20, జనవరి 2026, మంగళవారం

కిటీకీలు వికసిస్తాయి

 




కిటికీలు వికసిస్తాయి 

వెలుగుతో రంగులతో

జీవం నిండిన ప్రపంచంతో 

********

పుస్తకంలో అక్షరాలు 

అడవి పూలు లాంటివి

ఎవరో చూస్తారనీ వికసించవు

పరిమళాలు వెదజల్లవు

కాలానికి  అవే పూస్తుంటాయి

విత్తనాలై వెదజల్లబడతాయి

ఏదో వొకనాడు ఎవరో వొకరి 

అరచేతుల మధ్య ప్రేమగా 

పాత పుస్తకమై జీవిస్తాయి

*****

జీవితం ఇస్తుంది  ఎన్నో అవకాశాలు

ఆ అవకాశాలు ఉపయోగించుకుని

అవే తప్పులు మళ్ళీ చేయకు

పరిణామాలు ఎదురుచూస్తుంటాయి

దండిచడానికి.  

                                 -వనజ తాతినేని


18, జనవరి 2026, ఆదివారం

పంట కోసే పిల్ల పాట

The Solitary Reaper  - William Wordsworth 

 ద సోలిటరీ రీపర్ 

                    ప్రముఖ ఆంగ్ల కవి - విలియం వర్డ్స్‌వర్త్  రాసిన కవిత కు తెలుగు అనువాదం వినండీ. అనువదించిన వారు  P. సింహాద్రమ్మ. విశాఖపట్టణం



అదుగో! అక్కడ!

ఆమె పాటను శ్రద్ధగా వినండి 

వొంటరిగా పొలంలో పనిచేసుకుంటోంది 

దూరంగా ఉన్న పర్వత ప్రాంతాలనుంచి వొచ్చిన పిల్ల 

పంట కోస్తూ తనలో తానే పాడుకుంటోంది 

కాసేపు ఆగి వినండి... లేదా నెమ్మదిగా వెళ్ళండి 

ఒక్కతే కోస్తూ కోసిన వెన్నుల్ని కట్టగా కడుతూ 

ఒంటరిగానే పాడుకుంటోంది 

ఏదో ప్రాచీన గానం  ఒంటరి విషాద గీతం 

వినండి! లోయలనిండా నిండిపోయి 

కొండల్లో ప్రతిధ్వనిస్తోంది 

లోతైన ధ్వనిలో ఉప్పొంగిపోతోంది


ఎక్కడినుండో దూరాభారాలనుండి వొచ్చి 

అరేబియా ఎడారి ఇసుక తిన్నెల మధ్య అలసిపోయి 

ఏ నీడలోనో విశ్రాంతి తీసుకునే ప్రయాణీకులకు 

ఏ చకోర పక్షీ కూడా ఈమె పాడినంత శ్రావ్యంగా 

స్వాగత గీతాలు పాడివుండదు 

వసంత కాలంలో కోయిల పాట కూడా ఇంత మాధుర్యంగా వినబడి ఉండదు 

అంతగా ఉత్తేజ పరిచేలా ఎన్నడూ వినలేని స్వరం అది 

సముద్రాల నిశ్శబ్దాన్ని బ్రద్దలు చేస్తూ 

సుదూరంగా వ్యాపించిన హెబ్రైడ్స్ ద్వీప సమూహాల 

మధ్యనుండీ వస్తున్న సాంప్రదాయ సంగీత విభావరేమో అది!!


ఆ పాట ఏదో సుతి మెత్తటి సందర్భం గూర్చి పాడినదా!

లేక రోజూ ప్రతినిత్యం జరుగుతున్న ఏదేని ప్రాముఖ్యత గల అంశమా?

ఏదేని సహజంగా ఉండే విషాదమా 

ఏదేని కోల్పోయిన విషాదమా 

ఎప్పుడో ఒకనాడు  బాధించినదా 

లేక మళ్ళీ ఇప్పుడదే బాధిస్తున్నదా

ఎవరైనా చెబుతారా నాకు?

ఆమె ఏం పాడుతోంది?

కవితలా ? వాటి ఛందస్సు తీరు తెన్నులా

బహుశా ఏనాటి తన గుండె గాయాల గురించా 

తీరని కోర్కెల గురించా 

సుదూరంగా ఉండే చిన్న చిన్న సంతోషాల గురించా 

తాను ఒకనాడు చేసిన యుద్ధాల గురించా 

లేక మరికొంచెం నిజాయితీ గా చెప్పాలంటే 

తన సహజ కష్టాల గురించా 

తాను పోగొట్టుకున్నదీ , లేక

తనను పదే పదే తాకుతున్న 

ఏదేని దుఃఖపు  తెరల గురించా??


అర్ధం ఏమైనా అయి ఉండొచ్చు 

ఆపిల్ల పాటకి అంతే లేనట్టుంది 

తాను పని చేసుకుంటుండగా పాడడం

కొడవలి వంపులోంచీ చూసాన్నేను 

కదలకుండా నిశ్చలంగా నిలబడి విన్నానా పాట 

కొండ చిగురుకి ఎక్కుతూ 

నాగుండెలో ఎన్నాళ్లకయినా ఆ గానాన్ని దాచుకున్నాను

ఇంకేనాటికీఆ స్వరం నాకు వినపడ నప్పటికీ......

(ఎప్పటికీ ఆపాట వినలేక పోయినప్పటికీ......)





పండగ అంటే..

 


పండగంటే.. ఏమిటంటే.. 

పండగ అంటే నాకు ప్రత్యేకమైనదిగా ఏమీ వుండదు. మన ఆత్మీయులు కళ్ళ ముందుంటే వారితో కలిసి పచ్చడి మెతుకులు తిన్నా అదే సంతోషం. అబ్బాయి అమెరికా వెళ్ళాక ఏ పండుగ చేయలేదు నేను. నా బిడ్డ లేకుండా ఏం పండగ అంటాను. గారెలు చేసినా పాయసం వండినా బెండకాయ + కొబ్బరి ప్రై చేసినా.. అయ్యో! నా బిడ్డ తినకుండా నేను తింటున్నాను కదా! అనే బాధ వుంటుంది. అసలు ఆ వంటలు చేయను కూడా!  అందుకే పండగంటే ఏమీ వుండదు. అన్ని రోజులు వొకటే!  బొటిక్ లో పని చేసే వర్కర్స్ వుంటే వారికి కొన్ని వంటలు  చేసి ఇచ్చేదాన్ని. వాళ్ళు సంతోషంగా తింటుంటే అదో తృప్తి.  14 సంవత్సరాలు ఆదివారం అంటే కూడా ఏమీ తెలియకుండా దగ్గర బంధువులు స్నేహితుల ఇళ్ళలో  శుభకార్యాలు వేడుకలు వినోదాలు అశుభకార్యాలు వేటికి వెళ్ళలేనంత బిజిగా గడిచిపోయాయి. ఇప్పుడు అంతా ఖాళీ గా వుంటాను. అయినా వెళ్ళను. తప్పనిసరి అయితే తప్ప. పండుగలు, వేడుకలు, సరదాలు, ప్రయాణాలు ఏమీ లేవు. అంతా వొకటే!

అప్పుడప్పుడు శ్రీశైలం వెళ్ళినట్లు పుట్టింటికి వెళ్తాను. నేను ఒక్కదాన్ని అయితే కదలను. చెల్లి నాకు లింక్ పెడుతూంది కాబట్టి. నిన్న మా నాన్న చాలా సంతోషించారు.. కజిన్స్ ని కలిశాము. సంతోషంగా గడిచిపోయింది. మొన్న కాలు బెణికింది. విపరీతమైన పెయిన్. నొప్పి అనగానే మా నాన్న గారు గబగబా  లోపలికి వెళ్ళి ఆయన మోకాళ్ళ నొప్పులు లకు రాసుకునే మందు రాసి మసాజ్ చేసారు. బస్తాడు మునగాకు కోయించి ట్రంక్ లో వేయించారు. మా అన్నయ్య చెల్లెళ్ళు కోసం ఏవేవో సర్దాడు. మా వదినమ్మ తాంబూలం ఇచ్చి మంచి చీరలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చింది. నేను యదాతథంగా చెట్టు చేమ నది మనుషులు ఫోటోలు తీసి తీసి ఫోన్ GB బద్దలు అయ్యింది. మా నాన్న వచ్చేటప్పుడు చెప్పారు. పెందలాడే పడుకో.. ఆ కళ్ళు చూడు ! చుట్టూ నల్లగా అయిపోయాయి..మొహం అంతా పొక్కులు వచ్చేసాయి అని. “లేదు నాన్నా! బాగానే వున్నాను.చాలా ప్రశాంతంగా వున్నా!” అని చెప్పాను. మా చెల్లి జోక్స్ మా అన్నయ్య శబ్దం లేని నవ్వులు.. మా నాన్న ని షర్టు గుండీ పెట్టించి మరీ తీసిన ఫోటో మిట్టమధ్యాహ్నం పూట కూడా పక్షుల సంగీతం కోతుల విహారం అన్ని అలా మైండ్ లో ఇంకిపోయాయి. నలుగురు కలినప్పుడు పుట్టేదే పండగ! 

నా ఆలోచనలకు దగ్గరగా.. పండగంటే ఏమిటంటే… సిరివెన్నెల మాటల్లో.. గతంలో ఒక పోస్ట్ రాసాను.

లింక్.. ఇక్కడ.. పండుగ అంటే..



17, జనవరి 2026, శనివారం

ఆలకించు అర్మాన్ … ఆలకించు.

 ఆలకించు అర్మాన్… ఆలకించు  - వనజ తాతినేని.


అర్మాన్.. 


నీ ఇంటి వైపు చూస్తూ వెళ్ళే బాటసారుల దాహం 

తీర్చడానికి మంచినీటి బావినొకటి తవ్వించు 

కానీ నువ్వు చేద వి కాకు. 

తేనీటి ఆతిథ్యానికి వచ్చిపోయే వరుసైన వారికి 

నీ దాహ పాత్రను అరువు ఇవ్వకు. 

చాంచల్యం తో వన్నెచిన్నెలను వలగా వేసి వారిని బంధించకు

వీరెవ్వరూ  నీ వాడు కాలేరు..


అతనికిచ్చిన వాగ్దానం మరిచావా?

అతను సంచారిగా వున్నాడు. లక్ష్యాన్ని ప్రవాహాన్ని కలగంటున్నాడు.

అనేక సంగతులను మేలి ముసుగును కలగంటున్నాడు 

అతని వలపుని గులకరాయిని చేసి విసిరి పడేయకు. 

ఏరిపారేసిన గవ్వలకు విలువ వుంటుంది. కొద్దిగా ఓపిక వహించు


ఎవరెన్ని మణి రత్నఖచిత భూషణములు బహుకరించినా

అవి అతని పాద ధూళి కి  సమానం కాదు. 

నువ్వు అతని దానివి గానే వుండు. 

అతను ప్రమాణం చేసాడు అన్యులను ఊహించనని 


ముసలి ఒగ్గు అయిన తల్లిని చూడటానికి కూడా

వెళ్ళకుండా నీ వద్దకే వస్తాడు 

తన ప్రాణాలను నీ పాదాల వద్ద పణంగా ఉంచుతాడు. 

తన గుండెను గొంతుగా మార్చి

పహాడి రాగంలో పాటలు పాడి నిన్ను సంతోషంతో అలరిస్తాడు. 


కొన్ని పాటలను నీలోఫర్ పుష్పాలుగా మార్చి నీ కొప్పులోన అలంకరిస్తాడు. 

పాల లోయ మధ్య వున్న సరస్సుల్లో నిను విహరింపజేస్తాడు.

తన ప్రేమతో నీకు శాశ్వతత్వాన్ని ప్రసాదించగల నేర్పరి అతడు

ఇంతకన్నా విలాసవంతమైన దాంపత్యం వుంటుందా?  


కాలం కఠినం అయితే అర్థాకలితో నైనా అలమటిస్తాం

సంగీతం తాగి రోజులు వెళ్ళమారుస్తాం అని నువ్వే అన్నావు. 

ఆ నాటిని గుర్తు చేసుకో! నీ ఆనందం అవసరార్థం వలసపోయింది అంతే! 

పక్షి తిరిగి రాకుండా వుంటుందా? 


ఎప్పుడో దుఃఖం మేఘంలా కమ్ముకొస్తుందని 

ఇప్పటి సంతోషాన్ని చెడగొట్టుకోవాలా?

ఎప్పుడో సంతసం వస్తుందనే ఆశతో 

ఇప్పడు దుఃఖాన్ని బలవంతంగా ఆహ్వానిస్తారా? 


మనిషికి ఎప్పుడు ఏది లభిస్తే దానికి దోసిలి పట్టాలి 

ఇరు దోసిళ్ళతో  హృది ని నింపుకోవాలి. 

జీవితం భోగించడానికి కాదు 

భావించడానికి అనే ఎరుకలో ఉండాలి 


నువ్వు మాత్రం గుండె ని జోలెని చేసి 

ఎవరినో ప్రేమని అర్ధించడం అవమానం కదూ

చినుకులనే విదిలించిన కర్కసి అపహాస్యం  మరణం కాదూ!  

అది రానంత వరకూ… ముగింపుకి రాని, ప్రారంభంతో పని లేని 

వయనం ఎక్కడినుండైనా మొదలెట్టవచ్చు 

ముడిపడిపోయే తత్వం వుంటే పేద హృదయంతో పందిరి అల్లుకోవచ్చు.


ప్రారంభం ముగింపు లేని దుఃఖం ఎప్పుడైనా కమ్మేయవచ్చు 

నువ్వు ఆశించే ఈ సుఖం  దుఃఖం నీడ మాత్రమే 

అవిభక్తమైన నువ్వు మనసుతో అనేకంగా విభజించబడకు. 

ఎండమావుల వైపు పరుగులు తీయకు. 

మురికి కూపంలో పడిపోకు. ఆడిన మాటను నిలబెట్టుకో.. 


ఇదిగో.. ఈ లేఖలో నా మిత్రుడు తన ప్రాణాలను 

అక్షరాల దండగా చేసి పంపాడు. తెంపి పడేయకు 

ఆ పేద యెదకు ముళ్ళు గుచ్చకు. 

హృదయాన్ని ఆట బొమ్మగా చేసి ఆడుకోవడం న్యాయమేనా?

మధుపాత్రను పగలకొట్టకు.


దెయ్యంగా వుంటావో దేవతగా మన్ననలందుకుంటావో నీ యిష్టం. 

అతని యోగ్యతను ప్రేమ లోని గాఢతను పరిహసించకు. 

దిగులు రాగాలను బహుకరించకు. 


హీర్ రాంఝా,  సోహ్ని మహీవాల్ , లైలా మజ్నూ,

సలీం అనార్కలి,దేవదాసు పార్వతి  కథలను గుర్తు చేసుకో..

నిలువెత్తు కష్టాల్లో మునిగి విరహాగ్నిలో మండి ప్రాణాలు త్యజించి 

పులుకడిగిన ముత్యంలా  స్వచ్ఛంగా మెరిసిపోయారు

చరిత్రలో నిలిచిపోయారు.


నిన్ను అంతటి వారిగా ఖ్యాతిగాంచమని

అనడంలేదు. సొమ్ములకు అమ్ముడుచెందకు అని బతిమాలుకుంటున్నా

ఇష్క్ పతాకాన్ని గర్వంగా ఎగరనీయ్.

అతనికి ప్రియ మిత్రుడినన్నమాటే కానీ..నేను నీకూ హితుడిని  

దయచేసి నా మాట ఆలకించు ఆర్మాన్ .. ఆలకించు. 



01/01/2026. 10:30 pm. 




వినబడని పాట


వినబడని పాట

తలపుల నిషేధం విధించినా సరే ఆజ్ఞలు ఉల్లంఘిస్తూ 

వెలుగు లాగానో సవ్వడి లాగానో చీకటి లాగానో లోపలికి జొరబడి పోతావ్  

*********

నేను లోలోపల పాడుతున్న పాటలు కూడా 

పక్షుల వలె సీతాకోకచిలుకలు కు మల్లే ఎగురుతూ నీ వద్దకు చేరుకుంటాయ్. 

*********

నువ్వు నా ప్రపంచాన్ని దోచుకున్నావు. 

విస్తరించుకున్నావు. ఆఖరికి నా ఇంటిని కలల ప్రపంచాన్ని కూల్చేసి పోయావ్ 

*********

విడిపోయి మళ్ళీ కలుసుకునేటప్పుడు లోపాలు నీలో కన్నా నాలోనే ఎక్కువగా  

కనబడతాయ్,  నువ్వు మగవాడివోయ్. 

*********

రాత్రంతా నిన్ను గుర్తుచేసుకుంటూనే వున్నాను.జ్ఞాపకాల చంద్రుడు 

నా హృదయంలో  అమావాస్య చీకట్లు నింపుతూ,


                     - వనజ తాతినేని


13, జనవరి 2026, మంగళవారం

ది రోజ్ ఫ్యామిలీ

 ది రోజ్ ఫ్యామిలీ.. 

గులాబీ పువ్వు అంటే ఒక గులాబీ పువ్వు

అది ఎప్పుడూ గులాబీగానే వుంది

కానీ ఇప్పుడు ఒక సిద్ధాంతం ప్రకారం 

ఆపిల్ పండు బేరీ పండు కూడా గులాబీ యే. అలాగే రేగు పండు కూడా అనుకుంటాను. 

పిమ్మటఏది గులాబీ అని నిరూపించబడుతుందో అది ఆ దేవుడికి తెలుసు. 

మీరు నిస్సందేహంగా ఒక గులాబీ. 

కానీ మీరు ఎల్లప్పుడూ ఒక గులాబీ గానే వున్నారు. 

The Rose Family  by Robert  Frost

కి అనువాదం. 

కవి భావం ఏమనగా.. ఉన్నదాన్ని వున్నట్టుగానే వుండనీయండి. వేటినో తెచ్చి దానితో కలపవద్దు. ఉన్నదేదో ఎప్పుడూ ఒకటే! 

ఉదాహరణకు 

ఒక గులాబీ పువ్వును గులాబీ పువ్వు గానే వుండనివ్వండి

కవిత్వాన్ని కవిత్వం గానే వుండనీయండి. 

ఫెమినిజం  ని ఫెమినిజంగానే వుండనివ్వండి. 

స్వేచ్ఛ ని స్వేచ్ఛ గానే వుండనివ్వండి. 


************ ఇంకొకటి కూడా.. 

😊 నన్ను నన్ను గానే వుండనీయండి. 

వనజ తాతినేని always వనజ తాతినేని. 

11, జనవరి 2026, ఆదివారం

వన్య

 




వన్య   - వనజ తాతినేని #sketch


ఓయ్.. వన్య! వన్య!!  ఎక్కడ వున్నావోయ్

పలకవేల?  అసలే మా నగరం విశాలమైనదే కాకుండా రేయంబవళ్ళు రద్దీగా వుంటుంది. జాగ్రత్త!!

ఈ రణగొణ ధ్వనుల మధ్య నా పిలుపు వినబడుతుందా? 

 ఈ మౌనమేల, పోనీ కోపమా! 

అతిధి సత్కారాలు బాగా చేయలేదేమో నన్న నింద నాపై పడనీయకోయ్ 

మధువును సిద్ధపరిచాను. ఆరగించడమే ఆలస్యం కరుణించి కనబడవోయ్..


*********

ఏటి గట్టున పచార్లు చేస్తున్నావా  లేక

లంక భూముల్లో నిత్యం విరబూసే పూల తోటల్లో సంచారం చేస్తున్నావా?

నావ నెక్కి   షికారు కొడుతున్న కొత్త దంపతుల సరాగాలను చూస్తూ 

సిగ్గులొలుకుతూ అక్కడే ముడుచుకుపోయావా? 

నది మధ్య వల వేసి నింపాదిగా రేడియోలో  జనరంజని 

పాటలు వింటూన్న జాలరికి సహ శ్రోతవి అయ్యావా? కాస్త ముందుకెళ్ళి

ఇసుక తిన్నెలపై పవళించి విలాసంగా వేణువు ఊదుకుంటున్న మువ్వ గోపాలుడిని చూసి వచ్చావా?  

నది వొడ్డున బండరాయిపై కూర్చుని కూనిరాగాలు తీస్తున్న పడుచుపిల్ల గుండెగదిలో ఎవరున్నారో తొంగిచూస్తున్నావా? తీరంలోని తడి ఇసుకపై ఆమె చేస్తున్న కూచిపూడి నృత్యం వీక్షించావా?

ఆ పదాభినయనం నిను ఆకట్టుకుందా? మీ బ్యాలెట్ పోలె అంత బాగుందా? 

ఎలాగు  పుష్యంలోనే వచ్చావు గనుక నీకు నమ్మకం వున్నా లేకపోయినా కాస్త పుణ్యం మూటగట్టుకోవడానికి మా ఆంధ్ర మహా విష్ణువుని దర్శించి రాకపోయేవా? 

 మా రాయలు రచించిన ఆముక్తమాల్యద కావ్యానికి ప్రేరణ నిచ్చిన తావును చూసొచ్చావా? చూసింది చాల్లెద్దూ అనుకుంటూ..

వెనక్కి వస్తూంటే మా పచ్చని పొలాలపై వీచే మంద్రమైన గాలి నిన్ను సేదదీర్చే వుంటుందిలే! 


*****************


నగర సంచారం చేసి అలసిపోయి నది ఒడ్డుకు చేరావా మళ్ళీ?  

సరిగంగ స్నానాలు చేసి నీలాల కురుల నుండి ముత్యాలు జారుతుండగా రాయంచలా నడిచి వెళుతున్న ఆమెను చూసి విభ్రమ చెందావా? 

రివ్వున  ముందుకు పరుగులు తీసి  వెనుదిరిగి చూసావా!  

ముఖానికి  పచ్చని పచ్చి పసుపు పూసుకుని నుదుటిపై యెర్రని కుంకుమ దిద్దుకున్న నడి వయసు స్త్రీ సౌందర్యాన్ని కాంచి మూర్ఛపోయావా?  

ఆమె పెదవుల మధ్య  విరిసిన చందమామ తునక లాంటి

దరహాసాన్ని చూసాకైనా నీ సౌందర్యదాహం శాంతించిందా? 

ఆమె ముందు మోకరిల్లాలనిపించిందా లేదా? 

పోనీ…అరకన్నులతో సిరివెన్నెల కురిపిస్తూ పరామర్శించిన 

ఆయననైనా గుర్తు పట్టావా లేదా? అదిగో కనబడే ఆ కొండైనా విజయుడి విల్లంబులపొదిలో చేరిన పాశుపతాస్త్రం కథ చెప్పలేదా?  

అయ్యయ్యో! ఊపిరాడనీయకుండా ఇన్ని ప్రశ్నలు వేసి విసిగించానా? 

మన్నించు సఖీ! త్వరగా ఇంటికి వచ్చేయ్! 


*************

ఎక్కడో ఓల్గా తీరం నుండి మా కృష్ణా తీరానికి అతిధిగా విచ్చేసావు. 

మా నగరం  తన అందాలతో నీకు  కనువిందు చేసిందా? 

ఇప్పటికైనా ఒప్పుకుంటావా లేదా? 

సౌందర్యం ఏ ఒక్కరి సొంతం కాదని. 

ఏటవతలకు వెళ్ళి నీకొక కానుక తెచ్చి వుంచాను. 

అది ఏమిటా అనుకుంటున్నావా? 

అందమైన మంగళగిరి జరీ చీర పట్టుకొచ్చానోయ్,  

కట్టుకోవూ… సింగారించుకుని  నాకు చూపియ్యవూ 

మధువు విందు చాలులే, నా కెందుకీ చీరలు? అని విసుక్కుంటున్నావా? 

నా ఒళ్ళంతా రంగు రంగుల చీరలు. ఏ నేతకాడు నేయలేని అందమైన చీరలు  

నా చీరల రంగులను రేఖలను దొంగిలించడం మీ మానవులకు అలవాటు కదా!

నేను వెళ్ళొస్తా .. ఎప్పుడైనా మనసైతే మళ్ళీ వస్తా, 

నాకసలే చిత్తచాపల్యం అని నీకు తెలుసుగా! బై. 

ఇష్ట సఖి! వన్య….  వన్య ఇంకొన్నాళ్ళు వుండవూ!  ప్లీజ్!!

బతిమాలుతూ వుండగా మెలుకువ వచ్చేసింది. 😊❤️


*****************


*వన్య అంటే రష్యన్ భాష లో సీతాకోకచిలుక

*బ్యాలెట్ పోలె రష్యన్ నృత్యాలు. .