30, జులై 2011, శనివారం

గురు బ్రహ్మలా! వీరు కుల బ్రహ్మలు..


అంటారు.

కానీ ఇప్పుడు.. చాలా కళాశాలలో..గురువులు కుల మౌడ్యంతోకళ్ళు మూసుకు పోయిన వారే!

పిల్లలకి విద్యా బుద్దులతో పాటు మంచి-చెడు ఔచిత్యంని భోధించే గురువులే కులతత్వాన్ని ప్రోత్సహిస్తూ.. తమ కులం కాని వారిని పైశాచిక ధోరణితో..కారణం లేకుండా హింసించడం సర్వ సాధారణం అయిపోయింది.

ఒక ఉదాహరణ చెబుతాను. మేము అద్దెకు ఉంటున్న ఇంట్లోనే.. మాకు సమీపంలో..ఉన్న ఇంజినీరింగ్ కాలేజీ లో..పని చేస్తున్న ఒక మేడం అద్దెకి..వచ్చారు.ఆవిడ మాటల సందర్భంలో..మన వాళ్ళు కాని వారితో నేను అస్సలు మాట్లాడను అని అన్నారు. మరి మీ స్టూడెంట్స్ సంగతేమిటి మరి? అడిగాను. వాళ్ళని అంతే.. ప్రక్కకి నేట్టేయడమే!అన్నారు.
ఇలాటి వారిని గురువు అనాలా?

మనం చాలా సందర్భాలలో.. ఏ పి.హెచ్.డి. స్థాయిలోనో విద్యార్ధులని మార్కులు ఇవ్వకుండా కావాలని హింసిస్తున్నారు అనో, అమ్మాయిలని అయితే లైంగిక వేధింపులకి గురి చేస్తున్నారనో అని విన్నాం. కొందఱు ఆ సమస్యని ఎదుర్కున్నారు కూడా.

కానీ.. ఈ రోజున చాలా కళాశాలల్లో.. లెక్చరర్స్ ,లాబ్ టెక్నీషియన్స్ తో సహా.. పిల్లలని వివిధ రకాల కారణాలతో వేధిస్తున్నారు. ఇది నిజం.

మనం పిల్లలకి.. తల్లి దండ్రులుగా ఎన్నో నీతి భోదలు చేస్తాం. వారు మనం చెప్పినదానిని ఆచరించడానికి అన్వనయిన్చుకోవడానికి..సంసిద్దతని చేకూర్చు కుంటూ ఉండగానే మన ఒడిని దాటి సమాజం అనే బడిలో..అడుగు పెట్టగానే..అక్కడ తల్లిదండ్రులు చెప్పినదానికి వ్యతిరేకంగా కనబడగానే పెద్దవాళ్ళు చెప్పేదంతా అబద్దం. వాళ్లకి బయట ఎలా ఉందో తెలియదు అనుకుని ఒక స్థిర నిర్ణయం ఏర్పరచుకుని.. ఇంట్లో..చెప్పే మాటలకి వ్యతిరేకంగా చేస్తూ ..చెబుతూ ఉంటారు.
సమాజంలో వివిధ రకాల మనస్తత్వాలు..వాళ్ళ మనుసు పై అప్లై అయి.. ఒక విధంగా కన్ప్యూజన్ లో..వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఖచ్చితంగా.. అలాటి దశే .. (అడాల్సేంట్ ఏజ్ ) ఆ దశ లోనే పిల్లల లో రక రకాల పైత్యాలు, విపరీత ధోరణి కి కారణమవుతున్నాయి.

కులం పేరిట, మతం పేరిట,ధనిక -పేద తారతమ్యాలు తో.. వర్గాలు ఏర్పడి.. అకారణ విద్వేషాలు..రగులు కుంటున్నాయి.

అది రూపు మాపాల్సింది..గురువులు. వారే కుల పిచ్చిని ప్రోత్సహిస్తుంటే.. కొందఱు అకారణంగా బలి అవుతుంటే.. చూస్తూ ఉండటం కన్నా వేరే మార్గం లేదు. ఖండించి..గొడవలు పెట్టుకునే తీరిక లేదు.మూర్ఖత్వం ముందు తలవంచుకు వెళ్ళడం నేర్చుకున్న సగటు మనుషులం అని అనుకుని నేను కూడా ఆ కోవా మనిషిగానే రాజీ పడతాను , తృప్తి పడతాను.

నాకే ఇలాటి సమస్య వచ్చింది కూడా.. మా అబ్బాయి ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదివేటప్పుడు..తనకి..ఫిజిక్స్ రికార్డు వర్క్ ఉండేది. తను రికార్డ్ వర్క్ కంప్లీట్ చేసుకుని.. సబ్మిట్ చేసేందుకు కాలేజ్కి..తీసుకుని వెళ్ళాడు.

ఆరోజు.. ఆ.."సర్" లీవ్ లో ఉన్నారు.స్పోర్త్స్ రూమ్లో..బాగ్ లో..పెట్టేసి.. గ్రౌండ్ లో..క్రికెట్ ఆడుకుంటున్నారు. ఆట పూర్తయ్యాక చూస్తే.. ఆ రూం కి వెళ్లి బాగ్స్ కల్లెక్ట్ చేసుకుని బాగ్ చూసుకుంటే మొబైల్ ఫోన్స్,ఫిజిక్స్ రికార్డ్ ..మాయం. వాటి కోసం రిపోర్ట్ చేయడం.. మరలా రికార్డ్ తయారు చేసుకోవడానికి సమయం లేకపోవడం వాళ్ళ ఆ సంవత్సరం ..అ సబ్జెక్టు వ్రాయడానికి వీలు కాలేదు.అలా ఆ సబ్జెక్ట్ మిగిలిపోయింది.

నెక్స్ట్ ఇయర్లో.. మళ్ళీ రికార్డ్ తయారు చేసుకుని..సబ్మిట్ చేసాడు మా అబ్బాయి. ఎన్నో లోపాలు చూపి రిజెక్ట్ చేసారు..ఆ.. లాబ్ టెక్నీషియన్.
నిజానికి మా అబ్బాయి వ్రాసుకున్న రికార్డ్ చూసి వ్రాసుకున్న పిల్లలకి..ఓకే.. చేసారు.మళ్ళీ రికార్డ్ తయారు చేసుకుని వెళితే..అక్కడ పెట్టి వెళ్ళు తర్వాత్ చూస్తాను అన్నారంట. ఆయన ముందున్న బల్లపై పెట్టి వచ్చేసిన కొన్ని రోజుల తర్వాత ..మా అబ్బాయి వెళ్లి.."సర్ ..నా రికార్డ్ కలెక్షన్ చేసారా? ఇస్తారా అని అడగితే..అసలు నీ రికార్డ్ ఎప్పుడు ఇచ్చావ్? అన్నారట. మా అబ్బాయి కి విషయం అర్ధమై పోయింది. తనని వేధించడానికే.. అలా చేస్తున్నారని.

తర్వాత జూనియర్స్ చెప్పారట..నీ రికార్డ్ ల్యాబ్ లో..ఉంది అని.
వెంటనే అది తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు పర్మిషన్ లేకుండా లోపలి వెళ్లాడన్న నెపంతో..తిట్టిపోసి.. నీ రికార్డ్ ఇక్కడ ఉందని నీకు ఎవరు చెప్పారు..? లేదని నేను చెబుతున్నాను కదా..అని అరచి.. గెట్ అవుట్..అని బయటికి..నేట్టించుకుని అవమానం తో..బయటకి రావడం... ఆ రాత్రంతా బాధపడటం..చూసి నేను చాలా ఏడ్చాను.

సున్నిత మనస్కుడైన మా అబ్బాయి మనసు గాయపడిన మూలంగా.. ఆ రాత్రంతా నేను మేలుకుని నా బిడ్డకి కాపలా కాసుకోవాల్సి వచ్చింది.

నేను వెళ్లి ఆ "సర్" తో..మాట్లాడతాను..అంటే..వద్దమ్మా!..వాడు (గౌరవభావం తగ్గి) ఎలా పడితే అలా మాట్లాడతాడు. నువ్వు వెళ్లి వాడితో..ఏమైనా అనిపించుకుంటే..బాగోదు..నేనే చూసుకుంటాను అన్నాడు.

అయినా నేను మళ్ళీ మనసు ఆగక సెక్షన్ హెడ్ ని కలసి మాట్లాడితే..అలా ఏం ఉండదు..నేను చూస్తాను..మేడం! మీరేం..వర్రీ అవకండి..అని మాటల నవనీతం పూసి..పంపించారు.

ఒక పది వేలు ఇస్తే.. సబ్జెక్టు కి..మార్కులు ఇస్తారు.అలా ట్రై చేయక పోయారా?అని..ప్యూనుల రాయబారాలు. నేను ఏదైతే అదే అవుతుందని అలా కుదరదే కుదరదని చెప్పాను. మా బాబు వాళ్ళ నాన్న గారు..ఆ డబ్బు ఇచ్చేసి అ వేధింపులు లేకుండా చేస్తే బాగుంటుంది కదా అంటే .. కూడా నేను ఒప్పుకోలేదు.

నిజానికి.. అక్కడ అందరికి తెలుసు. ఆ..ఫిజిక్స్ లాబ్ టెక్నీషియన్ సర్..కుల గజ్జితో పిల్లలని వేదిస్తాడని.డబ్బు ఆశించి పిల్లలని ఇబ్బంది పెడతాడని.

ఇక క్యాంపస్ లో చూస్తే.. ఒకే కులం వారు ఒకే చోట వెహికల్స్ పార్క్ చేయడం దగ్గర నుండి..క్లాస్స్ లో కూర్చునే వరకు అన్ని గ్రూప్ రాజకీయాలే!
ఇతర కులాలవారు వాళ్ళ వెహికల్స్ మద్య పార్క్ చేసుకుంటే..టైర్లు లో.గాలి తీసేయడం.. కొత్త బండ్లు అయితే.. పదునైన వస్తువులతో..గీకి..అందం చెడగొట్టడం, సైడ్ వ్యూ మిర్రర్స్ మాయం చేయడం..అన్నీ మామూలే! ఇవి.. కుల మౌడ్యం తో కనిపించే సంగతులు. విద్యాలయాల్లో..విద్వేషాలు.

మా అబ్బాయి..ఈ జోన్ లో క్రికెట్ లో కాలేజ్ టీం ని గెలిపించడం కోసం అహర్నిశలు కష్టపడటం, కోచ్ తో పాటు కాంప్ లకి వివిధ చోట్లకి వెళ్ళడం.. క్లాస్ లు పోగొట్టుకోవడం,పరీక్షలకి..రెండు రోజుల ముందు పుస్తకం తెరవడం.. అయినా బాగానే వ్రాయడం ఇది పద్ధతి.
వాళ్ళ టీం కి .. అటెండెన్స్ లో.. మినహాయిపు ఇచ్చేవారు . కాలేజ్ కి.. పేరు తెచ్చిపెడుతున్నారని.

అందుకు కూడా .వేధించేవారు.
ఏరా? నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా? నువ్వు.. కాలేజ్ కి హీరో వి అయినా నా ముందు జీరో వే..అని ఎగతాళి చేస్తూ.. మానసిక హింసకి గురి చేసిన వికృత మనస్తత్వం అక్కడ పేరుకుని ఉండేది.

కాలేజ్ కెప్టెన్ గా..యూనివెర్సిటీ ప్లేయర్ గా వి.ఆర్.ఎస్.ఈ .ని ఈ జోన్ లో.. క్రికెట్ విజేతగా నిలపడంలో..ప్రధాన పాత్రధారి అయిన ..చాలా సాఫ్ట్ అయిన కుర్రాడి కే కుల వేధింపు..తప్పలేదు.

నేనైతే.. చాలా కోపంతోనూ,బాధతోనూ.అవసరమైతే..వాళ్ళ బ్యాచ్ తో వెళ్లి..ఘోరావ్ చేసినా బాగుండును అనుకునేదాన్ని. ఇలా వేధింపు కి గురికావడం ఒక చేదు గుర్తు. మరువనన్నా మరవలేనిది కదా!


కారణం .. ఆ "సర్" ఎదురైన ప్రతి సారి నమస్కారం పెట్టలేదని, తన బైక్ పై..మా ఇంటి పేరు..వ్రాయించుకుని మా కమ్యూనిటిని చాటుకోవడం..ఇవన్నీ..ఆ "సర్" కి కంటగింపు గా మారి దాదాపు మూడు సంవత్సరాలు వేధించాడు.

ఆఖరికి..నాలుగవసారి రికార్డ్ సబ్మిట్ చేసాక వారం లో ఒక సారి అయినా ఆ "సర్'" ముందు నిలబడి.. అకారణంగా తిట్టించుకుని.. తన నోటి దురుసు తనాన్ని భరించి మౌనంగా తలవంచుకుని రావాల్సి వచ్చేది. (నాకు ఇవన్నీ తెలియకుండా చాలా సార్లు జరిగేది. ఎందుకంటే..మా అబ్బాయి అంత సహనం నాకు లేదు. అకారణంగా..ఎవరు తిట్టినా నేను ఉపేక్షించను.) ఇక మా అబ్బాయి అయితే కాలం కలసి రాక వీడితో..తిట్టిన్చుకోవాల్సి వచ్చింది..అనే వాడట తన ఫ్రెండ్స్ తో..

అలా ఆ దెబ్బతో.. మావాడి హీరో ఇజం అంతా..అణిగి పోయి..ఆ లాబ్ టెక్నీషియన్ చుట్టూ తిరిగి..తిరిగి అందరి చేతా..పాపం .."నిఖిల్ "..అనిపించుకునేవాడు.

ఒకవేళ స్టూడెంట్స్ వాళ్ళ తిట్లు భరించలేక సహనం కోల్పోయి వయలేంట్ గా మారితే.. "గురువు ని కొట్టిన శిష్యుడు" అని పేపర్ లో..న్యూస్ వచ్చి ఉండేది..అనుకునేదాన్ని.

ఆఖరికి సెక్షన్ హెడ్ జోక్యంతో.. సంతకం చేసి మార్కులు ఇస్తూ.. నాన్-సి తో..పెట్టుకుంటే ఏమవుతుందో ..చూసావా? అన్నాడట..ఎగతాళిగా.. ఇలాటి పైశాచిక ధోరణి లో..ఉన్నారు..గురువులు.

ఆ ల్యాబ్ టెక్నీషియన్ "సర్" ఎవరో..ఇక్కడ చదువుకునే పిల్లలందరికీ తెలుసు. ఆయనతో..చాలా జాగ్రత్తగా ఉండటం నేర్చుకుంటారు. గౌరవంతో కాదు..భవిష్యత్ ని బలి తీసుకుంటాడనే భయం తో.. .

ఇంకొక స్టూడెంట్ అయితే..ఏడు సంవత్సరాలుగా తిరుగుతూనే ఉన్నాడట.
ఎందుకంటే.. ల్యాబ్ లో నోరు పారేసుకుని ఆ స్టూడెంట్ తల్లిని..తిడితే.. ఆ "సర్" కాలర్ పుచ్చుకున్నాడని.. అతనికి. పనిష్మెంట్ ఇస్తూ..అతనికి..ఇంకా రికార్డ్ మార్కులు..ఇవ్వలేదట. పాపం ఈ సంవత్సరంకి..అతనికి విడుదల అవుతుంది. ఏడు ఏళ్ళు శని పీడన అన్నమాట.

చాలా కాలేజెస్ లో..కుల గజ్జి ఓపెన్ సీక్రెట్.. పిల్లలు వేధింపులకి గురి కాకుండా ఉండాలంటే.. కులానికి ఒక కాలేజ్ ఉండాలేమో! లేదా....సబ్జెక్ట్ కి..ఇంత అని.. ముడుపులు సమర్పించుకుంటే..ఇలా వేధింపులు ఉండవు...అంట.

ఇలా కొత్త కొత్త విషయాలు.. తెలుసుకుని ఆశ్చర్య పడుతూ..భాదపడుతూ నా కొడుకు కి కల్గిన కష్టం ఇంకొకరికి రాకూడదని..కోరుకుంటూ..


విద్యాలయాలు.. దేవాలయాలు. మన లోని విష సంస్కృతులని, మన ఇంటి సమస్యల ప్రభావాన్ని పిల్లల పై చూపి.. వారికి.. చదువుల వత్తిడే కాకుండా, మానసిక వత్తిడికి..గురి చేసి వారి పువ్వు లాటి మనసులని నలిపి వేయవద్దని కోరుకుంటూ..

గురు బ్రహ్మల్లారా.. కుల బ్రహ్మలు..గా..మిగిలిపోకుండా ఉండాలని..విన్నపం చేస్తూ.. ఇక్కడ నా.. అనుభవం ని పంచుకుంటున్నాను.

20 వ్యాఖ్యలు:

మురళి చెప్పారు...

చాలా బాధ అనిపించిందండీ చదువుతుంటే.. సాంకేతిక కళాశాలల్లో అనేక రూపాల్లో ఉండే ర్యాగింగ్ గురించి తెలుసు.. కానీ ఇలా, ఈ రూపంలో ఉండడం..........

దినేష్ చెప్పారు...

నేను ఇంజనీరింగ్ చదివినప్పుడు కూడా ఒక లెక్చరర్ దాదాపు యిలాగే వేధించాడు చాలామందిని. మేమైతే విసిగిపోయి, అందరం చందాలు కలెక్ట్ చేశాం వాడిని చంపించేద్దామని...ఎందుకో ఆఖరి నిముషంలో ఆగిపోయాం. ఇప్పుడు తల్చుకుంటే ఆనిర్ణయం అంతబాగా అనిపించదు కానీ, అప్పటి నా పరిస్థితి గుర్తుకొస్తే, ఇప్పుడెళ్ళి వాడిని చంపేద్దామనిపిస్తుంది. ఖర్మ.

అజ్ఞాత చెప్పారు...

చాల మంచి అంశాన్ని ప్రస్తావించారండీ.. డాక్టర్లు, లాయేర్లు, ఇంజినీర్లు తప్పు చేస్తే కొంత మందే affect అవుతారు.. కాని గురువు సరైన రీతిలో లేకుంటే... కొన్ని తరాలు పట్టాలు తప్పుతాయి.. ఇలాంటివి వింటుంటే... చుస్తుంటే... మేము చదువుకున్న రోజుల్లోని గురువులు, వారి విలువలు గుర్తొచ్చి మ్లానమౌతుంది హృదయం..
చక్కటి సామజిక స్పృహతో రాస్తున్నారు... అభినందనలు

రామకృష్ణ

Praveen Sarma చెప్పారు...

కాలేజ్‌లో కులం పేరు చెప్పుకోవడం అవసరమా? రిజర్వేషన్ కాటెగరీ పేరు చెప్పుకోవడమైనా అవసరమా? కాలేజ్‌లో కులం పేరు చెప్పుకోకపోతే ఏ సమస్యా ఉండదు కదా.

అజ్ఞాత చెప్పారు...

సి-కమ్యునిటి వారిని వేధించే వారు కూడా ఉన్నారా!? వారే అందరిని వేదిస్తూ ఉంటారు. దానికి ఇంట్లో వారి మద్దతు కూడా వుంట్టుంది. వారి (కృష్ణా,గుంటూరు గోదావరి జిల్లాల సి కమ్యునిటి వారి)అతి వలననే ఈ పిచ్చి ప్రతి కమ్యునిటికి రాష్ట్రవ్యాప్తంగా పాకి, అన్ని వర్గాలవారికి బాగా వంట పట్టింది. దాని వలన ఇప్పుడు అందరు బాధ పడుతున్నట్లు ఉన్నారు.

సి-కమ్యునిటి వారి వర్గస్పృహ జద్విదితం. పర్ణశాల బ్లాగులో వారి గురించి కొన్నిటపాలు ఉన్నాయి. అవి చదివినపుడు అతిగా రాశారేమో అని అనుకొంటాం. కాని అందులో చాలా వాస్త్లవాలు వున్నాయి. విదేశాలకు వెళ్ళినపుడు తెలుగు వారు కదా పరిచయం చేసుకొని మాట్లాడితే, ఇంటి పేరు తెలుసుకొని బాయ్ కాట్ చేసేవారేంతో మందిని చూశాను. ఎంత సేపటికి వారిలో వారే గుడుగుడు గుంజం,మిగతా వారితో ఎవరు కలవరు. ఒక వేళ కలసినా ఒక డిస్టన్స్ మైన్ టైన్ చేస్తారు. రాయలసీమ సామాన్య ప్రజలకి(కడప,కర్నూల్ &అనంతపూరు)ఇంతటి వర్గస్పృహ లేదు. ఈ విషయం లో ఆంధ్రావారిని చూస్తే ఎంతో కొత్తగా కనిపించారు.

వనజ వనమాలి చెప్పారు...

మురళి గారు..నేను చెప్పిన విషయం ని..క్యాచ్ చేసి..స్పందించినందుకు.. ధన్యవాదములు

దినేష్.. మీలాటి యువతరం కోసమే..ఈ పోస్ట్ వ్రాసాను.ముందు ముందు..నేను వ్రాసే విషయాలు కూడా చూడాలి తప్పకుండా.

రామకృష్ణ గారు ..ధన్యవాదములు. వర్గాలు,కులాలు ,మతాలు లేకుండా ఉండాలనే..మనుషులుగా ఉండాలనే ..నా..ఆలోచనల రూపమే.. ఈ పోస్ట్ లు.

ప్రవీణ్ శర్మ గారు.. నేను ఇలాటి విషయాలు పట్ల అవగాహన పెంచే విధంగా పోస్ట్ లు వ్రాయదలచాను.వీలుని బట్టి చూస్తూ ఉండండి.

అజ్ఞాత గారు అందరు ఒకే విధంగా ఉండరు. మీ స్పందనకి ధన్యవాదములు. ఒక చర్చ లేవనెత్తితే..చాలా విషయాలు వెలుగులోకి వస్తాయి. యువత లో..కుల మౌడ్యం ఎలా పేరుకు పోతుందో.. అందుకు ఎలాటి పరిస్థితులు,వ్యక్తులు ప్రేరేపిస్తున్నాయో చెప్పడమే ..నా ఉద్దేశ్యం...అంతేనండి. ధన్యవాదములు.

బుద్దా మురళి చెప్పారు...

వారిని గురువులు అనడం కన్నా పురుగులు అనడం బాగుంటుంది. ప్రాంతాల గురించి చర్చ అనుకుంటే నా వాఖ్యలు ఉపసంహరించుకుంటాను కానీ హైదరాబాద్ తో పాటు తెలంగాణా జిల్లాల్లో నాకు తెలిసినంత వరకు ఇలా కులపరమైన కక్ష సాధింపులు ఉండవు . దళితులపట్ల అక్కడక్కడ వివక్ష ఉండవచ్చు , కానీ విద్యా సంస్థల్లో కుల చర్చ తక్కువే

వనజ వనమాలి చెప్పారు...

బుద్ధా మురళి గారు.. ప్రాంతాలనుండి..విశ్వవ్యాప్తి చేస్తున్న మన తెలుగు వారి విష సంస్కృతి ఎలా ఉందో.. చెప్పడమే..నా ఉద్దేశ్యం. మరి కొన్ని పోస్ట్ లో కూడా.. కొన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. ఎక్కడా కూడా.. ఇలాటి అహంకార పూరిత కుల మౌడ్యాలు..వేళ్ళూన కూడదని కోరుకుందాం. అలాటి దారిన నడుస్తున్న యువతకి. అవగాహన కల్పించే ప్రయత్నంలో.. వరుస వారి పోస్ట్ లు వ్రాస్తున్నాను. స్పందించిన మీకు ధన్యవాదములు..

SNKR చెప్పారు...

మీ ఆవేదన అర్థమయ్యింది. చదువుకున్న వారిలో కులగజ్జి మరీ ప్రమాదకరంగా మారుతోంది. డబ్బులిస్తే మార్కులేస్తాము అని ప్యూను/అటెండర్ సార్లు చెప్పడాన్ని బట్టి... అవినీతి కులమతాప్రాంతభాషాభేధాలకు అతీతమన్న సత్యాన్ని గమనిస్తాము. ఇలాంటి వివక్షను అనుభవించిన పిల్లలు కసి/ద్వేషంతో అలానే మారే అవకాశాలెక్కువ వుంటాయి, దాన్ని ఆపడం తల్లిదండ్రుల ముందున్న ఓ సవాలు.

వీరుభొట్ల వెంకట గణేష్ చెప్పారు...

_______________________________
సి-కమ్యునిటి వారిని వేధించే వారు కూడా ఉన్నారా!? వారే అందరిని వేదిస్తూ ఉంటారు. దానికి ఇంట్లో వారి మద్దతు కూడా వుంట్టుంది. వారి (కృష్ణా,గుంటూరు గోదావరి జిల్లాల సి కమ్యునిటి వారి)అతి వలననే ఈ పిచ్చి ప్రతి కమ్యునిటికి రాష్ట్రవ్యాప్తంగా పాకి, అన్ని వర్గాలవారికి బాగా వంట పట్టింది. దాని వలన ఇప్పుడు అందరు బాధ పడుతున్నట్లు ఉన్నారు.
_______________________________

I agree 100%

నేను కూడా బెజవాడలోనే ఇంజనీరింగ్ చదివానండి. మా కాలేజీలో నాన్ సి విద్యార్థులను చాలా అవమానాలకు వేదింపులకు గురిచేసేవారు. మాకు ఒక కమ్మ లెక్చరర్ ఉండేవారు, ల్యాబుల్లో ఆయన అటు తప్పించకుండా, తిరిగి వ్రాసే అవకాశం లేకుండా, సరిగ్గా పాస్ మార్కులు వేసేవారు. మా కాలేజీలో ఐతే ఇంటిపేర్లతోనే పిలుచుకునేవారు. ఈ కులగజ్జి నచ్చకే నేను బెజవాడలో పుట్టి పెరిగినా, మద్రాసులో స్థిరపడ్డాను.

వనజవనమాలి చెప్పారు...

SNKR గారు.. మీ స్పందనకి ధన్యవాదములు. విద్యార్ధులని సాధించడం ,వేధించడం గురువుల స్థానంలో ఉన్నవాళ్ళు చేసే సంస్కారవంతమైన పని కాదండి.
ఇంకా చెప్పాలంటే.. కులం,మతం వివక్ష లతో..ఎవరిని ఎవరైనా సాదిన్పులకి వేధింపులకి గురిచేయకూడదు..అనే భావనతోనే నేను ఈ విషయం పంచుకున్నాను.
మా అబ్బాయి సహనవంతుడు కాబట్టి.. నిలబెట్టి తిట్టినా హెరాస్ చేసినా. ఓర్చుకుని బయటపడ్డాడు. వయోలేంట్ గా మారితే.. పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. ?
ఇలాటి దోరణి లని ఎవరైనా ఖండించాలి. అప్పుడే కొన్ని వికృతాలు బయట కి తెలుస్తాయి. అది మేము చేయలేకపోయాం. ఏ తల్లిదండ్రులైనా ఇలాగే ఉంటారు. అలా కాకుండా పోరాడే స్వభావం ఉంటే..బాగుంటుంది అని కూడా ఉంటుంది. ప్చ్.. అలా నలుగురు తోడైతే..బలం చేకూరుతుంది. థాంక్ యు.అండీ
@గణేష్ గారు.. ఇప్పుడు అన్ని కమ్యూనిటిలలోను.. చేతనా వస్థ కనబడుతుంది. ఎవరికి అనుకూలంగా ఉన్న చోట వారు వేదించి,సాధించే ప్రయత్నం చేస్తున్నారు.అది హర్షించా దాగిన పరిణామం అయితే కాదు కదండీ.
అలా కూడదు అని చెప్పడమే నా ఉద్దేశ్యం . http://vanajavanamali.blogspot.in/2011/06/blog-post_09.html వీలయితే సమయం చిక్కితే ఈ లింక్ లో పోస్ట్ చూడండి. Thank you very much!

అజ్ఞాత చెప్పారు...

భీమవరం, విజయవాడ పరిసర ప్రాంతాలలో ఈ జాడ్యం ఎక్కువని విన్నాను. మిగతా ప్రాంతాల గురించి తెలియదు.
C community వారు ఆర్ధికంగా మిగత వాళ్ళ కంటే ఉన్నత స్తితి లో ఉండటం వల్ల, వాళ్ళు మిగతా వాళ్ళని బాగా డామినేట్ చేస్తారని విన్నాను. కాని కులాల గొడవలలో నేను విన్న వాటి లో C community గురించే ఎక్కువ విన్నాను. కులాల వారిగా సెపెరేట్ మీటింగ్స్ కూడా జరుగుతాయంట.వాటికి professors, lecturers attend అవుతారంట. మా ఊరి నుండి వెళ్ళిన ఒకడు భీమవరం లో చదివి వచ్చి ఎంత దారుణంగా తయారయ్యదంటే, నేను ఎవడితో అయిన మాట్లాడటం చుస్తే, వాడు మన వాడు కాదు కదరా, వాడి ఎందుకు మాట్లాడుతున్నావు అని అడిగేవాడు. మాకు షాక్ వాడి ప్రవర్తన చూసి.
anyhow very good post.

SNKR చెప్పారు...

/వయోలేంట్ గా మారితే.. పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. ?/
హింసాత్మకంగా మారితే ఒకరిద్దరి నీచుల ప్రాణం తీయగలడేమో కాని, అబ్బాయి జీవితం పాడవుతుంది. మనుషుల్లో ఆలోచన రేకెత్తేవిధంగా మొదట ఎవరికివారు తమ కమ్యూనిటీల్లో మొదలుపెట్టి మార్పు తీసుకు రావడానికి ప్రయత్నించాలి. 'వాళ్ళు అలా చేస్తే మనం ఎందుకు చేయకూడదు?' అనే ప్రశ్న మీకు ఎదురయ్యే మొదటి సవాలు. దానికి జవాబు ప్రిపేర్ అయి మొదలుపెట్టండి. అంతేగాని, సినిమాలో లా జరగదు. సినిమా 'స్టాలిన్' నిజజీవితంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టు వుంటుంది. :)

వనజవనమాలి చెప్పారు...

సన్నాయి రాగాలు గారు.. ఎప్పుడు ఏ కమ్యూనిటీ పిచ్చి మొదలయిందో కాని మీరు విన్నట్లు.. నేను చూసినది కూడా..నిజమే. ఒక్క" సి" లలోనే కాదండి ..అందరిలోను అన్ని సామాజిక వర్గముల లోను ఆ..జాడ్యం ముదిరిపోతుంది.
ఇంట్లో పెద్ద వాళ్లలోనే అలా ఉంటే. ఇక పిల్లలకి మంచి ఆలోచనలు ఎలా వస్తాయి చెప్పండి.?
ఇంటి పేరు తో తప్ప అసలు పేరుతొ పిలవడం జే జాడ్యానికి చిహ్నమో..మీకు అర్ధం అయి ఉంటుంది కదా!
మన కుటుంబాన్ని గురించి తెలిపే ఇంటి పేరు.. వ్యక్తి ఒక్కడికే చిహ్నం అవుతుందో..నాకు అర్ధం కాదు. అందుకే..తోకలు అవసరమా ? అని వ్రాయాల్సి వచ్చింది.
మీ అనుభవాన్ని పంచుకున్నందుకు ధన్యవాదములు
SNKR .. కొన్ని ప్రయత్నాలు చేస్తాను. వింటారు. విమర్శిస్తారు,వ్యతిరేకిస్తారు, అయినా చెపుతూనే ఉంటారు. "ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠాన్ని" సిరివెన్నెల గారి పాటలో భాగం.
నష్టం జరిగాక కదండీ తెలిసేది. కొంతమంది ప్రేక్షక పాత్ర . బహుశా నేను అంతేనేమో!

Truth Seeker చెప్పారు...

కమ్మ విద్యార్ధిని నాన్-కమ్మ లెక్చరర్ వేధించడమా? ఇదేదో ప్రపంచ వింత లాగా ఉంది లేదంటే ఒక కల్పిత గాధ అన్నా అయ్యుండాలి? కమ్మ కుల యూనిటీ వారి ఇంటినుండే మొదలవుతుంది. కమ్మ కుల విద్యార్ధులు మిగతా వాళ్ళని వేధించడం ఒక మోడస్ ఆపరండీ లాగ జరుగుతుంది. అది జగమెరిగిన సత్యం. వాళ్ళతో 20 సంవత్సరాలు వేగాను. వాళ్ళ వే అఫ్ థింకింగ్ వింటే మనము మానవ జాతిలోనే ఉన్నామా అనిపించేది?

వనజవనమాలి చెప్పారు...

Truth Seeker ,గారు .. actually నేను ప్రొఫైల్ సరిగా లేని కామెంట్స్ పోస్ట్ చేయను. డిలీట్ చేస్తాను. కానీ ఇఏ పోస్ట్ ఏదో కల్పితం అన్నారు.లేదా ప్రపంచ వింత అంటున్నారు. Truth seeker అని పేరు పెట్టుకుని ఫేక్ ఐ డి తో కామెంట్ చేసే మీరెంత నిజాయితీ పరులండీ!?
2005 - 2009 వి.ఆర్.కే.ఎస్ లో తాతినేని నిఖిల్ చంద్ర ని కావాలని వేధించిన ఫిజిక్స్ ల్యాబ్ టెక్నీషియన్ ఎవరో కాలేజీ స్టూడెంట్స్ అందరికి తెలుసు. ఋజువు కి వస్తారా!? కామెంట్ చేసేటప్పుడు ఎవరు పోస్ట్ వ్రాసారో చూసుకుని కామెంట్ చేయండి.ఒక తల్లి అలా వ్రాస్తుందా? మీ అనుభవాలు మీకు చేదైనట్లే ఎవరి అనుభవాలు వాళ్లకి చేదు.ఇది తెలుసుకోవడానికి కాస్త ఇంగిత జ్ఞానం అవసరం.
ఫేక్ ఐ .డి తో ఇంకెప్పుడు నా బ్లాగ్ లో కామెంట్ పెట్టకండి. అలాటి కామెంట్స్ కి నా బ్లాగ్ లో స్థానం ఉండదు. మీకు ఆన్సర్ చెప్పడం కోసమే ఈ కామెంట్ పోస్ట్ చేసాను.

అజ్ఞాత చెప్పారు...

painful experience

వనజవనమాలి చెప్పారు...

puraanapanda Phani gaaru..
ardham chesukunnaaru.
Thank you very much!!

banoo చెప్పారు...

అగ్ర కులం గొప్ప కులం వాళ్ళు అంటే వాళ్ళ ఆలోచనలు నిర్ణయాలు కూడా చాలా గొప్ప గా ఉండాలి.. కానీ మన దురదృష్టం కొద్ది ఈ సమాజం లో ఎంత గొప్ప కులం ఐతే అంతగా పెత్తనం చేయచు జులుం ప్రదర్శించ వచ్చు అనుకుంటున్నారు ........ మేరు మీకు ఎదురయిన పరిస్తితుల గురించి తెలియచేసారు ... ఇలాంటి వాటిని ఎవరు ఉపేక్షించ కూడదు.... కానీ వనజ గారు చివరిగా ఒక్కమాట... బ్లాగ్ లో ఇంట ఆదర్శం గా మాట్లాడే మీరు .... మీ పిల్లల పేర్ల చివర ఆ C - ని తగిలించ కూడా ఉంటే చాలా బాగుండేది.... ఎందుకంటే ఇన్ని తెలిసిన మీకు మీ C కమ్యూనిటీ వాళ్ళ ఆగడాలు తెలియవని అనుకోను....

వనజవనమాలి చెప్పారు...

banoo .. గారు మీ వ్యాఖ్యకి ధన్యవాదములు.
మా పిల్లల పేర్ల చివర తోకలు ..ఉండటమా లేకపోవడమా అన్నది వారి వారి ఇష్టం. నా పేరు ప్రక్కన అయితే లేదు కదా! అయినా కొత్తగా చాలా కమ్యూనిటీ లలో లేనివి తగిలించు కుంటున్నారు. మా పిల్లలకి లేవని ఎగతాళి చేస్తున్నప్పుడే అప్పుడు తోక అవసరమని తెలిసి పెట్టుకుంటున్నారు. వాళ్ళకి ఆ అవసరం లేదని అనిపిస్తే తీసేస్తారేమో!
నేను అనుకున్నట్లుగానే ఎవరిలో ఎక్కడ ఎలాటి జాడ్యాలు ఉన్నా ఖండించాల్సిందే అని మీరే ఒప్పుకున్నారు కదా! ధన్యవాదములు.
నేను ఆదర్శాలు వల్లించే అంతా గొప్పదాన్ని కాదండి. సామాన్యమైన మధ్యతరగతి స్త్రీని. నా పిల్లలని మంచి విలువలతో పెంచాలని అనుకోవడం తప్పు కాదు కదా! సమాజంలో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్తున్నారో..వాటి గురించి వివరంగా తెలుసుకుని వాళ్ళకి అవసరమైన సలహాలు ఇవ్వడం ముఖ్యం కదా! నాకు అన్ని భాద్యతలకన్న మంచి తల్లి అనిపించుకునే భాద్యత సవాల్ గా ఉందని అనిపిస్తూ ఉంటుంది. అందుకే నా పిల్లలకు చెప్పడం కోసం నేను విస్తారంగా చూస్తాను. ఆలోచిస్తాను.అదే చెపుతాను.ఎవరి కమ్యునిటీ లో ఆగడాలని అయినా నేను ఖండిస్తాను. "c " తో సహా!