19, మే 2022, గురువారం

రాతి సీతాకోకచిలుక



రాతి సీతాకోకచిలుక -వనజ తాతినేని


ఒకప్పుడు వానాకాలం వస్తుందంటే 

కళ్ళు కలల సీతాకోకచిలుకలయ్యేవి 

ఊహలను మాలలుగా అల్లడం అలవాటేమో

తుది మొదలు సృహ లేని కాలం అది


రాతి పుష్పాలపై  తుంటరి తుమ్మెదలు 

ప్రదక్షిణలు చేసి చేసి విసిగిపోయినట్లు

మధువుకై శోధించి స్వప్నించి శోష పడి

వరుణుడిని అర్ధించి  కడకు

అమృతంతో తడిసిన పూలరెక్కలపై  విహరించి  

తూలి తూగి సోలిపోతాయని..


పూల గోష్ఠికి తుమ్మెదల చెవుల నుండి రక్తం కారిందని

మకరందం గ్రోలే సీతాకోకచిలుకలు 

పూల రంగులకు మూర్ఛిల్లి తమ అయిదు నెలల 

ఆయువును  త్యాగం చేసాయని.. 

తుమ్మెదలకు పరిమళాన్ని జల్లుకునే పనిలేదనో

ఇలా ఎన్నెన్నో వ్యర్థ ఊహాగానాలు


వయస్సు పడమటికి వాలుతుంటే

ఇతర ప్రాణులు అర్దం చేసుకున్నట్టు

వెలుగు నీడల భాషను  అర్దం చేసుకోలేని 

మనిషినని తప్పటడుగుల నాడే

కాలం ఆగిపోయి వుంటే ఎంత బాగుండేదని 

ఓ అత్యాశతో పెనుగులాట.. 


నిత్యం రంగుల పండుగను చూస్తూ 

ఎగరలేని రాతి సీతాకోకచిలుకను నేను 

అకాల వృద్దాప్యపు చొక్కా తొడుక్కున్న 

నత్తగుల్లను నేను.


18/05/2022.

కామెంట్‌లు లేవు: