1, డిసెంబర్ 2013, ఆదివారం

ఎయిడ్స్ భూతం -వివక్ష పిశాచం .

అవగాహన లేమి ఒక ప్రక్క  మానవత్వం లోపించి ఒక ప్రక్క .. మనుషులని బ్రతికి ఉండగానే కాటి

కీడ్వడం పై స్పందనతో ..

ఎయిడ్స్ వ్యాధి నియంత్రణా దినోత్సవం సందర్భంగా .. నేను వ్రాసిన వ్యాసం

 డిసెంబర్  నెల  విహంగ  లో ..

ఎయిడ్స్ భూతం -వివక్ష పిశాచం .. ఈ లింక్ లో 



ఎయిడ్స్ భూతం - వివక్ష పిశాచం  
                                                         వనజ తాతినేని 


పరీక్షలో తప్పామని, ప్రేమ పరీక్షలో ఫెయిల్ అయ్యామని ఆత్మ హత్య చేసుకునే వారికి  హెచ్ ఐ వి పాజిటివ్ గా ఉండి ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులుగామారబోతు కూడా  బ్రతుకుపై ఆశతో జీవిస్తున్న వారిని చూపి జీవితం యొక్క విలువ ఎలాంటిదో చూపాలనిపిస్తూ ఉంటుంది. 

ఒక్కగానొక్క కూతురు. అపురూపంగా పెంచాం . ఓ.. అయ్య చేతిలో పెడితే బాధ్యత తీరుతుందని మంచి చెడు అన్నీ విచారించుకునే పెళ్ళి చేసాము. ఏడాది తిరగక ముందే తాళి తెగి తిరిగొచ్చింది. పొలాలు ఇళ్ళు అబ్బాయి వ్యాపారం చూసాము కాని అబ్బాయికి ఎయిడ్స్ ఉందొ లేదో తెలుసుకునే పరీక్ష చేయించాలన్న ఆలోచనే రాలేదు  వాడు చచ్చిందిగాక పిల్లకి జబ్బు అంటించి పోయాడు  దాని బతుకు బుగ్గిపాలై పోయింది .. ఓ ..తల్లిదండ్రుల కన్నీటి వ్యధ . 

మా అబ్బాయికి ఎలాంటి వ్యసనాలు లేవు, ముంబై లో అయిదంకెల జీతం, అందగాడు   హెచ్ ఐ వి పాజిటివ్ కాదు  అంటూ అన్ని వివరాలతో ఓ..తండ్రి కొడుకు బయోడేటాని అమ్మాయి తరపు వాళ్లకి అందించాడు . అయ్యో! ఈయనేమిటి ఇలా మొహమాటం లేకుండా ఇలా చెపుతున్నాడు . ఇప్పుడు మన అమ్మాయి కూడా అలాంటి పరీక్షలు చేయించుకుని రిపోర్ట్ ఇవ్వాలా? ఇలాంటి సంబందం మనకి కుదరదు .. వద్దని చెప్పీద్దాం ..అని ఓ..సంప్రదాయ కుంటుంబ పెద్దల వెనుకడుగు .. 

అన్నెం పున్నెం ఎరుగని అమాయకులు మహమ్మారి ఎయిడ్స్ బారిన పడుతున్నా .. సరి అయిన అవగాహన లేక .. జీవితాలు బుగ్గి పాలు చేసుకుంటున్న వైనాలు . 

గతంతో పోల్చితే ఎయిడ్స్ వ్యాది పట్ల అవగాహనయితే పెరిగింది కాని .. వ్యాధి గ్రస్తుల పట్ల వివక్ష మాత్రం తొలగిపోలేదు . 

 . ప్రభుత్వం ఎన్ని  ఎయిడ్స్ నియంత్రణా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా  ప్రజలలో అవగాహన పెరగనంతకాలం హెచ్ ఐ వి ని తరిమి కొట్టడం అంత సాధ్యం అయ్యే పని కాదు . ముఖ్యంగా నిరక్షరాస్యులైన ప్రజల జీవన విధానంలో అంతగా మార్పు లేదనడానికి గ్రామీణ ప్రాంతాలలో నానాటికి పెరుగుతున్న పాజిటివ్ సంఖ్య. "నిశబ్ద్దాన్ని పారద్రోలండి ఎయిడ్స్ ని తరిమి కొట్టండి " ప్రచారం వీధి వీధినా జరిగినా హెచ్ ఐ వి పాజిటివ్ వ్యక్తులని తమ మధ్య మసలడానికి కూడా ఒప్పుకొని సభ్య సమాజంలోనే మనం ఉన్నాం . వారిని వారి నిత్య జీవితంలో జీవించనీయకుండా పశువుల కొట్టంలోకి, వూరి చివర పాకల్లోకి వారిని బలవంతంగా ఈడ్చి పారేస్తున్నారు మానసికంగా బలహీనం చేసి వారిని త్వరితగతిన కాటికి చేరుకునేటట్టు చేస్తున్నారు . 


 స్వీయ తప్పిదాల వల్ల, ఇతరుల అజాగ్రత్త వల్ల హెచ్ ఐ వి బారిన పడుతుంటారు అలాగే స్త్రీల విషయాలకి వస్తే వారి భర్తల వల్ల ఈ మహమ్మారి బారిన పడుతున్నవారే అధికం . స్త్రీతో పాటు వారి బిడ్డలు కూడా ఏ  తప్పిదం  చేయకుండానే వారి వారి శరీరం వ్యాధిగ్రస్తమయి సమాజ నిరాదరణకి గురి అవుతున్నారు . వారు తల్లిదండ్రులని కోల్పోయి అయినవారు ఉండి కూడా ఆదరించక ఆనాద ఆశ్రమాలలో ప్రేమ రాహిత్యంతో ,సమాజం పై కసితో పెరుగుతున్నారు. వారికి సమాజంలో బ్రతికే హక్కు ఉంది ఆ హక్కుని కాలరాస్తూ  . వారిని బడికి వెళ్లి చదువుకోవడానికి అనుమతి నివ్వని పాఠశాలలు ఉన్నాయని వింటే ఆశ్చర్యం కల్గుతుంది 
ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలోనూ , స్వచ్చంద సేవా సంస్థలు కలసి హెచ్ ఐ వి పాజిటివ్ వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వారికి  ఉచితంగా మందులు ఇప్పించడంతో  పాటు జీవితం పై ఆశ కల్గిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు . అందులో భాగంగా పాజిటివ్ వివాహ వేదికలని నిర్వహిస్తున్నారు  వారు కోరితే వారి వివరాలని రహస్యంగానే ఉంచుతూ వారికి అవసరమైన సలహాలు ఇస్తూ వారు జీవించడానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అయితే మార్పు రానిదిమాత్రం వ్యాధి గ్రస్తుల కుటుంబం బంధువుల మధ్య మాత్రమే!   మానవత్వం లోపించి వారిని చీత్కారిస్తూ బతికి ఉండగానే  ప్రత్యక్ష నరకం చూపుతారు. 

గురుదేవోభవ అని పూజించే  ఉపాద్యాయులు కూడా వాళ్ళు చదివి ఎవరిని ఉద్దరించాలి అనే భావనతో .. వారిని తరగతి గదుల్లోకి ప్రవేశించడానికి అభ్యంతరం చెపుతూఉండటం గమనార్హం. కళాశాలల్లో, మురికివాడల్లో , గ్రామీణ ప్రాంతాలలో అన్ని చోట్లా .. అవగాహన తరగతులు నిర్వహిస్తూ పాజిటివ్ వ్యక్తుల పట్ల వివక్షన రూపుమాపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే వివాహ వయస్సు దృవీకరణ తో పాటు .. హెచ్ ఐ వి టెస్ట్ కూడా తప్పనిసరి నిబంధన అమలుపరచాలి అప్పుడైనా చాలామంది జీవితం బుగ్గిపాలు కాకుండా కాపాడుకోవచ్చు .భూతం బారిన పడకుండా  ఇలాంటి జాగురుకత అవసరం  .  

ఎయిడ్స్ నియంత్రణ  కన్నా మనుషుల మనస్తత్వంని  మార్చడమే చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది  ఎయిడ్స్ కంట్రోల్  ప్రాజెక్ట్స్ అధికార గణం, రెడ్ రిబ్బన్ సంస్థలు  మాత్రమే కాదు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా  హెచ్జీ ఐ వి పాజిటివ్ వారిని ఎయిడ్స్ వ్యాది గ్రస్తులని తోటి మనిషిగా అంగీకరిస్తూ వారు జీవించి  ఉండటానికి చేసే పోరాటానికి చేయూత నివ్వాలి .  తోటి మనుషుల పట్ల ప్రేమ, కూసింత సానుభూతి, నాలుగు మంచి మాటలు, మనకి ఉన్నదానిని ఇవ్వడం లో చూపే ఉదారం   అవసరం అయినప్పుడు చేసే ఉడతా సాయం మనం మనుషులమే అన్నదానికి నిదర్శనంగా నిలిస్తే బావుండును .

(ఎయిడ్స్ నియంత్రణా దినోత్సవం డిసెంబర్ 1 సందర్భంగా ఈ వ్యాసం )  

1 కామెంట్‌:

పల్లా కొండల రావు చెప్పారు...

<> వీరే ఇలా ఉంటే సమాజంలో చైతన్యం ఏ స్థాయిలో ఉందో అవగాహన చేసుకోవచ్చు. ఈ విషయం పై ధైర్యంగా చర్చలు జరగాలి. అవగాహన పెరగాలి. ఎయిడ్స్ రహిత సమాజం దిశగా ప్రయత్నాలు పెరగాలి. ఎయిడ్స్ మహమ్మారిని పారద్రోలేందుకు శాస్త్రజ్ఞులు చేస్తున్న ప్రయత్నాలు ఫలవంతం కావాలి. ఈ లోగా ఈ అంశంపై చైతన్యం పెంచేందుకు అందరూ నిశ్శబ్ధాన్ని ఛేదించేందుకు ప్రయత్నించాలి. ఆ దిశగా ఆలోచింపజేసేందుకు ఈ ఆర్టికల్ ద్వారా వనజ గారి ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను.