23, డిసెంబర్ 2015, బుధవారం
దేవునికి స్తోత్రము
19, డిసెంబర్ 2015, శనివారం
చెలిని చేరలేక (ఖ )
రాత్రి సమయం మూడున్నర అయింది . రాత్రంతా పడక మార్చుకుంటూనే వున్నాను మనసు బరువుగా వుంది, అస్థిమితంగా వుంది. ఇంకా బాగా చెప్పాలంటే లోపలంతా వుక్కగా వుంది. ఎవరితో పంచుకోవాలో తెలియడంలేదు, సంతోషాన్ని యెవరికైనా పంచగలం. బాధనెవరికి పంచగలం ? ఆప్తులకి మినహా. అందుకే ప్రక్కనే వున్న మన అన్న వారిని వదిలేసి దూరంగా వున్నాసరే వారినే మన ఆప్తులుగా జత చేసుకుంటాం వాసంతి అంతే కదూ ! ఆమె గురించిన ఆలోచనలే నాకీ రాత్రి నిద్రని దూరం చేసాయి మరి కొన్ని రాత్రులు యిలాగే వుండబోతాయనుకుంటా !
ఇప్పుడు తనెలా వుందో అనుకుంటూ మొబైల్ని చేతిలోకి తీసుకున్నాను. ‘whatsaap” లో టింగ్ మంటూ వచ్చిన మెసేజ్. చాట్ ఓపెన్ చేయకుండానే డిస్ ప్లే లో కనబడుతున్న సారాంశం.
” నేస్తం ! నువ్వు దూరంగా వున్నావనేమో రాత్రి నీ స్థానంలో దిండు వచ్చి నన్ను వోదార్చింది” అని. మనసు మరింత బాధకి గురయింది. నిన్న నేను విన్న విషయం మర్చిపోలేకపోతున్నాను. రాత్రి యే౦ జరిగిందో ! అదృష్టవశాత్తూ ఆమె ఆత్మహత్యా ప్రయత్నం విఫలమైంది కాబట్టి తేలికగా వున్నాను లేకపోతే… ఆ వూహే భయంకరంగా వుంది. అయితే నిన్నటి సంభాషణని అప్రయత్నంగానైనా మళ్ళీ గుర్తు చేసుకోవాల్సి రావడం బాధాకరం. ఇది నిత్య గాయాల జ్ఞాపకం కూడానూ .
వ్యధల జీవన సముద్రంలో మరి కొన్ని కన్నీటి చుక్కలు చేరుతున్నాయి. మరి కొన్ని ఆవిరవుతూ వున్నాయి. నిన్నటి నుండి యెడతెరిపి లేకుండా ఆలోచిస్తూనే వున్నాను. ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకినట్టే దొరికి మరికొన్ని ప్రశ్నలని ముందు నిలిపి సవాల్ చేస్తుంది. ప్రశ్నతోనే ఆడదాని జీవితం ముగియాలన్నట్టు. ఇంటి పనులు చేసుకుంటూనే వాసంతికి కొంత ఓదార్పు నివ్వాలనే ఉద్దేశ్యంతో వొక ఉత్తరం వ్రాయాలనుకున్నాను. ఆలోచన రావడమే తరువాయి క్షణంలో చేరుకునే ఈ – ఉత్తరం పెన్నిధిగా కనిపించింది నాకు. మెయిల్ బాక్స్ వోపెన్ చేసి వ్రాయడం మొదలెట్టాను.
వాసంతీ..
నాకవకాశం వుంటే ఈ ఉత్తరానికి బదులు ఉత్తర క్షణంలోనే నీ దగ్గరకి చేరాలని నిన్ను హృదయానికి హత్తుకుని నీ బాధని కొంతైనా పంచుకుని నిన్ను సేదదీర్చాలని ఉంది. నీకు దైర్య వచనాలనివ్వాలని, నీ భవిష్యత్ అగమ్యగోచరంగా మారకూడదని, నీ పిల్లల భవిష్యత్ ని నాశనం చేసే నిర్ణయాలు తీసుకోవద్దని, నీ వ్యక్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని భర్త పాదాల దగ్గరే పెట్టి నిత్యం అగ్ని సీతలా నీ పవిత్రతని నిరూపించుకోమని చెప్పడానికి యీ లేఖ వ్రాయడం లేదు .
అమ్మ నన్ను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది .అమ్మకి బాగొలేదేమో తోడూ తీసుకొచ్చింది అనుకుని అమ్మతో లోపలి వెళ్లాను నన్ను బయటే కూర్చోబెట్టి లోపలి వెళ్లి డాక్టర్ తో మాట్లాడి వచ్చింది. తర్వాత నర్స్ వచ్చి నన్ను లోపలి తీసుకు వెళ్ళి లోపలి గదిలో బల్లపై పడుకోబెట్టింది. “నన్నెందుకిలా పడుకోబెడుతున్నారు నేను బాగానే వున్నాను కదా” అంటూ విదిలించుకుని బయటకి రాబోయాను . డాక్టర్ వచ్చి నా భుజంపై చేయి వేసి మృదువుగా అడిగింది “నీకు మూడు నెలలుగా నెలసరి రావడం లేదని అమ్మ భయపడుతుంది, పరీక్ష చేసి చూడాలి అందుకే నువ్వు బల్లపై పడుకోవాలి ” అని చెప్పి బలవంతంగా పడుకోబెట్టి గ్లవుజ్ తొడుక్కున్న చేయిని లోపలికి పెట్టి కెలికి చూస్తూ .. “నువ్వు యెప్పుడన్నా మగాళ్ళతో పడుకున్నావా ? అలా పడుకుంటే నెలసరి రావు, కడుపు వస్తుంది. అది మీ అమ్మ భయం ” అని ఒక విధంగా నవ్వి చేతిని తీసి తొడుక్కున గ్లవ్స్ తీసి చేతులు కడుక్కుని నాప్కిన్ తో తుడుచుకుంటూ కుర్చీలో కూర్చున్న అమ్మ దగ్గరికి వెళ్లి కంగారు పడకండి అలాంటిదేమీ లేదు వొకో సారి నెలసరిలు ఆలస్యంగా వస్తూ వుంటాయి ” అని చెప్పింది . అమ్మ “అమ్మయ్య మంచి మాట చెప్పారు, యేమైందోనని భయపడి చచ్చాను ” అని తేలికగా వూపిరి పీల్చుకుంది. ఆనాటి పరీక్ష అదొక పెద్ద అవమానంగా తోచింది నాకు . 15 ఏళ్ళ పిల్ల శారీరక సంబంధం యేర్పర్చుకుందేమో అని అనుమానపడే తల్లిదండ్రులు, కాలేజీకి పంపితే చెడు తిరుగుళ్ళు తిరుగుతారని ఆలోచించే వాళ్ళు అసలు శరీరాల కలయిక అంటే యేమిటి , తమకి తెలియకుండానే యేమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి తో సెక్స్ లో పాల్గొనే వాళ్లకి, వంచనకి గురయ్యే ఆడపిల్లలకి గుప్పిట మూసి రహస్యాన్ని దాచినందువల్ల వచ్చే భద్రత కన్నా అనర్ధమే యెక్కువ జరుగుతుందని అనిపించింది. నిజం చెప్పొద్దూ... మూడు నెలలు నెలసరి రాకపోతే ఆదుర్దా పడి అనుమానంగా చూసి , డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి పరీక్ష చేయించడం నా వరకు నాకొక పెద్ద అవమానంగా అనిపించింది.
మరొకరి సంగతి .ఈ మధ్య నాకత్యంత సన్నిహితులురాలైన కుసుమ బాధ విన్నప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకోకుండా బ్రతికి వుండటమే చాలా గొప్పనిపించింది తెలుసా ! ఆమె యెంత ఆవేదనని మనసులో దాచుకుని నవ్వుతూ ఆ విషయాన్ని చెప్పిందో, ఇప్పుడు గుర్తుకు వచ్చినా కన్నీళ్ళు వస్తాయి మరి . అంత పచ్చిగా వుంటుంది ఆమె గాయం .
“అసలు మన బాధని గురించి పట్టించుకోని లోకాన్ని మనమెందుకు లక్ష్య పెట్టాలి . ఎవరి బాధలు యెవరి గాయాలు వారివి. ఎదుటివారికి యివన్నీ యెలా తెలుస్తాయి ? చెప్పినా అర్ధం చేసుకునే సహృదయత వుందంటావా ? సునీతా విలియమ్స్ గురించి కొన్ని చెత్త నోళ్ళు యిలా వాగుతుంటాయి “అంతరిక్షంలో అంతమంది మగాళ్ళ మధ్య అన్నాళ్ళు గడిపివచ్చింది యేమి లేకుండానే వుందంటారా? ” అని. ఆ మాటలు విని మనిషి గా పుట్టినందుకు యెంత విరక్తి కల్గిందో నీకెలా చెప్పగలను. ఇక మన యింట్లో వాళ్ళు మనని అనుమానించడం తక్కువేం కాదు మనం యెవరితో మాట్లాడినా ఆ సంబంధమేదో వున్నట్టు వూహించుకుంటారు,అనుమానంగా చూస్తారు . రహస్యంగా మనం మాట్లాడుకునే ఫోన్ సంభాషణలు వింటూ వుంటారు కూడా. అందుకు నా అత్తగారే ఉదాహరణ అంటూ కృష్ణ ప్రియ చెప్పిన విషయాలు ఇవి . భర్త రాజకీయ నాయకుడి హత్య కేసులో చిక్కుకుని ఆరేళ్ళు జైలు పాలైతే ఒంటరిగా యెoతో పోరాటం చేసింది ఆమె ప్రతి అడుగుని, ప్రతి సంభాషణని కుటుంబం అక్రమ సంబంధం దృష్టితోనే చూసింది. కుటుంబం అండదండలు కావాలని అత్త,మరిది,ఆడపడుచులతో సన్నిహితంగా వుంటూనే వున్నాను. ఒకసారి యే౦ జరిగిందో తెలుసా ? “నా కూతురు విదేశాలకి వున్నత చదువుకి వెళ్ళే సమయంలో మా యింటికెదురుగా వున్న బిల్డర్ నుండి తప్పనిసరై మాట సాయం తీసుకున్నాను . పాపం! అతను కూడా నిస్వార్ధంగా శ్రద్ద తీసుకుని మాట సాయం చేసాడు. అలా నా క్లిష్టమైన పని సులభంగా జరిగిపోయింది. నా కూతురు విదేశానికి పయనమై వెళ్ళేటప్పుడు నాకు మాట సాయం చేసినతను కూడా వాళ్ళ యింటి గేటు ముందు నిలబడి వున్నాడు . అతనికి కూడా వెళ్ళొస్తానని చెప్పి చేసిన సాయానికి థాంక్స్ చెప్పి రా … అని నా కూతురికి చెప్పాను.. నే చెప్పిన మాట విని నా కూతురు అతని దగ్గరకి వెళ్లి వెళ్ళొస్తానని చెప్పి వచ్చింది . అప్పటి నుండి మా అత్తగారికి నా పై యేవో అనుమానం. ఎప్పుడు కలిసినా అతని గురించి ప్రస్తావన తీసుకు వస్తారు, అతని గురించి నేను యే౦ మాట్లాడతానో అని గమనిస్తూ ఉంటారు. ఇంటికి వస్తే సరాసరి బెడ్ రూం లోకి వెళ్లి చెక్ చేస్తూ ఉంటుంది. నా బెడ్ మీద ఒక ప్రక్క ప్రక్క నలిగి వుందా లేక రెండు వైపులా నలిగి వుందా అని పట్టి పట్టి చూడటం నేను గమనించాను. ఒకసారి నా ఫ్రెండ్ వచ్చి రాత్రి వేళ విడిది చేసి వెళ్ళింది. ఇద్దరం కలసి పడుకుని యెన్నో ముచ్చట్లు చెప్పుకున్నాం,అలాగే నిద్ర పోయాం. నాకసలే బద్ధకం ఎక్కువ రోజూ ప్రక్కలు దులిపి నీట్ గా దుప్పట్లు పరిచే అలవాటు లేనితనం కదా! అదే రోజు మా అత్తగారు వచ్చి చెకింగ్ ఒకవైపే నలిగి వుండాల్సిన ప్రక్క రెండవ వైపు నలిగి వుండటం చూసి యెవరు వచ్చారు? అని అడిగింది అప్పుడుకి గాని నాకర్ధమైంది ఆవిడ చెకింగ్ లకి అసలైన అర్ధం ” అని చెప్పింది"కృష్ణప్రియ.
మనిషికి మనిషికి మధ్య యే విధమైన సంబంధం వుండకూడదు వుంటే గింటే ఆ సంబంధం మాత్రమే వుండాలనే ఈ మనుషుల మనస్తత్వాలని చూస్తే జాలి కల్గుతుంది. మనిషికి మనిషికి మధ్య సహజంగా వుండాల్సిన మానవ సంబంధాల స్థానంలో, ఒకరికొకరు యె౦తో కొంత సాయం చేసుకుని ప్రేమాభిమానాలు పెంపొందించుకుని మనుగడ సాగించాల్సింది పోయి ప్రతి సంబంధాన్నీ ఆర్ధిక సంబంధం గాను, శారీరక సంబంధంతో కొలిచే యీ సమాజంలో బతకడం యెంత అవమానకరంగా వుంటుందో తెలుసుకోవడానికి నాకు తెలిసిన సంగతులు చెప్పడం కూడా మంచిదే అనుకుంటున్నాను. నీకవి వుపకరిస్తాయని చెపుతున్నాను తప్ప నిన్ను యింకా యింకా ఆందోళనలోకి నెట్టడానికి కాదని అర్ధం చేసుకుంటావనే నమ్మకంతో వ్రాస్తున్నాను.
ఎవరి ఆలోచనలని బట్టి, మానసికస్థితిని బట్టి వారి ప్రవర్తన బహిర్గతమవుతుంది, అది తెలుసుకో చెలీ ! నీ దుఖాన్ని నేను తీర్చలేను. అలా అని నిన్ను నీ ఖర్మానికి వొదిలి వేయలేను. నేను యే సలహా చెప్పలేను. నా మనసంతా బాధగా, పచ్చిగా వుంది. మన ఈ దుఃఖాలు మనవి మాత్రమే కాదు చెలీ ! సమూహాలవి. ఈ సమూహాలు పెరిగి పెద్దవుతున్నాయి . ఓదార్చే వొడి లేక భూమాత వొడిని వెతుక్కుంటున్నాయి. ఆ వొడిని వెదుక్కునే అవసరం నీకు రానీయకు అని మాత్రం చెప్పదలచాను . ఎందుకంటే ఆర్ధిక స్వాతంత్ర్యం లేని స్త్రీలు , అన్నీ వున్నా కూడా అణువణువునా నిరాశ నింపుకున్న స్త్రీలు ఆవేశంలో క్షణికంలో నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని అంతం చేసుకుంటారు, ఆ బాట వైపు నీ చూపు పడనేకూడదు. తగిలిన గాయాలని గేయం చేసుకుని పాడుతూ సాగిపోవాలి తప్ప గాయం తగులుతుందని శరీరమే లేకుండా చేసుకోవడం ద్రోహం కదా !
ప్రేమతో … నీ నెచ్చెలి “అమృత"
11, డిసెంబర్ 2015, శుక్రవారం
రెండు నాల్కల ధోరణి
ఫ్రెండ్స్ !
రచనలు రచనలు గాను కవిత్వం కవిత్వం గా వ్రాసుకుంటే ఎవరైనా హర్షిస్తారు. బాధితులు పీడితులు ఉంటె సహానుభూతి చెందుతారు. కుల మత జాతులకి అతీతంగా స్పందిస్తారు అందులో ఎలాంటి కుట్రలు సందేహాలు ఉండవు. ఈ మధ్య కొందరు సూడో అభ్యుదయవాదులు ముసుగేసుకుని మరీ వచ్చి వారి అసహనాన్ని వ్యక్తిగత ద్వేషాన్ని రచనల్లో, కవిత్వంలో వ్యక్తీకరిస్తున్నారు. ఒక కులాన్నో లేదా ఒక మతాన్నో ఒక వర్గాన్నో టార్గెట్ చేసుకుని వచ్చి వారి ప్రేలాపనలతో ఇతరులని కించపరుస్తున్నారు. అణచివేతకి గురైతే ఎక్కడ గురయ్యారో అక్కడ ప్రశ్నించండి. వ్యక్తులని వదిలేసి సమూహాలకి ఎందుకు ఆపాదిస్తారు ? ఎవడో ఎక్కడో ఏదో చేస్తారు కూస్తారు. దాన్ని పట్టుకుని కులం మొత్తానికి మతం మొత్తానికి జాతి మొత్తానికి ఆపాదించి కసిదీరా తిట్టి దూలానందం పొందుతున్నారు.
చరిత్రలో చాలా పీడనలు అణచివేతలు ఉన్నాయి. అవి ఇంకా అలాగే ఉన్నాయి అసలేమీ మారలేదు అన్నట్లు ఉంటె ఎలా ? క్రమేపీ సమాజం మారుతుంది మనుషులు మారుతున్నారు. అణచివేయబడిన వర్గాలు తెలివి చదువు ఉద్యోగం బలం పెంచుకుని చట్టాల గురించి తెలుసుకుని ప్రశ్నించే స్థాయికి, తిరిగి ఇతరులని బాధించే స్థాయికి చేరుకున్నట్లే ... ఒక్కప్పుడు బలవంతులమని విర్రవీగినవాళ్ళు సైతం వాళ్ళ మూఢత్వాన్ని ఛాందసవాదాన్ని వొదిలి జనబాహుళ్యంలో కలిసిపోతున్నారు. సామరస్యంతో ఇతరులతొ కలసి పోతున్నారు. ఈ విషయాన్ని మరుగున పరిచి మీ వ్యక్తిగత ద్వేషాలని ఒక కులంలో ఉన్న మొత్తానికో ఒక మతంలో ఉన్న మొత్తానికో అపాదించవద్దు. పదే పదే వ్యక్తులకి బదులు సమూహాలకి సమాజం మొత్తానికి మీ ద్వేషాన్ని అంటకట్టవద్దు. మీకెలా ఒక కులం ఉందో మాకు అలాగే ఒక కులం ఉంది. మీకిష్టమైన మతం మీరెలా పాటిస్తారో మా కిష్టమైన మతాన్ని మేమలాగే పాటిస్తాం. మీరు అవహేళనలకి అన్యాయానికి గురైతే ప్రశ్నించండి మా దృష్టికి వచ్చినప్పుడు ఖండించడం, మీకు మద్దతు పలకడం అన్నీ ఉంటాయి.
అణగారిన వర్గాల తరపున వకాల్తా పుచ్చుకుని (కొందరు ఇలా వకాల్తా పుచ్చుకుని వ్యక్తిగత ప్రయోజనాల కోసం నమ్మిన వాళ్ళని నట్టేట ముంచేసిన వాళ్ళు ఉన్నారు) అందరిని ఒకే గాట కట్టేయడం సబబు కాదు. చీము, నెత్తురు, రోషం, అభిమానం మాకూ ఉన్నాయి. ఎల్లకాలం చూసి చూడనట్లు పోవడం కూడా కుదరదు. దయచేసి వివాదాస్పద వ్రాతలు వ్రాయకుండా ఉంటే మంచిది. చదువుకుని సంస్కారవంతంగా ఆలోచించే రచయితలూ కవులు కళాకారులే ఇలా ఉంటె మిగతావారి సంగతేమిటని ఆలోచిస్తున్నారా ? లేదా !? చాలా విచారంగా ఉంది. అభిప్రాయబేధాలు సహజంగానే వస్తూనే ఉంటాయి. కాదనడంలేదు. ఎవరు ఏమీ మారలేదు అనుకుంటే మాత్రం జాలిపడటం తప్ప ఇంకేమీ మాట్లాడలేం . కానీ వంచన చేయడం ఆత్మ వంచన చేసుకోవడం మంచిది కాదు
."సో కాల్డ్ మేధావులు...స్తీవాదులు....సామాజిక సేవేద్దారకులు ...వారి కిష్టమైనపుడు మాట్లాడతారు ...లేకపోతే. .తేలు కుట్టిన దొంగలలా నో రుమూసుకుంటారు. మరల వారే ఇంకొకరి మతాలను కులాలను విమర్శిస్తారు. రెండు నాలుకల నీతి చాలా ఎక్కువ ఉంది"
పరమత సహనం నా అభిప్రాయం ...
