21, జులై 2019, ఆదివారం

" పూవై పుట్టి" కథ వెనుక ..

ఫ్రెండ్స్ ....
కొత్త కథ 2019 లో వున్న నేను వ్రాసిన కథ " పూవై పుట్టి" రచన వెనుక ఉన్న కథ
ఈ కథ గురించి తప్పనిసరిగా మీతో చెప్పాల్సిన నాలుగు మాటలు
ఈ కథను వ్రాసాక ఒకో పత్రికకు పంపి తిరిగి వచ్చినప్పుడల్లా tone మార్చి తిరగ వ్రాసాను. అలా మూడుసార్లు తిరగ వ్రాసిన కథ యిది. ఈ కథను ముగ్గురు మిత్రులు చదివారు. ఎవరికీ యిది నేను వ్రాసిన కథ అని చెప్పలేదు. ముగ్గురూ మూడు రకాల అభిప్రాయాలు చెప్పారు కానీ వొకరు కూడా యీ కథలో నిజ జీవిత ఛాయలను కనుగొనలేక పోయారు.. కొత్త కథ 2019 కి పంపినపుడు టైటానిక్ సురేష్ గారు ఆ కథను క్యాచ్ చేసారు. బాగా తీసుకువచ్చారు వనజ గారూ అని మెచ్చుకున్నారు.
ఈ కథ వ్రాయడం వెనుక నా ఆలోచనల్లో వూపిరి సలపనితనం వుంది. ఒక వేదనటీగ నా మస్తిష్కం పై వాలుతూ వుండి నన్ను నిలవనీయకుండా చేసింది. కథ వ్రాయక ముందు విపరీతంగా హోమ్ వర్క్ చేయాల్సి వచ్చింది. వ్రాసిన తర్వాత చాలా రిలీఫ్ గా ఫీల్ అయ్యాను. ఇప్పుడీ కథ బావుంది బాగోలేదు అనే ప్రశంస విమర్శ కోసం కూడా నేను యెదురుచూడటం లేదు. కథ పాఠకలోకంలోకి వెళ్ళింది అది చాలు. ఈ కథకు వొక మంచి ప్లాట్ ఫామ్ దొరికింది అది చాలు.
ఇంకొక విషయం ఏమిటంటే వంద కథలు వ్రాసిన అనుభవంలో ఈ కథను యెలా పడితే అలా వ్రాయలేదు. పూవు పూవు కలిపి జాగ్రత్తగా మాలనల్లినట్లు ఓర్పుగా కూర్చి కూర్చి వ్రాసాను. రచయితగా ఈ కథ వ్రాయడం నాకెంత తేలికో అంత కష్టమనిపించిన కథ యిది. మనసు ఉగ్గబట్టుకోలేక వ్రాయకుండా వుండలేని తనంలో వ్రాసాను. ఈ కథ వ్రాయాలని తపించాను. వ్రాసిన తర్వాత నా మనసుకు మరియు ఆలోచనకు నచ్చిన, సంతృప్తినిచ్చిన కథ యిది. నేనెపుడూ చెబుతూవుంటాను.. నాకథలన్నీ ముప్పాతిక వంతు జీవితకథ పావు వంతు కల్పన అని.. ఈ కథ పూర్తిగా కల్పన అనుకుంటే మంచిది. నన్నెవరూ ప్రశ్నలు వేయకుండా వుంటారు. పోనీ పూర్తిగా.. జీవితకథ అనుకోండి. అపుడుకూడా నన్నేమి అడగకండి. Even then I feel safe. 
బంగారు పళ్ళేనికి కూడా గోడ చేర్పు అవసరం.
అక్షరాలు బంగారం అవునో కాదో తెలియాలంటే... ఏదో వొక గోడ అవసరమైన కాలం... ఈ కాలం  పత్రికలు ప్రచురించడానికి అనుమతించని కథలు రావాలంటే ఇలాంటి కథాసంపుటాలు రావాల్సిన ఆవశ్యకత వుందని నేను భావిస్తున్నాను.
Thank you so much కొత్తకథ 2019. Thanks Khadeer Garu & Suresh Garu
కొత్త కథ 2019 ను కొనండి, చదవండి. చదువుతారు కదూ





16, జులై 2019, మంగళవారం

దృష్టి కోణం


కొన్ని కథలను పత్రికలు ససేమిరా ప్రచురించవు. ఎవరి ప్రామాణికాలు,విధానాలు, ఉద్దేశ్యాలు వారికి వుంటాయి కదా!
అందువల్ల రచయితలకు యిబ్బంది కూడా లేదు. ఎక్కువమంది చదవాల్సిన రచనలను ఆలస్యంగా తక్కువమంది చదువుతారు. లేదా ఆలస్యంగా యెక్కడో ప్రచురితం అవుతాయంతే..అంతే !
ఒక మాసపత్రికలో లో పబ్లిష్ అవబోయిన కథ ఆఖరినిమిషంలో ఎడిటర్ కథ చదివి తన నిర్ణయం మార్చుకోవడం వల్ల cancel అయింది. కథ పంపి ఏడు నెలలు. పరిశీలన ప్రచురణకు వెళ్ళేముందు జరుగుతుంది అనుకుంటాను . అదీ... రచయితకు ప్రచురణకు వెళుతుంది అని తెలియజేసాక కూడా నిర్ణయం మారవచ్చు. అది దృష్టి కోణం వల్ల కావచ్చు. కథలు ప్రచురించని పత్రికల వారిపై నాకు యెలాంటి వ్యతిరేకత కూడా లేదు. వూరికే నా ఆలోచనలను పంచుకుంటున్నాను అంతే!
నేను ఆ మాస పత్రికకు పరిశీలన కొఱకు పంపిన కథ “ పగిలిన కల” ఆ కథలో కుల వివక్ష, దళితులను అణిచివేసే అగ్రకుల అహంకారం కన్నా.. దళితులు aggressive గా ఆలోచనలు చేసి atrocity act కేసులు పెడుతూ విచారణలో అవి false cases అని నిరూపితం అయ్యాక కూడా కక్షపూరిత స్వభావంతో యితరులపై దాడి చేయడం క్షణికావేశంతో ఆత్మహత్యలకు పాల్పడటం జరుగుతుంది. వారి aggressive thoughts మూలంగా వారి వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబానికి ముఖ్యంగా కుటుంబంలోని స్త్రీ లకు అన్యాయం జరుగుతుంది. కేసు బలంగా వుండటం కోసం ఈవ్ టీజింగ్ చేస్తున్నారనో కులం పేరున తిట్టి అవమానించారనో అత్యాచారం చేయ ప్రయత్నించారనో స్త్రీలతో కేస్ లు పెట్టించడం లాంటి చర్యలకు దిగుతున్నారు. అలాంటి సందర్భాలలో ఆ చర్యలు స్త్రీల మనఃసాక్షికి విరుద్దంగా తనవారే తమని వ్యక్తిగత ఆస్తిగా పరిగణించడం తమకి అవమానంగా మిగులుతున్నాయని భావించడం జరుగుతుంది. ఇలా జరుగుతుందని నోరు విప్పి చెప్పే స్త్రీలు కూడా తక్కువే! ఇటువంటి చర్యల వల్ల ప్రతి స్త్రీ తన పురుషుడి చుట్టూ అల్లుకున్న కలలన్నీ పగిలిపోతాయి. వాళ్ళకు అవమానంతో పాటు దుఃఖం మాత్రం మిగులుతుంది.
ఈ అంటరానితనం ఉందనుకుని aggressive గా వుండే వారికి కూడా atrocity act ఒక ఆయుధమై పోయిందని కొందరు దళిత స్త్రీలు వాపోయిన సందర్భాలున్నాయి. పనిపాటలు చేసుకుని బ్రతికే వారికి పనులు దొరకడం కష్టమైపోయిందని అదివరకు కనిపించని వెలి అప్పుడే మొదలైందని అగ్రకులాల వారు దళితులని భయంగా చూస్తున్నారని చదువుకునే పిల్లలు సైతం స్నేహానికి దూరం జరుగుతున్నారని చెప్పడం జరిగింది.
నేను స్త్రీ కోణంలోనే ఆ కథ వ్రాసాను. ఎందుకంటే అణచివేతకు గురవుతున్నామని భావించే పురుషులు కూడా తమ అహంకారాన్ని చూపేది వారి వారి స్త్రీల పైనే అన్నది మరువరాదు. నా కలమెప్పుడూ నేల విడిచి సాము చేయదు.
కథ అంటే కొందరికి ఊహాకల్పన కావచ్చు. నా దృష్టిలో కథంటే జీవితం.
సరే ..ఈ కథ ఇంకొక పత్రికకు పంపే ఆలోచన లేదు. నేను ప్రచురించే "దుఃఖపు రంగు " కథా సంపుటిలో అముద్రిత కథగా రాబోతుంది.
ప్రచురణకు నోచుకోని కథలు వల్ల రచయితలకు వారి వారి అనుభవాలు రాటుదేల్చుతాయి. 🙂
ఫోకోస్ లేకపోతే చిత్రాలు బాగా రానట్లు ఫోకోస్ లేకపోతే కొన్ని సమస్యలు బయటకి రావు





                                                      (చిత్రాలు  గూగుల్ నుండి సేకరణ) 

8, జులై 2019, సోమవారం

అంతరంగ మిత్రునితో మాటలు

🌼ఈ రోజు భగవంతునితో నా మాటలు🌼. అంతరంగ మిత్రునితో మాటలు చెప్పినట్లు ..

ఈశ్వరా... నీ పూజకు పూవులను తెచ్చాను. రాలిన పూవులను చూస్తూ జాలిపడి.. అయ్యో.. ముందు రోజు మిమ్ములను విస్మరించడం యెంత పొరబాటైనదీ.. మిమ్ములను తృంచుతూ నా పూల సజ్జ నింపుకుంటూ కూర్చుంటే నా స్వామి పూజకు వేళ మించిపోదూ.. అనుకుంటూ.. పూచిన ప్రతి చెట్టు నుండి కొన్ని పూలను సేకరించే ముందు చెట్టుకు పొదకు తీగకు క్షమాపణలను చెపుతూ గోటిగాటు పడకుండా రెమ్మలు విరగకుండా పూవు నలగకుండా .. సున్నితమైన పూలను అంతే సున్నితంగా తల్లి నుండి వేరు చేసి తేవడం పట్ల నాది కఠినమైన మనసు అని గోచరిస్తే అందుకు నేనేమి చేయగలను. ఎన్నెన్నో పూలను సేకరించి వాటిని నీకర్పిస్తూ మనసారా నిను కీర్తిస్తూ .. వొడలు మరిచి సంకీర్తన చేస్తూ పరమానందంలో తనమునకలవడమే కదా నేను చేయుచున్నది. మధ్య మధ్య చిత్తము మరొక విషయములపై వాలుచున్ననూ క్షణాలలో తెప్పరిల్లి చిత్తముని మందలించి మనముని నీపై లగ్నం చేసి నిను పూజిస్తుంటిని కదా .. మల్లన్నా.. నా ప్రార్దనలన్నీ ఎవరి కోసమో నీకు తెలియనిదా.. నీలో సగమై వున్న అమ్మను కోరిన వెంటనే కామితములను తీర్చే పెద్ద దొడ్డమ్మను వొదిలి.. నా కోరికలను నీకు విన్నమించుటలోనున్న ఆంతర్యం నీవెరుగనిదా..! అమ్మని వొదిలి అయ్యను అడుగుతున్నారంటేనే.. బిడ్డలకు తండ్రి వెన్నలాంటి మనసు తెలుసుననే కదా... తండ్రీ.. చంద్ర కళావసంత శిరో శివా.. కరుణాకరా.. భక్తబంధూ .. చరణం శరణం తవాస్మి.

పరమేశ్వరా.. నీ పూజకు తెచ్చే పూలలో వాటిని తుమ్మెద ముట్టని పూవులని యెటుల తెలుసుకుందును.?. మకరందాన్ని పొడిచి పొడిచి ఆరగించ బుల్లి పిట్టల కాలి జాడలను గుర్తించగలను కానీ, అటులను నిన్న పూచి తమ వన్నె చిన్నెలన్నీ తరిగి నేటికి నేలరాలిన పువ్వులను గుర్తించగలను కానీ.

ఎవరైనా స్వయంగా మొక్కలను నాటి పెంచి పోషించిన పిమ్మట పూచిన పూలను నీకర్పించుట పాడి యగును కానీ పరులు పెంచిన తోటలో పూలను తస్కరించి నీకర్పించుట తగదు కదా ! నాకా భాగ్యమును కల్గించలేదని కినుక వుంది క్లేశమూ వుంది. అయిననూ నిను పూజించడంలో గొప్ప శాంతి వుంది. అది నేనెలా వొదులుకోగలను.

కొందరు నా పూజల పట్ల బహిరంగంగా నేను తెలియజేయుట పట్ల అదేదో ఘోర తప్పిదం అయినట్లు ఎగతాళి చేస్తూ విమర్శించు చుందురు. ఏమీ వారు మాత్రం వారి వారి దేవుడ్ని ప్రార్ధించడం లేదా .. వారు చేతులు జోడించి నమస్కరించుదురో అరచేతులను ఆకాశం వైపు చూపుతూ ప్రార్ధించుదురో లేదా పైన కుడి ఎడమలను తాకుతూ కిందికి దిగి మరల వేళ్ళలో వేళ్ళు జొనిపి పెదవులు కలిపి ప్రార్ధించేదరో కదా, ..ఒక్క హిందువులనే పరమత పీడితులని నిందించుట ఏల? ఎగతాళి చేయుట ఏల? అసలు పరమత సహనం లేకుండా పోతుంది కదా తండ్రీ .. నేనెన్నడూ యితరులని అలా చేసినది లేదు. ఒకవేళ అలా చేసిన యెడల శిక్షింపుము తండ్రీ..

ఈమధ్య నేను పరమత సహనం చూపాలి ఎవరిని అల్పులుగా బలహీనులుగా చూసి దండించడం పాపం, నేరమూ అందరికి సమంగా బ్రతికే హక్కు వుందని వాదించి వాదించి వారి దృష్టిలో శత్రువుని అయ్యాను. నాలుగు రోజులుండి పోదామని వచ్చిన మిత్రురాలు కూడా అందరూ సమానమన్నందుకు కోపగించుకుని తిరుగు ప్రయాణమయ్యింది ప్రాణ స్నేహితులమైన వారి మధ్య కూడా ఉగ్ర భావాలు చోటు చేసుకుని శత్రువలవలె వ్యవహరించు కర్మలు చేయుట ఈ దేశమున సర్వసామాన్యమైనది. నీకు తప్ప ఎవరికీ మొరపెట్టుకున్ననూ ప్రయోజనం లేని కాలమున వుంటిని నేను. స్వమతమును భుజాన మోస్తూ మరల నిన్ను పూజించే నన్ను ఎగతాళి చేసిన మూర్కులను క్షమించి వారిని కూడా చల్లగా చూడు తండ్రీ .. అక్షర అజ్ఞానాన్ని వ్యాపింపజేసే వారి యెడల  కూడా కరుణవహించి అందరిని శాంతిగా సుఖంగా జీవించే జ్ఞానాన్ని ప్రేమను ప్రసాదించు తండ్రీ ! ఇవాల్టి నా ప్రార్ధన ఇదే !

పితా యథా రక్షతి పుత్రమీశ జగత్పితా త్వం జగతః సహాయః కృతాపరాధం తవసర్వ కార్యే కృపానిధే మాం శివపాహి శంభో..