3, జూన్ 2016, శుక్రవారం

కాస్త విను చిన్నమ్మా...

చిన్నమ్మా !  ఎలా ఉన్నావ్ ? 


ఈ పలకరింపులో ఉట్టిపడే ఆత్మీయత నీ మనసుని తాకుతుందని నాకు తెలుసు. 

మన మనసులు మాత్రమే  సున్నితమైనవి . ఎదుటివారి మనసు మాత్రం పాషాణం లాగా ఉండాలి అంటే  ఎట్టాగమ్మా!  ఎందుకంటే మనం ఎన్నెన్నో అంటుంటాం కదా ! వాళ్లకి అసలు చక్కిలిగిలి ఉండకూడదు. ఎన్ని రాళ్ళు వేసి కొట్టినా చలించకూడదు అంటే ఎట్టాగమ్మా!  ఇలాగైతే చాలా కష్టమే చిన్నమ్మా !!


నీలో హంస గుణం లేకుంటే ముందుకు సాగడం కష్టం చిన్నమ్మా ! రక్త స్పర్శ వేరు, భావజాల స్పర్శ వేరు చిన్నమ్మా ! ఎదుటివాడిని తిడుతూ కౌగిలికి ఆహ్వానిస్తే రారు చిన్నమ్మా! ఎదుటివాడిని ద్వేషించి మనల్ని మనం వెలివేసుకుంటే వ్యక్తీ స్వేచ్ఛ అనుకుని హాయిగా బతికేయవచ్చు. మంది కోసం మందిలో బతికే వాళ్లకి  ఈ సూత్రం పనికిరాదు చిన్నమ్మా ! నిజానికి దూరంగా పారిపోకు చిన్నమ్మా ! దైర్యం నీ సహజ గుణం. నిలబడి ఎదుర్కో! 


అభాద్రతాభావంలో నలిగిపోకు. నువ్వంటే నాకెప్పటికీ అభిమానమే ! అందుకే చెపుతున్నా!  అకారణంతో నచ్చలేదని దూరంలో పెట్టాననుకుని అందరిని దూరం చేసుకుంటున్నావ్. కాలాతీత,మతాతీత, కులాతీత స్నేహాన్ని అర్ధం చేసుకుంది ఇంతేనా !? 


ఎదుటివారు చెప్పింది వినాలి కదా !.  ఏం చెప్పదల్చారో  వినకుండా కూడా  దూరంగా నెట్టేస్తే ఎలా ? 


మొన్న ఒకసారి నాకూ కళ్ళు విచ్చుకున్నాయి పత్తి పువ్వులా... జీవించి ఉన్నప్పుడు తోటి మనుషుల నుండి ఎదురయ్యే    ప్రతిచర్య ఒక  రాజకీయమే అని ఆలస్యంగా తెలుసుకున్నాను . 


కొందరిలో హటాత్తుగా కనబడే ఉదారవాదాన్ని చూసి తెగ సంబరపడిపోతాను . వారి హృదయం విశాలమైందని.

కానీ వారి సహజ గుణం అలాగే ఉంటుందని తెలియకపోతే ఎలా పిచ్చి వనజమ్మా ..అని మనసు నాలుగు కూకలేస్తే గాని సత్యం బోధపడలేదు. కొందరు ఎపుడు దొరుకుతారా అని ఎదురు చూస్తారు . అచ్చం పులిలా. అవును నిజం ... పొదలమాటున పులిలా పొంచి ఉంటారు. సమయం వచ్చినప్పుడు చావు దెబ్బ తీస్తారు.


ఇప్పటికైనా అలాంటి వారి నైజం నీకు తెలిసిందని అనుకుంటున్నాను. ద్రోహం చేయడం నా రక్తం లోనే లేదు. నమ్మడమే ! నమ్మినదానిని నిలబెట్టుకోవడమే నాకు చేతనైనది. ఇంకో విషయం ఏమిటంటే  నిష్కర్షగా నా అభిప్రాయం చెప్పడానికి ఏనాడు వెనుకాడను.  


ఎవరో వస్తారు కొంత పరిచయంతో. ఆ పలకరింపులన్నీ సాధారణ పలకరింపులే ! తాడే పామై కనబడటం నీకున్న అభద్రతా భావమే ! దానికి నేనేం చేయను ? హృదయం నలిగిందని బాధపడటం తప్ప. 


ఈ దేశపు సౌభాగ్యం అన్ని మతాల స్త్రీలు అందంగా ఉండాలని అలంకరించుకునే గోరింటలో ఉంది 

ఈ దేశపు ఐకమత్యం అందరి భుజాలపై మోసే త్రివర్ణ పతాకంలో ఉంది. 

ఈ దేశపు సామరస్యం జనగణమన జాతీయ గీతంలో దాగి ఉంది. 


మొత్తానికి ఈ దేశపు ఘనత    mile sur mera tumhara జీవన గీతంలో ఉంది. కాదనగలవా !?  


మనమొక్కరిమే మోస్తున్నామని అనుకోవడం భ్రమ కాదూ ! మానసిక దౌర్భల్యాలని వదిలించుకో ..  హృదయాన్ని ఆకాశం చేసుకో ! 


సర్వ మానవ హితమే మన మతం అని చెప్పిన వివేకానందుడు అంటే మనకెంతో  ఇష్టం కదా ! ఆదారిలోనే మనం ఉన్నాం. ఆ నడకలోనే ఉన్నాం. 



                                                                                                                    యువర్స్ లవింగ్లీ ... 







1 కామెంట్‌:

Zilebi చెప్పారు...



కాస్తా విను చిన్నమ్మా !
విస్తారమయినది లోక విస్మయ రీతుల్
చూస్తున్న మేర కలయే
నాస్తీ లోకం జిలేబి నాటక మోయీ !

జిలేబి