27, ఫిబ్రవరి 2011, ఆదివారం

ఇక్కడ ఆశలు వ్రేలాడబడ్డాయి!?

నిజం.. నాకు నచ్చని రెండు బలవంతపు మరణాలు గురించి తెలుసుకుంటే  మీకు అలానే అనిపిస్తుంది.

నేను చాలా ఆక్రోశంతో..చాలా రోజులు ఆలోచించాను.ఒక ప్రాణం పోయటానికి..ఒక డాక్టర్ ఎంత విశ్వప్రయత్నం చేస్తారు..ఒక తల్లి నవమాసాలు మోసి ఒక ప్రాణికి జన్మ ఇచ్చి ఎంత అపురూపంగా..పెంచుతారు.ఎన్ని కష్టాలు పడతారు. బ్రతుకు విలువ తెలిసీ.. మరీ.. బ్రతకలేము అనుకుని బలవన్మరణం పొందేవారిని చూసి..నాకు వారిపట్ల జాలి కలగదు. విపరీతమైన కోపం ముంచుకొస్తుంది.

ఒక సం.ము.కాలంలో నేను చూసిన మరణాలు..ఇద్దరి యువతుల మరణాలు. ఒక అమ్మాయికి 26 వయసు.న్యాయశాస్త్రంలో  పట్టభద్రురాలు.. పేరు పొందిన కూచిపూడి నృత్య కళాకారిణి. రెండేళ్ళ క్రితం జాతీయ మహిళా దినోత్శవం సందర్భంగా.. "మహిళలా-మజాకా" అన్నమెగా మహిళా  కార్యక్రమాన్ని నేను నిర్వహించినప్పుడు ఆ అమ్మాయి "పద్మశ్రీ " మా సంస్థ ఆహ్వానాన్ని అందుకుని ఒక అతిధిగా  వచ్చి చర్చాకార్యక్రమంలో పాల్గొన్నారు.ఆవేశపూరితమైన,ఆక్రోశ భరితమైన ఆ అమ్మాయి ఆలోచనావిధానం, చట్టం పై ఉన్ననమ్మకం న్యాయ శాస్త్ర పరిధిలో.. మహిళలపట్ల జరిగే అన్యాయాలకి.. శిక్షలు ఎలా  ఉంటాయో చెప్పిన తీరు.. ఆ అమ్మాయి.. యేమిమి చేయాలని అనుకుంటుందో... అవన్నీ..చెప్పడం అందరికి యెంత బాగా గుర్తు ఉన్నాయో.! తను ఒక డాన్సు స్కూల్ కూడా నడుపుతూ.. ఆసక్తి ఉన్న పేద విద్యార్ధులకి..ఉచితంగా శిక్షణ ఇస్తూ.. ఎంతో.. స్పూర్తిగా మాట్లాడిన అమ్మాయి.. కొన్ని నెలల తర్వాత ఆత్మహత్య చేసుకుని చనిపోయిందన్న వార్త దిన పత్రికలో చూసి నేను షాక్ అయ్యాను. మన తోటి  బ్లాగర్ తెలుగు కళ కూడా ఫోన్ చేసి ఆ అమ్మాయే అని నిర్ధారించుకున్నాక  ఎంత  బాధని వ్యక్తం చేసారో. అంత  మంచి ఆలోచనా విధానాన్ని వ్యక్త పరచిన ఆ అమ్మాయేనా.. ఇలా చేసింది అని ఆశ్చర్య పోవడం తోపాటు.. బాధ,కోపం మిళితమయ్యాయి.

ఎందుకు.. ఈ ఆవేశాకావేషాలతో జీవితాని తృణప్రాయంగా భావించి తల్లిదండ్రులకి ఆవేదనని మిగిల్చి అలా.. పచ్చని ఆశలు నేరవేర్చుకోకుండానే..ఉరితో.. వ్రేలాడ బడటం!? చదుకుని పదిమందికి సాయం చేయగల మేధ ఉండి, వారసత్వ సంపదగా.. కళని అందించాల్సి ఉండి..బలవన్మరణం. కారణాలు ఏదైతేనేం..విలువైన జీవితం ముగించుకుంది. అసలు చావడానికి.. ఎంత ధైర్యం కావాలో.. చచ్చే ధైర్యం వచ్చిందంటే..బ్రతికి చూపడం ఎంత తేలికో..!? నాకు తెలుసు అది నా అనుభవం కూడా.

ఇక రెండవది.. ఇటీవలె..  మాకు సమీపంలో.. జరిగిన సంఘటన. అమ్మాయి డాక్టర్.ధనవంతుల కుటుంబంలో పుట్టిన అమ్మాయి.తండ్రి మరణం తర్వాత ఆ అమ్మాయికి  వాళ్ళ హోదాకి తగిన వరునితోనే వివాహం జరిగింది. భర్త, అతని కుటుంబీకులందరు  ధన పిశాచిలు. పెళ్లి ఆరు నెలల కాలంలో.. నిత్యం అధిక కట్నం కోసం వేధింపులు. ఆ అమ్మయి తల్లికి ఎప్పటికి అప్పుడు అక్కడ విషయాలు చెబుతూనే ఉండేది. కొంత సర్దుబాట్లు.. కొంత కాలం సైలంట్ గా ఉండటం.తర్వాత తిరిగి వేధింపులు మామూలే. అది భరించలేక  ఆ అమ్మాయి పుట్టింటికి వచ్చి తల్లికి అన్ని విషయాలు చెప్పి..కడసారి మురిపించి గోరుముద్దలు తిని మరీ..ఏ మాత్రం  అనుమానం  కలగకుండా.. నమ్మించి మరీ.. ఒక సూయిసైడ్ నోట్ వ్రాసి ఆత్మహత్య చేసుకుంది. కట్న పిశాచానికి బలి అయిన  ఒక వైద్యురాలి  బలవన్మరణం ఎంత సిగ్గు చేటు!? పైగా ఆ అమ్మాయి గర్భవతి కూడా. తన తల్లికి.. వేదన మిగిల్చి ఒక ప్రాణిని     భూమిపైకి రానీయకుండా.. ఒక  ప్రాణిని నలిపేసే హక్కు ఎవరు ఇచ్చారు ?

ఆ అమ్మాయి చేసిన  పిచ్చి పనికి ఎంతగా కోపం వచ్చిందో. ఆ అమ్మాయిని  డాక్టర్ చదివించడానికి  తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో, ఎంత ఖర్చు పెట్టి ఉంటారో.. ఒక డాక్టర్నితయారు చేయడానికి   ప్రభుత్వ ధనం (పరోక్షంగా ప్రజల ధనం ) ఎంత ఖర్చుఅయ్యిందో.. ఎంత మందికి వైద్య సాయం చెయ్యాల్సిన ఆ చేతులు..  అలా పిరికితనంతో..ప్రాణాలు తీసుకోవడం  ఏమిటో..!? వీళ్ళకి  మంచి చదువులు చదవడం  తప్ప జీవితాన్ని చదువుకోవాలని నేర్పలేని  ఈ.. ఉన్నత చదువులు ఎందుకు!?

తప్పు తమది కాకపోయినా.. సరే.. మూల్యాన్ని ప్రాణ రూపంలో.. త్యజించడం ఎంత వరకు సబబు. ఎన్ని కష్టాలు ఎదురైనా నష్టాలు భరించి అయినా..

జీవితాన్ని జీవించి చూపడంసహజలక్షణంగా..ఎదగలేకపోతున్నందుకు..యెంత బాధ కల్గుతుందో! నేనైతే.. ఆ భర్త,అతని బందువులందరిని.. చట్ట పరిధిలో, న్యాయ పరిధిలో.. శిక్షించకుండా వదిలేదాన్నేకాదు. ఎంత పిరికివాళ్ళు.ఈ..యువత.. ఇంత భీరువులా.. !? ఇలాటి యువతనా మనం చూస్తుంది, కోరుకుంది.!?.

సుకుమారంగా ఉండటం తప్పా? అంటే ఖచ్చితంగా తప్పే.. ఒకసారి వివేకానందుడి మాటలు గుర్తుకు తెచ్చుకుంటే సరి. పోరాడి సాధించాలి.. అదే అదే.. జీవితం..   

26, ఫిబ్రవరి 2011, శనివారం

మాకు నచ్చినట్లు

నా కళ్ళు పచ్చబడ్డాయి అన్నాను..నా మిత్రురాలితో.."అమ్మో.. జాండీస్ ఏమోనే! వెంటనే  హాస్పిటల్ కి వెళ్ళు" అంది. నేను ..హే! అది కాదులే అన్నాను..మరి ఏమిటో..చెప్పు? లోకానికి మొత్తానికి పచ్చకామెర్లు వచ్చాయా.?లేక.. ఓ కవి గారు అన్నట్లు భూమికి ఆకు పచ్చరంగు వేశారా!? చెప్పు తల్లీ.. చంపక అని తొందర చేసింది. "ఏముందే.. తల్లి.. నాకు.. అబ్బాయి పుట్టి బోలెడు ఖర్చు చేయిస్తున్నాడు.. ఒంటినిండా గాలి చొరబడకుండా బట్టలు వేసుకోవాలంటాడు.ఇప్పటి ఆడపిల్లలని చూడు..బట్టలు వేసుకోవడంలో.. ఎంత పొదుపరులో.!? మా ప్రక్కింటి ఆవిడ లాగా..అమ్మాయి 9 వ తరగతిలో ఉండగానే..ఇంటర్ మీడియట్ చదువుకి కాలేజ్ కి వెళ్ళేటప్పుడు రోజుకొక డ్రెస్ వేసుకుని వెళ్లాలని..అరలుఅరలుగా కొత్త డ్రెస్ లు పేర్చి పెట్టాలని తెలియదు కదా..అందుకే ఇప్పుడు బోలెడు అనుకోని ఖర్చు" అన్నాను.

నేను ఏం చెపుతున్నానో.. తేలికగానే అర్ధం చేసుకుంది నా..స్నేహితురాలు.చెప్పు.. "నీ దండయాత్ర దేనిపైన" అంది. "నీపై కాదులే'" అని నేను నవ్వి..ప్రొద్దున్నే 8.30 కో.. సాయంత్రం 4.30 కో మన  బెజవాడ  బస్సు స్టాప్స్ లోకి వెళ్లి చూడు. రంగు రంగు సీతాకోక చిలుకల్లా అమ్మాయిలు.. ఎన్ని వెరైటీ.. డ్రస్సులో" అన్నాను. "వాళ్ళని చూసేగా..నీ కళ్ళు పచ్చబడింది" అంది. "అమ్మయ్య క్యాచ్ చేసావు అన్నమాట.". అన్నాను.

 నిజంగా.. డ్రస్సు కోడ్ పెట్టి కాలేజ్ ల యాజమాన్యం మంచి పని చేసింది. లేకపోతే.. ఆడపిల్లలు పోటీలు పడి మరీ..రోజుకొక సరిక్రొత్త డ్రస్సు కావాలని తల్లుల ప్రాణాలు తీసేవారు.అమ్మలు ఏం తక్కువ కాదు లెండి. అమ్మాయిలకి కావాలని ఫిజిక్ టైట్ డ్రస్సులు.. దగ్గరుండి మరీ వివరంగా.. చెప్పి కుట్టిస్తున్నారు. ఒకప్పటి కాలం వేరు. ఇప్పటి కాలం వేరు. "అమ్మా! పైట నిండుగా కోప్పుకో..వంచినతల ఎత్తకు" అనే టైప్లో కాకపోయినా.. తగిన జాగ్రత్తలు చెప్పేముందు..మన పిల్లల  వస్త్రధారణ  ఎలా ఉంటుంది? అని తల్లి దండ్రులు ఆలోచించుకోవాలిసిన  అవసరం ఉంది. పెద్ద తెర మీద.. ఆనక చిన్న తెర మీద కూడా.. అమ్మాయిల వస్త్రధారణ ఎంత ప్రొవొకింగ్ గా ఉంటుందో..కూడా గమనించకుండా.. ఉన్నామా!? తండ్రి-కూతురు,అన్న-చెల్లెలు,మామ-కోడలు ఇలా.. బంధుత్వాల మద్య ఆడపిల్లల వస్త్రధారణ ఎంత ఇబ్బందిగా.. ఉంటుందో..చెప్పలేం. ప్రపంచ సుందరి  కాబోయే మామ(ఇప్పుడు మామ) ప్రక్కన,కట్టుకోబోయే వాడితో.. కల్సి..తెరమీద చేసిన డాన్స్ తో.. భారతీయ సంప్రదాయమే.. సిగ్గుపడిపోయింది. పెద్ద తెర సరే.. చిన్ని తెర పై కూడా.. ధారావాహిక  కార్యక్రమాల్లో.. కూడా.. నటీమణిల  వస్త్ర ధారణ ఏమి తక్కువకాదు.  నాకు అప్పుడప్పుడు ఓ డౌట్ వస్తూ ఉంటుంది. నాకే ఇలా అనిపిస్తుందా!? చూసే అందరికీనా అని.. అందుకే ఫ్రెండ్స్ తో.. ఇలా.. ముచ్చట్లు పెడుతుంటాను.వాళ్ళు కూడా నా అభిప్రాయంతో ఏకీభవించాక.. పర్లేదు.. నాకు మతి తప్పలేదు అనుకుంటూ.. ఉంటాను.

 దృశ్య చిత్రీకరణలో..మన వాళ్ళు అందే వేసిన చెయ్యి అండీ!వీక్షకుల చూపు..ని.. ప్రక్కకి మరల్చకుండా ఎలా ప్రదర్శించాలో  అలా ప్రదర్శించి.. ఆడవాళ్ళు.. సీరియల్స్ కి  అంకితం అయ్యేటట్లు చేసిన వారు.. మగ దృష్టిని కూడా.. ఆకర్షించాలని  తాపత్రయం కాబోలు అత్త పాత్రల డీప్ నెక్ సౌందర్యాలు, అమ్మాయిల దేహ సౌందర్యాలు.. తెగ చూపించి..భార్య-భర్తలు కూడా.. కలసి టీ.వీ. చూడకుండా..పుణ్యం కట్టుకుంటున్నారు. " ఏమే..ఆ.. సీరియల్స్ లో.. చూపించినట్లు..బట్టలు తొడగవద్దని నీకు ఎన్ని సార్లు చెప్పానే." అని తిట్టే భర్తని చూసాను. ఇప్పుడు పల్లెటూళ్ళకి కూడా.. ప్రాకిన లెగ్గిన్స్  మరో.. కోత్త పరిణామక్రమం. లంగా-ఓణీ,చీర పోయి చుడిదారులు వొచ్చే, అవి పోయి.. ఫేంట్-షార్ట్  వొచ్చే, అవి పోయి లెగ్గిన్స్-షార్ట్ వొచ్చే.. ఇంక్జా ఏమిటేమిటో..వొచ్చే..ఎన్ని ఫేషన్స్. నాకు ఎప్పుడూ.. ఫేంట్-చొక్కా ఏనా..అని..మా బుడ్డాడు గొడవండీ.. వాళ్లకి.. కొత్త డిజైన్లు కనిపెడితే బాగుండును కదా.. అని..ఓ.. తల్లి కోరిక.
శుభ్రంగా వొంటి  నిండా బట్ట కట్టుకున్న వాళ్ళు కనపడక  ఇంటా-బయటా..చిన్ని తెర మీద పెద్దతెర మీదా ఒకే రకంగా చూసి చూసి.. నా కళ్ళు పచ్చ బడ్డాయి...ఏం చేయను చెప్పు.. అంటూ.. ముగించాను. అవునే! చున్ని కూడా బరువైపోయింది. మెడకేగా అది అలంకారం. ఏమిటో..అంత వైపరీత్యం.. అంటుంది.

 పిల్లలకి చెప్పలేని తల్లి దండ్రులకి వైపరీత్యం కాదే.. అందం అనేది.. వస్త్రధారణలో పూర్తిగా రాదు.అసలైన అందం ఆత్మగౌరవం అని ఈ.. ఆడపిల్లకి ఎప్పుడు అర్ధం అవుతుంది.వస్త్రధారణ సౌకర్యవంతంగా ఉండటానికి..ప్రాముఖ్యత ఇవ్వడం మరచి.. దేహ సౌందర్యాన్ని..బజారున  పడేసి మరీ.. చిక్కులు కొని తెచ్చుకుంటున్న ఈ..కాలపు పిల్లలని చూస్తే.. జాలి వేస్తుంది.అబ్బాయిలకి..కామెంట్ చేసే అవకాశం వాళ్లే ఇస్తున్నారు అంటే..అమ్మాయిలకి కోపం వస్తుంది. మాకు నచ్చినట్లు డ్రస్స్ చేసుకునే హక్కు మాకు లేదా..!? వారి వస్త్రధారణ మమ్మల్నిరెచ్చగొడుతుంది..అని మేము వారిపై అఘాయిత్యం కి తలపడ్డామా?అని..ఆడపిల్లల వాదన.ఇది కాదనలేం.అసలు తేడా ఎక్కడుంది.. బాబోయి.. నాకేమి అర్ధం కావడం లేదు కానీ..తల్లిదండ్రులు..పిల్లల వస్త్రధారణ పట్ల శ్రద్ధ వహించాలి..అని మాత్రం ఖచ్చితంగా.. చెప్పాలనుకుంటున్నాను. పిల్లలు చెప్పెరీతిలో చెబితే..వింటారు.మంచి-చెడు.. వివరించి చెబితే తప్పకుండా వింటారు..     

25, ఫిబ్రవరి 2011, శుక్రవారం

అమ్మల్ని కృశింప జేయడమా?

అమ్మాయిలు ఏం పాపం చేసారు!? అమ్మలకి ఎందుకు ఇంత వేదన!? పుత్రుడి పై మమకారమేనా!? లేక ఓ.. తండ్రి మనసులోని తీరని కోరికల చిట్టానా!? ఏమిటండీ ఈ.. ప్రశ్నలు??? ఎవరికైనా సంధించారా? అని అడగకండి.నాకే అర్ధం కాక ఎవరైనా..నాకు అర్ధమయ్యేటట్లు చెబుతారని..ఈ.. ప్రయత్నం. అనగనగా..ఓ కథ కాదండీ..ఓ.వాస్తవం.

 ఆస్ట్రేలియా దేశంలో ఉన్నత విద్యకై వెళ్ళిన ఓ తెలుగు యువకుడు.ఆ..యువకుడిపై ఎన్నో..ఆశలు పెంచుకున్న తల్లిదండ్రులు.వారికి ఇంకో అమ్మాయి కూడా.. ఆ అమ్మాయికి 21 సం.లు. కారణాలు తెలియదు కానీ.. ఆస్ట్రేలియా లో ఉన్న అబ్బాయి ఆత్మహత్య చేసుకుని మరణించాడు.చాలా విషాదం.కుటుంబం మొత్తం విషాదంలో నుండి తేరుకోకుండానే  ఆ తండ్రి.. ద్వితీయ వివాహానికి  సిద్దపడుతున్నాడు. ఎందుకంటే.. మరణించిన  ఏడాదిలోపు మళ్ళీ.. ఆ యువకుడు.. ఆ తండ్రికే జన్మిస్తాడని.. ఓ  జ్యోతిష్యుడు చెప్పాడట.కొడుకు మరణించి.. తల్లడిల్లిపోయే తల్లిని ఓదార్చే ప్రయత్నం మానేసి.. పుత్ర సంతానం కోసం  21  సం. ల క్రితం  ట్యుబక్టమి చేయించుకున్న ఆ స్త్రీమూర్తికి... రీకానలైజేషన్ చేయించడం,మళ్ళీ పిల్లలు కలిగే వీలు సఫలీకృతం కాకపోవడం తో.. పుత్ర సంతానం కోసం ద్వితీయ వివాహం కోసం  ప్రయిత్నించడం.. ఇవన్నీ..కేవలం మూడే మూడు నెలల కాలంలో..జరిగిపోయాయి.. అంటే నమ్మాలి...తప్పదు మరి.ఎందుకంటే స్వయంగా..ఆ తండ్రి..ఒక లైవ్ షో లో.. సిగ్గు లేకుండా.. సందేహ నివృత్తి కోసం కాల్  చేసి మరీ..అడుగుతున్నాడు.

 సంతానంని ప్రేమించడం..వారి అభివృద్దిని కాంక్షించడం ఎవరికైనే సహజమే. వారు.. పిన్నవయసులోనే దురదృష్ట వశాత్తు వారు మరణిస్తే కలిగే విషాదాన్నిజీర్ణించుకోవడం కష్టమే.కానీ..కాలక్రమేణా కొంత తేరుకుని..జీవనాన్ని కొనసాగిస్తూ..మరణించిన ఆప్తులని..ఇష్టమైన కొందరిలో.. చూసుకుని తృప్తి పడుతుంటారు.కానీ.. చదువుకుని బాద్యతగల ఉద్యోగాలు చేస్తూ కూడా.. పుత్ర సంతానంపై.. వ్యామోహంతో.. పుత్రికా సంతానాన్నితక్కువగా చూడటం, వారిని ఉద్దరించేది.. పుత్ర సంతతే అని తలపోయడం... 50 ఏళ్ళ వయసులో.. పుత్ర సంతానం కోసమని..  ద్వితీయ వివాహ ప్రయత్నం  చేయడం ఏమన్నా .. బాగుందా!?  కొడుకుని  పోగొట్టుకున్న ఆ తల్లి వేదన కి తోడు.. సవతిని.. ఆహ్వానిన్చడమా !? ఎంతటి అవమానవీయం?అన్న మరణిస్తే.. ఆ బాధ తడి ఆరక ముందే..ఉన్నసంతానం లెక్కలేదు.పుత్రుడే..పున్నామ నరకాలు తప్పించేవాడు అన్న రీతిలో ప్రవర్తించే తండ్రి..ని చూసి ఆ అమ్మాయి పడే వేదన ఆ గుడ్డి  తండ్రికి..కనపడటం లేదా!? చాలా మంది ఇంతే! మూర్కత్వంతో..నడుచుకుంటారు.జాతకాల పిచ్చి. పుట్టిన సంతానం అభివృద్ధి పధం లో లేరని మళ్ళీ..ఇంకొక వివాహం చేసుకుని మంచి సంతతిని కోరుకుంటున్నామని మభ్య  పెడుతూ.. సిగ్గు ఎగ్గు లేకుండా.. మళ్ళీ  పెళ్లి ప్రయత్నాలు మొదలడతారు.వారిలో..ఉన్న తీరని వాంఛలకి, వికృతమైన కోర్కేలకి.. మరో  రూపమే ఇలాటి విపరీత ధోరణి. ఇదే కారణాలు చెప్పే నా పరిచయస్తులలో కొందరిని..మందలించడం, నిర్మొహమాటంగా.. ఖండిచడం జరిగింది.

 యాదృచ్చికంగా రెండు రోజుల క్రితం జాతక సమస్యలు  చెప్పే "గ్రహ బలం" కార్యక్రమంలో.. ఇది వినడం జరిగింది. సిద్దాంతి గారు కూడా ఆ తండ్రికి..చురకలు వేసి..వారి అమ్మాయికి పుట్టే సంతతిని దత్తత చేసుకోమని సలహా.. ఇచ్చారు. అది నాకు బాగా.. నచ్చింది. మనకి నచ్చినట్లు  ప్రవర్తించడానికి కారణం జాతక ప్రభావమే అంటూ.. సమర్ధించుకునే వారిని..సమర్దిన్చేవారిని చూస్తే నాకు అమితమైన కోపం. దైవాన్ని విశ్వశించండి. మనం చేసే ప్రతి పనిని  ఆ.. దైవానికి ఆపాదించకండి.మనిషి అన్నాక కాస్తంత ఇంగిత జ్ఞానం ఉండాలి కదా..! చదువు-సంస్కారానికి  మూడ నమ్మకానికి పొంతన ఉండదని ఇలాటివారిని చూసినప్పుడు అనిపిస్తుంటుంది. ఇలాటి వారు.. మీకు తారస పడితే.. నిరసించండి. పున్నామ నరకం నుండి తప్పించడమా !? అమ్మాయిలను అవమానించడమా!?  అమ్మల్ని కృశింప జేయడమా?  నాగరిక తండ్రీ..!!! కొంచెం ఆలోచించండీ!!!!?                             

20, ఫిబ్రవరి 2011, ఆదివారం

అమ్మని బతకనిద్దాం

 
Posted by Picasa

అమ్మని బతకనిద్దాం
 సీమంతాలే ఎరుగని తల్లులు
రహస్యంగా జార విడిచిన కన్నేతల్లులు
పాలు కారే పాలవెల్లిలు
మూగగా రోదించే.. మమతల పరవళ్ళు
అమ్మకానికి వెల్లువైన అమ్మలు
అమ్మకాలేని అమ్మలు..
ఇలా.. కొందరు  "స్త్రీలు"

సృష్టిలో తీయనిది,మధురమైనది
అందమైనది,అద్భుతమైనది "స్త్రీ".
స్త్రీ లేకుంటే ప్రేమే లేదు.
ప్రేమ లేకుంటే సృష్టే లేదు.
అమ్మ లేకుంటే జన్మే లేదు.
జన్మ లేకుంటే జగమే లేదు.
జగమే లేకుంటే ఏమి లేదు..
శూన్యం తప్ప.
అటువంటి శూన్యాన్ని
జగమంత కుటుంబంగా చేసినది  "అమ్మ" .

అటువంటి  అమ్మ గొప్ప చెప్పటానికి..
ఏ భాష  లోని పదాలకైనా పదును సరిపోతుందా..!?
నిన్న-నేడు-రేపు..ఎన్నటికి 
అమ్మ నిన్నుపొదువుకునే ఉంటుంది
"అమ్మ"ని, "అవని" ని  పదిలంగా  కాపాడుకుంటేనే
మన ఉనికి పదిలం.

ఏ నవీన నాగరిక సోపానాలైనా..
ధ్వంసమైన సంస్కృతికి ఆనవాలు.
అమ్మలని వద్దనుకునే సంస్కృతి సిగ్గు చేటు..

చెత్త కుండీ దగ్గర
పసిపాప  రోదన కని అడవు నుండి
తప్పి పోయిన పులి
ఆత్మ హత్య చేసుకుంది..

విషపు నాగు..
ఆత్మహుతి చేసుకుంది.

అమ్మ తనాన్ని..అమ్మని..
పదిలంగా కాపాడుకుందాం..
అవని పై అమ్మని..బ్రతకనిద్దాం..
          

16, ఫిబ్రవరి 2011, బుధవారం

ఈమనిషే దిగ జార్చిన జాతి పరువులు



గత రాత్రి.. టీ.వి. చూస్తూ..చానల్స్ మార్చుతూ..నేను చూసిన కధనం క్రొత్తది కాకపోయినా..హృదయాన్ని కలచివేసేది.. ఆడ పుట్టుక పుట్టినందుకు..భయంతో.. వణికిపోయేస్థితి.ఆడ పిల్లలు పుట్ట కూడదు.పుట్టినా..వాళ్ళని కాపాడుకోవడం.. ఎంత కష్టతరం.!? 

అడుగడుగునా సుడిగుండాలు..పసి మొగ్గలుగానే ఉన్నప్పుడు కాలరాచే మృగాలు, అమాయకత్వంని ఆసరా  చేసుకుని మాయమాటలు చెప్పి మభ్యపెట్టి కాసులకి..అమ్మే వాళ్ళు కొందరు, శరీరాలతో.. వ్యాపారం చేయించే కొందఱు.. కామా పిశాచి కోరలకి చిక్కి..ఈ.. జనారణ్యంలో.. వెలివేయబడిన ప్రాంతాల్లో.. చీకటి వికృత కోర్కెల తీర్చే..ప్ర్రాణం లేని సెక్స్ యంత్రాలు..   అంగడి బొమ్మలు. ఇంటి నుండి తప్పిపోయిన చిన్నితల్లులు, ప్రేమ పేరిట అమాయకంగా గడప దాటినా కన్నెపిల్లలు, వరకట్న పిశాచాలకి బలి అయిన ఇల్లాళ్ళు, పేదరికంతో..బాధపడే కుటుంబాలలోని స్త్రీలు.. ఇలా.. ఎందరో!


మన సమాజంలో.. వీళ్ళ గురించి మాట్లాడుకోవడం తప్పు అనుకునే సభ్యసమాజంలో. మనం బ్రతుకుతూ.. మన మద్య ఉన్నవారిలో ఉన్న   వికృతాలని కనిపెట్టలేని  కళ్ళున్న కబోదిలం మనం.

ఇలా మోసగించబడి వేశ్యావాటికలో కూరుకుపోయిన కొంత మందిని రక్షించి వారి వారి ప్రాంతాలకి పంపేముందు..మా సిటీలో వారికి.. ఆశ్రయం కల్పించినప్పుడు మేము కొంత మందిమి కలసి ఒక సంఘ సేవిక వెంట రిహబిటేషన్ సెంటర్ కి  వెళ్ళాను.

 ఆకాశవాణికి  ఒక శబ్ద చిత్రం చేయాలని ప్రయతించి.. వారి మాటలలో.. వారి గాధలన్ని విని.. మనసు వికలమై.. తీరని దుఖంతో ఆ పని చేయకుండానే వెనుదిరిగాను.. కొన్ని నెలలు నేను మనిషిని కాలేకపోయాను.   అప్పుడప్పుడు.. నా దృష్టికి వస్తూనే ఉంటాయి ఇలాటి వార్తలు.

 ఒక స్త్రీగా.. అవి వినడం కూడా భయం నాకు. నేను ఎప్పుడో.. చూసిన మానవుడు-దానవుడు  చిత్రంలో..పాట, మల్లెపువ్వు చిత్రంలో ఎవ్వరో.. ఈ.. నేరాలను అడిగేవారు ఎవ్వరో.. పాట అప్రయత్నంగా గుర్తుకొస్తూ ఉంటాయి.డా..సి.నా.రె స్పందించి వ్రాసిన పాట.. ఎప్పుడు ఆ చిత్రం గుర్తుకు వచ్చినా కదిలి కదిలి ఏడుస్తాను. "అశ్వద్ధామ" స్వర కల్పనలో.. ఎస్.పి.బాలు పాడిన పాట అది.

ఎవరు వీరు ఎవరు వీరు.. 
దేశ మాత పెదవిపైన మాసిన చిరునవ్వులు.. 
మనసులేని పిడికిలిలో..న్లిగిప్డిన  పువ్వులు..
ఎవరు వీరు ఎవరు వీరు.
ఆకలిలి అమ్ముడుపోయిన ..అపరంజి బోమ్మలు..
చెక్కిలి వన్నెలు చిరిగిన చిగురాకు కొమ్మలు..(ఎవరు వీరు)

పొరబాటుగా అబలలుగా పుట్టిన విదివంచితలు వీరు.
బుస కొట్టే కామాగ్నికి.. విసిరేసిన సమిధలు వీరు (ఎవరు)
కన్నేలుగానే పిల్లలుకన్న వింత తల్లులు..
రోమ్ముక్రింద మమత లను అణుచుకున్న పాలవెల్లులు. (ఎవరు)
  
కసిదాగిన కళ్ళు.. సల సల కాగిన కనీళ్ళు.. 
నవ్వలేక ఏడ్వలేక నిట్టూర్చే శవాలు.. 
నడిచే జీవచ్చవాలు.. 
ఎవరో..కాదు..వీరెవరో కాదు..
ఆ దేవుడు సృష్టించిన పడతులు..
ఈ.. మనిషే దిగజార్చిన పతితలు.. 
ఎవరో తెలుసా.. వీరెవరో తెలుసా..!?
మన రక్తం పంచుకున్న ఆడపడచులు.. 
మనం జారవిడుచుకున్న జాతి పరువులు..

ఈ..ఆడపడుచులు.. మన జాతి పరువులు. 
వ్యాపార రాజధానిలో.. 
మనం జారవిడుచుకున్న జాతి పరువులు.

వారి పిల్లల చదువలకి.. ఆర్ధిక సాయం చేయడం తప్ప వాళ్ళ బ్రతుకులని మార్చలేని ఈ..వ్యవస్థలో.. "భూమిక" సంపాదకురాలు.. సత్యవతి గారి..  హెల్ప్ లైన్ కొంతమందిని అయినా అలాటి వారి బారిన పడకుండా కాపాడటం.. ఎంతైనా అభినంధనీయం.

మనసుకి స్పందన కల్గితే..స్పందించండి. మీ ఇంట్లో ఆడపిల్లలనే కాదు.. బయట వారి ఆడ పిల్లలని.. భద్రంగా.. కాపాడే ప్రయత్నం చేయండి.

ఆడ పిల్లలకి.. చుట్టూ ముంచుకొచ్చే ప్రమాదాల  గురించి..అవగాహన కల్పించండి. రోడ్ యాక్సిడెంట్ ల కన్న ప్రమాదకరమైన  విషవలయంలో.. మన ఆడ పడుచలని పడనీయకండి. ఈ.. పోస్ట్ చూసినంధులకు ధన్యవాదములు.ఈ రెండు పాటలు వినేయండీ!!      



ఎవరువీరు  ఎవరు  వీరు  -- మానవుడు -దానవుడు   
ఎవ్వరో .. ఈ  నేరాలను  అడిగేవారెవ్వరో .. -- మల్లెపువ్వు 

             

13, ఫిబ్రవరి 2011, ఆదివారం

శతవసంత సాహితీ మంజీరాలు

శతవసంత సాహితీ మంజీరాలు..సాహిత్యం పట్ల అభిమానం ఉన్నవారికి రేడియో..వినేవారికి..ఈ..పేరు సురపరిచితం.ఒక దశాబ్దం క్రిందట..ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమయ్యే ఉదయ రేఖలులో ఈ.. కార్యక్రమంతో..అభిరుచి గల శ్రోతలకి అనుబంధం ఇంతా అంత కాదు. "పుస్తకం హస్త భూషణం" అన్నారు.అలాటి రోజులు పోయి..టీ.వి. రిమోట్ కొన్నేళ్ళు, తర్వాత మొబైల్,ఎఫ్.ఎమ్.చానల్స్ రాజ్యమేలి ఇప్పుడు.. అంతా..వల లోకంలో..విహరిస్తుంటే.. ఇంకా.. పుస్తక ప్రియులకి చోటెక్కడ అనకండి. వాస్తవానికి ఇందులో కొంత నిజం ఉన్నప్పటికి .. పుస్తక ప్రియులకి కొదవ లేదు.  మానసిక వికాసానికి ఆలోచనా పరిపక్వతకి.. పుస్తకం చదవడం ఎంతో అవసరం. మన సంస్కృతిని, సాహితి వైభవాన్ని..పరిచయం చేసిన కార్యక్రమమే.. శతవసంత సాహితీ మంజీరాలు..నేను విన్న రేడియో కార్యక్రమాల్లో మేలిమి,పేరెన్నిక గల్గిన కార్య క్రమం ఇది. శ్రీమతి.ప్రయాగ వేదవతి గారు..ఆకాశవాణి విజయవాడ కేంద్ర సంచాలకులుగా..ఉన్న సంవత్శరాలలో.. ప్రోగాం ఎగ్జిక్యుటివ్ గా శ్రీ..నాగసూరి వేణుగోపాల్ గారు ఉన్నప్పుడు.. అత్యంత  ఆసక్తి కల్గిన కార్యక్రమాలు..రూపొందించి శ్రోతలకి సాహితీ పిపాసని.. పెంచారు.. ఒక మోడరేటర్ గా  నాగసూరిగారు..పరిచయ కార్యక్రమం నిర్వహిస్తే.. వినే శ్రోతలకి.. ఎంతో..అవగాహన లభించేది. "నవకవితావేదిక" ద్వారా యింతో మంది కవులని వెలికిదీసింది..ఆకాశవాణి. ఇక విషయం ఏమిటంటే.. శతవసంత సాహితీ మంజీరాలు గురించి... పుస్తకం ప్రపంచ చూడటానికి గవాక్షం లాటిదట.ఒక రచయిత..అతని (లేదా)ఆమె.. సమ కాలంలో.. సామాజిక పరిస్థితులు,సాంస్కృతిక జీవనం,నైతిక విలువలు,కట్టుబాట్లు,కుటుంబజీవనం,ఆచారవ్యవహారాలు తెలుసుకోవాలంటే.. పరోక్షంగా.. చరిత్రని చెప్పే ఆ కాలంనాటి సాహిత్యంని  చదవాల్సిందే.. అలాటి బృహత్తర కార్యక్రమం చేపట్టి.. వందేళ్ళ మన తెలుగు సాహిత్యం గురించి నవల,కవిత్వం,పద్యం ,గద్యం,కథ,నాటిక,ఇలా.. సమగ్ర సాహిత్యం గురించి.. ప్రముఖులైన సాహితివేత్తలతో..వ్యాసరూపంలో.. ఒకోక్కరితో..ఒకో లబ్ధ ప్రతిష్టులైన రచయిత రచించిన వారి.. పుస్తకాన్ని.. పరిచయం చేసేవారు.. వినే శ్రోతకి.. విన్న వెంటనే..ఆ.. పుస్తకం కొనుక్కున్ని..చదివాలనే..ఆసక్తి కల్గేది. వేదవతి..గారి.. పాండిత్యం.. నాగ సూరి గారి..సైన్స్ పరిజ్ఞానం ..వెరసి.. ఒక నాలుగేళ్ళు..నేను..రేడియో విన్న కాలం స్వర్ణయుగం  అంటాను నేను. విశ్వనాధ వారి "వేయి పడగలు"  విద్వాన్ విశ్వం గారి "పెన్నేటి పాట" మొక్కపాటి వారి "బారిస్టర్ పార్వతీశం "దాశరధి" అగ్నిధార, గబ్బిలం, కాలాతీతవ్యక్తులు, మరీచిక, పాకుడురాళ్ళు, కొల్లాయిగడితేనేమి, కొడవటిగంటి "చదువు"   కృష్ణపక్షం, ప్రతాప రుద్రీయం, శివభారతం,పానశాల,నగరంలో వాన,అతడు-ఆమె.. మహా ప్రస్తానం,అమృతం కురిసినరాత్రి, నేను-నా దేశం..ఇలా.. వందేళ్ళ సాహిత్యం వంద పుస్తకాలు.. పరిచయం.. ఆకాశవాణి.. శబ్ద రూపంలో ఉన్న గ్రంధాలయంగా..భాసిల్లిన రోజులవి.. ఎంత అక్షర సుగంధం.సాహిత్యం,సంగీతం,సామాజిక సమస్యలపై అవగాహన కల్గించడం, సమాచారం,వినోదం అన్నీ..సమపాళ్ళలోఅందించే కామధేనువు లాటి ప్రసారసాధనం రేడియో. బహుజన సుఖాయ -బహుజన హితాయ కి..నిర్వచనమై.. శ్రోతలని అలరించే..ఆకాశవాణికి సాటి మరేది లేదు. ప్రస్తుతం ప్రసారభారతి.. ఆద్వర్యంలో మనుగడ సాగిస్తూ/నిధుల కొరత అనే..స్టాక్ డైలాగ్ తొ.. మసకబారి పోతుంది. వివిధభారతి ప్రసారాలలో.. జనప్రియ,అభిరుచి,వినోధవల్లరి మాయమైపోయాయి.. జనరంజని చిక్కి శల్యమైంది.తాత్కాలిక సిబ్బందితో.. రోజులు.. నెట్టుకోస్తుంది.బూజు పట్టిన రేడియోలని దులిపి మరీ వినిపించిన హలో.. వివిధభారతి..ఎక్కడ.!? సాహిత్య ప్రసంగాలు..నల్లపూస. ప్రేవేట్ ఎఫ్ .ఎమ్ ల తొ.. రేసు గుర్రంలా.. పరుగులు పెడుతూ..వాణిజ్యాన్ని నూరు శాతం వంటబట్టించుకుని..ముక్కల పాటలు, కొత్త కార్యక్రమాల రూప కల్పన లేకుండా మూసపోత ధోరణిలో నాణ్యత లేని కార్యక్రమాలు.. అర్ధం-పర్ధం లేని..ఆంక్షలు.. కులం-మతం వివక్షలు..ఇదీ.. నేటి ఆకాశవాణి స్థితి. ఎంతో మంది కళాకారులని తీర్చి దిద్దిన ఆకాశవాణి ఇదేనా..అన్న అనుమానం కల్గుతుంటుంది. ఇప్పటికి ఉన్న అప్పటి  తళుక్ తారలు.. బి.జయప్రకాశ్,కుసుమ, ఏ.శారద ఇప్పుడు నామ్ కే వాస్త్! ఎఫ్ ఎమ్ సందడిలో..సరాగమాలలో.. అందమైన వాఖ్యానం తో  అలరించే "శ్రీ రాజ్", పద్మకళ, వైష్ణవి, సత్య,అను,వారిజ,అనిత,శాంతి,వీణ,విద్య, సంజయ్, జాక్ జిల్..జానీ.. ఇలా..అందరి రాకింగ్ తొ..ఇది ఇప్పటి వైభవం. ఆకాశంలోఎంత ఎత్తులో .. ఎగిరే  విమానానికి అయినా ఎగరడానికి.. నేల ఆధారం.అలాగే కళలకి.. కళాకారులకి..పుట్టినిల్లు అయిన ఆకాశవాణి..సామాన్యుడి..విజ్ఞాన, వినోద ప్రపంచం. మంచి-చెడు చెప్పే మాస్టర్ ! అక్కడే..అందరూ .. తమ ఉనికిని చాటుకోవాలి. అందుకే.. రేడియోని చిన్న చూపు చూడకుండా.. బ్రతికించుకుందాం. మరిన్ని మంచి కార్యక్రమాల రూపకల్పనకి.. సూచనలు ఇస్తూ.. రేడియో.. విందాం  రండి... అంటూ.. మా.. శబ్దాలయా ద్వారా.. వెలుగెత్తి చాటుతుంటాను. లిజనర్స్ క్లబ్ ల ద్వారా.. మనకి ఇష్టమైన కార్యక్రమాలకి బలం చేకూర్చుకుందాం. నేషనల్ లెవల్లో.. హమ్ వివిధ భారతి హై.. లో.. గొంతు కలపండి.నేను అయితే.. అందులోజాయిన్ కాలేదు సుమా!  ఎందుకంటే.. నాకు జాతీయ బాష తెలియదు. ప్రపంచబాష అంతకన్నా తెలియదు. మాతృ బాష వచ్చు అనుకున్నా ఇన్నాళ్ళు. అదీ.. సాంతం రాదని అర్ధమైంది..ఏదో..ఇలా..ఈ బ్లాగ్ లోకం లో..ఇలా.. పడ్డాను. నేర్చుకుంటున్నాను. అనుభవగ్నులే గురువులు.అందరికి ధన్యవాదములు.ఇది  మా విజయవాడ రేడియో కబుర్లు.          .   

హరి క్షేత్రంలో హరుని సేవలో

సదా హరుని సేవలో పులకించే యువ కెరటాలు 
ఓం నమః శివాయ నమః                                                     
ఒక వారం రోజులుగా.. నేను..బ్లాగ్ లోకం నుండి హటాత్తుగా మాయం అయ్యాను..ఎందుకంటే.. క్షేత్ర దర్శనం కోసం తిరుమల వెళ్ళాను..నాతో పాటు భక్త బృందం వందల మంది.6 రోజులపాటు ఇంటి ధ్యాస లేకుండా.. భక్తి పారవశ్యంతో పాటు ఎన్నో ప్రదేశాలని ఆసక్తితో..అచ్చెరువుతో..చూసి ఆనందపడ్డాను.. చాల విషయాలని సేకరించ గల్గాను. తెలుసుకోవాలనే ఉత్షాహం ఉన్నా సరిగా వివరించే వారు లేక కొంత నిరాశ.ఏమైతేనేం  నా.. యాత్రానుభవం మీతో పంచుకోవాలని..నా ఈ.. చిన్ని ప్రయత్నంలో..భాగంగా..మొదటిది..కపిల తీర్ధం గురించి..


మీలో చాలా మంది తిరుమలని దర్శించిన అందరు..ఈ ప్రదేశాన్ని..చూసి ఉంటారు.అయితే ..ఈ సారి నా.. అనుభవంలో సరిక్రొత్తగా చూడండి..ప్లీజ్!! మా మిత్ర బృందం అంతా కలసి కపిల తీర్ధం చూడటానికి వెళ్ళాం.దూరంగా.. ప్రవహించని తీర్ధం కొంచెం నిరాశ. ఏముంది? ఇక్కడ చూడటానికి.. అన్న నిరాశక్తత..లోనికి అడుగిడినాము. కపిల తీర్ధం శేషాద్రి పర్వత పాదాన నెలకొనిఉంది.. సస్యాద్రి పర్వత శ్రేణులలో గల 108 తీర్ధాలలో కపిల తీర్ధం ఒకటి. పర్వ దినాలలో.. ముక్కోటి,కార్తీక పౌర్ణమి.. రోజులలో..10 ఘటికల కాలంలో.. ఆ తీర్ధమందు స్నానండితే  ముల్లోకాలలోని తీర్ధాలన్నిటిలో.. స్నానమాడిన ఫలితం లభించి.. జననమరణాలు లేని.. సత్య లోకంలో ఉండే భాగ్యం కల్గుతుంది అని చెప్పారు.

ఆ మాటలు వింటూ.. ముందుకు నడుస్తూ.. తిరుపతి తిరుమల ప్రాంతాలలో ఎక్కడా కనబడని..పంచాక్షరి..షడక్షరి  కనిపించి నేను తెగ ఆనంద పడిపోయాను..ఆ క్షేత్రం హరుని క్షేత్రమట.క్షేత్ర పాలకుడు..శివుడు. హరి క్షేత్రంలో.. హరుని..కరుణా కటాక్షం భక్తులెల్లరిపై కపిల తీర్ధమై ఆశ్శీస్సుల  చిలకరింపులతో  పునీతులని చేసింది. పైన కన్పించే ప్రస్తుత  స్థితి లోని తీర్ధపు సరస్సులో.. కాళ్ళు కడుక్కుని తలపై భక్తిభావంతో.. కొంచెం నీరు చిలకరించుకుని అదే తీర్ధ స్నానం అనుకుని.. కపిలేశ్వర స్వామి.. ఆలయం అన్న సూచికని అనుసరిస్తూ.. వడివడిగా ఆడుగులు వేసాను అందరి కంటే ముందుగా.. ఎందుకంటే మేము వెళ్ళిన సమయం ప్రదోష కాలం.. ఆ సమయమందు శివ దర్శనం మంచిదని విన్నాను కనుక... ఆలయంలోకి  వెళ్ళక ముందే.. వళ్ళు గగుర్పబోడిచే.. శంఖా నాదం,డమరుఖ ధ్వని.. తాళాల సవ్వడి..తొ పాటు.. ఘంటా నాదం కర్పూర హారతి గాంచి వొడలు పులకరించిపోయింది.. ఏమి భాగ్యం అనుకున్నాను.

భక్తుల  తాకిడి వల్ల నేను స్వామి వారి సమీపంలోకి వెళ్ళలేక  అక్కడే నిలబడిపోయాను.. స్వామి వారికి  మళ్ళీ కర్పూర హారతి  ఇవ్వడం ప్రారంభమైనది.. మళ్లీ ధ్వనాలు.. ప్రారంభం .ఈ సారి ఆసక్తిగా చూసాను..నలుగురు యువకులు.. ఆ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు.. ఆరు నిమిషాలు పాటు..స్వామి వారికీ సేవ ఆగకుండా.. సాగింది..నాకు చాలా ఆశ్చర్యం కల్గింది. వాళ్ళని అభినందించడానికి హస్తమంధించాను..ఒకరు అందుకున్నారు..మరొకరు సున్నితంగా తిరస్కరించారు.. సర్వీసెస్ ఆన్ డ్యూటీ ! అని అడిగాను.. "నో"  అన్నారు..నాకు మళ్లీ ఆశ్చర్యం.. తాళాలు ని ఏమంటారో.. అ టైములో.. గుర్తు రాక ఆ ఇనుస్త్రుమేంట్ గురించి అడిగి తెలుసుకుంటూ.. వారితో.. మళ్లీ  మాట కలిపాను. స్వామిని  చూద్దామని వడి వడిగా వెళ్ళిన నాకు స్వామి కన్న వాళ్ళని చూడటమే.. సరిపోయింది.

స్వామి దర్శనం  చేసుకుని.. నందీశ్వరునుకి  నమస్కరించి.. కామాక్షి అమ్మవారిని దర్శించుకుని  అశ్వద్ధ వృక్షం,వేప చెట్టు క్రింద ఉన్న సుబ్రమన్యేశ్వరునికి నమస్కరించుకుని ప్రసాదం తీసుకోవడానికి వెళుతున్నప్పుడు ఆ యువకులు కనిపించారు..మిమ్మల్ని ఒక ఫోటో తీసుకోవచ్చా !? అని అడిగాను .. వారు మొదట ఒప్పుకోలేదు..రెండు మూడు సార్లు పదే పదే అడిగిన పిమ్మట ఓ.కే.అన్నారు. వారి మాటలు ..ఇలా.. "ప్రతి రోజు ఇలాగే వచ్చి స్వామి వారికి సేవ చేసుకుంటాము..అది మాకు చాలా ఇష్టం. ఇది ఒక పని అని మేము భావించడం లేదు. ఇది మాకులభించిన  అదృష్టం.. అని సిమ్స్ లో  పని చేస్తూ రోజు స్వామి సేవకి వచ్చే "గోపి" చెప్పారు.

అన్నింటికన్నా శంఖం పూరించడానికి ఎక్కువ శక్తి కావాలి.. ఆపకుండా.. ఆరు నిమిషాలపాటు.. ఎంత..మంచి..ప్రయత్నం .. వావ్ !!!! అనుకోకుండా ఉండలేకపోయాం.యువతలో.. భక్తి ప్రపత్తులు లోపించిన ఈ కాలంలో.. వారిని  మరీ మరీ అభినందించకుండా ఉండలేకపోయాను.

అప్పుడప్పుడు.. విజయవాడ దుర్గామల్లెశ్వర  స్వామి వారి సన్నిధికి.. సేవకి వస్తూ ఉంటామని చెప్పారు..  ఇంకా.. క్షేత్ర మహిమ గురించి వివరించారు.  కపిల తీర్ధం పాతాళం నుండి.. పైకి వచ్చిన తీర్ధమని.. కపిలమహర్షి.. వెలిగించిన   జ్యోతి ఇప్పటికి.. వెలుగుతూనే ఉంటుందని..తీర్ధము,గుహలోని మూర్తి స్వరూపం. వెరసి.. ఈ క్షేత్రం పవిత్రత అనంతమని.. తెలుసుకుని..చాలా ఆనంద పడ్డాను. స్వామి వారి  మూర్తి ఇత్తడి లింగాకరమని..ఆలయం ప్రత్యేకంగా భాసిల్లే అనంత శోభానమయంని.. చెప్పిన పిమ్మట మరలా ఒకసారి  దర్శించుకోవాలని అనుకున్నాను కానీ  వీలు కుదరలేదు.. ప్రతి సోమవారం 4 .30 .. కి స్వామి వారి సేవ మొదలవుతుంది అట..ఎవరైనా..ఇది చదివి వెంటనే చూడాలనుకుంటే..అ సమయంలో..వెళితే.. ఎక్కువ సమయం గోపి బృందం వారి సేవ చూడవచ్చు.

ఇక నందీశ్వరుని చూడటానికి రెండు కళ్ళు చాలవు. అంతా సుంధర స్వరూపం కూడ.. ప్రతి ఒక్కరు చూడ వలసిన క్షేత్రమిది..స్నానం ఆచరించవలసిన తీర్ధం ఇది. భక్తి పారవశ్యంతో.. యువ కెరటాలు..మృదంగ,శంఖ ద్వనాలతో,తాళాలతో..కర్పూర హారతితో.. స్వామిని అర్చించడంని.. కన్నులారా చూడవలసిన క్షేత్రమిది.

తప్పకుండా.. చూసి.. "గోపి"  బృందానికి అభినందనలు అందించడం మరువకండీ!!! ఎందుకంటే.. ఎన్ని.. సంగీత పరికరాలు.. ఆధునిక పోకడలతో.. కొత్త ఒరవడిని సృష్టించినా  ఆధునిక పరికరాలకి అందని.. శబ్ద మంత్రం ప్రణవం. ఆ.. ప్రణవ మంత్రమే.. శంఖా నాదం. శంఖంని..  భక్తి ప్రపత్తులతో.. పూరిస్తేనే..సాధ్యం. ఒక్క శంఖా నాదం మీ ముంగిలిలో..మారుమ్రోగితే.. సోమయాగం చేసిన ఫలితం వస్తుందని.. విన్నాను..ఆ పుణ్యం ఏమో.. కానీ.. పవిత్రభావం అలముకుంటుంది . ఇది.. నా అనుభవం.

 "ఓం నమః శివాయ"..