19, ఆగస్టు 2013, సోమవారం

ఫెమినిస్ట్ !!! ???

ఒక బ్లాగర్ ఫ్రెండ్ నాతొ గంటలు తరబడి పోన్లో మాట్లాడతారు విధ్యాదికురాలు, ఉపాధ్యాయురాలిగా పనిచేసి పదవీ విరమణ కూడా చేసారు  ఆమె తో మాట్లాడితే నేను చాలా విషయాలు తెలుసుకుంటాను.  అలాగే  ఆమెకి . ఏవైనా సందేహాలు ఉంటే తెలియజేపుతాను. ఆమె నా బ్లాగ్ చదువుతారు. కానీ ఒక్క కామెంట్ కూడా ఇవ్వరు . మళ్ళీ ఆమెకి నేనే మార్గదర్శకత్వం అంటారు . నాకేంటో తికమకగా ఉంటుంది . ఒక రోజు అడిగాను "అసలు నా బ్లాగ్ చదువుతారా ? "అని ."  రోజూ చూస్తాను" అని చెప్పారు . 

సరే మీ అభిప్రాయం మీరెప్పుడు వ్రాయలేదు .. మరికొంతమంది మీ స్నేహితులు చూస్తారు అని చెప్పారు కదా ! వాళ్ళ అభిప్రాయమేమిటో తెలుసుకోవచ్చా ? అన్నాను.

వనజ వనమాలి బ్లాగ్ ఎప్పుడు మగవాళ్ళని దుయ్యబడుతూ రాస్తారు అని అన్నారు .. ఆమె పోస్ట్ లు నచ్చినా కామెంట్ చెయ్యాలంటే భయపడతాము. మనం అలాంటివి సమర్దిస్తున్నాం అని మన మగవారు అనుకునే ప్రమాదం ఉంది .. అన్నారట.

ఇది విన్న నేను గట్టిగా నవ్వేసాను. బహుశా నాతొ గంటల తరబడి మాట్లాడుతున్న ఆ ఫ్రెండ్ అభిప్రాయం కూడా అదే కావచ్చు. నాకైతే కామెంట్ ఇవ్వడం లేదనే సమస్య లేదు.  బట్ నాకైతే ఫెమినిస్ట్ అన్న ముద్ర పడిందన్నమాట. :) నాకైతే భలే నచ్చేసిందండి.  సమస్యలని గుర్తించేవారు, ప్రశ్నించేవారు, తామున్న స్థితిని తెలుసుకోమని చెప్పేవారు  ఫెమినిస్ట్ లు అన్నమాట. ఇన్నాళ్ళు నాకు ఈ మాట అర్ధం అయ్యేది కాదు.. ఇప్పుడు బాగా అర్ధం అయ్యింది. :)

సామాజిక జీవనంలో సమస్యలకి ఇతిహాసాలలోని పాత్రలని ప్రామాణికంగా తీసుకుని వారి వారి వ్యాఖ్యానాన్ని జత చేసి పాజిటివ్ గాను,నెగిటివ్ గాను లేదా పాత్రోచిత పరంగాను సాహితీ  సృజన చేసినవారు ఉన్నారు. నచ్చిన వారు చదువుతున్నారు లేనివారు విమర్శిస్తున్నారు. అందులో ఎవరి అభిరుచి వారిది. 

సాహిత్యం అంటే సమాజానికి హితం కల్గించేది. మంచికి చెడుకి తార్కాణంగా ఇతిహాసాలలో పాత్రలు ని చెప్పుకుంటూ ఉంటారు. సాంఘిక మార్పుల వల్ల ఆ పాత్రల సృజనలో వున్న లోపాలో లేదా లోటుపాటులనో.. తర్కిస్తూ అలాగే ఉండాలనుకోవడం, ఉండాలని  అతిగా ఆశించడం కూడదని చెప్పడమనేది జరుగుతుంది. అలా జరిగేది .. స్త్రీలు సృష్టిస్తున్నసాహిత్యంలో ఇంకా వివరంగా చెప్పాలంటే కొందరు అంటున్న పెమినిస్ట్ సాహిత్యంలో ఉన్నది అదే !

ఇతిహాసాలని సృశించకుండా కథలు వ్రాసేవారు ఉన్నారు. మరి వారి మాట ఏమిటి ? వారు వారి సృజనలో చెపుతున్న ఆంశాలలో నిజాలు  అసలు లేనే లేవా?  ప్రపంచంలో  లేదా మన దేశంలో స్త్రీలకి సమస్యలే లేవా? లేని సమస్యలని కల్పించి రచనలు చేస్తున్నారా ?  పురుషులని దుయ్యబట్టడమే పనిగా పెట్టుకున్నారా ? ఇలాంటి  ఆలోచన చేయడం మాని  మన సాంఘిక జీవనాన్ని అక్కడ నెలకొన్న సమస్యల్ని సహృదయత తో అర్ధం చేసుకుని అలాంటి సమస్యలు లేకుండా ఉంటె బావుంటుందని తలంచాలి కాని .. ఇతిహాసాలని స్త్రీలు మాత్రమే ప్రామాణికంగా తీసుకోండి. సీతలు,సావిత్రులు, ద్రౌపదిలు, అనసూయలు,అహల్యలు లాగానే ఉండండి.  పురుషులు మేము అలాగే ఉంటాము. ఇంకా అంతకన్నా ఘోరంగానే రాచిరంపాన పెడతాం .. అంటూ  చెప్పకండని.. విమర్శకులకి మనవి.

 భర్త పురుషుడే! ప్రేమికుడు పురుషుడే ! వాళ్ళలో ఏమి లోపాలు ఉన్నాయో .. స్త్రీకే తెలియాలి. లేదా ఆ పురుషులకే తెలియాలి.  పురుషులందరూ ఒకే విధంగాను ఉండరు స్త్రీలందరూ ఒకే విధంగాను ఉండరు .. .  అచ్చంగా మీరు చెప్పే "ఇతిహాసాలలో " చెప్పినట్టు గానే !

స్త్రీలకి తమ  సమస్యల పై అవగాహన కల్గించే విధంగా అనేక రచనలు చేసిన   "ఓల్గా "  గారి గురించిన వ్యాసం ఒకటి ఇక్కడ ..  ఏ పత్రికలో వచ్చిందో గుర్తు లేదు .. మళ్ళీ చదువుకోవచ్చని భద్ర పరచుకున్నాను . ఇక్కడ షేర్ చేస్తున్నాను. .  చదివినవారికి .స్త్రీవాదంపై కాస్తంత అవగాహన కోసం.

******************************************************

 ఓల్గా
మృణ్మయనాదంతో కాసేపు.....
ఇప్పుడున్న ఈ ప్రపంచం ఎట్లా ఉంది అంటే- కొందరు వందల ఏళ్ళ పాటు కుట్రలు చేసి తమకు అనుకూలంగా మలుచు కున్నట్లు ఉంది. అడ్డంగా ఒక గీత గీసినట్టుగా, మెట్లు మెట్ల నిచ్చెనలా ఉంది. అలాటి ఈ గీతల, నిచ్చెన మెట్ల సమాజాన్ని ఉన్నదాన్ని ఉన్నట్లుగా పరిశీలించి, ఇలా ఉండటం పరమ తప్పు అని గ్రహించి సంస్కర్తలు, మేధావులు దానిని మార్చడానికి ప్రయత్నించారు. తెలుగు నేలపెై అలాంటి గ్రహింపుతో ప్రారంభమైన స్త్రీవాద సాహిత్యోద్యమం కోసం, తన జీవితంలోని అత్యంత విలువెైన సంవత్సరాలను వెచ్చించిన, ఇంకా వెచ్చిస్తున్న రచయిత్రి ఓల్గా.

‘మృణ్మయనాదం’ పన్నెండు కథల సంకలనం. స్త్రీవాదుల రచనలు అనగానే ‘ఫెమినిస్టు పాఠాలు చెప్పే పాత్రలు’ అనే అపప్రథ ఉందని అంటారు విమర్శకులు. అందుకు సమాధానమా అన్నట్లు ఓల్గా ‘అసలు నేను కథల కోసం కథలు రాసే రచయిత్రిని కాదు. స్త్రీ వాద రాజకీయ చెైతన్యాన్ని సాహిత్యం రూపంలో అందించడానికి కథారచనను ఒక మార్గంగా ఎంచుకున్నాను’ అంటారు. ఓల్గా రచనల పెై వచ్చిన ఈ తరహా విమర్శలకు ఇది చాలా స్పష్టమైన సమాధానం.ఓల్గా రచనలలో స్త్రీలు రచయిత్రి చేయిదాటి నడవరు. కథ కానీ పాత్రలు కానీ యథేచ్ఛగా సంచరించవు. రచయిత్రి ఎంపిక చేసుకున్న సిద్ధాంతాన్ని అనుసరించి ఆవిడ చెప్పిన మార్గంలోనే ప్రయాణం చేస్తాయి. అందుకే ఓల్గా రచనలు పరిశీలించేటప్పుడు అందులోని శెైలి- శిల్పాలు ఏమిటి, ఆ పాత్రలు సహజత్వానికి ఎంత దగ్గరగా వచ్చాయి, ఎంత దూరంగా నడుస్తున్నాయి అని చర్చ చేయడం అర్ధ రహితం.

Volgaఆవిడ రచనలు స్త్రీ చెైతన్యానికి చేసిన దోహదం ఎటువంటిది అనే దృక్పథం నుండి మాత్రమే చూడాలి.మృణ్మయ నాదంలో ధన యవ్వనం, సారీ జాఫర్‌, నిర్వాసం, రోషనార, 1971లో రాసిన జెైలు గది ఆత్మకథ తప్పించి మిగిలిన ఏడు కథలూ, ఓల్గా మాటల్లోనే చెప్పాలంటే- ‘స్త్రీల శరీరాల చుట్టూ, స్త్రీలకు తోటి స్త్రీలతో, సమాజంతో, తమ పురుషులతో ఉండే సంబంధాల చుట్టూ అల్లిన భావజాలానికి సంబంధించిన కథలు’. ఓల్గా ప్రతి రచన స్త్రీవాదానికి సంబంధించినంతవరకు ఒక అధీకృత రచనే. ఈ మృణ్మయ నాదం కూడా అట్లాంటిదే.‘సమాగమం’ ఈ సంకలనంలోని మొదటి కథ. తరతరాల నుంచి పురుషుల పగలు ప్రతీకారాలు తీర్చుకోడానికే స్త్రీలుండేది అని చెప్పే కథ. సీత కథ, శూర్పణఖ కథ. ధర్మపత్ని- రాజ్యపాలనల మధ్య రాజరికాన్నే ఎంపిక చేసుకుని రాముడు సీతను విడిచిపెట్టిన తరువాతి కథ. అరణ్యంలో ఉన్న సీతకు ఒకానొక సందర్భంలో శూర్పణఖని కలిసే అవకాశం వస్తుంది.

వారిద్దరి మధ్య జరిగిన పరిణత సంభాషణే ‘సమాగమం’. కథ పూర్తిగా ఓల్గా కల్పనే అయినా అసహజంగా అనిపించదు. కథంతా చదివేసిన తర్వాత- అవును సీత శూర్పణఖ ఇద్దరూ నివసిస్తున్నది అడవిలోనే అయినప్పుడు వారి సమాగమం ఎందుకు జరిగి ఉండదు? చరిత్ర దానిని లిఖించి ఉండకపోవచ్చు, కానీ అది సంభవమే అనిపిస్తుంది. ఇద్దరూ పురుషుడి దౌష్ట్యానికి బలెైన వారే. విషయం పట్ల ఇద్దరికీ అనుభవ సృష్టత ఉంది. అందుకే వారిద్దరి స్పష్ట సంభాషణ కథను పండించింది. ‘సాఫల్యానికి అర్థం పురుషుని సాహచర్యంలో లేదని గ్రహించాను’ అని శూర్పణఖ అన్నా, ‘శూర్పణఖను రాముడు అవమానిస్తే రావణుడు తన నపహరించి రాముడి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. పురుషుల పగలు, ప్రతీకారాలు తీర్చుకోవటానికేనా స్త్రీలున్నది’ అని సీత అనుకున్నా పురుషుల పట్ల ఆ ఇరువురికి ఏర్పడ్డ స్పష్టమైన అభిప్రాయాలు, ఆ అభిప్రాయాలని ఏర్పరిచిన అనుభవాలే కారణం.

పురాణాలు, చరిత్ర ఏదెైనా సరే లిఖితమైన ప్రతి పదానికీ మధ్య ఇంకేదో ఉంటుంది. అది అస్పష్టం కావచ్చు, కావాలని తొక్కిపెట్టిందే కావచ్చు. వాక్యాల నడుమన జాతులు, కులాలు, స్త్రీలు నలిగిపోయారు. స్త్రీల విషయంలో ఈ అనావిష్కృతాలను ఆవిష్కరించే పని తలపెట్టిన ఓల్గా ఆ పనిలో సఫలీకృతం అయ్యారు. అందుకు ఉదాహరణే సమాగమం, మృణ్మయ నాదం కథలు.

