అమ్మాయి.. అలా సరదాగా సినిమాకి వెళ్ళి వద్దాం పద.. తొందరచేసింది నా ఫ్రెండ్
సినిమాకా !? అయిష్టంగా ముఖం పెట్టాను.
నువ్విలా అంటావని తెలుసు అయినా ఎక్కడో ఆశ. అసలు ఇల్లు కదిలి బయటకి రావా? ఎప్పుడూ చదవడం చదవడం తప్ప ఇంకేమి ఉండదు. బయట ప్రపంచంతో సంబంధం వద్దా? పోట్లాటకి తయారయింది.
చదువుతున్న పుస్తకాన్ని ప్రక్కన పెట్టి.. ఇంతకీ ఏమిటి నీ ఆరోపణ ? అడిగాను
ఆరోపణ కాదమ్మాయి! ఎప్పుడు మనుషులతో కలవవు. ఒక వేడుక లేదు వినోదంలేదు నీకు నలుగురితో కలసి ఆనందంగా మెలగడమే తెలియదు. ఒంటరితనమనే శిక్ష విధించుకుని జీవితంలో ఎన్నిటినో కోల్పోతున్నావ్. బయటకి వెళదామని ముస్తాబై కూడా ఆఖరి నిమిషంలో మనసు మార్చుకుంటావ్, ఎవరికీ అర్ధం కాకుండా తయారయ్యావ్. నీలో మార్పు తీసుకువద్దామని ప్రయత్నించి ప్రయత్నించి విఫలమవడం తప్ప ఏం మార్పు కనబడటంలేదు .. కొంచెం కోపంగా, నిసృహగా అంది .
నేను ఆనందంగా లేనని ఎవరు చెప్పారు? అసలు ఆనందం అంటే ఏమిటి? సినిమాలకి వెళ్ళడమా!? ఆ రెండుగంటల అసహజవాతావరణంలో నేనుండలేను. సినిమా చూడటమంటే మీలా వినోదం కాదు అదొక పెద్ద శిక్ష నాకు. అలాగే విందులకి,వినోదాలకి అంటావా? అక్కడ ఆర్భాటాలు ప్రదర్శించే వాళ్ళే తప్ప ఆత్మీయంగా మాట్లాడే వాళ్ళే ఉండరు. అది నాకు నచ్చదు. వేసుకున్న నగలు, కట్టుకున్న చీరలని బట్టి పలకరింపుల మధ్య నేనిమడలేను బంధుమిత్రులని కలిసామన్న సంతోషం లేకుండా వారి ప్రవర్తన ముల్లులా మనసుని గుచ్చుతుంటుంది. అలాగే హాయిగా మెత్తని క్రేప్ చీర కట్టుకుని మనింటిలో స్వేచ్చగా మసలుతూ ఒక రోటి పచ్చడి,చారన్నంతో తిన్న తృప్తి ఆ విందులలో నాకు కనబడదు నిజాయితీగా చెప్పాను.
ఏమో.. నువ్వేన్నైనా చెప్పు నిన్ను నువ్వు అందరి నుండి వెలివేసుకుని అంతర్ముఖి వై బతుకుతున్నావ్, నువ్వలాగే ఉండు. నేను నీలా కాదు జీవితంలో కాస్త సరదాసంతోషం ఉండాలి. సినిమాకి వెళ్ళి వస్తానంటూ వెళ్ళిపోయింది.
తనలా వెళ్ళగానే ప్రక్కన పెట్టిన పుస్తకాన్ని అందుకుని ..ఈ జనాలు ఎందుకిలా ఆనందాన్ని వెతుక్కుంటూ పరుగులు తీస్తారు ? ఆనందం వెతుక్కోవడం వేరు. తామున్న స్థితిలోనుండే ఆనందాన్ని పొందటం వేరని ఎందుకు తెలుసుకోరు? .స్వగతంలో అనుకున్నాను .
ఓ.నాలుగైదు రోజుల క్రిందట నాతొ చదువుకున్న ఇద్దరి బ్యాచ్ మేట్స్ ని చూసాక.. అసలు ఆనందాన్ని అనుభవించడమంటే ఏమిటో ఎరుకైంది. .. అంతస్తులు, కొలతలు ,చట్రాల మధ్య తమని తాము బంధించుకున్న మనుషుల అసంతృప్త జీవన విధానానికి - స్వేచ్చగా సరళంగా బేషజాలు లేకుండా ఆనందంగా ఉండటం ఎలాగో నిరూపణగా నిలిచిన వేరొకరి జీవన విధానానికి ఉన్న తేడా స్పష్టంగా అర్ధమయ్యాక ..
కొన్ని నెలల క్రితం నేను వ్రాసుకున్న మాటలు.. చాలా అర్ధవంతంగా అనిపించాయి నాకు చాలా సంతోషం కల్గింది . . ఆ మాటలు ఇదిగో ఇలా....
అసలు నేటి బంధాల్లో బలమెంత?
ప్రపంచంలో ఆడదే కరువైనట్టు ఏరి కోరి చేసుకున్నాను ఈవిడ గారిని. ఇది భార్య కాదు ...బ్రహ్మ రాక్షసి.
- ఓ భర్త ఆవేదన.
ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో వీడికి భార్యనయ్యాను. ఓ ముద్దా...ముచ్చటా..లేదు
వీడు మనిషి కాదు వ్యసనాలకు చిరునామా. వీడికన్నా జంతువులు నయం.
- ఓ భార్య ఆవేదన.
ప్రపంచంలోనే స్నేహం చాలా చాలా గొప్పది.కానీ నాతో స్నేహం చేసినవారందరూ నన్ను అవసరానికి వాడుకుని అవసరం తీరాక ముఖం చాటేశారు. స్నేహం అన్న మాట వింటేనే కంపరం పుడుతోంది .
- ఓ స్నేహితుడి ఆవేదన.
మధురమైనది...అమరమైనది ప్రేమ అలాంటి ప్రేమ పేరు చెప్పి నన్ను మోసం చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేసి జీవితాంతం నాకు మనోవేదనను మిగిల్చి తన సంతోషం తాను వెతుక్కుని వెళ్ళిపో(యింది)యాడు.
నిజమైన ప్రేమకు ఈ లోకంలో విలువ లేదు.
- ఓ ప్రేమికు(రాలి)డి ఆవేదన.
నిజం చెప్పాలంటే ఒక మనిషి తన జీవిత కాలంలో సగం సమస్యలు తన ఆలోచనలవల్లో,తన ప్రవర్తనలవల్లో ''కొని'' తెచ్చుకొనేవే.
ఈ ప్రపంచంలో ''అవసరం'' కోసం ఎదుటివాడిని మోసం చేసేవారికన్నా...
తమ వారి మీదున్న ''అక్కసు''తో తమను తాము మోసగించుకునే వారే ఎక్కువ.
ఇద్దరు వ్యక్తులు (భార్య/భర్త, ప్రేమికులు,స్నేహితులు) కలిసి జీవనం సాగించాలంటే ముందుగా వారి మధ్య ఉండాల్సింది ''నమ్మకం''.
నేడు ఎంతమంది భార్యాభర్తల్లో/స్నేహితుల్లో/ప్రేమికుల్లో తమ వారిని పూర్తిగా నమ్ముతున్నారు??
మనం చదువుద్వారా సంపాదించిన జ్ఞానం,స్వతహాగా ఉన్న తెలివితేటలు మనకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యనుండి బైటపడటానికి ఉపయోగపడాలి.
దురదృష్టం ఏమిటంటే మనకున్న జ్ఞానంతో,తెలివితో సమస్య'లను తెంపుకోవడం కన్నా తెచ్చుకోవడమే ఎక్కువైపోతోంది.
ముక్కు,మొహం తెలియని పరాయి వారు పలకరిస్తే పళ్ళికిలించుకుని ముఖంలో చాటంత చిరునవ్వు తెచ్చుకుని మరీ పలకరిస్తాం
వారి తరపునుండి మనకు ఏదైనా కష్టమో,నష్టమో కలిగినా క్షమించేసి
వారి దృష్టిలో చాలా ''మంచివాళ్ళం'' అయిపోవడానికి ప్రయత్నిస్తాం.
అదే
జీవితాంతం కలిసి ఉండాల్సిన వారితో మాత్రం ఒక నియంతలా ప్రవర్తిస్తుంటాం
.''మన''వారి దగ్గరకొచ్చేసరికి ఎక్కడలేని రాక్షసత్వం బైటికొచ్చి విలయతాండవం చేస్తుంటుంది.
అస్సలు
''మనసు'' విప్పి మాట్లాడం.
పరాయి వారికిచ్చే ప్రాధాన్యతలో పదోవంతు ప్రాధాన్యత మనవారికిచ్చినా బంధాలు బలపడవా??
మనసు మెచ్చిన క్షణం ''నచ్చినోళ్ళు''
మనసు నొచ్చిన క్షణం ''సచ్చినోళ్ళు''
అయిపోతుంటారు మనవాళ్ళు.
ఇలా క్షణానికోసారి మనసు మారిపోతుంటే బంధాలకు బీటలు వారవా??
మనం ఒకరితో స్నేహం చేసేది..
మనం ఒకరిని పెళ్ళి చేసుకునేది...
మనం ఒకరిని ప్రేమించేది....
పొద్దస్తమానం వారి తప్పులను ఎత్తిచూపుతూ కించపరచడానికా?
పొద్దస్తమానం వారి పొరపాట్లను వేలెట్టి చూపడానికా?
పొద్దస్తమానం శత్రువుల్లా పోట్లాడుకోవడానికా?
మాట,పట్టింపులకు ప్రధాన్యత ఉండదో
అక్కడ బంధాలు బలంగానే ఉంటాయి.
అక్కడ మనుషులతోపాటు మనసులూ మాట్లాడతాయి.
తప్పే చేయని సత్యహరిశ్ఛంద్రులే కావాలంటే గృహాల్లో దొరకరు
వేరే గ్రహాల్లో వెతుక్కోవాల్సిందే.
పొరపాట్లే చేయనివారు కావాలంటే సమాజంలో దొరకరు
సమాధుల్లో వెతుక్కోవాల్సిందే!
ఆలోచించండి ..ఫ్రెండ్స్.
మన సంతోషం మన చేతుల్లోనే కదా ఉంది.
1 కామెంట్:
ఆనందమును బయట వెతుక్కోవడం కాదు, తామున్న స్థితిలోనుండే ఆనందమును పొందవచ్చు...
ఇది సత్యం.
నచ్చినట్లు జీవించాలంటే ... జీవితంపట్ల అపారమైన ప్రేమ వుండాలి ...
ఇది పరమ సత్యం.
చాలా చక్కగా చెప్పారు వనజగారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి