2, ఫిబ్రవరి 2013, శనివారం

నేను వ్రాసిన కవిత ఆంగ్ల అనువాదంలో

తెలుగు అనువాదాలు బ్లాగ్ లో N S ,మూర్తి గారు నేను వ్రాసిన కవితని ఆంగ్లం లోకి తర్జుమా చేసారు.

ఆ కవిత పేరు With the Yoke You Left Half-way

ఈ పై లింక్ లో ఆంగ్లంలో అనువదించిన  కవితని, తెలుగు మూలంని చూడండి. 



నువ్వు వదిలేసిన కాడితో

ఏ ఏటికి ఆఏడు చెలమలోని  నీళ్ళులాగ
అవసరాలు ఊరుతూనే ఉంటాయని
చేసిన అప్పులు వడ్డీతో కలసి
సాలుసాలుకి రెళ్ళు దుబ్బుల్లా
పెరుగుతూనే ఉంటాయని
బాధల్లన్ని మరిచిపోవాలని
అప్పుడు ఆ  మందు తాగినావు
ఏకంగా  ఇప్పుడు ఈ మందు తాగేసి
పురుగులా మాడిపోయావు

కొంగు ముడి  పడ్డ నాటినుండి
నేను సాయంగా ఉండానన్న సంగతి మరిసేసి
నిన్ను కన్నోళ్ళకి   మనం కన్నోళ్ళకి
నన్నే ఒంటి నిట్టాడిని  చేసి పోయినాక
నన్ను గాలికి  ఒగ్గేసి నువ్వు గాలిలో కల్సిపోయాక
నేను రోజూ ధైర్యం అనే మందు తాగుతూనే ఉండాను

నువ్వు ఉన్నప్పుడు సాయం చేస్తానని రాని చేతులు
నా ముందుకొచ్చాయి  లెక్కలేనన్ని
బిక్క చచ్చి బక్క చిక్కి ఉన్న శరీరాల చుట్టూ
ఆకలి చూపులు కాకుల్లా గ్రద్ధల్లా
గిరికీలు కొడుతూనే ఉండాయి
నువ్వు చస్తే మారతాయని  అనుకున్నబాధలు
పెనంలోనుండి పొయ్యిలోకి మారినాయి
నడిరేతిరి కీచురాళ్ళ రొదలా
అప్పులాళ్ళ బాధలు,పేగులు తిప్పేసే బిడ్డల
 తీరని ఆకలి కేకలు
దాయలేని యవ్వనపు ప్రాయపు పొంగులు

మోటబాయి లోని నీళ్ళు లాగానే
నీరింకిన కళ్ళల్లో భయం
దైన్యం శూన్యం తారట్లాడుతున్నాయి
మనోల్ల చూపుల్లో చుక్కలు పొడవాలంటే
మా చుట్టూ తిరిగే చూపులకి ముళ్ళ కంచెలు కొట్టి
మా చూపులకి అగ్గి రగిలించుకుని
ఆమడ దూరంలో వాళ్ళని ఆపేసి
నువ్వు వదిలేసిన కాడితో
బతుకు సేద్యం చేస్తూనే ఉండాల
బతుకుతూనే ఉండాల బతుకుతూనే ఉండాల

ఒంటి చేత్తో ఆవలి ఒడ్డుకి చేరేదాక
బతుకుతూనే ఉండాల బతుకుతూనే  ఉండాల

(ఆంద్ర జ్యోతి ఆదివారం లో ప్రచురణ  )

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Read the translation in the blog of Murtiji y'day. CONGRATS.

గోదారి సుధీర చెప్పారు...

అనువాదం చాలా బాగుంది వనజ గారు .కంగ్రాట్స్ .ఆ కవిత నాకు చాలా ఇష్టం .

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కష్టేఫలే మాస్టారూ.. ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సామాన్య గారు.. థాంక్ యు వేరి మచ్