ప్రియమైన నీకు….
చిన్నితల్లీ.. నాయనమ్మ నీకు వ్రాస్తున్న రెండో ఉత్తరం ఇది.
నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ఒక మధురమైన ఘట్టంలా రికార్డ్ చేయాలని వుంటుంది కానీ చేయలేను. పసిపిల్లలకు ప్రతిది ఆశ్చర్యంగా తోస్తుంది అందుకే వారు అనేక ప్రశ్నలు అడిగి పెద్దలను విస్మయపరుస్తారు అనుకుంటానెపుడూ.ఇప్పుడు అనుక్షణం నిన్ను చూస్తూ.. పసితనం మనిషికి అద్భుతమైన వరం కదా.. కాలం చెక్కిన గుర్తుల వెనుక అవి మాయమైన తెల్లకాగితాలు కదా అనిపిస్తూంది.
బంగారూ.. చీకటి పడ్డాక బ్యాక్ యార్డ్ లోకి వెళ్ళగానే మినుకు మినుకు మనే నక్షత్రాలను చూసి స్టార్స్ అని ఒకింత ఆశ్చర్యంతో చెప్పలేని సంతోషంతో నీవు అనడం చూసి నేను యెంత మురిసిపోయానో.. అది మాత్రమే కాదు ఉదయిస్తున్న సూర్యుడికి “స్వామీ” అని చేతులు జోడించడం, రాత్రివేళ చందమామను చూసి “దా దా” నీ చిట్టిచేతులతో పిలవడం చూస్తే ఏదో చెప్పలేని ఆనందం. సైకిలు యెక్కి బయటకు వెళ్ళి తిరిగిరావలనే ఆకాంక్షను చలిగాలుల బూచి చూపి నేను వాయిదావేయడం నువ్వేమో చెట్లఆకుల కదలికలను చూసి కొద్దిపాటి భయం ప్రదర్శించే చూపులతో “అమ్మో గాలి” అనడం. ఇలా ప్రతి విషయం నాకు అపురూపమే.
పచ్చదనాన్ని ప్రకృతిని పరిరక్షించుకోవాలనే ఆకాంక్ష వున్న నేను.. నిన్ను మొక్కల దగ్గరకు తీసుకువెళ్ళి వాటికి గుడ్ మార్నింగ్ చెప్పించి ఆకులను స్మూత్ గా టచ్ చేయిస్తూ.. చెట్టూ ఐ లవ్ యూ అని నీతో చెప్పించడమూ, కేవలం స్క్రీన్ మీదనే కాకుండా అనంత ఆకాశాన్ని మబ్బులను పక్షులను వాన ను సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలను ఎడతెగక తిరిగే విమానాలను విరబూసిన పూలను మంచును ఇంటి ముందు ముగ్గులను దీపకాంతుల మధ్య దైవమందిరాన్ని నీకు పరిచయం చేయడం నా బాధ్యత కూడా.ఏ రాగమో తెలియక పోయినా ఏ భాష రాకపోయినా గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గరళమాధుర్యానికి పరవశిస్తూ రాగాలు ఆలపిస్తూన్న నిన్ను చూసి నాకెంతో మురిపెం. అలాగే Nora En pure బీట్ కి లయబద్దంగా కాళ్ళు కదుపుతూ రిథమిక్ గా ఊగిపోవడం చూస్తే కూడా అమిత ఆశ్చర్యమూ ఆనందం. నీ బోలెడన్ని ఆశ్చర్యాలు నేను అనుభవించడం కూడా ఆనందమే! ఇలా రోజు మొత్తం సూర్యుడు చుట్టూ తిరిగే భూగోళంలా మనుమరాలు చుట్టూ తిరిగే నాయనమ్మను అయిపోయాను.
నీ సాన్నిహిత్యంతో మనసుకు తొడిగిన నైరాశ్యాన్ని కడిగేసుకుని నువ్వు ఇంకొంచెం పెరిగిన తర్వాత నన్ను అడగబోయే ప్రశ్నలను ఊహించుకుంటూ ప్రియమైన నీకు ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. ఈ ఊహలో సత్యమెంతో మధురం కూడా అంతే! నువ్వు నన్ను ఇలా అడుగుతూ వుంటావన్నమాట. నేను నీకు సమాధానం చెపుతుంటాను.