పరమత సహనం భారతీయ ఆత్మ దాని గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. నాయకులు వేరు ప్రజలు వేరు . భిన్న సంస్కృతితో తరతరాలుగా మమేకమైపొయిన జాతి మనది. అయిదేళ్ళు పాటు పరిపాలించే నాయకులోచ్చి ఇది ఒక మతానికి చెందిన దేశమనో లేదా ఈ దేశ వారసత్వానికి ప్రతీకలమనో చెప్పుకున్నంత మాత్రాన మిగతా మతాల వారందరూ ఈ జాతీయులు కాకపోతారా? అలాంటి నాయకులకి బుద్ది చెప్పాలంటే వారి కుళ్ళు కుతంత్రాలు అర్ధం చేసుకున్న వారే నడుంబిగించాలి కానీ కొంత మంది కావాలని మంటలని ఎగదోస్తున్నారు. అందుకు విచారంగా ఉంది.
ఈ మధ్య నా కథ ఒకటి ప్రింట్ మీడియాలో ప్రచురింపబడినప్పుడు పాఠకుల స్పందన కోసం మొబైల్ నెంబర్ ఇచ్చాను. వెంటనే ..దేవుడు మీకు స్వస్థత చేకూర్చుతాడు ప్రార్ధనామందిరమునకి రండి తో మొదలెట్టి ప్రతి రోజు సువార్త వాక్యాలు అందించడం మొదలెట్టారు. మరి ఈ రకమైన మత ప్రచారం పట్ల కూడా సహనం వహిస్తూనే ఉన్నాం. మాకు సమీపంలో ఒక గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో వినాయకుడి గుడి కట్టి పదేళ్ళు అయింది. దానికి దగ్గరలోనే విదేశాల నుండి వచ్చిన సొమ్ముతో ఒక ఇంటిలో చర్చిని నెలకొల్పారు. తెల్లవారుఝామునే పోటాపోటీగా మైకులు పెట్టి మరీ ఆమెన్ - గణేష్ మహారాజ్ కి జై అంటూ వినిపిస్తారు . నిద్ర ఖరాబై ఆరోగ్యాలు పాడై ఏమిటీ శిక్ష అనుకుంటున్నాం తప్ప ఒకరినొకరు తిట్టుకోవడంలేదు.
మనం తల్లి గురించి గొప్ప కవిత్వం వ్రాస్తాం. చెల్లి గురించి కవిత్వం వ్రాస్తాం. ఆలి గురించి అంతకన్నా గొప్పగా కవిత్వం వ్రాస్తాం. ఆకాశంలో సగమంటూ కీర్తిస్తాం. ఆహా .. ఓహో అనే భట్రాజు పొగడ్తలు వందిమగాదులు ఎందఱో ! ఒక మత పెద్ద ఈ ఆడోళ్ళని గడ్డిపోచ లెక్కన జమకట్టినప్పుడు మాత్రం అస్సలు మాట్లాడరు . అది వాళ్ళ మతానికి సంబంధించిన విషయం మాత్రమే ! కలగజేసుకుంటే ఫత్వాలు జారీ చేయబడతాయని భయం .
అదే ఇంకో మతం స్వామీజీ ఎక్కువమంది పిల్లలని కనాలంటే మాత్రం ..ఈ ఆడజాతి మీద అంతులేని సానుభూతి పుట్టుకొస్తుంది. అప్పుడు మాత్రం బాగా మాట్లాడతారు .
అభ్యుదయమంటే కులమతజాతికి అతీతంగా నిర్భయంగా న్యాయంగా మాట్లాడాలి కదా ! నేను ఈ రెండు నాల్కల ధోరణి గురించే మాట్లాడుతున్నాను.
పరమత సహనం హిందువులకి లేదని వక్కాణించే సూడో మేధావులు వారి మతం వారి వ్యక్తిగతం అనుకుంటారు. పరమతం వారి విశ్వాసాలు మాత్రం సమాజం పై బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపణలు చేస్తారు. అసలు ఈ బీఫ్ వివాదాలు లేని గ్రామాలు భారతదేశంలో మూడొంతులు ఉన్నాయంటే నమ్మరు వీళ్ళు.
మా పల్లెటూర్లో హిందూ ముస్లిం క్రిష్టియన్ బేధాలు లేవు ఏమైనా వస్తే అవి అప్పటికప్పుడు సమసిపోయేవే ! మా మధ్య కుహనా మేధావులు లేరు అందుకే మేము ఇంకా స్వచ్చంగా స్వేచ్చగా ఆనందంగా బ్రతకగల్గుతున్నాం అని చెప్పడానికి గర్విస్తున్నాను. జై హింద్ !