28, మార్చి 2011, సోమవారం

కాలర్ ట్యూను కథ



చాలా రోజులైంది నేను మనసులో మాట పంచుకోక.

జీవనం తాలూకు.. వత్తిడులు.. తీరిక లేక పోవడం , అనాసక్తి ఇవ్వన్నీ కలసి దాదాపు ఒక నెల రోజుల నుండి బ్లాగ్ లోకం వైపు కన్నెత్తి చూడడం లేదు.

ఈ రోజు మధ్యాహ్నం ఒక పాట విన్నాను. మనసు పొరలు...తెరచి.. ఒక జ్ఞాపకం తడిమింది. ఒక అనుభవం ఎవరితో అయినా పంచుకోమని..ఒత్తిడి చేసింది.. అందుకే ఇలా.. మాట అక్షరంలో..ఒదిగిపోయి.. మీ.. ముందుకొస్తుంది.

నేను మొబైల్ ఫోన్ ఉపయోగించడం మొదలెట్టి దాదాపు 8 సంవత్సరాలు దాటింది. ఈ మద్యనే.. సెల్ ఈస్ హెల్ అనుకోవడం చాలా ఎక్కువయింది.మొదట్లో సెల్ ఫోన్ వాడడం అందునా స్త్రీలు మొబైల్ ఫోన్ ఉపయోగించడాన్ని  విచిత్రంగా చూసేవారు. ఎవరి అవసరాలు వారివి కదా! నేను పెద్దగా పట్టించుకునే దాన్ని కాదు.

అయిదు సంవత్సరాల క్రితం కాలర్ ట్యూన్ సెట్ చేయించడం జరిగింది.నాకు ప్రేరణ నా కొడుకే.. తనకి ఇష్టమైన పాట పెట్టించుకుని చాలా చక్కగా అందరికి వినిపించేవాడు. తన నంబర్ ఒక నిమిషం వ్యవధి పాటు..రింగ్ వినిపించే నెట్వర్క్ లో నంబర్ కనుక ఎక్కువ పాట వినడం వీలయ్యేది. అలా కాలర్ ట్యూను వినడంని విపరీతంగా నచ్చేసిన నేను ఒక రోజున వర్షంలో తడుస్తూ..ఆ తడవడాన్ని టూ వీలర్ లో వెళుతూ..ఆస్వాదిస్తూ వెళ్లి మరీ..కాలర్ ట్యూను సెట్ చేయించుకుని పదే పదే వేరొక ఫోన్ తో.. అ నంబర్ కి రింగ్ చేసుకుని విని మరీ మురిసిపోయేదాన్ని.

ఏమాట కా మాటే! నా సాంగ్ సెలక్షన్ సూపర్ అని అందరు మెచ్చుకుంటుంటే విని ఎవరెస్ట్ ఎక్కిన ఆనందం కలిగేది కూడా.

ఇంతకి ఆ పాట ఏమిటంటే "నువ్వు వస్తావని" అనే చిత్రంలో.. "కొమ్మా కొమ్మా విన్నారమ్మ కోయిల వస్తుంది" అనే పాట. నాకు ఆపాటంటే చాలా ఇష్టం. నా కాలర్ ట్యూను విని చాలా మంది ఆ పాట కోడ్ నంబర్ అడిగేవారు.

నాకు చెప్పడం అసలు ఇష్టం ఉండేది కాదు. ఎందుకో ఎవరైనా.. నేను కోరిన పాట విని మళ్లీ వారు కోరి వింటుంటే నేను వెంటనే.. ఆ పాట ని కోరి వినడం ఆపేస్తాను. అందుకే ఆకాశవాణిలో నేను కోరే పాటలంటే క్రేజ్ అని నానుడి.సాంగ్ సెలక్షన్ డిఫరెంట్ అండ్ సూపర్ అని ప్రశంసలు అందుకుంటాను. విసిగిస్తున్నాను కదూ..!

ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే.. నేను ఎవరిని ఫాలో అవను. నన్ను ఫాలో అవుతున్నట్లు అనిపిస్తే.. నా రూట్ మార్చుకుంటాను అని చెప్పటానికి అన్నమాట. ఇది కూడా  నా బ్లాగ్ గనుక నేను ఎవరిని బాధ పెట్టడం లేదు కనుక నాకు నచ్చినట్లు వ్రాసుకుంటూ ఉన్నానన్నమాట.

ఇక విషయానికొస్తే   దాదాపు అయిదు సంవత్సరాలు.. నా కాలర్ ట్యునుగా.. పిక్స్ అయిపోయి హమ్మయ్య! వనజ గారి నంబర్కే కాల్ చేసాం అని గట్టిగా తీర్మానించుకునే అన్నంత ఇదిగా అన్న మాట. తర్వాత తర్వాత నేను ఒక నంబర్ కాకుండా.. వేరే నంబర్ వాడే టప్పుడు ఆ నంబర్కి కాలర్ ట్యూను ఉండేవి. నాకెంతో ఇష్టమైన పాట "శివరంజని " చిత్రంలో నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలీ నీవు అనే పాట ని కాలర్ ట్యూను గా వినిపించడం కోసమే..వేరొక నెట్వర్క్ లో ఇంకో నంబర్ ఉండేది. ఇంట్లో.. కోపాలు,నిరసనలు..అన్ని మామూలే!

పాటలు వినడం,వినిపించడం నా వ్యసనం కాబట్టి నన్ను పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ బయటి వాళ్ళతో..నాకో ఇబ్బంది వచ్చి పడేది. నీ కాలర్ ట్యూను బాగుందండీ.. అని మెచ్చుకోవడంతో.. పాటు అబ్బ! భలే పాట పెట్టారండీ! అది వినడం కోసమే ఫోన్ చేస్తున్నాం మీరు లిఫ్ట్ చేయకండి..మీతో మాకు పనేంలేదు అని ముఖానే  చెప్పేవాళ్ళు. ఏది నిజమైన కాలో.. ఏది పాట వినే కాలో.. అర్ధం కాక తిట్టుకునేదాన్ని. ఇంకొక ఇబ్బంది ఏమిటంటే.. నవమి నాటి వెన్నెల పాట వింటుంటే.. వాళ్ళకేదో స్వీట్ మెమరీస్ గుర్తుకోస్తున్నాయని నాకు చెప్పడం మొదలెట్టాక  వెంటనే.. డీ యాక్టివేట్ చేయించుకున్న చేదు అనుభవం కూడా ఉంది. 

అలాగే "జాజి మల్లి" చిత్రంలో.. "ఎక్కడ పడితే అక్కడే నువ్వు కనబడుతూ ఉంటే" పాట పెట్టించుకున్నప్పుడు  80 లు దాటిన  ఒక పెద్దాయన నాకు ఫోన్ చేసి మాట్లాడి ఆఖరిలో.. పాట బాగుంది .. నా గురుంచే ఈ పాట పెట్టి ఉంటావు అనుకుంటాను అనగానే.. హడలిపోయి మళ్ళీ  డీ యాక్టివేట్ ..

ఇలాటి అనుభవానికి తోడు.. ఎన్నెన్నో.. పాటల కోసం హచ్ స్టోర్స్ కి తరచు వెళ్ళడం,ఆ.. స్టోర్స్ లో అందరికి నన్ను చూడగానే.. ఈ మేడం మళ్ళీ ఏదో కొత్త పాట కోసం వచ్చారని.. ఆసక్తి + విసుగు ప్రదర్శించడం అలవాటైపోయాయి.

కభి కభి మేరె దిల్ మే ఖయాల్ ఆతీ హై.. పాట కోసం ఎన్ని రోజులు తిరిగానో  గుర్తు లేదు కానీ..ఆ పాట ఎయిర్ టెల్ లో దొరికినప్పుడు నా ఆనందం ఇంతా అంతా కాదు.

అలాగే దిల్-ఏ-నాదాన్ లో  చాందిని రాత్ హై ఏక్ బార్ తుజే దేఖా హై.. పాట దొరికి నప్పుడు నా ఆనందం చెప్పనలవి కాదు. అలా నా విలువైన సమయాన్ని,ధన్నాన్ని వృధా చేస్సానని ఎప్పుడూ అనుకోలేదు పాటలు వినడంలో ఉన్న ఆనందాన్ని పోగొట్టుకోలేదు. 

తర్వాత :"బొంబాయి ప్రియుడు" చిత్రంలో.. "ప్రణయమా మరుమల్లె పూల తోటలో"పాట, "జ్వాల" చిత్రంలో "ఏవేవో కలలు కన్నాను" పాట.. "జానకి రాముడు " చిత్రంలో "నీ చరణం కమలం మృదులం" పాట.."గంగోత్రి" లో.. ఒక తోటలో ఒక కొమ్మకి ఒక పూవు పూసింది"పాట.. ఇలా.. కాలర్ ట్యూను కోసమే.. నేను ఎన్నో నెట్ వర్క్ లో నంబర్స్ వాడేదాన్ని.
కానీ.. ఎందుకో ఈ మధ్య ఒక రకమైన విరక్తి వచ్చేసింది. నేను ఏ పాట పెట్టినా ప్రశంసలు, వాఖ్యానాలు  రెండు వచ్చేవి. ఎప్పుడు ఒక నంబర్ కి మాత్రం కొమ్మా కొమ్మా..పాట ఉండేది..అది.. ఈ మధ్య డీ ఏక్టివేట్ చేయించాను. మళ్ళీ ప్రశ్నలే!?

ఎందుకో..ఏళ్ళ తరబడి కాలర్ ట్యూను వాడినందుకేమో.. వోడా నెట్ వర్క్ వారు మాత్రం 9 నెలల నుండి ఫ్రీగా ఒక ఇంగ్లీష్ కాలర్ ట్యూను ఇస్తున్నాడు. వద్దని చెప్పినా వినడం లేదు. నాకేమో.. ఫోన్ చేసిన వారు అడిగే ప్రశ్నలెదుర్కునే బాధా తప్పడం లేదు.

వ్యాపార రహస్యం ఏమిటంటే.. వ్యక్తుల అవసరమే కాదు.. బలహీనత కూడా!

మంచి టేస్ట్ ఉన్నప్పటికి ఎప్పుడు వినాలో.. అక్కడే వినాలి .. ఎవరికి వినిపించాలో.. వారికే వినిపించాలని.. నాకు అనుభవమైనది.

అందుకే నేను చెబుతున్నాను.. ఇష్టమైతే.. పాటించండీ.. లేకపోతే లేదు. నలుగురు వినే పాట మనకి సమస్యలు తెచ్చి పెట్టేదిగా ఉండకూడదు కదా ! 

అలాగే.. మనకిష్టమైన దాన్ని.. పదుగురిలో పడకుండా పదిలంగా దాచుకుని.. మనం మాత్రమే ఆస్వాదించేదిగా ఉంటే మనకు సంతోషం మిగులుతుంది. లేదంటే.. తిప్పలే! అందుకే అంటారు.. "పదునెరిగి విత్తు నాటాలి కీలెరిగి వాత పెట్టాలి" అని.

అసలు సంగతి ఏమిటో.. చెప్పనా..!? నేను ఇంకా ఒక పాట కోసం వెతుకుతూనే ఉన్నా.. ! ఆపాట ఏమిటంటే.. "రాజా రమేష్ " చిత్రంలో " నేల మీద జాబిలీ నింగిలోని సిరిమల్లీ" ..అనే పాట కోసం.

ఏ నెట్ వర్క్ లోను దొరక లేదు. మీకెక్కడైనా లబిస్తే చెప్పండి..ప్లీజ్!..:)

ఇదండీ!..నా మొబైల్ ఫోన్-కాలర్ ట్యూను కథ కమామీషు.

1 కామెంట్‌:

buddhamurali చెప్పారు...

మీ ముచ్చట కవిత వినిపిస్తున్నట్టుగా ఉంది. హాయిగా చదివించే ముచ్చటలే రాయండి. సమశ్యలకు ఆడ మగ అనే తేడ ఉండదు అందరికి ఉంటాయి. వాటిని కాసేపు పక్కన పడేసి హాయిగా చదివించే కబుర్లు raayandi