******
“నాయనమ్మా! రాత్రంతా నక్షత్రాలు ఎందుకు అలా మెరుస్తున్నాయి”
చీకట్లో దారి కనబడక మనం ఇబ్బంది పడుతుంటామని దేవుడు మనకు దారి చూపడానికి ఇచ్చాడమ్మా అంటాను నేను.
ఉహూ.. అంటావ్ పెద్ద ఆరిందలా.
మరో రోజు..
“ నాయనమ్మా! రోజూ సూర్యుడు ఎందుకు వస్తాడు, సాయంత్రం మాయమైపోతాడెందుకు”
చిన్నితల్లీ.. మిష్టర్ సూర్య ఎక్కడికీ వెళ్ళడమ్మా అతనికి చాలామంది పిల్లలు. వాళ్ళ ఊరికి కూడా వెళ్ళి వస్తాడంతే!
“నాయనమ్మా! వాన ఎందుకు కురుస్తుంది. కాసేపటికి
మాయమై అది ఎక్కడికి వెళుతుంది?"
“పూల చెట్లకు, పండ్ల తోటలకు, పొలాలకు దాహం అవుతుందని దేవుడు వాటికి నీళ్ళు పోస్తాడమ్మా ఎందుకంటే ఆయన వాటిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు.
” నాయనమ్మా! నువ్వు నన్ను కూడా ఎప్పుడూ ప్రేమిస్తావా! నేను ఎంత అల్లరి చేసినా తిట్టకుండా ప్రేమిస్తావా!? అని అడుగుతావు.
చిన్ని తల్లీ! నా బంగారు కొండా! నువ్వు నాకెప్పటికీ ప్రియమైన దానివి. ఎల్లప్పుడూ నా బిడ్డవి, ఎప్పటికీ మరియు ఎప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తూనే వుంటాను. దేవుడు మన అందరినీ ప్రేమించినట్లే నేనూ నిన్ను అమితంగా ప్రేమిస్తాను బంగారు తల్లీ! అంటాను.
అపుడు నీవు నన్ను ఎత్తుకోమని చేతులు చాపుతావు. నేను నిన్ను ఎత్తుకోగానే నా మెడ చుట్టూ చేతులు చుట్టేసి “ ఐ లవ్ యూ నాయనమ్మా” అంటూ ముద్దులు పెడతావు. నా హృదయం అమృతం సేవించిన ఆనందంతో ఊగిపోతుంది. చిప్పిల్లిన కళ్ళతో.. “హృదయాలను వెలిగించే దేవుడు కల్మషం ఎరుగని పసి మనసుల్లోనే కదా వున్నాడు కదా” అంటాను మీ నాన్నతో. “అవునమ్మా” అంటాడు మీ నాన్న.
నాకు తెలియని నా పసితనం నాకు తెలిసీ మీ నాన్నకు తెలియని మీ నాన్న పసితనం ఇప్పుడు మా ఇద్దరికీ తెలిసిన నీ పసితనపు ముచ్చట్లు ఇలా భద్రపరచడం నాకెంతో ఇష్టమైన వ్యాపకం కూడా. నువ్వు పెరిగి పెద్దయ్యాక వీటిని చూసి సంతోషిస్తావ్. ఫోటోగ్రాఫ్ లు వీడియోలతో పాటు ఈ లేఖలను కూడా నీ పిల్లలకు చూపించి నీ బాల్యాన్ని వారికి పరిచయం చేస్తావు కదూ! బాల్యం మధురమైనది ఎంతో స్వచ్ఛమైనదని అప్పుడు నువ్వు కూడా అనుకుంటావు.
శుభాశీస్సులు బంగారు తల్లీ.. ప్రేమతో నాయనమ్మ.
(175 మంది రచయితలు వ్రాసిన లేఖాసాహిత్యం పుస్తకరూపంలో ‘’ జ్యోతి వలబోజు’’ గారి సంపాదకత్వంలో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి