20, జులై 2011, బుధవారం

వేయివేణువులు మ్రోగేవేళ..





వేయివేణువులు మ్రోగేవేళ సాహిత్యం..క్రింద..  


వేయి వేణువు మ్రోగేవేళ 

హాయి వెల్లువై పొంగేవేళ  

రాసక్రీడలో చేరేవేళ

రాదమ్మని లాలించేవేళ


నను పాలించగ నడచివచ్చితివా..

మొరనాలింపగా తరలి వచ్చితివా..గోపాలా..(నను) 


అరచెదిరిన తిలకంతో అదిగదిగో రాధమ్మ

అరజారిన పయ్యదతో అదిగదిగో గోపెమ్మ

ఎరుపెక్కిన కన్నులతో ఇదిగిదిగో సత్యభామ

పొద పొదలో ఎద ఎదలో 

నీ కొరకై వెదుకుతు ఉండగ (నను)   


కంసుని చెరసాలలొ ఖైదీగా పుట్టావు  

కాంతల కౌగిళ్ళలో ఖైదీగా పెరిగావు 

కరకురాతి గుళ్ళలో ఖైదీగా నిలిచావు  

ఈ భక్తుని గుండె లో ఖైదీగా ఉండాలని (నను)


ఎంత చక్కని పాట. నాకైతే ఎంతో ఇష్టమైన పాట.

వనమాలి పాటేదైనా అందునా..వేణువు ఎన్నిమార్లు విన్నా తనివితీరదు.

 "మామ" స్వరకల్పనలో వేణువు రాతిలో కూడా రాగాలు పలికిస్తుంది.   

ఇక సాహిత్యం విషయంకి వస్తే ఆయన రాముడి పేరుని ఇంటి పేరులో, కృష్ణుడిని తన పేరులోనూ సమన్వయపరచుకున్న దాశరధి కృష్ణమాచార్యులు.దాశరథి గా ప్రతీక.



ఇంతటి భక్తిరసంలో..ముంచెత్తుతూ ఆ సాహిత్యపు సొంపులు చూడండీ!!మధురాతిమధురం. సాహిత్యంలో వారి ముద్రని మరోసారి చెప్పుకుందాం. 


ఆ వనమాలికి భక్తులన్న అలవిమాలిన అనురాగం. ఆయన  ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం తాండవిస్తుంది. అందుకేనేమో..అసలే దక్షిణ నాయకుడు. అష్ట భార్యలున్నవాడు. ఆ పై పదహారువేల గోపెమ్మలు. అయినా ఆయన అందరిని సంతోషంగా ఉంచగల్గాడు.  ఎందుకంటే నిజంగా ఆయన రెపల్లె లోనో, బృందావనిలోనో ఉండడు.ఆయన నివాసం భక్తుల హృదయాలు. పిలవగానే వడి వడిగా పరుగు పరుగున వాలిపోతాడు. వారిని పాలిస్తాడు,మొరలాలకిస్తాడు. తనని ఆరాదించే భక్తులకి  హృదయంలో బందీగా ఉంటాడు. అది వనమాలి భక్తులకి..ఇచ్చిన వరం. అదే సంగతిని..బహు సుందరంగా వ్రాసారు  కవి. నిజంగా.. ఆ నల్లనయ్య ఆ సాహిత్యానికి, ఆ..మధుర గానానికి..పరుగు పరుగున రాకపోడా అనేంత గొప్పగా ఉంది సాహిత్యం.


వేణువు ఒకటి  మ్రోగితేనే మది ఊగుతుంది,తూగుతుంది. అలాటి  వేయి వేణువులు మ్రోగేవేళ ఎంతగానో ప్రేమించే రాధమ్మని చేరి రాసక్రీడలో..మునిగే వేళ ఆపదలో ఉన్న భక్తుడు  పిలవగానే.. ఉన్నపళాన ఆ నల్లన్నయ్య పరుగు పరుగున భక్తుల కడకు  వచ్చెస్తే.. 



ఆయనంతే!  భక్తులని  యెప్పుడూ పాలించడానికి, లాలించడానికి

కనికరించడానికి సిద్దంగా ఉండగలడు .   కానీ ఆయన దేవేరి లకు కోపం తెప్పించదూ? మంచి సమయము..భార్యని వదిలేసి వెళ్ళిపోతే? ఇక వారి అవస్తలు ..ఇలా..ఉంటాయని చెప్పడం ఒక శృంగార కావ్యం కూడా! రసమయ జగత్తులో ఉండగా ఆ నల్లనయ్య ఆమెని విడిచి వెళ్ళగా మోహంతో..శయ్య పై ఆ రాధమ్మ పొరిలి పొరిలి సగం చెరిగిన కుంకుమతో ఊర్పులు విడుస్తుందని..  

ఆ గోపెమ్మ ఏమో..కోరికతో సగం జారిన పయ్యదతో..కలియచుడుతుందని, ఇక సత్యభామ తనని వొదలి  వెళ్ళాడన్న కోపం తోనూ, వాంఛ వల్ల ఎర్రగా మారిన కన్నులతో పొద పొదలోన  ఆచూకీ కోసం ఎద ఎద లోను వెదుకుతూ ఉంటే..నన్ను పాలించగా నువ్వు వచ్చావా గోపాలా!? అని ఆయనని ఆర్ద్రంగా ,ముకుళిత మైన మనసుతో కీర్తిస్తున్నాడు..ఆ భక్తుడు.



చెరసాలలో ఖైదీగా పుట్టి ఇంతుల కౌగిళ్ళలో ఖైదీగా పెరిగి (అందరూ ఆయనని ప్రేమించే వారే కదా?) కరకు అయిన నల్ల రాతి గుళ్ళలో ఖైదీగా మారినా (ఆయనని రాతి గుళ్ళల్లో మనమే ఖైదీగా మార్చాము. ఆయన నిజంగా భక్తుల హృదయాలలో ఉంటాడని  చెబుతారు.) ఈ భక్తుని గుండెలో ఖైదీ కావాలని కోరుకుంటాడు.  ఎంత ఆశ! చూడండీ! అది అపారమైన భక్తికి చిహ్నం.

 

ఎంత చక్కని భావం. ఎన్ని సార్లు విన్నా..మళ్ళీ వినాలనిపించే పాట.ఈ చిత్రంలో శోభన్ బాబు గారు కృష్ణుడుగా   ఎంత సుందర రూపమో! ఎ.ఎన్నార్ ఆహార్యం అంత చక్కనిదే! అందుకే పదికాలాలు నిలిచే పాట ఇది.

మీరు చూసి విని ఆస్వాదనలో మునిగి తేలాలని బుద్ధిమంతుడు చిత్రంలో.. ఈ పాట పరిచయం చేసాను. 


వేయి  వేణువులు  మ్రోగే  వేళ   .. 



 


2 కామెంట్‌లు:

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

మంచి పాట మీద పోస్ట్ రాశారు. గుర్తుచేసినందుకు నెనర్లండి!

మురళి చెప్పారు...

ఇందులో 'రాధమ్మని లాలించే వేళ..' లైన్ అంటే నాకు ప్రత్యేకమైన ఇష్టమండీ.. పలకడం, అభినయం కూడా కొంచం ప్రత్యేకంగా ఉంటాయి, గమనించండి..