25, జులై 2024, గురువారం

భగవద్దర్శనం

 



మనస్సుల్లో దేవుడు. 

ఈ రోజు గురు పౌర్ణమి. 14 ఏళ్ళ క్రిందట ఇదే రోజున నేను నా కొడుకు తో కలిసి శ్రీశైలంలో వున్నాను కదా! గుర్తు చేసుకుంది. గాఢమైన జ్ఞాపకశక్తి ఆమెకు వరమో శాపమో! 

మళ్ళీ శ్రీశైలం వెళ్ళి రావాలి. స్వామి అనుమతి ఇవ్వడం లేదనుకుంటా! దేశానికి వెలుపల వున్నప్పుడు ఎంత తపించిపోయాను.ఒకసారి దర్శనం చేసుకోవాలని. ఇప్పుడు ఆ తపన లేదు. 

ఎందుకంటే.. మనసు మెదడు పొరలు విచ్చుకున్నాయి. ఆత్మబోధ లేక అజ్ఞాత బోధ నో కోరికలకు కళ్ళెం వేయమనో లేదా పూర్తిగా తగిగించుకోమనో ఉద్భోద చేసాయి అనుకుంది. 

కార్యకారణ సంబంధం లేకుండా ఏవీ జరగవు.ఏమీ కూడా జరగదు. 

“అబ్బాయ్! ఒకసారి పెద్ద గుడికి తీసుకువెళ్ళు. దైవదర్శనం చేసుకోవాలి”. ఆమె.

“నార్త్ కరోలినా లో శివాలయం వుంది బాగా నిర్మించారు అంట.అక్కడికి వెళ్దామండీ”అంది కోడలు. 

ఆ రోజు వస్తుందేమో అని ఎదురుచూస్తూ కూర్చుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక, మైలు, ఏవేవో అడ్డంకులు. సరే కార్తీకమాసం కూడా పూజ చేసుకోవడానికి వీలు కాలేదు ఒకసారి దగ్గరలో వున్న గుడికి వెళ్ళిరావాలి అని గట్టిగా అనుకుంది ఆమె. కొడుకుని మళ్ళీ గట్టిగా అడిగింది..”బాబూ! గుడికి తీసుకుని వెళ్ళు” అని.

ఒక్క కసురు కసిరాడు.నాకు వీలవదు. టైమ్ లేదు అని. ఆ కసురుకు చప్పున కన్నీళ్ళు. 

“ఛీ.. ఛీ .. ఈ మాత్రం దానికే కన్నీళ్ళు రావాలా?” అనుకుంది తన బుద్ది తక్కువ తనానికి. 

మనుమరాలి పుట్టినరోజు వచ్చింది. చక్కగా తలస్నానం చేసుకుని కుటుంబం అంతా తయారయ్యారు.  ఆమె కూడా బయలుదేరింది. “సాయిబాబా గుడి ఆంజనేయ స్వామి గుడి కా” అడిగాడు అబ్బాయి/భర్త. ఆమె మాట్లాడలేదు. కోడలూ మాట్లాడలేదు. 

సాయిబాబా గుడి దగ్గర ఆగింది కారు. ఆమెకు ధ్వజస్థంభం లేని గుడి అంటే అయిష్టత. గడచిన కాలంలో వేళ్ళ మీద లెక్క పెట్టినన్నిసార్లు వెళ్ళిందేమో! అయినా ఏదైతేనేం నలుగురు కూడినచోట అది పవిత్రమైన స్థలమే కదా! అనుకుని లోపలికి వెళ్ళింది. కోడలు పుట్టింటి వైపు వారి పూజలు సతత్సంగాలు క్రేత్ర దర్శనాలు అన్నీ సాయిబాబా చుట్టూనే! ఎవరి సంప్రదాయం వారిది. నాకెందుకు అభ్యంతరం అనుకొంటుంది. మనిషికి మానసిక సంస్కారం ముఖ్యం అనుకుంది. వాకిలి శుభ్రం చేసుకోకుండానే పూజ చేసుకోవడం.. పూజ చేసుకుని వారాల పాటు ప్రసాదం నిర్మాల్యం తీయకపోవడం గమనించి వొకటి రెండుసార్లు చెప్పి ఊరుకుంది. మనసులో భక్తి చాలును. ఆచారాలు పాటింపు ఏముందిలే అని కూడా  మళ్ళీ సర్దుకుంది. ఇవ్వన్నీ ఆలోచించుకుంటూనే దైవదర్శనం చేసుకుని హారతి కార్యక్రమం చూసి ఇంటికి వచ్చారు. 

తర్వాత ఎప్పుడూ గుడికి వెళదాం అని కొడుకును అడగలేదు ఆమె. తర్వాత కోడలు పుట్టినరోజు వచ్చింది. బిజీ షెడ్యూల్ మధ్య కూడా.. కొడుకు కోడలిని సాయిబాబా గుడికి తీసుకొని వెళ్ళడం మర్చిపోలేదు. అమ్మ మనిషి కాదా!? అమ్మకు విలువ లేదా! బంధాలు భ్రాంతులేనా!?

ఆమె వొద్దు వొద్దు అనుకుంటూనే బాధ పడింది. కళ్ళు మూసుకుంది. రెండు కళ్ళూ ధారాపాతంగా వర్షించాయి. 

నమో భగవతే రుద్రాయ శ్రీమాత్రే నమః  అని మనసులో స్మరించుకుంది. 

ఓ చల్లని చేయి ఆమె తలపై పెట్టి ఆశీర్వదించింది. “అన్నిచోట్లా నేను లేనా.. నీలో నేను లేనా? కళ్ళు మూసుకుని చూసుకో అమ్మా” అని. చప్పున కళ్ళు మూసుకుంది. పద్దెనిమిది సెకనులు ఏకాగ్రత గా.. 

శ్రీ శైల మల్లన్న దర్శనం లభించింది. అంతులేని ఆనందం ప్రశాంతమైన ఆనందం.

అది కోరినదే తడవు లభించే అపరిమితమైన ఆనందం. అపాదమస్తకం దర్శన అనుభూతి. 

మనసు మూగబోయింది. 

మొబైల్ చేతిలోకి తీసుకుంది. Pinterest దానంతట అదే ఓపెన్ అయింది. స్క్రీన్ నిండా మల్లన్న దర్శనం. 

“ఇంకెప్పుడూ ఎవరిపైన ఆరోపణ చేయను... ఎవరినీ ఎప్పుడూ గుడికి తీసుకువెళ్ళమని అడగను” అనుకుంది. ఎప్పుడు తలుచుకుంటే అప్పుడే ఇష్టదైవం మనసు మెదడు నిండా!. 

ఓం నమఃశివాయ 🙏🙏🙏

అనంతానంద భోదాంబునిధిం,

అనంత విక్రమమ్

అంబికా పతిం ఈశానం

అనిశం ప్రణమామ్యాహమ్

నశ్వరం కాని అభయమిచ్చే శంకరా ..

నేను నీ దర్శనాభిలాషిని

జన్మ జన్మల నుండి 

నీ పూజ చేయుటలో దప్పిక గొన్న దానిని

నా మీద కొంచెం దయ చూపు

నీ కన్నా నాకు ఎవరు ఎక్కువ కాదు

నా ప్రాణాలు కేవలం నీ కోసమే !

నా హృదయం పాడింది ..ఓం నమః శివాయ

ఓం నమఃశివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ 🙏🙏




కామెంట్‌లు లేవు: