23, ఏప్రిల్ 2017, ఆదివారం

చెక్కేసిన వాక్యం

చెక్కేసిన వాక్యం -వనజ తాతినేని

Life is blended with Kitchen

వాక్యాన్ని చెక్కుతుండగా
కాఫీ ఇవ్వవే .. అంటావ్ అధికారం ధ్వనిస్తూ
నిమిషాల్లో బ్లెండెడ్ కాఫీ పొగలు కక్కుతుంది కానీ
వాక్యమెక్కడికో జారుకుంటుంది నిసృహగా
కలల బరువుతో ఈ రెప్పలు
బాధ్యతల బరువుతో ఆ రెక్కలు
ఎన్నటికీ విచ్చుకోలేవని
నిత్యం సరిక్రొత్తగా అర్ధమవుతాయి.
తడిచిన కళ్ళతో పాఠం నేర్చుకుని
మరీ ..భోదిస్తాం.
అమ్మలూ... వంటిల్లు స్త్రీలకి కిరీటం
ఎప్పుడైనా తీసి ప్రక్కన పెట్టుకో
భయపడకు..
ఎవరూ ఎప్పుడూ దోచుకెళ్ళరులే
పాకశాలతో చిక్కబడిందే స్త్రీల జీవితమని
ఎప్పటికీ మారని నిర్వచనం
ఎప్పుడో చెక్కేసిన వాక్యం కదా !


19, ఏప్రిల్ 2017, బుధవారం

రమ్మంటే రాదు

రమ్మంటే రాదు 
ఎంత విదిల్చినా రాని సిరా చుక్కలా  
తనంతట తానే వచ్చి 
పాతదే అయినా మళ్ళీ సరికొత్తగా వొచ్చి 
తిరిగి  పోనట్లు బెట్టు పోతుంది 

రాలుతున్న ఆకుల రాగాన్ని 
కొత్త చివురులందుకున్నంత గ్రాహ్యంగా 
ఆలోచన పోగు అతుక్కోక తగని అవస్థలవుతుంటే 
పడమటి సంజె  వెలుగులో సాగే పొడుగు నీడలా 
పక్కుమంటుంది, సౌందర్య తృష్ణ మరీ రగులుకుంటుంది  

గరిక కొమ్మ మీద నీటి పక్షిలా మనసు ఉయ్యాలూగువేళ  
గాలి తరగలొచ్చి మేనుపై సువాసనలద్ది పోతుండగా  
తటిళ్ళున్న  తగులుకున్న పదాలేవో స్వరాలై  
లేత చిగురుటాకు పెదవులపై  
ఒంపులు తిరిగి  పాటగా పరిమళిస్తుంటాయి    

గతాన్ని వర్తమానాన్ని కవనంలా  
కలగలుపుకుని సాగే ప్రవాహం లాంటి మనిషి  
ఉత్సాహం  జీవ పాత్ర అంచులు దాటి పొర్లిపోతూ ఉండగా 
సాలె గూడులా అల్లుకున్న బంధాలని పుట్టుకున్న తుంచేసి 
జీవితమంటే ఇంతేగా అన్నట్టు తప్పుకుంటాడు .
పరిశుభ్ర ప్రియుడైన ఆ  దేవుడు 

ఇప్పుడు తెలిసిందా !? 
ఈ భువిపై శాశ్వత అసత్యాలు కానీ 
అశాశ్వతమైన సత్యాలుకానీ లేనేలేవు 
కవిత్వంలా ఋతువుల్లా అవీ రంగుమార్చుకుంటాయాని జెప్పి  
వనదేవత కాలికి బలపం కట్టుకుని వెళ్ళిపోయింది  
పువ్వులాంటి పదం పదంలో  మధువుని నింపడానికో 
చీడ పట్టిన  వాక్యపు  తరువులకి శుస్రూష చేయడానికో  అన్నట్లు 
ఇక రమ్మంటే రాదు తానై  తానుగా
వెలిగే దాకా వేచి ఉండాల్సిందే.

19/04/2017.   
  
.  

17, ఏప్రిల్ 2017, సోమవారం

Old Man అని

ఒకానొకప్పుడు నిజంగా చెప్పాలంటే  ఓ పదహారు ప్రాయంలో రేడియోలో ఏ పాట విన్నా ..
అబ్బా ! ఈ పాట ఎంతబావుంది, ఎవరు పాడుకున్నారో , అబ్బాయి చిలిపిగా నవ్వుకున్నాడా ? అమ్మాయి బుగ్గలు సిగ్గులతో కెంపులయ్యాయా? పాట సాహిత్యం ఎంత బాగుంది ..నీ మనసు నా మనసు ఏకమై ..అంటున్నారు. ఏకమైతేనే ఇలా అనిపిస్తుందా ? లేకపోతే ఇలా అనిపించదా ? ఇలా పాట పాడుకోవాలంటే శోభన్ బాబు లాంటి అబ్బాయిని ఎక్కడ వెతుక్కోవాలి ? ఆ తొందరలో ఎవరినో ఒకరిని ఎన్నుకుంటే మా అమ్మ కాళ్ళు విరక్కొట్టదూ, మా నాన్న సినిమాల్లో విలన్ లాగా ఆ అబ్బాయిని ఏమైనా చేసేస్తే ...

ఇవన్నీ వద్దు కానీ ..అయినా నా వయసుకి శోభన్ బాబు లాంటి ముసలాడు ఎందుకు ? అసలే మా పెద్ద నాన్న చిన్ననాటి స్నేహితుడంట. మా వూరిలో పుట్టి పెరిగి .మా వూరి నుండే మైలవరం వెళ్లి చదువుకున్నాడంట పెద్దనాన్నతో కలిసి. ఇక శోభన్బాబు కథలు మా పెదనాన్న తాతయ్య కథలు కథలుగా చెప్పేశారు. ఇక శోభన్ బాబు అంటే ఇష్టం చచ్చిపోయింది . అతన్ని అమ్మ,పిన్నమ్మలు అత్తలు, పెద్దక్కలు,చిన్నక్కలు అందరూ పీకల్లోతు ప్రేమించేసిఉంటారు కృష్ణ,కృష్ణంరాజు కూడా కాదు. వీళ్ళందరినీ ఎప్పుడో ప్రేమించి ఉంటారు. ఆయినా నాకీ ఈ ముసలి టేస్ట్ ఏమిటీ ?   చక్కగా చిరంజీవి , తర్వాత తర్వాత వచ్చిన వెంకటేష్,నాగార్జున లు ఉండగా .. అని విరక్తి తెచ్చుకుని అయినా ఉత్తరాది హీరో రాజేష్ ఖన్నా ఉండగా వీళ్ళందరూ నాకెందుకు ? అని తిరస్కారంగా ఓ చూపు చూసి. పాట మీద మాత్రమే మక్కువ పెంచుకుని ..అబ్బా ..ఇంత చక్కని పాటని ఆ రామకృష్ణ గారు బుగ్గన కిళ్ళీ పెట్టుకుని మరీ పాడినట్టున్నారు.అయినా కూడా చాలా బావుంది,నాకు నచ్చేసింది అనుకుంటూ వినడానికి ఇష్టపడిపోయాను.

ఇప్పుడు you tube లో ఈ చక్కని పాటని చూస్తూ అయ్యయ్యో ! శోభన్ బాబుని Old Man అని ప్రేమించకుండా వదిలేసానే అని బాగా ...గా ...ఆ.ఆ.. బాధపడుతూ స్క్రీన్ మీద చూస్తూ తృప్తి పడుతూ ఉంటాను. అయినా ఈ శారద గారేమిటండీ.. శోభన్ లాంటి సోగ్గాడ్ని ఎన్ని సినిమాల్లో ఆమె చుట్టూ తిప్పుకుంటుంది అని ఈర్ష్య కూడా .. ఏదైతేనేం ..ఈ పాట వినడం యవ్వన వీచికపై ..ఓ మధుర భావం . ఇప్పటి సరదా రాత ఇది . పాట మీకూ నచ్చుతుంది ..ఓ చూపు చూసేయండి మరి .

నీ మనసు నా మనసు ఏకమై
నీ నీడ అనురాగ లోకమై
ప్రతి జన్మలోన జతగానే ఉందాములే

చలిగాలి తొలిమబ్బు పులకించి కలిసే
మనసైన చిరుజల్లు మనపైన కురిసే
దూరాన గగనాల తీరాలు మెరిసే
మదిలోన శతకోటి ఉదయాలు విరిసే
పరువాల బంగారు కిరణాలలో
కిరణాల జలతారు కెరటాలలో
నీవే నేనై ఉందాములే

నీ మనసు నా మనసు ఏకమై
నీ నీడ అనురాగ లోకమై
ప్రతి జన్మలోన జతగానే ఉందాములే

ఏనోములో నిను నా చెంత నిలిపే
ఏ దైవమో నేడు నిను నన్ను కలిపే
నీ పొందులో ప్రేమ నిధులెన్నో దొరికే
నీతోనే నా పంచ ప్రాణాలు పలికే
జగమంత పగబూని ఎదిరించినా
విధి ఎంత విషమించి వేధించినా
నీవే నేనై ఉందాములే

నీ మనసు నా మనసు ఏకమై
నీ నీడ అనురాగ లోకమై
ప్రతి జన్మలోన జతగానే ఉందాములే---

సాహిత్యం :-సి. నారాయణ రెడ్డి,
గళమాధుర్యం: రామకృష్ణ,సుశీల,
స్వరాలు సమకూర్చినవారు : చక్రవర్తి
చిత్రం : ఇదా లోకం (1973)


15, ఏప్రిల్ 2017, శనివారం

తన్హాయి

ఓ..కాంత ..ఏకాంత గాధ.."తన్హాయి"



తన్హాయి నవలని చదవడం మొదలెట్టగానే కొంచెం ఆసక్తి. ఓహ్.. పెళ్ళయిన వారి మధ్య ప్రేమ చిగురించిందా!? ఏమవుతుందో..చూద్దాం అనుకుంటూ ఏకబిగిన చదవడం మొదలెట్టాను. చదువుతున్న కొద్దీ పరిచయం అవుతున్న ప్రతి పాత్ర లోను మరో నేను ప్రత్యక్షం అవుతున్నాను. కల్హార,కౌశిక్ ల ప్రేమ,వారి మానసిక సంఘర్షణ  నాకు తెలిసిన ఎవరిలోనో చూస్తున్నట్లు బలమైన భావన.


కౌశిక్ అనుకుంటాడు కల్హార మనసు నాది. ఆమె పూర్తిగా నా సొంతం. ఆమెని నాతొ కలసి జీవించడానికి ఒప్పించి నా భార్యకి తెలియకుండా.. ఆమెతో.. కలసి ఉండటం ని సాధ్యం చేసుకోవాలి. పెళ్ళైన తర్వాత వచ్చే ప్రేమలో ..ఆ ప్రేమని సొంతం చేసుకోవడంలోను ,మరొకరికి అన్యాయం చేస్తున్నామన్న భావనలోను యెంత మానసిక క్షోభ ఉంటుందో చదువు కుంటూ పోతుంటే టెన్షన్ మొదలయింది. ఆఖరికి ఏమవుతుందో అన్న టెన్షన్ తో ఆఖరి పేజీలు చదవడం నాకు అలవాటు. కానీ మనసు ఉగ్గ బట్టుకుని ఓపికగా చదవడం చేసాను. విదేశాలలో జరిగే పెళ్ళిళ్ళు,వారు తీసుకునే స్వేచ్చా నిర్ణయాలు అందువల్ల కుటుంబానికి జరిగే నష్టాలు గురించి ఆలోచిస్తూనేకౌశిక్, కల్హారల ప్రేమ ఒక తీరం చేరాలని ఆశించాను. కానీ కల్హార యెంత సంఘర్షణ అనుభవించింది. యెంత నిజాయితీగా తన మనసుని,భావాలని వ్యక్తీకరించగల్గింది అని నిశితంగా చూసేటప్పటికి ఆ పాత్ర పై నాకు అమితమైన ప్రేమ పుట్టుకొచ్చింది. చదివిన భాగాన్నే  మళ్లీ మళ్లీ చదివాను.


అపుడు ఈ నవలపై ఒక సమీక్ష వ్రాస్తే అన్న ఆలోచన వచ్చింది. అది ఒక సాహసమే అనుకున్నాను. ఎందుకంటే సమీక్ష వ్రాయడమంటే  ప్రతి పాత్రని నిశితంగా అర్ధం చేసుకోగల్గి ఏ పాత్ర పై అభిమానం ఏర్పరచుకోకుండా నిస్పక్షపాతంగా తప్పు ఒప్పులని చెబుతూ..వ్రాయాలేమో!కానీ నాకీ నవల చదవడం పూర్తయ్యేటప్పటికి “కల్హార”పాత్ర పైవిపరీతమైన అభిమానం పుట్టుకొచ్చింది. పెళ్లి అయిన తర్వాత పుట్టే ప్రేమ పై నెగెటివ్ ఫీలింగ్ ని అది సమంజసమే అని చెప్పడం సాహసం అని చెప్పను. అది సహజం అని కొందరైనా గుర్తించారు కాబట్టి అలాటి ప్రేమలోని లోతుపాతులని, కలసి బ్రతకాలి అనుకునే టప్పుడు ఉండే సాధ్యా సాధ్యాలని  చెప్పే ప్రయత్నం చేసారు నవలా రచయిత్రి.


మానసిక మైన ప్రేమ మాత్రమే సొంతం చేసుకుని బాధతో విడిపోయిన పెళ్ళయిన ప్రేమికులు కల్హార-కౌశిక్ లు. వారి మధ్య శారీరక సంబంధాలు కనుక నెలకొని ఉంటే వారి జీవిత భాగస్వామ్యులు చైతన్య,మృదుల అంత పాజిటివ్గా ఆలోచించ గల్గేవారా!? అన్న కోణంలోనేను చేసిన ఈ సమీక్ష. ఇది.


ప్రేమ ఒక భావ ఉద్వేగం,కొన్ని అనుభూతుల పుష్ప గుచ్చం.


పెళ్లి ..ఒక భాద్యత తో కూడిన ఆలోచనా స్రవంతి.


ఎవరి యెదలో ఎప్పుడు ఈ ప్రేమ జనియిస్తుందో ఎందుకు మరణిస్తుందో! మరణించి బ్రతికి ఉంటుందో ఎవరు చెప్పలేరు.


భావాలు,అభిరుచులు కలసినంత మాత్రాన ఎవరు స్నేహితులు అయిపోరు.కలవక పోయినా భార్యాభర్తలు కాకుండాను పోరు.


కానీ  ఆమె లేదా అతని ఫీలింగ్ ని తన ఫీలింగ్ గా అనుభూతి చెందే భావం మాత్రం ఖచ్చితంగా ప్రేమే!

ఆ ప్రేమలో స్వార్ధం ఉంటుంది కౌశిక్ ప్రేమలో స్వార్ధాన్ని  చూస్తాం మనం, కల్హార మనసు తనది అని తెలుస్తూనే ఉంది. ఆమె మనసు పై సర్వాధికారమ్  ఉన్నప్పుడు ఆమె శరీరాన్ని  తను కోరుకుంటున్నాడు.అది అతనికి తప్పుగా తోచలేదు. ఎందుకంటే  అతను పురుషుడు. ఏ పురుషుడు కూడా నీ మనసు మాత్రమే నాక్కావాలి  నీ శరీరం నాకు అక్కర్లేదు అనడు. తనువూ,మనసు కలిస్తేనే పరిపూర్ణం అనుకోవడం కద్దు.


అదే సంఘర్షణ కల్హార మనసులోనూ తలెత్తి..కౌశిక్ ని తను మనసారా కోరుకుంటున్నాని అర్ధం కాగానే.. భయం కల్గుతుంది.  అది ఆమెలో కల్గిన శారీరక , మానసిక స్పందనలకి పరాకాష్ట. అది మనం గుర్తించ గల్గుతాము కూడా.

కౌశిక్ ని ప్రేమించానని తెలియగానే ఆమె మనసులో తలెత్తిన సంఘర్షణ  అదే ప్రేమని కొనసాగించాలనే ఉద్దేశ్యం ఉంటే..తర్వాత ఉత్పన్నమయ్యే సమస్యలు ఆమె కళ్ళ ముందు కదలాడి ఆమెని కట్టడి చేసి ముందుకు వెళ్ళనీయకుండా సంకెళ్ళు వేసాయి కానీ కౌశిక్ పై ఆమెకి కల్గిన ప్రేమని మొదలంటా తుడిచివేయలేక పోయింది అంటే మనసు యొక్క ప్రభావం మనిషిని శాసించ లేదని చెప్పకనే చెబుతుంది.


కౌశిక్ కల్హార ల మద్య ఒక ఆకర్షణ ,బలీయమైన మోహం,ఇద్దరు దగ్గరగా ఉండాలనే కాంక్ష కూడా కనబడుతుంది.వ్యక్తీ గతమైన భావనలకి విలువనీయకుండా ఇద్దరూ కూడా వారితో ముడిపడిన మిగిలిన వారి గురించి కూడా ఆలోచించుకుని విడివడటం “తన్హాయి” చదివిన పాఠకుల అందరి కి నచ్చిన విషయం.


కల్హార మరో రాజేశ్వరి కాలేదు. చినుకుకై పుడమి నోరు తెరిచి నట్టు కౌశిక్ ప్రేమకై ఆమె అంతరంగం పరితపించింది. అయినను మోహం తో అతని దరి చేరలేదు. కౌశిక్ ప్రేమలో ఆమెకి హృదయ సాంత్వన లభించింది. ఆమె స్నేహితురాలు మోనికా ఇంట్లో వారు ఇరువురు కలసినప్పుడు ప్రేమలోని ఒక ఉద్వేగం తో..వారు ఇరువురు ఆత్మీయంగా దగ్గరిగా ఒదిగిపోవడంలో ప్రేమ తప్ప దేహపరమైన కాంక్ష ఉండకపోవడాన్ని మనం చూడవచ్చు.


చైతన్యతో గడిపిన జీవితంలో ప్రేమ లేకపోయినా ఆ బంధంలో భద్రత ఉంది. తన కూతురి బాగోగులు,సమాజంలో ఒక గౌరవనీయమైన స్థానం కూడా ఉన్నాయి. అందు కోసమే ఆ ప్రేమని త్యజించింది.

హటాత్తుగా ఆమె కి లభించిన ప్రేమ పాత్ర లో కౌశిక్ ఇచ్చిన ప్రేమామృతం తో నింపబడిన తర్వాత కూడా ఆమె సంశయించింది. నిజాయితీగా తనలో కౌశిక్ పట్ల కల్గిన భావ సంచలనాలను చైతన్యకి చెప్పడం అన్నది సాహస నిర్ణయమే!ఇలా ఎందుకు చెప్పడం ? మనసులోనే దాచేసుకోవచ్చు కదా అన్న చిరాకు కల్గుతుంది. కానీ కల్హార తనను తానూ మోసగించుకొని,ఇతరులని మోసగించే గుణం లేని నిజాయితీ కల్గిన స్త్రీ.


చైతన్య కూడా  మీరివురి మధ్య సంబంధం అక్కడి వరకు వెళ్ళిందా అనే సందేహాన్ని పదే పదే వ్యక్తీకరిస్తాడు. అది ఒక అనుమాన పూర్వకమైన సందేహం,అవమాన పూర్వక మైన సందేహం కూడా. అలాంటి సందేహం పురుషునిలో ఉంటుందని తెలుసు కాబట్టీ.. కల్హార పాత్రని కౌశిక్ తో మమేకం చేయకుండా శారీరక సంబంధాలకి అతీతమైన ప్రేమ కూడా ఉంటుందని ఒక పాజిటివ్ దృక్పధాన్ని చెప్పే ప్రయత్నంలో సపహలీకృతం అయ్యారనే చెప్పవచ్చు.

రచయిత్రి ఈ కోణం లోనే.. కల్హార చుట్టూ ఒక బలమైన కోట గోడ కట్టారు. స్త్రీ మనసులో పెళ్లి తర్వాత కూడా ప్రేమ జనించడం సహజమైనదే! వివాహ బంధంలో మూడో మనిషి కి ప్రవేశం కొన్ని అసంతృప్తుల మధ్య మాత్రమే సులువు అవుతుంది. ఆ అసంతృప్తి కల్హార మనసులో ఉంది. ప్రేమ లేని పెళ్లి ఉంటుంది. ఉంది కూడా. అదే ప్రేమ ఉన్న మనుషులు ఒకటిగా కలసి ఉండటానికి అంతకి ముందు ఉన్న బందాలని త్రుంచుకు వెళ్ళ గల్గె సాహసం భారతీయ స్త్రీకి ఉండదు అని కాదు కాని ఆ సాహసోపేత నిర్ణయాలు తీసుకునే ముందు వివేకం కల వ్యక్తిగా ఆలోచించడం, నిజాయితీగా చెప్పడం  జీవితాంతం ఒక అనుమాన పూరితమైన ప్రశ్నకి సమాధానం తానూ చెప్ప గల్గినా కూడా ఆ ప్రశ్నని ఎదుర్కోడానికి తయారుగా తనని తానూ బలోపేతం చేసుకోవడం సామాన్య విషయమేమీ కాదు. చాలా మంది కల్హార పాత్రని చిన్న చూపు చూస్తారేమో కూడా! పెళ్లి అయిన స్త్రీకి మళ్ళీ ప్రేమ ఏమిటి? అన్న నిరసన భావం తో పాటు చైతన్య కాబట్టి అర్ధం చేసుకోగల్గాడు అన్న సానుభూతి చైతన్య పై కలగడం సాధారణ విషయం.


మనసు భావ సంచనల రూపం. దురదృష్టవశాత్తు మనసుని మనం నగ్నీకరించి చెప్పలేం. అలాగే మాట కూడా.మనం మాటకి ముసుగు వేస్తాం. కల్హార తన మనసుని ఎక్కువ కాలం దాచుకోలేకపోయింది. నిజాయితీగా ఏం చేయాలో చెప్పమని చైతన్యని అడుగుతుంది. ఒకవేళ అతను ఆమెని ద్వేషించి ఆమె నుండి విడిపోయినా కూడా ఆమె తప్పుకు ఆమె బాద్యురాలిగా చేసుకునే వ్యక్తిత్వం ఉన్న స్త్రీ.


ఇదే నవలలో  ఇంకా కొన్ని స్త్రీల పాత్రల కంటే కూడా ఆమె పాత్ర విభిన్నమైనది.

పవిత్రత అన్నది అది మానసికమా శారీరకమా అన్నది ఎవరికి వారు విలువనిచ్చుకునే విషయం. ప్రమాదవశాత్తు పడిన ప్రేమలో మనసు జారిపోయినా చాలా సందర్భాలలో కౌశిక్ సన్నిహితంగా దగ్గరికి వచ్చే ప్రయత్నం చేసినప్పుడల్లా అతనిని కట్టడి చేస్తూ ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది చైతన్య పదే పదే అడిగినప్పుడు కూడా తానూ మనసునే కోల్పోయింది కాని శరీరాన్ని కౌశిక్ తో పంచుకోలేదు అని చైతన్య కి చెప్పగల్గింది. అదే విషయం వారి మధ్య ఎడబాటు రాకుండా ఎడబాటు కానీయ కుండా కాపాడ కల్గింది. చైతన్య కూడా ఒక సాధారణ పురుషుడే! తన వైవాహిక జీవితం అనే కోట కి పగుళ్ళు ఏర్పడినాయి అని తెలియగానే తన పరువు-ప్రతిష్ట లకి భంగం వాటిల్లుతుందని బాదపడతాడు. భార్యకి తను ఏం తక్కువ చేసాడు ఇప్పుడేనా కల్హార ఇలా ప్రవర్తించడం,లేక ఇంతకూ ముందు కూడా ఇలాటి ప్రేమ కలాపాలు కొనసా గించి మభ్య పెట్టిందా లాటి ప్రశ్నలు తలెత్తుతాయి. అదే అభద్రతా బావం మృదుల మనసులో కూడా తలెత్తడం సహజం. 


కౌశిక్,కల్హార ల మధ్య శారీరక సంబంధం కనుక ఏర్పడి ఉంటే చైతన్య కానీ ,మృదుల కానీ ఆ విషయాన్ని అంతా తేలికగా తీసుకునే వారా!? ఇదంతా ఆలోచించేనేమో రచయిత్రి కౌశిక్,కల్హార మధ్య శారీరక దూరాన్ని ఉంచారు ఏమో అనిపించక తప్పదు.


ప్రేమలో మోహం కూడా మిళితమై ఉండటమే ప్రేమకి పరాకాష్ట. సంపూర్ణ ప్రేమ స్వభావాన్ని అనుభవంలోకి రానీయక ఒక ఆత్మీయ చుంభనంతో ఇరువురు ప్రేమికులని విడదీయడం వెనుక భారతీయ మనస్తత్వమే గోచరించింది. అదే ఇంకెవరు ఆయినా లేదా రంగనాయకమ్మ లాంటి రచయిత్రి అయి ఉన్నట్లు అయితే ఆ విషయం కి అంత ప్రాధాన్యత నివ్వరు. ప్రేమ అన్నది మనసుల కలయిక ,శరీరాల కలయిక అన్నదానికి ప్రాముఖ్యత నివ్వరు. నీ మనసులో ప్రేమే కావాలి నీ శరీరం వద్దు అనే ప్రేమికుడు ఎవరైనా ఉన్నారంటే నమ్మశక్యం కాదు.


మన భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థ ఇంకా బ్రతికి ఉంది అంటే కారణం అదే! ప్రేమ లేకపోయినా పెళ్లి జరిగాక శారీరకమైన సంబంధం ద్వారా పురుషుడు స్త్రీతో అనుబంధం ఏర్పరచుకుంటాడు. ఆ అనుబందాన్ని బలోపేతం చేసుకుంటాడు.ఒకవేళ పురుషుడు వేరొక ఆకర్షణలో పడినా కూడా స్త్రీలు తప్పని సరి అయి సర్దుకుని ఉండే వారు కావడం వల్ల వివాహ వ్యవస్థకి భంగం వాటిల్లలేదు.


అదే స్త్రీల విషయంలోకి వచ్చేసరికి పెళ్ళికి ముందు ఎన్ని ఊహలు ఉన్నా పెళ్లి జరిగిన తర్వాత పురుషుడి చుట్టూ తన ఆలోచనలని అల్లుకుని..అందుకు అనుగుణంగా తనని తీర్చి దిద్దుకుంటూ అక్కడే జీవితాన్ని నిర్మించుకుంటుంది.


ప్రపంచం ఏమిటో తెలియని స్త్రీకి పురుషుడే ప్రపంచం. అందుకని ఏమో.. స్త్రీలని వీధి వాకిట నిలబడటానికి కూడా అభ్యంతరం చెప్పేవారు. ప్రపంచాన్ని చూసిన స్త్రీకి తనకి కావాల్సినది ఏదో తెలుసుకుంటుంది. ఆ తెలుసుకున్న క్రమంలో హద్దు దాటుతుంది. ఆ హద్దు దాటే ప్రయత్నంలో తనకి తానే చేటు చేసుకుంటుంది. అసంత్రుప్తులని బడబాగ్నిలా దాచుకుని కోర్కెలని అణచుకొని వివాహ జీవితంలో మగ్గిపోతుంది. నాకు కల్హార పాత్రలో ఇదే కనబడింది. సప్త సముద్రాలు దాటినా యెంత ఉద్యోగం చేసినా ఆమెలో కల్గిన ప్రేమ రాహిత్యం అన్న భావనని చైతన్య తుడిచి వేయగలడా? కౌశిక్ ని ఆమె మనసు నుండి తుడిచి వేయగలడా!? స్త్రీ ప్రేమ మానసికం. ప్రేమించిన వ్యక్తి ని ఆలోచనలోను,జ్ఞాపకాలలోను నింపుకుని ప్రేమని క్షణ క్షణం సజీవంగా ఆస్వాదించ గలదు. ఆ ఉత్తెజంతోనే బ్రతక గలననే నిబ్బరం తోనే కౌశిక్ తనని వీడి పోతుంటే కల్గిన బాధని అనుభవిస్తూ కూడా అలాగే నిలబడి పోయింది.


ప్రతి కలయిక ఒక విడిపోవడానికి నాంది అంటారు. వారి ఎడబాటు మాత్రం జీవిత కాలం బ్రతికి ఉండటానికి అని వారిద్దరికీ మాత్రమే తెలుసు. మరో ఇద్దరికీ తెలిసే అవకాశం ఉన్నా కూడా.. వారు మనిషికి ఇచ్చిన ప్రాముఖ్యత మనసుకి ఇవ్వలేదు కాబట్టి..సంప్రదాయమైన వివాహ జీవితం మాత్రం పై పై మెరుగులతో..లోపల డొల్ల గానే మిగిలి ఉంటుంది.


అవగాహన,సర్దుబాటు,రాజీపడటం,సమాజంలో గౌరవం ఈ నాలిగింటి కోసమే ఆ రెండు జంటలు  మరో రెండు హృదయపు శకలాల పై నిలబడి ఉన్నాయి అన్నది ఎవరు కాదనలేని సత్యం.


ఈ నవలలో నాకు అత్యంత బాగా నచ్చిన పాత్ర కల్హార. తనలో కలిగే భావనలకి ఎక్కడా ముసుగు వేయదు. అనవసరమైన పవిత్రతని ఆపాదించు కోదు. ఎప్పటికప్పుడు సహజంగా ప్రవర్తించడం కనబడుతుంది. రక్త మాంసాలు ఉన్న స్పందన కల్గిన స్త్రీగా ఆమె మనసులో కల్గిన భయాలని మరచిపోయే చోటు కౌశిక్ సాన్నిహిత్యమే అని ఆమెకి తెలుసు. అలాగే చైతన్యతో తన జీవితం లో కల్గిన లోటు కూడా ఏమి ఉండదు అని అనుకుంటుంది. కౌశిక్ ని ప్రేమించడానికి, చైతన్యని ద్వే షించాల్సిన పని లేదు అనుకుంటుంది. ఇద్దరి పైనా ఏక కాలంలో ప్రేమ కల్గినా కూడా అది తప్పు కాదనుకుంటుంది.


ప్రేమ లక్షణం బహుశా అదేనేమో!అది అందరికి నచ్చదు కూడా. ఇద్దరి పై ప్రేమ ఏమిటి..అది వళ్ళు బలిసిన ప్రేమ కాకపొతే అని తిట్టిన్చుకోవాల్సి వచ్చినా సరే రహస్యంగా ఉంచక ఏమో ఎందుకు కల్గిందో ఈ ప్రేమ అనుకునే స్వచ్చత కల్గిన స్త్రీ మూర్తి కల్హార. ఆమె ప్రేమని.. బహుశా కౌశిక్ కూడా పూర్తిగా అర్ధం చేసుకుని ఉండదు. ఒక్క మోనికా తప్ప.


ఒకే ఒక్క రోజు ఆయినా సరే అతనితో సన్నిహితంగా ఉండి సంపూర్ణ జీవితం ని గడపాలనే ఆకాంక్షని వ్యక్త పరుస్తుంది. అక్కడ మనసు,శరీరం రెండు కలసిన కలయికకి యెంత తపించిపోయిందో.. రచయిత్రి సహజంగా వ్రాశారు. అందులో ఎక్కడా కల్హార పాత్రని ద్వైదీ భావనలో  తేలియాడించనూ ఒక ఇనుప చట్రంలో ను బిగించలేదు. మనసు పిలుపు కన్నా కూడా శరీరం పిలుపు కూడా అంతే బలంగా ఉంటుందని కల్హార పాత్ర ద్వారా చెప్పడాన్ని  జీర్ణించు కోలేరేమోనన్న అనుమానం ఉంది. కాని అది సబబుగానే అనిపించింది.


తప్పు ఒప్పు ల దృష్టి తో చూస్తే..ఆంతా తప్పే! అసలు తన్హాయి నవల లో కల్హార పాత్ర చిత్రీకరణే తప్పు. మన మధ్య చైతన్యలు, మృదులలు ఎక్కువ శాతం, కౌశిక్ లు మరి కొంత శాతం అతి తక్కువ శాతం మంది మాత్రమే కల్హార లాంటి నిజాయితీ కల్గిన పాత్రలు ఉంటారు. రచయిత్రి నాలుగు పాత్రలలోనూ తన వ్యక్తి గత అభిప్రాయం ని జోప్పించినా జోప్పించక పోయినా అది పెద్ద పరిగణలోకి నేను తీసుకోలేదు. కల్హార పాత్ర చిత్రీకరణని చాలా మంది స్వాగతిస్తారు అనుటలో ఎట్టి సందేహం లేదు. కల్హార  వికసిత విరాజ కుసుమం.  బుద్భుదమైన భావ జాలంలోనుండి జనియించిన సహస్ర భావాలతో అరవిరిసిన పుష్పం..


తనలో కలిగే భావాలని,ఆలోచనలు స్వేచ్చగా వెల్లడించు కునేటప్పుడైనా నిజాయితీ లోపిస్తే ఈ మనుషులకి మనసు అనే వ్యర్ధ పదార్ధం ఎందుకు? అని నాకు అనిపించినది అంటే అంతలా కల్హార పాత్ర చుట్టూ నెలల తరబడి నా ఆలోచనలు చుట్టుకుని ఉన్నాయి.


పెళ్ళికి ముందు పెట్టుకునే డేటింగ్ గురించి , ఓపెన్ మేరేజ్ సిస్టం గురించి,వైఫ్ స్వాపింగ్ గురించి మనం చీత్క రించు కుంటున్నాం కానీ మన భారతీయ వివాహ వ్యవస్థలో సంప్రదాయ ముసుగులో ఎన్నో మనవి కాని విచ్చలవిడి తనాలు రాజ్యం యేలుతున్నాయి సంప్రదాయవాదులు పాశ్చాత్య నాగరికత తో మన వాళ్ళు చెడిపోతున్నారు అంటున్నారు .కానీ మన వారిలోనూ ఉండే బహు భార్యా తత్వాలు,అక్రమ సంబంధాలు మాటేమిటి!? కొన్ని భావజాలాల మధ్య స్త్రీ స్వేచ్చని అణగ ద్రొక్కిన వివాహ వ్యవస్థలో కల్హార లాటి వాళ్ళు తమ మనసుని తమలో పెళ్లి తర్వాత కల్గిన భావ ప్రకంపనలని వెల్లడి చేసే నిజాయితీ తనం అందువల్ల కలిగే పరిణామాలు మంచి-చెడులు  వాటి మధ్య వివాహ బందానికి ఇస్తున్న ప్రాధాన్యత అందరికి నచ్చి ఉండవచ్చును.


నాకు మాత్రం కౌశిక్ ప్రేమకి దూరం అవుతున్న కల్హార మనసులో వేదన కళ్ళముందు కదలాడుతుంది. ఆమె పాత్రపై సానుభూతి కల్గుతుంది. 


“ప్రేమయన నొక పంచభూతముల సమాహారమ్ము! అందు కలయికొక్కటేను, ప్రేమికుల ముందున్న దారి!!” అని సాఖీ గీతం. ఇదేమిటి వీరు ఇలా విడిపోయారు అన్న బాధ కల్గింది.కన్నీళ్లు వచ్చాయి.


మనసంటే అచ్చమైన నిజాయితీ. ఆ మనసుకి లభించే కూసింత ఆలంబన, లభించిన ప్రేమ,జీవన పర్యంతం కాపాడే స్నేహ హస్తం దొరికే చోట మనసు స్వేచ్చగా నిర్భయంగా మసలగల్గుతుంది.


కల్హార మనసుకి తనకి కావలసినది దొరికే చోటు కౌశిక్ హృదయం అని తెలుసు.ఇద్దరు వివాహితుల మధ్య అది సాధ్యం కాదు కనుకనే విడిపోయి ఆ ప్రేమని తలచుకుంటూ బ్రతక గలం అని .దూరం అవుతారు. మనసు ఏకాంతంలో తనని తానూ తరచి చూసుకుంటుంది. ప్రపంచం నుండి విడివడి ఆ ఒంటరి తనం లోనే, తనలోనే బ్రతుకుతూ కాసిన్ని మధుర జ్ఞాపకాలుతో సహజీవనం చేస్తుంది. అదే “తన్హాయి”


ఈ నవల లోని కథ పాతదే కావచ్చు. ఎందుకంటే వివాహం తరవాత ప్రేమ కూడా చాలా పాతదే! ఒక “సిల్సిలా” చిత్రం నా కనుల ముందు అలా కదలాడింది. ఆఖరిగా ఒకటి అనిపించింది. కల్హార-కౌశిక్ విడిపోయారు కాబట్టి ఇది ఒక “సిల్సిలా” చిత్రం లా ఉంది. లేకపోతే మేఘసందేశం అయి ఉండేది అని.


ఒక వివాహిత స్త్రీ మనసులోని భావ ప్రకంపనలని, అనుభూతులని అక్షరీకరించి “కల్హార” ని పరిచయం చేసినందుకు. కల్పన రెంటాల గారిని  అభినందించక తప్పదు.


అలాగే నేను గమనించిన ఒక చిన్న అంశం. కలువ పూలతో లక్ష్మి దేవిని పూజించడం కాదు.కమలాలు అని చెప్పాలి కదా! కలువ కి కమలానికి తేడా ఉంది. ఆ చిన్న విషయంని గమనించలేదేమో అనుకున్నాను. కొన్ని చోట్ల ఇంగ్లీష్ లో ఉన్న సంభాషణ లన్నిటిని తెలుగులో ఉంచితే బాగుండును కదా అనిపించింది కూడా.

ప్రతి పెళ్లి కాని అమ్మాయి, పెళ్లి అయిన స్త్రీ కూడా చదవాల్సిన నవల ఇది. “ఓ అపురూప ప్రేమ కావ్యం ” గా ఉదహరించుకోవచ్చు కూడా. *  _వనజ తాతినేని.


(ఈ స్పందన చాలా పాతది బ్లాగ్ లో భద్రపరుచుకునే క్రమంలో పోస్ట్ చేసింది ... ఇంతకు క్రితం "విహంగ " లో  మే  2012 సంచికలో ప్రచురితమైన  స్పందన ఇది . )


14, ఏప్రిల్ 2017, శుక్రవారం

త్వరపడి

 ( తెలుగు వన్ వారి ఉగాది 2017 కథల పోటీలో కన్సలేషన్ బహుమతి పొందిన కథ)
త్వరపడి   ఈ లింక్ లో చదవగలరు. 

"మమ్మీ సెకండ్ షో  సినిమాకి వెళతున్నాను " అంటూ క్రిందికి వచ్చింది రజిత.
"ఇప్పుడా అదీ నువ్వొక్కదానివే వెళతావా? వద్దులేమ్మా" అంది లక్ష్మి .
'ఒక్కదాన్నే అయితే మాత్రం ఏమైంది మమ్మీ! నాకిప్పుడు సినిమా చూడాలనిపిస్తుంది వెళతానంతే!" పంతంగా అంది.  "ఇప్పుడు వద్దని చెపుతున్నాను కదా !" అంతే పంతంతో  కార్ కీస్ తీసుకుని చేతిలో బిగించి పట్టుకుంది .
"మీ ఆవిడ పేరుకి డాక్టరే కానీ అన్నీ పాతకాలం అమ్మమ్మ భయాలు. ఒక్కదాన్నే సెకండ్
 షో కి వెళ్ళకూడదా ! డాడీ? " అన్న ప్రశ్న నాకు
"వెళ్ళకూడదు, నువ్వు ఆడపిల్లవని మర్చిపోతున్నావ్! " హెచ్చరిస్తూన్నట్లు చెప్పింది లక్ష్మి
"తరతరాలగా స్త్రీలు మగ్గిపోయింది యాతనలు పడింది అణగద్రొక్కబడింది చాల్లేదా ? ఇప్పుడిప్పుడే కదా మగవాళ్ళతో సమానంగా చదువులు చదువుతుంది, ఉద్యోగాలు చేస్తున్నది . అమ్మాయిలని కూడా వాళ్ళ లాగానే  ఎంజాయ్ చేయనివ్వండి మమ్మీ ! ఇలా ప్రతిదానికి ఆంక్షలు పెడితే ఎలా ? " విసుక్కుంది రజిత.
 "చిన్ని నిక్కర్ వేసుకుని పైన స్లీవ్ లెస్ టీ షర్ట్ వేసుకుని తిరుగుతుంటే, మగవాళ్ళ చూపులు తాకుతుంటే గర్వంగా ఎంజాయ్ చేసే  ఇప్పటి తరం మీది.   ఒంటి నిండా కిలోల కొద్దీ బట్టలు చుట్టుకుని కూడా మగవాడి చూపులు శరీరమంతా గుచ్చుకుంటుంటే ఇబ్బందిగా, అవమానంగా భావించిన మా తరానికి ఖచ్చితంగా తేడా ఉంది . ఆలోచనల్లో వచ్చినంత మార్పు మన జీవనవిధానంలో రాలేదుఅమ్మాయిల ఆలోచనా విధానం  మారినంత వేగవంతంగా అబ్బాయిల ఆలోచనల్లో మార్పు రాలేదుసమానత్వం సాధించామని  కొన్ని సందర్భాలలో మాత్రమే అనుకోవడానికి బావుంటుంది.జాగ్రత్తగా ఉండాలమ్మా !"
"నాకసలు బుద్ధి  లేదమ్మా! నీ పర్మిషన్ అడగడం, నువ్వు కాదనడం ఎప్పుడూ ఉండేవే ! నీ హితబోధ వినే ఓపిక నాకిప్పుడు లేదు" అనుకుంటూ గదిలోకి  వెళ్ళి పెద్ద శబ్దంతో  తలుపులు మూసుకుంది.
 నా భార్య హితబోధ నా కూతురి చెవి ఎక్కదుఎక్కనీయకుండా ...  ఎక్కువ సౌండ్ పెట్టి "ముసుగు వేయొద్దు మనసు పైన, వలలు వేయొద్దు వయసు పైన" పాటని  కక్ష కట్టి కావాలని పెద్ద సౌండ్ తో మాకు వినిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంది .
 "లక్ష్మీ !ఎన్నిసార్లు చెపుతావ్? పిల్లలకి  విసుగు వచ్చేదాకా చెపితే వాళ్ళింకా మొండివాళ్ళగా తయారవుతారు వదిలేయకూడదు" అన్నాను.
 "మీకు హాస్పిటల్, సర్జరీ లు తప్ప ఇంకేమి తెలియదు . ఒకసారి మా గైనిక్ విభాగం వైపుకి వచ్చి చూడండి  . రోజూ అబార్షన్ కోసం ఇద్దరు ముగ్గురు అమ్మాయిలైనా వస్తారు . ప్రక్కన భర్తనే వాడు ఉండడు. పోనీ  తల్లి కూడా ఉండదు .. ఏ ఫ్రెండో ఉంటారు . ఇవాళొక  అమ్మాయి వచ్చింది నాలుగు నెలలు దాటాయి కూడా అబార్షన్ రిస్క్ అవుతుంది అన్నా వినదు . నేను  అబార్షన్ చేయడం కుదరదని గట్టిగా చెప్పేసాను. వాళ్ళు వెళుతూ  వెళుతూ నన్ను శత్రువుని చూసినట్టు చూసి వెళ్ళారు. "వయాగ్రా దొరికినంత ఈజీగా అబార్షన్ చేయించుకోవడం కుదరదు.అంటే విన్నావా ? థ్రిల్లింగ్ గా ఉంది అంటూ ట్రై చేసావ్ ! ఇప్పుడు ఏడువ్ ... అని  ఆ ఫ్రెండ్ తిడుతూ తీసుకు వెళుతుంది "   ఇప్పటి పిల్లలకి సంప్రదాయం చట్టుబండలు ఏమీ లేవు . నాకు చాదస్తమని అనుకున్నా పర్వాలేదు మన అమ్మాయిని కూడా అలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందేమోనని భయంగా ఉందండి " అన్న లక్ష్మి మాటలని  "నువ్వు ఎక్కువాలోచిస్తున్నావ్ " అంటూ కొట్టి పడేసాను.
 మూడు రోజుల పాటు జరిగే మెడికల్ కాన్ఫరెన్స్ కి విశాఖపట్నం వచ్చాను. ఉదయం నుండి సాయంత్రం వరకు రెండు సెషన్స్ లోనూ  కాన్ఫరెన్స్లో పాల్గొని సాయంత్రానికి బీచ్ కి చేరుకోవడంమిత్రులతో సందడి చేయడం ఉల్లాసంగా ఉంది. ముఖ్యంగా అరవింద్ తో కాకినాడ రంగరాయలో చదువుకునేటప్పుడు  నాకతను జూనియర్.   ఇప్పుడు  హైదరాబాద్లో సొంత హాస్పిటలు నడుపుతున్నాడు.
ఆ రెండు రోజుల నుండి భీమ్లీ బీచ్ వెంట, రామకృష్ణ బీచ్ దగ్గర అమ్మాయిలని అబ్బాయిలని చూస్తుంటే మతి పోతుంది. ఎక్కడ చూసినా జంటలు జంటలు. ఏకాంతాన్ని వెతుక్కుంటూ, దూరంగా వెళుతూ ప్రమాదాల అంచున పయనిస్తున్నారనిపించింది .
"ఇప్పుడున్న అమ్మాయిల స్పీడ్ చూస్తుంటే  అబ్బాయిలకేమీ తీసిపోనట్లుగానే ఉన్నారు." అన్నాను  అరవింద్ తో .
"ప్రపంచదేశాలన్నింటి నుండి టెక్నాలజీని దిగుమతి చేసుకున్నట్లే వారి సంస్కృతిని సంప్రదాయాలని ఆహార విహారాలని దిగుమతి చేసుకుంటున్నాం. కొన్ని మాత్రమే కావాలి, కొన్నింటిలో మనం మనలాగే ఉండాలని కోరుకోవడం కూడా స్వార్ధమే అవుతుంది." అన్నాడతను.
"మంచికి చెడుకి ఉన్న వ్యత్యాసాన్ని పిల్లలు గుర్తించగల్గేలా చేయడంలో మనం విఫలమవుతున్నాం. వాళ్ళతో గడిపే సమయం చాలా తక్కువ, వాళ్ళకి లభించే స్వేచ్చ ఎక్కువ. పల్లె-పట్టణం  అనే తేడానే లేదు ప్రతి ఒక్కరి జీవితం దృశ్య మాధ్యమం చుట్టూనే తిరుగుతుంది. టీవి అయితేనేమిటి ఇంటర్ నెట్ అయితే ఏమిటీ అన్నట్టుగా ఉందిమా రజితని   చూస్తేనూ భయంగా ఉంటుంది. నా మిసెస్ లక్ష్మి కూడా చాలా ఆవేదనగా ఉందీ విషయంలో అన్నాన్నేను
"మన ఫెయిల్యూర్స్ ఏమిటో మనకి తెలుసు, అయినా పిల్లల ముందు ఒప్పుకోము. పిల్లల్లో మొరాలిటీ తగ్గిపోతుంది ఎదుటివారిని మోసం చేయడం, తాము మోసగింపబడటాన్ని తేలికగా తీసుకుంటున్నారు. తల్లిదండ్రులని మోసం చేయడమే కాదు తమని తాము మోసం చేసుకుంటున్నారు". బాధగా చెప్పాడు అరవింద్. నేను మౌనంగా తలూపాను.
నా కొడుకు కూడా అంతే ! మేము చెప్పే ఏ మాటని లక్ష్య పెట్టడు. బిట్స్ లో చదువుతున్నాడు . మీకు కావాల్సిన రిజల్ట్స్  మీకిస్తున్నాంగా, మా ప్రతి విషయంలో జోక్యం చేసుకోకండి అంటాడు. ఫ్రెండ్స్,పార్టీలు అన్నీ మామూలే ! అరవింద్ బాధగా చెప్పాడు. ఎదురుగా అనేకమంది యువతని జంటలు జంటలుగా చూస్తూ  వాళ్ళ చేష్టలని గమనిస్తూ ఉంటే  మా పిల్లలు కూడా ఇలాగేనేమోనన్న ఆలోచనల మధ్య   సముద్ర తీరంలో సాయంసమయాల్లో ఉండే సుందర దృశ్యాలని ఆస్వాదించలేకపోయాం. ట్రైన్ అందుకోవాల్సిన  సమయం దగ్గర పడుతుంది. ఆరోజు రాత్రికి అక్కడే ఉండి మర్నాడు ఉదయమే ప్లైట్ కి వెళతానన్న అరవింద్  ఎక్కువసేపు నీతో గడిపినట్లు ఉంటుందని అతను కూడా  ట్రైన్ లో వస్తానని నాతో పాటు  బయలుదేరాడు. విజయవాడలో  ట్రైన్  మారొచ్చు , వచ్చేసేయి అన్నాను సంతోషంగా.
హోటల్ రూమ్  ఖాళీ చేసేసి  విశాఖపట్నం - చెన్నైసూపర్ ఫాస్ట్  ఎక్స్ ప్రెస్ ఎక్కేసాము.నాకు రిజర్వేషన్ ఉంది.   సోమవారమవడం మూలంగా ఎక్కువ రద్దీ లేకపోవడం మూలంగానేమో అరవింద్ కి కూడా తేలికగానే బెర్త్  దొరికింది. ట్రైన్ బయలుదేరుటకు సిద్దంగా ఉంది ఎనౌన్స్మెంట్ వినబడుతూ ఉండగా ఒకమ్మాయి వచ్చి ఎదురు సీట్ లో కూర్చుంది. తనకన్నా పెద్దగా ఉన్నతను వచ్చి బెర్త్ చెక్ చేసి లగేజ్ సర్దుతూ ఎదురుగా కూర్చున్న నన్ను పలకరించి  మీరెక్కడి వరకండీ ? అని అడిగాడు. నెల్లూరు వరకు అన్నాను. ఓహ్..మీరు  కూడా నెల్లూరేనాతను నా సిస్టర్, ఒంటరిగా వెళుతుంది కదా ! అందులోనూ రాత్రి ప్రయాణం. పెద్దవారు మీరున్నారు తోడుగా ఉంటారు, ఇక భయమేమీ లేదు అంటూ భరోసా ఇచ్చుకుంటూ ట్రైన్  దిగేసి కదిలే వరకూ  చెల్లెలికి  జాగ్రత్తలు  చెపుతూనే ఉన్నాడు
 ట్రైన్ ప్లాట్ఫామ్ ని వదిలేశాక    " అన్నయ్యండీ ! ఉన్నంత సేపు నస పెట్టి  చంపేస్తాడు . ఇంత పెద్ద ట్రైన్ లో  నేను ఒక్కదానినంటూ భయం కల్గిస్తాడుఅంటూ విసుక్కుంది. నాకు నవ్వు వచ్చింది. అరవింద్ నేను మాటల్లో పడ్డాం.
కాసేపటి తర్వాత  దువ్వాడ స్టేషన్ లో ఆగినప్పుడు ఆ పిల్ల ప్రక్కన మరొక అబ్బాయి వచ్చి కూర్చున్నాడు. "ఎలాగైతేనేం, రిజర్వేషన్ సంపాదించావు. ఎక్కడ మిస్ అవుతావో అనుకున్నాను." అంటూ  ప్రక్కకి జరిగి  అతనికి చోటిచ్చింది. క్షణాల్లో అతని కుడి చేతిలో ఆమె ఎడమచేయి కలసి మాట్లాడుకున్నాయి . తర్వాత భుజాలపై చేతులేసుకున్నారు కొద్దిసేపటికి  ఆ చేతులు నడుమును చుట్టేసుకున్నాయి. చిన్నగా దగ్గి మా ఉనికి తెలియజేయజేసాను. వాళ్ళిద్దరూ దూరంగా జరిగారు . అరవింద్ కూడా ఆ అమ్మాయిని గమనిస్తూనే ఉన్నాడు. ఎక్కడో ఈ పిల్లని చూసినట్టు ఉంది. గుర్తుకురావడం లేదు అన్నాడు. అనకాపల్లిలో ఒక స్త్రీ ఎక్కింది ఆమె వయసు అరవైకి పైనే ఉంది. ఇంట్లో అసలు రెస్ట్  లేదండీ. మీకు అభ్యంతరం లేకపోతే నేను కాసేపు  పడుకుంటాను అంగీకారం కోసం ఎదురుచూస్తూ నిలబడింది. ఏ సి ఫస్ట్ క్లాస్ నాలుగు బెర్త్ ల కాబిన్ వచ్చింది. కేటాయించిన ప్రకారం కాకుండా   మేమిద్దరం పై బెర్త్  ల పైకి  చేరుకొని విశ్రమించాం.
పనిగట్టుకుని చూడాలని కాకపోయినా అప్పుడప్పుడూ నెల్లూరమ్మాయిపై నా దృష్టి పడుతూనే ఉంది. క్రింద బెర్త్ లో పడుకున్నావిడ కాసేపటిలోనే వారిని బాగా గమనించింది . ఈ కాలం పిల్లలకి హద్దు అదుపు లేదు. ఆడపిల్లలు చదువుకుని వృద్దిలోకి వస్తారు కదా అని చదువులకి పంపిస్తుంటే వీళ్ళు వేసే వెధవ వేషాలు ఇవీ ! ఇలాంటి పిల్లలు నాకుంటే పీక పిసికి చంపెసేద్దునూ! అసహ్యంగా పైకి అనేసింది. "ఇదిగో అమ్మాయ్.. ఈ కాబిన్ లో నలుగురికే కదా ప్రవేశం. అతనెందుకు ఇందులో ఉన్నాడు  అతన్ని పంపించేయి. అని గట్టిగా కోప్పడింది. ఆ పిల్లతో  నేను చెప్పలేని విషయాన్ని ఆమె అవలీలగా చెప్పేసింది. వాళ్ళిద్దరూ లేచి ఎంట్రన్స్ వైపు  వెళ్ళారు.
"ఈ అమ్మాయిలున్నారు చూడండీ, కన్నవాళ్ళని ఇట్టే మోసం చేసేస్తారు. స్వేచ్చనిచ్చి కాలేజీలకి పంపిస్తే  బాయ్ ఫ్రెండ్ ని వెంటేసుకుని షికార్లు కొట్టడం చూడలేక చస్తున్నాం. వీళ్ళకి నైతిక విలువలేవీలేవు. డ్రెస్ మార్చినట్టు బాయ్ ఫ్రెండ్ ని మార్చేస్తున్నారు. చెడిపోవడానికి మగవాళ్ళతో పోటీ పడుతున్నారు. ముల్లెళ్ళి  అరటాకుపై పడ్డా అరటాకు వచ్చి ముల్లుపైబడ్డా అరటాకుకే నష్టమని తెలిసినా వెరుపనేది లేదు. మద్రాస్లో కూడా ఇంతే ! తల్లిదండ్రులు మా పిల్లలు బాగా చదువుకుంటున్నారని డబ్బులు పంపించేస్తారు. తీరా చూస్తే వీళ్ళ బాగోతలివి"నిర్మొహమాటంగా మాట్లాడేస్తుందామె.
"సమాజపరంగా వచ్చే అనర్ధాలు కొన్నైతే వీళ్ళు కోరి కొని తెచ్చుకుంటున్నవి మరి కొన్నిఅమ్మాయిల ఆలోచనలు, స్వేచ్చా పిపాస  ఈ సూపర్ ఫాస్ట్ ట్రైన్ వెళ్ళినంత స్పీడ్ గా ఉన్నాయి. సమాజం ప్యాసింజర్ ట్రైన్ నడచినట్టు నత్తనడక నడుస్తుంది. రెండిటికి పొంతన కుదరడం లేదండి " అన్నాను నేను.
"నేనేమీ స్త్రీ అభివృద్ధి నిరోధకురాలినికాదండీ! పాస్ట్ పాసింజర్ లా వెళ్ళాలనుకుంటున్న దానినిఈ సమానత్వాలు చదువులు, ఉద్యోగాలు ఎన్ని చెప్పినా ఆడపిల్లలు అరటాకు లాంటి వారేనండీ ! వారి  జీవితం అందులో వడ్డించిన షడ్రశోపేత  భోజనం కావాలి. కానీ వీళ్ళు కుక్కలు చింపిన విస్తరిలా చేసేసుకుంటున్నారు. మన చుట్టుప్రక్కల జరుగుతున్నవి గమనిస్తుంటే బాధగా ఉంటుందండి. ఊరుకోలేక కలగజేసుకుని చెపుతూనే ఉంటాను. మా పిల్లలైతే నీతో మాకు సమస్యలొస్తున్నాయ్  అని  నన్ను తమతో  బయటకి తీసుకెళ్లడం మానేశారు. మనకెందుకవన్నీ ? సమాజం ఏమైపోయినా మనం పట్టించుకోకూడదు. కలుగజేసుకుని సుద్దులు చెప్పకూడదు, అవన్నీ వాళ్లకి నచ్చవ్ అని నా నోరు కట్టేస్తుంటారు" బాధపడుతూ చెప్పింది ఆమె.

అరవింద్ వైపు చూసాను  నిద్రలోకి జారుకున్నాడో ఇవన్నీ చూడకూదదనుకుని నిద్ర నటిస్తున్నాడో అర్ధం కాలేదురాజమండ్రి దాటింది, ఆ అమ్మాయి  బెర్త్ ఖాళీగానే ఉందిట్రైన్ లో  కాంతి తగ్గుతూ ఉంది. అందరూ నిద్రలోకి జారుకుంటున్నారు. నేను టాయ్లెట్ వైపు వెళ్ళాల్సి వచ్చింది. అటువైపు వెళ్ళబోయి అక్కడ కనబడే దృశ్యాన్ని జీర్ణించుకోలేకపోయాను. బహిరంగంగా చేయకూడనివి రహస్యంగా కూడా చేయకూడదన్నట్టు కంకణం కట్టుకున్నట్టున్నారు ఏకాంతంలో జరగాల్సిన వాటిని నిస్సిగ్గుగా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళిద్దరిని చూస్తుంటే  భయమేసింది. చటుక్కున వెనక్కి తిరిగి బెర్త్ మీదకి చేరుకున్నాను. నా భార్య లక్ష్మి అనే మాటలు, క్రింద బెర్త్ లో నిద్రపోతున్న పెద్దావిడ అన్నమాటల్లో నిజం లేకపోలేదన్నది తెలుస్తూనే ఉంది. చదువులు, ఉన్నత ఉద్యోగాలున్న యువతకన్నా సంస్కారం, నైతిక విలువలున్న యువత కావాలి. తెర  మీద చూసిన దృశ్యాల కన్నా వాస్తవ ప్రపంచంలో కనబడుతున్న దృశ్యాలే కలవరపెడుతున్నాయి. పార్క్, బీచ్,దియేటర్,బస్,ట్రైన్,ఆఖరికి గుడి  ఇలా అన్నిచోట్లా స్వేచ్చగా విహరిస్తున్నయువతే ! ఈ తప్పు ఎవరిది ? సినిమాల దా? పోర్న్ సైట్ లదా? సెల్ ఫోన్ వచ్చాక పల్లెటూర్లలో పిల్లలు కూడా ప్రేమ ఊబిలో చిక్కుకుని మోసపోయే తీరుని చూస్తూనే ఉన్నాం. చిన్న చిన్న పట్టణాలలో పెరిగిన పిల్లలే ఇలా ఉంటే  ఇక మహానగరాలలో పుట్టి పెరిగిన వారు ఎలా ఉంటారో! రజిత కూడా ఇలాగే అడ్వాన్స్ అవుతుందేమో ! ఊహకే  భయమేస్తుంది.
విజయవాడలో అరవింద్ దిగినప్పుడు నేను ట్రైన్ దిగి అతనికి వీడ్కోలు చెప్పి టీ  త్రాగుతూ నిలబడ్డాను. నెల్లూరమ్మాయి తన బాయ్  ఫ్రెండ్ తో  ప్లాట్ఫామ్ పై  చక్కర్లు కొడుతూ కనిపించింది.అయిష్టంగా ముఖం తిప్పేసుకున్నాను ట్రైన్ ఎక్కేసి అలారం నాలుగున్నరకి సెట్ చేసి పడుకున్నాను. అలారం మ్రోతకి  మెలుకువ వచ్చింది. కాసేపు కళ్ళు మూసుకునే ఉన్నాను . రాత్రి జరిగిన విషయాలు కళ్ళ ముందు మెదిలాయి. చటుక్కున కళ్ళు తెరిసి చూసాను. ఆ పిల్ల ఒక్కటే కూర్చుని ఉంది. బాయ్ ఫ్రెండ్ ఒంగోల్ లో దిగిపోయి ఉంటాడేమో
 రైలు పెన్నా బ్రిడ్జ్ మీదుగా వెళుతున్న శబ్దం. ఆలస్యమేమి లేకుండానే సమయానికే స్టేషన్ ని చేరుకుంది. లగేజ్  తీసుకుని క్రిందికి దిగాను . ఆ అమ్మాయి నా కన్నా ముందే రైలు  దిగి ముందుకు నడుస్తుంది . "అమ్మా! సరితా ఇదిగో ఇక్కడ  అంటూ నా వయసున్నతను ఆ అమ్మాయి  వెనుక నుండి పిలుస్తూ దగ్గరకి చేరుకున్నాడు. ఆ అమ్మాయి  డాడీ ... అంటూ తండ్రిని హగ్ చేసుకుని .. ఐ మిస్ యూ అలాట్ డాడీ, ఐ లవ్ యూ! అంటూ గారాలు పోతుంది. నేను ఆశ్చర్యపోయాను. ఎంత నటిస్తుందీ అమ్మాయి . ఆ అమ్మాయి అంతకు ముందు ఎలా ప్రవర్తించిందో ఆ తండ్రి తెలియదు . ఒకవేళ నాబోటి వాడు చెప్పినా ఆ తండ్రి నమ్మడు కాక నమ్మడు అలా నంగనాచిలా ప్రవర్తిస్తూ ఉందామ్మాయి. నా టికెట్ చెకింగ్ అయింది. ఆ అమ్మాయి టికెట్ చెకింగ్ ఆలస్యమయింది. నేను ఆ తండ్రి  వంక చూస్తున్నాను. ఎక్కడో చూసినట్టు ఉంది . ఆగి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. తండ్రీ కూతురు నన్ను దాటుకుని ముందుకు వెళుతూ అతను నన్ను చూసి దగ్గరకి వచ్చి " నువ్వు మాధవ్ వి కదూ ! నన్ను గుర్తు పట్టలేదా ? ఈశ్వర్ ని అంటూ వచ్చి  సంతోషంగా నా చేయి పట్టుకున్నాడు
"గుర్తున్నావ్, ఎంత మారిపోయావ్ ఈశ్వర్, నిన్నసలు పోల్చుకోలేకపోయాను, ఇక్కడే ఉంటున్నావా ?" అడిగాను .  'అవును, ఏవేవో  బిజినెస్ లు చేస్తూ అక్కడా ఇక్కడా తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చిపడ్డాను . ఇదిగో నా కూతురు  సరిత . నాలా చదువులో మొద్దు కాదు. బిట్స్ లో  చదువుతుంది. ప్రాక్టీస్ స్కూలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఇచ్చారు  పూర్తీ చేసుకుని తిరిగి వస్తుంది" పరిచయం చేస్తున్నతని కళ్ళల్లో గర్వం తొణికిసలాడింది. తల ఊపి  ఊరుకున్నాను.
"ఎక్కడ ఉంటున్నారు, హాస్పిటల్ ఎక్కడ ? అడిగాడు ఈశ్వర్ . విజిటింగ్ కార్డ్ తీసి ఇచ్చాను. ఆ అమ్మాయికి తండ్రితో నేను మాట్లాడటం అస్సలు ఇష్టం లేదని తెలుస్తూనే ఉంది . ట్రైన్ లో నేను చూసిందల్లా తండ్రికి చెపుతాననే భయం కావచ్చుఅక్కడి నుండి ఎంత తొందరగా బయటపడదామా అని చూస్తుంది . నేను బయటకి వచ్చి కార్ కోసం ఎదురుచూస్తున్నా !
"ఇప్పుడు నువ్వు మాట్లాడినాయన నీ ఫ్రెండా నాన్నా" అడుగుతుంది ఆ పిల్ల
"అవునమ్మా! తిరుపతిలో పదేళ్ళపాటు కలసి చదువుకున్నాం."
"అవునా! కల్చర్లెస్ బ్రూట్. ట్రైన్ లో ఎంత మిస్ బిహేవ్ చేసాడో, ఆ అంకుల్స్ ని అస్సలు నమ్మకూడదు. ఆడపిల్లలు ఒంటరిగా కనబడితే చాలు " ఇంకా ఏవేవో చెపుతుంది. వింటున్న నేను మ్రాన్పడిపోయాను. ఆటో ఎక్కుతూ  ఈశ్వర్  అసహ్యంగా నా వైపు చూసిన చూపు జీవితంలో మర్చిపోలేను. నేను మాట్లాడాలనుకున్నా అతని ఫోన్ నంబర్ తీసుకోలేదు. ఆ పిల్ల నాపై వేసిన అంత పెద్ద అపవాదుని పోగొట్టుకోవడం ఎలా ! అవమానంగా ఫీల్ అయ్యాను. ఆ మధ్యాహ్నమే అరవింద్ కి కాల్ చేసి ఆ పిల్ల అలా అందని చెప్పాను. గట్టిగా నవ్వేసాడు .
 "ఆ పిల్లని ఎక్కడ చూసానోనన్నది గుర్తొచ్చింది. నా కొడుకుతో పాటు పిక్స్ లో చూసాను. వాడి క్లాస్మేట్ అనుకుంటాను అని చెప్పాడు."
 ఖాళీ దొరికినప్పుడల్లా ఈశ్వర్ గురించి వాకబు చేస్తూనే ఉన్నాను. ఫోన్ నంబర్ దొరికినా మాట్లాడాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఈ విషయాన్ని నా భార్య లక్ష్మితో చెప్పాలనుకుని పెదాలపై వచ్చిన మాటని నొక్కేసాను. "రోజూ నేను చెపుతున్న విషయాలు అవేగా ! మీరసలు వినిపించుకోరు, ఇప్పుడర్ధమైందా? " అని క్లాస్ తీసుకోవడంతో పాటు ఆడపిల్ల తల్లిగా మరింత భయపడుతుందని మనసులోనే దాచుకున్నాను.
ఓ నెలరోజుల తర్వాత  ఈశ్వర్ నుండి ఫోన్. నాకతనితో మాట్లాడటం ఇబ్బందిగానే తోచిందిడా అరవింద్ అనే ఆయన నాకు ఫోన్ చేసి ఆ రోజు ట్రైన్ లో మా అమ్మాయితో  కలసి ప్రయాణించినప్పుడు మీరిద్దరూ  ఎలాంటి మిస్ బిహేవ్ చేయలేదని చెప్పాడు. నా కూతురెందుకు  అలా చెప్పిందా అని ఆలోచించాను.నిశితంగా గమనిస్తున్నా ఎవరెవరితోనో  ఫోన్ లో మార్చి మార్చి మాట్లాడుతూ ఉంటుంది. నా దగ్గర నటిస్తుందని అర్ధమయింది. నా కూతురు మాటలు నమ్మి నిన్ను తప్పుగా అనుకున్నాను, నన్ను క్షమించాలి "అన్నాడు.   అరవింద్ ఈశ్వర్ నంబర్ ఎలా  సేకరించాడో? తన కొడుకు సూర్య  హెల్ప్ తీసుకుని  ట్రై చేసి ఉంటాడని అనిపించింది. మొత్తానికి నన్ను రక్షించాడు. లేకపోతే ఈశ్వర్ దృష్టిలో నేనెంత  చెడ్డవాడిగా మిగిలిపోయే వాడినో కదా! అనుకున్నాను.
మరి కొన్నాళ్ళ తర్వాత  ఈశ్వర్  స్వయంగా కలవడానికి వచ్చాడు. ఆతను చాలా దిగులుగా కనిపించాడు.   ఎందుకలా ఉన్నావ్ ? ఏమైనా సమస్యలా అడిగాను .
 "అన్నింటి కన్నా పెద్ద సమస్య పిల్లలే ! నా కూతురు నా దగ్గర ప్రేమ కురిపిస్తూ గారాం  పోతుంటే ఇంకా చిన్న పిల్లే అనుకున్నాను. అడిగినవన్నీ కొనిస్తూ  నా స్తోమతకి మించి  ఖర్చు చేసైనా ఏమీ తక్కువకాకుండా చూస్తున్నానుఅబ్బాయి కన్నా అమ్మాయే ముఖ్యమనుకున్నట్టు పెంచుకుంటూవచ్చాను.తను  ఇంత స్వేచ్చగా విహరిస్తుందనితల్లిదండ్రులని కూడా మోసం చేస్తుందని అనుకోలేదు. ఇన్నాళ్ళు తను క్లోజ్ గా  తిరిగినతనని పెళ్ళి చేసుకోనంటుందని ఈ ఫోటోలు బయటపెడతానని బెదిరిస్తూ  ఎవరో అబ్బాయి నాకు కొరియర్లో ఈ ఫోటోలు పంపాడు. అవి తీసుకుని  కాలేజ్ కి వెళ్ళి నా కూతురికి చూపించాను. ఏమిటమ్మా  ఇవి అని అడిగితే  "ఆడమగ కలసి చదువుకుంటున్నాం. జస్ట్ ఫ్రెండ్లీగా ఉన్నంత మాత్రానే పెళ్లి చేసుకుంటానని అతననుకుంటే  తప్పు   నాదెలా అవుతుందని నాన్నా!  అంటుంది అంత  క్లోజ్  గా అతుక్కుని ఫోటోలు  దిగడాన్ని   ఫ్రెండ్షిప్  అంటారాతల్లీ అని అడిగాను. "కోడ్ ఆఫ్ కండక్ట్" పెడుతున్నారా? అంది. అంటే ఏమిటో  నాకేమీ అర్ధం కావడంలేదు. నువ్వేదైనా సలహా చెపుతావని వచ్చాను  అంటూ నా చేతిలో ఒక కవర్ పెట్టాడు.
 నాక్కూడా ఏం మాట్లాడాలో  తోచలేదు "కోడ్ ఆఫ్ కండక్ట్ " అన్నమాట గురించి   ఆలోచిస్తూనే కవర్  ఓపెన్ చేసానుఈశ్వర్ కూతురు ఒక అబ్బాయితో చాలా క్లోజ్ గా ఉన్న చిత్రాలు. ఆ చిత్రాలలో ఉన్న అబ్బాయి ఆ రోజు ట్రైన్ లో కలిసి ప్రయాణం చేసిన అబ్బాయి ఒకటి కూడా కాదు. అదేంటి ? ఈ అబ్బాయి వేరే అబ్బాయా ? అని అనబోయి క్షణాల్లో తమాయించుకున్నాను. మీరు ట్రైన్ లో చూసిన అబ్బాయి ఈ అబ్బాయే  కదూ  ? అడిగాడు. కాదని అంటే గుండె పట్టుకుని  నా కళ్ళ ముందే కుప్ప కూలి పోయేటట్టున్నాడనుకుని  అవునని  తలూపాను. ఆ రాత్రంతా ..ట్రైన్ లో మాతో పాటు ప్రయాణం చేసిన పెద్దామె మాటలు గుర్తుకొస్తూనే ఉన్నాయి. అతి కొద్దీ మంది  అమ్మాయిలు అతి స్వేచ్ఛతో ప్రవర్తించడం వల్ల  పద్దతిగా ఉండే మిగతా అమ్మాయిలకి కూడా ఇబ్బంది వస్తుంది. అందరు ఆడపిల్లలు అలాగే ఉంటున్నారని జమ కట్టే వాళ్ళు ఉన్నారు. ఎవరు త్వరపడి, ఎవరు పొరబడి జీవితాలని నాశనం చేసుకుంటున్నారో తెలుసుకోవడం కూడా కష్టంగానే ఉంది. ప్రతి తల్లిదండ్రులు పిల్లలని అనుమానంగా చూడాల్సొచ్చిన రోజులివి. ప్రశాంతంగా నిద్రపోలేని రోజులివి .
కొద్దీ నెలల తర్వాత  అర్ధరాత్రి సమయంలో ఆత్మహత్యా ప్రయత్నం చేసి సృహలేని స్థితిలో ఉన్న కూతురిని చేతుల్లో వేసుకుని నా హాస్పిటల్ కి వచ్చారు ఈశ్వర్ అతని భార్య. సేవ్ చేసిన తర్వాత  ఈశ్వర్ భార్యకి ఇంకో విషయాన్ని చెప్పే బాధ్యతని  నా భార్య లక్ష్మీ పై ఉంచాను.ఆమె అభావంగా నావైపు చూసింది.