8, ఆగస్టు 2022, సోమవారం

రాలుగాయి జీవితం

 చెట్టు కొమ్మన ఊగుతున్న పసి పిట్టను 

రాలి పడుతున్న ఆకు జాగ్రత్తని మందలించింది

పట్టించుకోకపోయినా విననట్టు నటించినా


రుచి మరిగిన ఏకాంతం

మనుషుల సవ్వడిని ఓర్వలేకపోతుంది జీవితానందాన్ని

నిశ్శబ్దంగా అనుభవించాలని.


బుద్ది మనసు గొడవ పడుతుంటాయి

కాల దేవత మొట్టికాయ వేస్తున్నా. 

అది మనిషికి వినోదం విలాసం 


అంతరంగమంతా ఆరని ఆవేదన

గాలిలో కనిపించని వంతెన అనుబంధాలు

మబ్బుల్లా రూపం మార్చుకుంటూ..


అహం గాయపరుస్తుంది గౌరవం భంగటిల్లుతుంది

కోట గోడలు అగడ్తలు చుట్టూరా, 

 జొరబడ లేని మనిషి తనం నేస్తం


సమాధానం చేజిక్కించుకున్న తరుణానికి

కొత్త ప్రశ్న మొలకెత్తుతుంది. ఒక స్థితి నుండి మరొక స్థితికి 

జీవితపు బాటలో 


అనుభవ జ్ఞానం యిచ్చిన ఆనందాన్నో దుఃఖాన్నో వొంపేసి

పోవడం మినహా యేమి చేయగలం? 

రానిదంతా జీర్ణమైతే చాలును


దశల వారీగా  పలకరించిపోయే నేస్తాలు రోగాలు

అవస్థ శరీరానిది  యాతన జీవితేచ్చది

కాఠిన్యం లోకానిది దయ సమవర్తి ది . 


అంతా ప్రశాంతం ఉన్నది లేనట్టు

లేనిదంతా అంతకు ముందు ఉన్నట్టు తర్వాత లేనట్టు 

అమ్మ గర్భంలో శిశువులా


లిప్తపాటు లో  జనన మరణ వలయాలు

ప్రాణికి నిత్య నూతనాలు నర్తనాలూ పరిధి లేని నటన

రంగస్థలంపై రాలుగాయి జీవితం.



కామెంట్‌లు లేవు: