24, సెప్టెంబర్ 2012, సోమవారం

సాగరసంగమమే...



నాకు పన్నెండేళ్ళప్పుడు అనుకుంటాను.. మా రిక్షా మేట్స్ తో కలసి  ఓ..ఆదివారం పూట  మైలవరం అశోక్ దియేటర్ లో మ్యాట్నీ షో కి  వెళ్లి  "సీతాకోక చిలక " చిత్రం చూసాను. 

ఆ రోజు ఎవరు సినిమా గురించి మాట్లాడుకోలేదు.మౌనంగా ఉన్నాం.  ఎవరి ఇళ్ళకి వారు చేరుకునే తొందరలో..ఉన్నాం కాబట్టి. . 

తెల్లవారి మళ్ళీ సినిమా ప్రసక్తి వచ్చింది. అందరూ ఆ చిత్రం బాగోలేదు.. అని అన్నారు. ఎందుకంటే మతాంతర, కులాంతర వివాహం కాబట్టి.. బాగుందని చెపితే పెద్ద వాళ్ళు నాలుగు ఉతుకు తారనే భయం. 

మూడు దశాబ్దాల క్రితం ఎవరూ కూడా ప్రేమ వివాహాలని ప్రోత్సహించే స్థితిలో లేరు కాబట్టి.మేము వెళుతున్న రిక్షా ముందు వెనుక మరో రెండు రిక్షాలు మేము కూర్చున్న రిక్షాతో పాటు మొత్తం మూడు రిక్షాలలో పిల్లలు మొత్తం పద్దెనిమిది మంది పిల్లలలో అందరు ఆ సినిమా చూసినవారే.. అందరూ కూడా ఏం బాగోలేదు ఆ సినిమా..అని ఏకగ్రీవంగా చెప్పేశారు. తర్వాత పెళ్లీడు వచ్చాక కుల మత  ప్రసక్తి లేకుండా ప్రేమ వివాహాలు చేసుకున్నవారు ఉన్నారు. అప్పుడు మాత్రం.. సినిమాని మెచ్చుకునే దైర్యం లేదు.

నేనయితే  మాత్రం ఆ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఏ కులమయితే  ఏ మతమయితే ఏముంది.?   వాళ్ళు ప్రేమించుకున్నారు..పెళ్లి చేసుకున్నారు తప్పేముంది? అని అని చెప్పాను. 
మా వెనుక ఉన్న రిక్షా రాఘవులు.. మేము వెళుతున్న రిక్షాని క్రాస్ చేసి.. ఏమిటమ్మాయి ! సీతాకోక చిలక సినిమా బాగుందా!? పలుపుతాడు  తీసుకుని  నాలుగు ఉతికేవాళ్ళు లేక పొతే సరి. అన్నాడు. నాకు రోషం ముంచుకు వచ్చేసి .. ఏం! మీకు ఎందుకు బాగోలేదో నాకెందుకు ? నాకు నచ్చింది అంతే..!అన్నాను. 

ఈ పిల్లకి పెద్దదవగానే చదువు గిదువు మానిపించి.. పెళ్లి చేసేయమని .. సాంబయ్య  బాబాయికి చెప్పేయాలి. లేకపోతే ఈ పిల్ల ప్రేమించే  పెళ్లి చేసుకుంటుంది.. అని అన్నాడు. మా నాన్నతో..నువ్వేమిటి చెప్పేది.. నీ పని నువ్వు చూసుకో.. అని గట్టిగా సమాధానం చెప్పాను కానీ.. రాఘవులు అన్న మాటలు నాకు చాలా అవమానంగా అనిపించాయి. అతను వినకుండా.. పెద్ద వీడి బోడి పెత్తనం నా మీద చూపిస్తాడేమిటి..!? సినిమా చూసి బాగుందో లేదో చెప్పాను కాని వీడికి నేను ప్రేమించి  పెళ్లి చేసుకుంటానని చెప్పానా? అంటూ వినేటట్టు  ..వినకుండా..ఇంకా కొన్ని తిట్లు  స్కూల్ దగ్గర దిగే వరకు తిడుతూనే ఉన్నాను 

తర్వాత మా అమ్మకి చెప్పాను.. ఆ రిక్షా  రాఘవులు "సీతాకోక చిలక" సినిమా బాగుందని చెపితే.. ఆ చచ్చినోడు ఏమిటేమిటో..అన్నాడు.  వాడు ఎందుకలా అన్నాడో..అడుగమ్మా..! 
నువ్వు కూడా ఆ సినిమా చూసి రా.. ! బాగుందో  లేదో .. చెప్పమ్మా..! అని కొద్ది రోజులు నస పెట్టాను. మా అమ్మ ఆ సినిమా చూడనూ లేదు. రిక్షా రాఘవులని   మా అమ్మాయిని   అలా ఎందుకన్నావని  తిట్టనూ లేదు.

పల్లెలలో..ఉన్న పెద్ద వాళ్ళల్లో అంతర్లీనంగా.. ఈ ఆడ పిల్లలని చదువుకోవడానికి  పంపుతున్నాం  గోపాలరావు గారి అమ్మాయిలా ఏ క్రిష్టియన్ మతస్తుడినో కట్టుకుని వస్తే.. నలుగురిలో ఎంత తలవంపు..? మునుసబు గారి  చిన్న అబ్బాయి సినిమా నటి జయసుదని పెళ్లి చేసుకుంటేనే వాళ్ళు ఒప్పుకోలేదు, మన కులం కాదని అనుకుంటూ ఎంత పేరు,డబ్బు ఉన్నా కూడా వారికి మనసంగీకరించ లేదు అని చెప్పుకునేవారు. మన పిల్లలు అలాగే చేస్తారేమో అని  భయపడేవారు. అందుకనేమో.. మా అమ్మకూడా  ఆ సినిమా విషయం గురించి మాట్లాడలేదు అనుకునేదాన్ని.

ఏమైనా సీతాకోక చిలక సినిమా నాకు బాగా నచ్చింది అన్నానని..నేను ఏ కులాంతర,మతాంతర వివాహమో చేసుకోలేదు. నేను ఇంటర్ మీడియట్ చదువుతుండగానే  మా పెద్ద వాళ్ళు చూసిన సంబంధమే, నాకు వరుసకు అత్త అయ్యే ఆమె కొడుకునే కనీసం పెళ్లి చూపులు లేకుండా ఒక్క చూపు కూడా  చూడకుండా  పెళ్లి జరిగిపోయింది. రిక్షా రాఘవులు మాటని నేను అబద్దం చేసేసాను కూడా!

సరే దర్శకుడు భారతీరాజా గారికి  హ్యాట్సాఫ్ చెప్పుకుంటూ..  చిత్ర రాజం "సీతాకోక చిలక" చిత్రం లో నాకు నచ్చిన అంశాలు.. 

పాటలు చాలా బాగుంటాయి. అలాగే పాటల సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం. అప్పటికి వేటూరి గారు ఎవరో తెలియదు కానీ రేడియోలో  పాటలు వస్తుంటే గబా గబా నోట్స్ తీసుకుని వ్రాసేసుకునేదాన్ని. తర్వాత ఆ పాటలని ఇంకోసారి వచ్చేటప్పుడు వింటూ  తప్పులు సరిదిద్దుకుని పాఠం చదువు కున్నప్పటికన్నాశ్రద్దగా పాటలని చదివేదాన్నేమో.. ఆ పాట సాహిత్యం బాగా అర్ధం అయ్యేది.  ఆ పిచ్చో లేక పొతే ఇంకేదన్నానో కానీ  నా  ఇంట్రెస్ట్ మాత్రం అదే ! కావాలంటే నేను ఇంటర్ మీడియట్ చదివేటప్పుడు మాకు  బోటనీ    సబ్జక్ట్ భోధించిన "అనార్కలి " మేడం  తిట్లు సాక్షిగా  ఎప్పుడూ పాటలే చదివేదాన్ని అన్నమాట.

చిత్ర కథ కి వస్తే కులం, మతం ధనిక-పేద తారతమ్యాలు అనేవి కొన్ని వందల సంవత్సరాలుగా మనుషుల మనస్సులో పేరుకుని పోయి.. మనుషుల్లో సహజంగా దాగిన మానవత్వాన్ని కూడా మరుగున పడేసి కర్కశత్వంతో గిరి గీసుకున్న సమాజంలో మార్పు తీసుకురావాలన్న సందేశంతో  ఆ చిత్రం ఉంటుంది.

కులం,మతం అనేవి ప్రవహించే నదులు లాంటివి. ప్రవహించి ప్రవహించి ఆఖరికి అవి కడలి ఒడికి చేరాల్సిందే కదా! అలాగే మనుషుల మధ్య అంతరాలు సమసిపోవాలి. యువతీ యువకుల మధ్య సహజంగా వికసించే ప్రేమ,ఆకర్షణ కలగలిపి అవి పెళ్లివరకు దారితీసే దశలో ఈ కులం,మతం తప్పకుండా అడ్డుగోడలై నిలిచి ఎంతో మంది  ప్రేమికులని విడదీస్తూ ఉంటాయి. మనుషుల మధ్య ఈ అంతరాలు సమసిపోయి ఎవరు అడ్డుకున్నా వెరవక రెండు మనసులు ఏకమయ్యే అపూర్వ ప్రేమ సంగమమే సాగరసంగమం.

సీతాకోక చిలక ఆనే టైటిల్  కూడా.. ఎంత అర్ధవంతంగా  ఉంటుందో కద్దా!?
గొంగళి పురుగు చూడటానికి ఎంతో  అసహ్యంగా ఉంటుంది కదా ! అలాగే పచ్చని చెట్టు ఆకులని తినేసి.. ఆ ఆకుకే గూడు కట్టుకుని ప్యూపాగా మారి.. ఆ దశ నుండి క్రమ క్రమంగా వికాసం చెంది  అందమైన సీతాకోక చిలకగా  మారడం చూసే కన్నులకి ఎంత ఆహ్లాదకరం. 

 కులం మతం ఆనే గొంగళి  పురుగులు సమాజమనే మొక్కకి  పట్టిన చీడ లాంటివి.. అవి సమాజ వికాసానికి నిరోధకంగా మారతాయి. మనుషుల్లో ఆలోచన కల్గిస్తూ.. కులాంతర మతాంతర వివాహాలని ఆమోదించక తప్పదని  అప్పుడే ఈ సమాజం.. సీతాకోకచిలుకలా ఆహ్లాదంగా ఉంటుందనే సందేశం ఉంటుంది. ఇంత ఆలోచనా విధానం నాకు అప్పుడు లేకపోయినా కూడా ఆ సినిమా నచ్చింది. నచ్చినందుకేమో.. ఇంత డీప్ గా ఆలోచించాను. 


"సీతాకోక చిలక" చిత్రంలో.. ఈ బిట్  నాకు  చాలా  ఇష్టం అలాగే  సాగర సంగమమే పాట కూడా.. . 

సాగర సంగమమే... ప్రణవ సాగర సంగమమే!
సాగర సంగమమే... ప్రణవ సాగర సంగమమే!

జానకి కన్నుల జలధి తరంగం ... జానకి కన్నుల జలధి తరంగం ... 
రాముని మదిలో విరహ సముద్రం  
చేతులు కలిపిన సేతు బంధనం 
ఆ సేతు హిమాచల ప్రణయ కీర్తనం 

సాగర సంగమమే... ప్రణవ 

ఈ బిట్ ఎంత బాగుంటుందంటే.. జానకి కన్నుల జలధి తరంగం .. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.. అర్ధం అంత లోతు గనుక. ఆ విషయం అప్రస్తుతమే కానీ .. మనసు పెట్టి చది చూస్తే మీ నయనం చెమ్మగిల్లడం ఖాయం.   

రావణుడు సీతమ్మని అపహరించి లంకలో అశోక వనంలో బంధించి వుంచితే రామచంద్రుడిని తలచుకుంటూ కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతూ ఉంటే హనుమంతుని ద్వారా సీత జాడని తెలుసుకున్న శ్రీరామచంద్రుడు లంకకి ఈవల సముద్ర తీరాన వుండి వారధి కట్టే ప్రయత్నంలో ఉన్నప్పుడు  రాత్రి సమయంలో సీతని తలుచుకుంటూ విరహాన్ని అనుభవిస్తుంటే ఆ విరహాన్ని సముద్రంతో పోల్చిన కవి భావన అర్ధం చేసుకున్న మనసులకి ఎంతో రసజ్ఞత ఉందని అనుకుంటాను. తన విరహాన్ని మోసుకుని వెళ్ళేగాలి కూడా సీతకి వేడిగా తగలకూడదని శ్రీరామచంద్రుడు కోరుకున్నాడని ఎక్కడో చదివిన విషయం గుర్తుకొచ్చి అందలి భావనని అనుభవించి మనసు మూగపోతుంది నాకు. అలాంటి సాహిత్యమే ఇది కూడా అనిపిస్తుంది నాకు. 



జానకి  కన్నుల జలధి తరంగం, రాముని మదిలో విరహ సముద్రం.. 

ఎంత గొప్పగా చెప్పారు.. ఆ మహానుభావుడు 


చేతులు కలసిన ఆ సేతు బంధనం అనేది.. ఆ సేతువుని నిర్మించడమే కాదు..

చిన్నారి స్నేహితులు .. ఈ యువ జంట ప్రేమకి సాయం చేయడాన్ని  తెలుపుతాయి.

ఆసేతుహిమాచల ప్రణయ కీర్తనం.. 

నిజమే కదా! కన్య కుమారి నుండి హిమాచలం వరకు మనందరికీ ఆదర్శ ప్రాయమైన జానకిరాముల  ప్రణయ బందాన్ని ఆచంద్ర తారార్కం కీర్తించేవారిమే కదా!


ఈ చిత్ర కథకి "వేటూరి" సాహిత్యంతో   అర్ధవంతమైన  రూపమిస్తే  పోస్తే.. ఇళయ  రాజా సంగీతం ప్రాణం పోసింది.

మీరే ఒకసారి విని ,చూడండి. రేపు.. ఇంకొక పోస్ట్ లో "వేటూరి" గారిని తలచుకుంటూ.. సాగరసంగమమే... పాట.. గురించి చెప్పాలని ప్రయత్నం. 

8 కామెంట్‌లు:

శ్రీ చెప్పారు...

వనజ గారూ!
ఇలా వరసగా చాలా మంచి పోస్టులు పెట్టేస్తే ఎలా???:-)...:-)
ఆ సినిమా రిలీజ్ అయినపుడు చిన్నపిల్లలు చూడ కూడదని చూడనివ్వలేదు...:-)
తర్వాత నేను డిప్లొమా చదువుతున్నపుడు చూసాను...
పాటల సాహిత్యం అద్భుతం...సంగీతం మహాద్భుతం...
భారతీ రాజా అందించిన మంచి దృశ్య కావ్యం...
మరోసారి మంచి సినిమాని గుర్తు చేసారు...
ఓ సారి సీడీ పెట్టుకుని చూసేయాలి...
అభినందనలు మీకు.
@శ్రీ

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

చిత్రం లోని పాటలు విన్నాము కానీ ఎప్పుడు చూడటం వీలు కాలేదు!మీరు చెప్పాక తప్పక చూస్తాను.మీరన్నది అక్షరమక్షరం నిజం.మొదట ఏకులాలు లేవు.అన్నీ వృత్తులను బట్టి ఏర్పడ్డాయి.మానవులంతా బంధువులే!జీవ పరిణామ సిద్దాంతం ప్రకారం.

Meraj Fathima చెప్పారు...

వనజా, మంచి చిత్రం ముఖ్యంగా ముసలి హీరోలతో విసిగిపోయిన జనాలు ఆదరించిన సినిమా. మంచి పాటలు కథ ఉన్న సినిమా.
మంచి సినిమా గుర్తుచేస్సారు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శ్రీ గారు.. మీ స్పందన ఆనందం కల్గించింది. మరీ మరీ ధన్యవాదములు. ఇంతకీ సీతాకోక చిలక ని మీ పిల్లలని చూడనిస్తున్నారా!? :)
@మేరాజ్.. థాంక్ యు సో మచ్ !తీరిక చేసుకుని మళ్ళీ ఒకసారి ఈ మూవీ చూడండి. ఓకే..నా..?
@ఒద్దుల రవి శేఖర్ గారు.. మీ స్పందనకి ధన్యవాదములు. తప్పకుండా మూవీ చూడండి. మంచి మెసేజ్ తో పాటు మంచి దృశ్య కావ్యం ధన్యవాదములు.

సామాన్య చెప్పారు...

మీ అనార్కలీ మేడం సాక్షిగా మీరు సంపాదించిన ఈ జ్ఞానం నిజంగా ఇవాళ నన్ను చాలా సంతోష పరచింది .నా రోజును ఆహ్లాద భరితమూ చేసింది .థాంక్స్ వనజ గారూ !

SRINIVASA RAO చెప్పారు...

సీతాకొకచిలుక అనే టైటిల్ ఇంత meaning ఉందా!!!!!!!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సామాన్య గారు మీకు ఈ పోస్ట్ నచ్చినందుకు మరీ మరీ ధన్యవాదములు . మీకే కాదు అందరికి నచ్చాలని నా ఆకాంక్ష .

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శ్రీనివాసరావు గారు అవునండీ! సీతాకోకచిలుక టైటిల్ వెనుక ఉన్న నిగూఢమైన అర్ధం ఇదే !
థాంక్స్ అండీ !!