యాస్తమయం సమయానికి హమీద్ రషీదాబాద్ చేరాడు. పైనుండి భోరున వర్షం కురవడం ఆరంభించింది. అతనికి స్మృతి వచ్చినట్లయింది, గొడుగుమాత్రం చేతులో ఉన్నది. అయ్యో! గుడ్డలన్నా తెచ్చుకోలేదనుకున్నాడు. గొడుగు వేసుకొని బయలు దేరాడు. జనం   నివసించే చోట నీళ్ళు నిలవగూడదనే ఆరోగ్య సూత్రం గ్రామస్తులకు అర్ధమే అయ్యేది కాదు, అర్థమైనా వాళ్ళు పట్టించుకొనే వాళ్పుకాదు. మోకాళ్ళతోతు నీళ్ళలో పడుతూ, లేస్తూ మెల్లగా యింటికి చేరుకొన్నాడు. తలుపు లోపల వేసి ఉన్నది. తలుపు తట్టాడు. "అమ్మా ! అమ్మా !" అని పెద్దగా పిలిచాడు.


లోపుల నుండి ఒక లావుపాటివాడు వచ్చి తలుపులు తెరిచాడు. బక్రీదు పిండివంటలన్నీ తిని అరగడానికి నిద్రబోయి అప్పుడే లేచినట్లు కనపడ్డాడు, హమీద్ ను గుర్తు బట్టి మూడు సంవత్సరాల క్రితం ఆ యిల్లును కొన్నట్లున్నూ. హమీద్ తల్లి దర్జీ ఆమె ఇంట్లో వున్నదని చెప్పాడు. తలుపు వేసుకొని లోపలికి వెళ్ళిపోయినాడు.


హమీద్ కు అడుగు ముందుకు పడలేదు. ఇల్లు కూడా అమ్మవలసినంత కష్టంలో తల్లి పడిపోయింది కాబోలు ననుకున్నాడు. వనపచెట్టు ఆదాయంతో కాలక్షేపం చేస్తున్నదనుకొని చాలా పొరపాటు చేశాననుకున్నాడు. ఆ తల్లికి మొఖం చూపించడమెలా , ఎంత స్వార్ధం తనలో బలిసిపోయింది. తన పిల్లల మంచినీ, తన మంచినీ తను చూసుకున్నాడే గాని ముసలి తల్లిని గురించి ఆలోచించనైనా లేదుగదా అని పశ్చాత్తాన పడ్డారు. మెల్లగా దర్జీఆమె ఇంటిదగ్గరకు కాళ్ళీడ్చుకుంటూ చేరాడు. తలుపు కొట్టబోయాడు. చెయ్యి లేవలేదు. మెల్లగా తలుపు కొట్టాడు. "అమ్మా !" అని పిలిచాడు. దర్జీ సోతి వచ్చి తలుపు తీసింది. హమీద్ ను గుర్తు బట్టింది. “హమీద్ వచ్చాడు. హమీద్ వచ్చాడు" అంటూ లోపలకు పరుగెత్తింది.


హమీద్ తల్లి ఈమధ్య ఆసక్తతవల్ల ఇంట్లో అటూ ఇటూ  నడవడం కూడా మానుకొన్నది, ఆమె కళ్ళు కూడా ఏమీ కన్పించేవి కావు. కాని హమీద్ వచ్చాడనడంతోనే ఆ సంతోషంలో ఎక్కడ నుండి శక్తి వచ్చిందో ఠఫీమని లేచి వాకిట్లోకి దూకి హమీద్ ను ఆలింగనం చేసుకొన్నది. వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె శరీరంలో ఎముకలు తప్ప ఏమీలేవు. తలమీద వెంట్రుకలు తెల్లబడి పోయినవి. నడుము వంగిపోయింది. మెడ శిరస్సు భారాన్ని గూడా వహించలేకుండా ఉన్నది. ప్రేమవల్లనో, లేక ముసలి తనం వల్లనో ఆమె శరీరం వణక నారంభించింది. చాలాసేపు ఇద్దరూ మాట్లాడలేకపోయినారు. చివరకు తల్లి మెల్లగా కంఠం పెకలించుకొన్నది "నాయనా , చాలా దూరం నుండి వచ్చావు. గుడ్డలన్నీ తడిసిపోయినవి. గుడ్డలు మార్చుకో, టీ తీసుకొని వస్తాను, పిల్లలంతా కులాసాగా ఉన్నారా ?" అని ప్రశ్నించింది.


అమ్మా, ఇల్లు అమ్మివేశావా ? నాకు తెలియజేయలేదేమి " అని అడిగాడు.

“నాయనా! నీకు తెలియజేస్తే మాత్రం నువ్వేమి చేస్తావు, నీకు మాత్రం కష్టాలు తక్కువగా ఉన్నవి గనుకనా, కానీ. ఈ దర్జీ సోతి నాకు చాలా సహాయం చేస్తున్నది. నీ కష్టాలు మీకు గాక నా బాధ కూడా మీకెందుకు నాయనా, ఈ జన్మలో నిన్ను చూడలేనేమో అనుకున్నాను, నువ్వు వచ్చావు" అన్నది.


హమీద్ కళ్ళవెంట బొటబొటా నీళ్లు కార్చాడు. ఇల్లు నలువైపులా కలయ చూచాడు. ఎదుట చిన్న మంచం మీద దర్జీ ఆమె ఇద్దరు పిల్లలూ నిద్రబోతున్నారు. ఒక పిల్లవాడు కింద ఆడుకుంటున్నాడు.

దర్జీ సోతి పొయ్యి రాజేస్తున్నది. ఆమె తొడుక్కున్న రవిక వీపుమీద చిరిగిపోయి పున్నది. గుడ్డలు మాత్రం తెల్లగానే ఉన్నవి.. బక్రీదు పండుగ కదూ!


"అమ్మా , రోజూ నీవు ఇక్కడనే నిద్రపోతూ ఉంటావా?"


“కాదు నాయనా ! ఆమె ఈ గదిలో పిల్లలతో పడుకొంటూంది. నేను అవతల గదిలో పడుకొంటాను" అన్నది తల్లి.


“అమ్మా! నీవు ఇంకా పనిచేస్తూనే ఉన్నావా? చేతులు పని చేయనిస్తున్నయ్యా!”

"చేతులు బాగానే ఉన్నవి గాని కళ్ళు మాత్రం నెల రోజుల నుండి కనపడడంలేదు నాయనా"


“కళ్ళు కనపడడంలేదా ? అన్నాడు ఆతురతతో హమీద్,


తల్లి హమీద్ తలను చేతితో నిమిరింది. చెయ్యి బుగ్గలదాకా పోనిచ్చింది. అతని తలను తన హృదయానికి హత్తుకొన్నది. చిరునవ్వు నవ్వింది. "నాయనా, కళ్ళు కనపడడం లేదా అంటున్నావా , నాయనా నీవు కనపడుతూనే వున్నావు. రోజూ సూర్యుడు కనబడతాడు అంతే. మిగిలిన వస్తువులు ఏమీ కనబడవు. చిన్న పిల్లవాడు కులాసాగా ఉన్నాడా? వాడి వయస్సెంత? అని అడిగింది.


“సంవత్సరంన్నర"


“అయితే చొక్కా, టోపీ వాడికి సరిపోతవి" అంటూ ఒక పాత గుడ్డల మూట విప్పి అందులోనుండి ఒక చొక్కాను, బుటేదారీ పనిచేసి యున్న ఒక టోపీని బయటకు తీసింది.


"మజీద్ కోసం ఇవి తయారుచేశావా ? అని హమీద్ కన్నీళ్ళు కార్చాడు.


కాదు నాయనా సలమా కోసం కుట్టి తయారు చేశాను. పంపుదామంటే నీవు రానేలేదు. తరువాత సలమా చచ్చిపోయిందని ఉత్తరం వ్రాశావు అని చొక్కా వంక చూసి కన్నీళ్ళు పెట్టుకొన్నది. లేచి లోపలికి వెళ్ళిపోయింది. టీ తెచ్చి ఇచ్చింది. తాగారు. తల్లి మంచం మీద కూర్చొని ఉండిపోయినాడు.


ఏమిటేమిటో ఆలోచనలు హమీద్ తనను తాను మరచి పోయినాడు. అలా రెండు గంటలు గడిచింది. పక్క ఇంటి నసీబన్ గూడా వచ్చింది. నసీబన్, హమీద్ తల్లి, సోతి వంట ఇంట్లో ఏమేమిటో చేస్తూ ఉండిపోయినారు.


సుమారు ఎనిమిది గంటలకు హమీద్ తల్లి బయటికి వచ్చి “నాయనా! భోజనానికి లేవమన్నది.

అప్పటికి హమీద్ కు కొద్దిగా నిద్రపట్టింది. ఉలిక్కి పడి లేచాడు.


బీద స్థితిలో ఉన్నది గనుక తల్లి జొన్నరొట్టె తయారు చేసి ఉంటుందనుకొన్నాడు. కాని వడ్డించిన పదార్థాలను చూసి ఆశ్చర్యపడ్డారు. కబాబు, మేక గుండెకాయ కూర, పొరాటాలు, మినప్పప్పు పప్పు గారెలు,మామిడి కాయ పచ్చడి, ఒక కప్పులో మీగడి, ఒక ప్లేటులో వండిన మామిడి పండు ముక్కలు ఘుమఘుమ లాడుతున్నవి. ఇంత బీదతనంలో ఉన్న తల్లి ఈ సామానంతా నెలా సేకరించిందా అని ఆలోచించాడు. భోజనం చేశాడు. భోజనం చేసినంత సేపూ తల్లిదగ్గర కూర్చొని లోకాభిరామాయణం చెప్పింది. కొసరి కొసరి వస్తువులు వడ్డించింది. తృప్తిగా భోజనం చేశాడు. లేచి చేతులు కడుక్కొని మంచం మీదకు చేరాడు.


దర్జీఆమె, నసీబన్ ఇద్దరూ బయటకు వెళ్ళి కొంత సేపట్లో తిరిగి వచ్చారు.

తల్లి హమీద్ దగ్గరకు వచ్చింది. “నాయనా ! ఒక్క మాట చెపుతాను. వింటావా ?" అని అడిగింది.

హమీద్ మొఖం వెలవెల బోయింది. గుండె దడదడ లాడింది. బహుశా తల్లి తనతోగూడా ఢిల్లీ వస్తానంటుందనుకొన్నాడు. లోలోపల అనేక ఆలోచనలు తనకు వచ్చే జీతం చాలా కొద్ది, ఢిల్లీ లో ఆ కొద్ది జీతం మీద అంతమంది బ్రతకడం ఎలాగా? భార్యా, పిల్లలూ, తల్లీ యింత మందినీ తను పోషించగలడా . తల్లి వంక అలాగే చూస్తూ ఉండి పోయినాడు.


"నాయనా నీవు పట్టణంలో ఉండేవాడివి. నౌకరీదారుడివి. నేను పరాయవాళ్ళ పంచల్లో తలదాచుకొంటున్నాను. నీకు ఎలా మర్యాద చేయగలను నసీబన్ ను పంపించి ఖాన్ సాహెబుగారి ఇంట్లో ఒక గది బాగు చేయించాను. మంచం, పక్కా వేయించాను. కాని నీవు నాతోబాటే ఉంటే బాగా ఉంటుందని నా మనస్సు కోరుతున్నది. ఈ ముసలిముండతో కూర్చోమంటే నీకు మనస్సుకు ఏమి కష్టం కలుగుతుందోనని చూస్తున్నాను. భయపడుతూ ఉన్నాను. నాయనా ! నా కోరిక పూర్తిచేస్తావా, అని భయపడుతూ అడిగింది.


"అదుగో, మంచం కూడా తెప్పించాను" అని ఎదుటపరచి ఉన్న మంచం చూపించింది.

తల్లి మాటలకు హమీద్ గుండె కరిగిపోయింది. నోటనుండి మాట రాలేదు. "అమ్మా! నీ దగ్గర ఉండకపోతే నేను యింకెక్కడకు పోతాను” అన్నాడు.


తల్లి ఆనందసంభరితురాలైంది. హమీద్ శిరస్సును ఆఘ్రాణించింది. నసీబన్ ను పిలిచి మంచం తన గదిలో వేయించింది. ఒకమూట విప్పి తెల్ల దుప్పటి బయటకు తీసింది. ఆ దుప్పటిమీద రకరకాల లతలు కుట్టి ఉన్నవి. ఆ మూటలోనుంచి రెండు దిండ్లు బయటకు తీసింది. తెల్లటి గలీబులు తొడిగి ఉన్నవి. చిన్న సీసాలోనుంచి అత్తరు తీసి గలీబులకు అత్తరు రాసింది. మంచం కింద ఒక పీక్ దానును పెట్టించింది. ఢిల్లీ పూల నల్ల చెప్పుల జోడు - కొత్తది - మంచం కాళ్ళ వైపున పెట్టి "నాయనా ! అలసిపోయినావు. ఈ మంచం మీద పడుకొని నిద్రబొమ్మన్నది.

హమీద్ ఈ తమాషా అంతా చూస్తున్నాడు. యా అల్లాహ్ ఈ సామనంతా ఎలా వచ్చింది . చివరకు తల్లిని అడిగాడు.


రషీదాబాద్ గూడా చిన్న బస్తీ లాంటి గ్రామమే. అన్నీ ఈ ఊళ్లోనే దొరికినవని జవాబు చెప్పింది.


"అమ్మా! భోజనం సంగతి సరే. ఈ చెప్పులు, ఈ పీక్ దాను. ఈ దుప్పటి ఇవన్నీ ఎలా కొన్నావు ?"

తల్లి వేడివేడి కన్నీళ్లు కార్చింది. మాతృదేవతా వాత్సల్యం అనుపమానం "ఏడు సంవత్సరాలు ఎదురు చూశాను. ఇల్లు అమ్మాను. పొట్ట బిగించుకొని నీ కోసం, నీ పిల్లల కోసం ఈ వస్తువుల్ని సేకరించాను. నీ కోసం ఎదురు చూసిచూసి కళ్ళు కాయలు గాచినవి. నాయనా ! ఈ వస్తువుల్ని సేకరించడానికి ఏడు సంవత్సరాలు వల్లింది. సల్మాను చూడనే లేదు " అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. .


తల్లి మాటలను విని శాంతిదేవత ఆ చిన్నగదినిండా తన రెక్క లను విప్పింది. ఇక ఎవరూ ఏమి మాట్లాడలేదు.


తెల్లవారిపోతుంది హమీద్ తల్లి ఇక కళ్లు తెరవలేదు.


***********



5, ఫిబ్రవరి 2022, శనివారం

చైతన్యం ఆవిరైతే నైరాశ్యమే గతి

మేఘ రాగమ్ -2

ప్రియనేస్తం నీలాంజనా..


ఎలా వున్నావ్!  కొత్త సంవత్సరంలోకి ప్రవేశించాం అన్నమాటే కానీ పెద్ద ఉత్సాహం యేమీ లేదు. పైగా నిరాశ వైరాగ్యం కలగాపులగంగా యాంత్రికంగా కొత్త కేలండర్ ను చూడటం మొదలుపెట్టాం అంతే అనిపించింది నాకు. 


  కోవిడ్ -19 రూపం మార్చుకుని ఒమిక్రాన్  గా విరుచుకుపడుతున్న ఈ కాలంలో మరొకమారు భయం  గుప్పిటలోకి మనం బంధింపబడబోతున్నాం. ఇపుడిపుడేగా కొంచెం కోలుకుని సాధారణ స్థితిలోకి వస్తున్నాం అనుకుంటున్న తరుణంలో చెదలు రేగినట్టు అలజడి రేగింది. నేను కొంచెం ముందుగానే ఒకింత అతిగానే ఊహించుకుని ట్రావెల్ బేన్ విధించకమునుపే దేశాన్ని దాటి కొడుకు గూటికి చేరుకున్నాక బోలెడంత భద్రత లభించిందని సంతోషించాను. ఆనందించాను. దాదాపు ఇరవై నెలలు భయం గుప్పిట్లో ఒంటరితనంతో మానసిక అశాంతితో అతిభారంగా రోజులు గడిపిన తర్వాత లభించిన సంతోషం వెల కట్టలేనిది కదా! 

 

అలా ఒక పదిరోజులు గడిపానో లేదో.. మళ్ళీ అనేక దిగుళ్ళు మనసును కమ్మేసాయి. దేశీ సమాచారం కోసం ఛానల్ మార్చితే చాలు. ఒక నైరాశ్యం అలుముకుంటుంది. ఒకటి రెండూ చానెల్స్ మినహా అన్నింటిలోను అమరావతి రైతుల పాదయాత్ర గురించిన వార్తలే! ప్రత్యక్ష ప్రసారాలలో మహిళా రైతుల ఆవేదనను చూస్తే దుఃఖం కల్గింది. ప్రత్యక్షపోరాటంలో భాగస్వామ్యిని కాలేనందుకు త్రాణం సిగ్గిల్లింది. 


అమరావతి ప్రాంతం నుండి ఒక ఉద్యమం ప్రారంభమైనది. నిజానికి ఆ ఉద్యమం రెండేళ్ళ క్రిందటే మొదలైంది కానీ మన రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలని వారు ప్రారంభించిన ఈ యాత్ర ఎన్నో కష్టనిష్ఠూరాల మధ్య ఎందరో ధూర్తులు దుష్టపన్నాగాలు పన్నినప్పటికి  అవాంతరాలు కల్పించినప్పటికీ వాటిని ఎదుర్కొంటూ వారు ముందుకు సాగిన పోరాటపటిమ అభినందనీయం. ఎంతోమంది ప్రజల ఆదరభిమానాల మధ్య ఎంతో ఉత్సాహంగా సాగినతీరు చూస్తే ఒడలు పులకరించింది. రాజధాని ఉద్యమానికి  ప్రజలందరి మద్దతు లభించి విజయవంతమైనది కదా అనే గర్వం మధ్య ఒక అసంతృప్తి కూడా వెంటాడుతుంది. 


తమ భావాలను ఆలోచనలనూ అక్షరాలగా మార్చి వెదజల్లే వనితలు మనస్సును కదిలించగలరు.మేధస్సూ గొంతుకలు కల్గిన వనితలు ప్రపంచానికి తామేమిటో తెలియజేయగలరు అనుకునేదాన్ని. కానీ పొట్టకోసినా అక్షరం ముక్క రాని సాధారణ స్త్రీ మూర్తులు పండు ముదుసలి స్త్రీలు కూడా గళమెత్తి పదం  కలిపి రెండేళ్ళ పైబడి పోరాటం చేస్తున్నారు. ధ్వంసమవుతున్న కల కేవలం ఆ ప్రాంతం వారివే కాదు. రాష్ట్ర భవిత కూడా. అయితే  ఒకరే ఇద్దరో తప్ప మనలాంటి కవులు రచయితలూ కళాకారులు ఎవరూ కూడా అమరావతి మహిళా రైతుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించలేదు. అది ఎంత దురదృష్టకరం. 


సాహిత్యంలో కృషి చేసిన మహిళలు గురించి వల్లె వేసే   రచయిత్రులు ప్రజాపోరాటాలను ఉద్యమాలను ఓ వాలు చూపుతో గమనించి గమనించనట్లు గెంతుకుంటూ వారి స్థానాన్ని స్థాయిని పెంచుకుంటూవుంటారు తప్ప నిజమైన ఉద్యమాలకూ అమరావతి ప్రజల పోరాటానికి మద్దతునివ్వరు వారి గురించి ఒక ముక్క వ్రాయరు మాటాడరు. వీరు కాగితపు పులులు. సామాజిక చైతన్యం రాజకీయ చైతన్యం లేని ఏ వ్యక్తిగత చైతన్యమైనా బానిసత్వంలో మగ్గాల్సిందే.

మేథావుల మౌనం మంచిది కాదు. వారు స్వప్రయోజనాలకు తలవొంచినంత కాలం వారితోపాటు వారి జాతిని అథఃపాతాళానికి తోసేస్తారన్నది పచ్చి నిజం కదా!


మనచుట్టూ వున్న సమస్యలకు స్పందించని వారు ఆప్ఘనిస్తాన్ లో జరిగే పరిణామాల పట్ల అక్కడ స్త్రీలు పిల్లల పట్ల స్పందిస్తున్న తీరు చూసి ఆశ్చర్యం నవ్వూ రెండూ వచ్చాయి. కవులంటే రచయితలంటే లాలిత్యం కలవారు అని కదా అర్దం. మరి వీరేమిటి ఇంత లౌల్యం కలిగివున్నారు అనిపించింది. అందుకే ఒక పుస్తకం చదవాలని కానీ ఒక కవిని కానీ రచయితను కానీ కలవాలనే ఉత్సాహం ఆసక్తి మంటగలసిపోయాయపుడే!


 చరిత్రను చదివినపుడల్లా స్త్రీలు చేపట్టిన ఉద్యమాలు విజయం సాధించడానికి కొంత జాప్యం జరగవచ్చేమో కానీ  యెపుడూ పరాజయం పొందలేదు అనుకున్నాను.


అమరావతి రైతులు తమ తాత ముత్తాతల నాటి నుండి వారసత్వ  సంపదగా ఘనతగా  వచ్చిన భూములను పెద్ద మనసుతో రాష్ట్ర రాజధాని కోసమిచ్చి  ఇప్పుడు రోడ్డున పడ్డారు. తమ బిడ్డల భవిష్యత్ తో పాటు భావిపౌరుల భవిష్యత్  బాగుంటుందని భావించిన వారికి వారి బిడ్డల భవిష్యత్ ను ముళ్ళకంపలపై ఆరేసామని అర్దమై ఆవేదన చెందుతున్నారు. 29 గ్రామాల ప్రజల జీవన విధ్వంసానికి పాల్పడుతున్నది   రాజ్యమే అయితే వారి గోడు న్యాయదేవతకు తప్ప వేరెవరికి విన్నవించుకోగలరు. వారి వేదన మాటున అణువణువు అగ్నికణం రగులుతుంది. వారి గోడును చోద్యం చూస్తూ అవహేళన చేస్తూన్న కొందరిని చూస్తే అసహ్యం విరక్తి కల్గుతుంది.


ఎక్కడ చూసినా గనులను లోడేస్తు కొండలను తవ్వేస్తూ తీరాలను ఆక్రమిస్తూ ధనదాహం భూదాహం  అంతా దాహం దాహం. ఈ దాహాలను తీర్చుకోవడానికి రాజకీయ రాబందులు మనిషిని సాధారణంగా బ్రతకనీయడంలేదు. ప్రతి మనిషి మనిషి కాకుండా మట్టి కాకుండా మతం కులం అయిపోయారు. ఆ అమరావతి ప్రాంత  ప్రజలందరూ కొక్కిరాయి తగిలిన పిట్టల్లా కముకుదెబ్బ తిన్న ఎనుముల్లా జీవచ్చవాలుగా జీవనం బండి లాగుతూ కనబడుతున్నారు. అయినా అలుపెరుగని ఉద్యమం చేస్తున్నారు. వారి ఇక్కట్లు పట్ల సహానుభూతి ప్రదర్శించడం తప్ప నేనూ ఏమీ చేయలేకపోయాను. నిర్వేదంతో చూస్తూ వుండిపోవడం అపుడపుడు ఇలా ఆక్రోశం వెళ్ళగక్కడం తప్ప. అన్యాయాలను ప్రశ్నిస్తే రాజకీయ అరాచక మూకలచేత ట్రోల్ చేయబడటం మినహా ఏమీ కానరావడం లేదు.


మనిషికి తోటి మనిషే కాదు సతుల్ సుతుల్ హితుల్ అంతా డబ్బు కంపు కొడుతున్నారు. మంచి అన్నది కొంచెమైనా మిగిలినప్పటికి  ఏ రంగు రుచి వాసన లేని రుతువుల ధాటికి ప్రకృతి కి తలొంచక తప్పడంలేదు. 


ఏ రాజకీయ నాయకుడైనా దోచుకోవడానికి దాచుకోవడానికి వచ్చినవాడు తప్ప ప్రజల సంక్షేమం కోరుకుంటూ.. ప్రజారంజకంగా పాలించడానికి వచ్చినట్లు కనబడతుందా.. అసలు ఆ రోజులు వస్తాయా? సొంత ఊరులో బ్రతకలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. గత ఏడాది మన రాష్ట్రం నుండి ఏభై అయిదువేల మంది పిల్లలు ఉన్నత విద్య పేరిట విదేశాలకు వలస వెళ్ళారట. భావితరాలకు భవిష్యత్ అగమ్యగోచరమైన చోట నిరాశ కారు మేఘాలు కమ్ముకోవడం సహజమే కదా! అనేక దేశాల మధ్య యుద్దం వ్యాపారం అయిపోయింది. త్రాగేనీరు వ్యాపారం అయిపోయి రెండు దశాబ్దాలు దాటింది. పీల్చేగాలి వ్యాపారం కాబోతున్న దురదృష్టకరమైన రోజుల్లోకి మనం నెట్టబడుతున్నాం. చుక్కలనంటుతున్న ధరలు, సామాన్యుడి నడ్డి విరుస్తున్న పన్నుల మోత. వీటన్నింటి మధ్య నిరాశ నైరాశ్యం కాక ఏముంది చెప్పు? ఏమి చూసి విడవలేని మమకారంతో సొంత ఊరిలో వుండగలం అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను.


నీలోనూ నాలోనూ వొక మనిషున్నాడు. వాడిలోనూ కీకారణ్యం వుంది.  కులం మతం రంగు వేసుకున్న రాజకీయ మృగం  వాడిని మాయం చేస్తూ  వుంది. ఏదో వొక జెండా కత్తిని చేతపట్టి మరో మృగాన్ని వేటాడే తర్ఫీదు నిస్తుంది. కచ్చితంగా ఇక్కడే మనిషి మాయమైపోతున్నాడు.ఒక బాధ్యత కల్గిన పౌరుడు కూడా మాయమౌతున్నాడు. ఏదో వొక రంగు జెండాను తొడుక్కుంటున్న  మనుషుల ముఖాలను  బిక్క ముఖం వేసుకుని చూస్తూ  తిరణాలలో తప్పిపోయిన పసిపాపలా నేను నీవు మరికొందరూ.. అందరూ ఇలాగే వగస్తున్నారనుకుంటా. 


నువ్వక్కెడో ఆస్ట్రేలియా లో నేనిక్కడ అమెరికా సంయుక్తరాష్ట్రాలలో.. కానీ మన మూలాల గురించి అంతులేని వ్యధతో ఈ విషయాల ముచ్చట. మన తర్వాత మన పిల్లలకు మూలాలపై ఆసక్తి అనురక్తి రెండూ లేవనిపిస్తుంది. వారికి కావల్సిందేమిటో వారికి స్షష్టంగా తెలుసు. ఏది ఎక్కడ వదిలేయాలో వారికి స్పష్టత వుంది. మన పిల్లలతో మనను మనం పోల్చుకోకూడదు కానీ.. పిచ్చి మనసు ఊరుకోదు. నేను నా కుటుంబం నా ఇల్లు లాగానే నా ఊరు నా రాష్ట్రం నా దేశం అంటూ ఊగిసలాడుతూ ఇలా ఆలోచిస్తూ బాధపడుతున్నాం. నాకెందుకో  మణిరత్నం “అమృత” సినిమా బాగా గుర్తొస్తుంది. మనిషి చెట్టుకొకరు పుట్టకొకరూ పరాయీకరణ కావింపబడిబోతున్నారా.?


మన ప్రాంత ప్రజలంతా  కూడా అలా దూరంగా విసిరివేయబడుతున్నారా.. దిగులేస్తుంది నీలాంజనా! బ్రతుకు భద్రత కరువై తల్లులూ బిడ్డలూ  విడదీయబడుతున్నారా? మన లాగానే తల్లులు బిడ్డల సాంగత్యం కోసం అలమటిస్తారా.. వద్దు వద్దు. వద్దమ్మా వద్దు. అలాంటి దుస్థితి ఎవరికీ రాకూడదంటే ఉన్నచోట బతుకు భద్రత వుండాలి. ఆ బాధ్యత మనం ఎన్నుకున్న నాయకుల కర్తవ్యం కదా! అదే లోపించింది ఇక్కడ. ప్చ్ 😢


 ఉదయం తొమ్మిదింటికి కూడా మేలుకోని అట్లాంటా నగరంలో మంచు పొరల మధ్య బద్దకపు ముసుగు తొలగించుకుని ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తుంటే మన ఊరు మన గాలి గుర్తుకొచ్చి ఉక్కిరిబిక్కిరై పోయి వెనువెంటనే అయినవాళ్ళతో గొంతు కలిపాను. వారితో పాటు కౌలు రైతుకు ఫోన్ చేసాను. రెండో పంట వేయవద్దన్నారమ్మా.. పదును పోయాక మరో పంట అదీ అపరాలు అసలు వేయలేం. భూమి ఖాళీగానే వుందమ్మా అన్నాడు. పచ్చగా అలరారు భూములను బీడు భూములుగా మార్చడం  వెనుక  ఉన్నది రాజకీయమే. అలా చేయడం మొదలైందనిపించినపుడు అదోరకం నైరాశ్యం అలముకుంది. మన రాష్ట్రం బాగుండాలి మన వాళ్ళందరూ బాగుండాలి… అని మనఃస్పూర్తిగా కోరుకుంటూ వుండటం తప్ప ఏమి చేయగలం. 


కాసేపు మన చిన్నప్పటి రోజులు తలచుకుంటూ ఆకాశం వైపు చూస్తూ ఆ జ్ఞాపకాలలో మునిగిపోయాను. అనంతమైన ఆకాశం, లెక్కించలేని నక్షత్రాలు మనందరికీ గొడుగు పడుతున్నట్టూ  మన హృదయాలు, ఆత్మ దాని లయతో నృత్యం చేస్తున్నట్టూ  ఊహించుకుంటూ ఎన్నో కబుర్లు చెప్పుకుని మురిసిపోయాం.  ఇపుడు నువ్వు నేను నిలబడిన నేల వేరు వేరు కావచ్చు కానీ ఒకే ఆకాశాన్ని అవే నక్షత్రాలనూ చూస్తుంటాం. కానీ నా భావనలు నీ భావనలు వేరు వేరుగా వుంటాయేమో. అలాగే ఈ మనుషులందరూ ఒకే సమస్యను చూస్తున్నా  స్పందనలు మాత్రం వేరు వేరు అనుకుని నిట్టూర్చడమే !


ఏమి వ్రాయగలను.. మంచి తరుణం కొరకు వేచి చూడటం తప్ప . ఉంటాను మరి.

                                                            ప్రేమతో.. ప్రియ నేస్తం

                                                                “అమృత”