మృణ్మయ నాదంలో నాయిక అహల్య. మొదటిసారి అహల్య గురించి రాముడి ద్వారానే వింటుంది సీత. అప్పటినుండే సీతకి వంచిత అహల్యను చూడాలని ఆసక్తి. ఆ కోరిక ఒక సందర్భంలో తీరుతుంది. మనిషి తన వయసులోని ఒక్కో దశను దాటే క్రమంలో అనుభవంతో సంపన్నమవుతారు. అనుభవాలు ఒక్కోసారి దృష్టి కోణాలను మార్చుతాయి. మొదటి సారి అహల్యను చూసినప్పుడు సీత ముగ్ధ. అందుకే అహల్య మాటలు ఆమెకు అర్థం కాలేదు. రెండవసారి అహల్యను కలవాల్సి వచ్చినప్పుడు సీత త్యజిత. అప్పుడు అహల్య మాటలు విరబూసిన పువ్వులా సీతకి స్పష్ట పడ్డాయి. సీత- అహల్య మార్గదర్శకత్వాన్ని కోరుకున్నది. ఆ మార్గంలో పయనించి ‘తన లోపల తన మీద తనకున్న అధికార శక్తి’ని మొదటిసారి సంపూర్ణంగా అనుభవించగలిగింది.

సీత వ్యక్తిత్వం, చరిత్ర ఆసక్తికరమైనవి. స్త్రీల జీవితానికి ఒక చిరనమూనా సీత. ఆ నమూనాని స్త్రీవాదంలోకి తీసుకొచ్చి స్త్రీ వాదాన్ని సాధారణ స్త్రీల వద్దకి కూడా తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు ఓల్గా. ఈ ప్రయత్నం ప్రశంసనీయం.సంకలనంలోని మరో కథ ‘నిర్ణయం’. స్త్రీ మాతృత్వం పెైన స్త్రీకి హక్కు లేదు. అసలు స్త్రీ జీవితం పెైనే స్త్రీకి హక్కు లేదు. పుట్టబోయే ముందు ఆమె పుట్టుకా నియంత్రితమే. పుట్టిన తర్వాత బతికినంత కాలం స్త్రీ జీవించేది నియంతల మధ్యనే. ‘నిర్ణయం’ కథలో తన శరీరం పెైన తనకే నిర్ణయాధికారం లేని ఒక ఉద్యోగిని కథ చెప్పారు ఓల్గా. కమల భర్తకి తన భార్య గర్భంలో ఉన్నది స్త్రీ శిశువు అని తెలిసిన తర్వాత, రెండవసారి కూడా కూతురేనా అని అబార్షన్‌ చేయించుకోమంటాడు. అనేక మంది నేటి ఆధునిక స్త్రీల లాగే ఆర్థికంగా స్వతంత్రురాలయినా కమలది భర్త మాట జవదాటలేని స్థితి. ఆమె పనిచేసే హాస్పిటల్లో డాక్టరమ్మ శెైలజ ఇటువంటి పనులను సుతరామూ అంగీకరించని వ్యక్తి. అటువంటి ఆవిడతో అబార్షన్‌ చెయ్యమని ఎలా చెప్పాలో తోచదు కమలకి.

అనుకున్నట్లుగానే ఆవిడ కమలను నిందిస్తుంది. ఇక్కడ శెైలజ తాను చాలా అభ్యుదయంగా ఉన్నాను కాబట్టి పరిస్థితులతో సంబంధం లేకుండా అందరూ తనలాగే అభ్యుదయంగా ఉండాలనుకునే రొడ్డ కొట్టుడు తరహా ఆధునిక అభ్యుదయ స్త్రీలకు ప్రతినిధి. ‘అందుకే నువ్వు అబార్షన్‌ చేయిన్చుకోదల్చుకుంటే లెక్క చూసుకుని నీ జీతం నువ్వు తీసుకెళ్ళిపో, మళ్లీ రావొద్దు’ అనేస్తుంది. చివరికి ప్రమాద వశాత్తు కమలకి గర్భం పోతుంది. తన కసలు ఒక్క బిడ్డే చాలు అని ఆపరేషన్‌ చేయమంటుంది డాక్టర్ని. ‘నా నిర్ణయం మీకు నచ్చకపోతే ఉద్యోగం మానేస్తాను’ అని డాక్టర్‌కి ప్రకటిస్తుంది. ఇపుడు కమలకి భర్తను కూడా విడిచిపెట్టే తెగువ వచ్చిందని రచయిత్రి సూచనగా చెబుతుంది. కమల ఆర్ధికంగానే కాదు, ఇప్పుడు మానసికంగా కూడా స్వతంత్రం.

మారుతున్న కాలంలో స్త్రీ పురుషుల మధ్యనున్న అస్పష్టమైన విభజన రేఖ మసక బడుతూ వస్తోంది. స్త్రీకి పురుషుడికి మధ్య ఉండే ప్రేమ లేదా పెళ్లి సంబంధాలే కాకుండా స్నేహాలు కూడా మొదలయ్యాయి. అయితే కొన్నిసార్లు ఈ స్నేహాలు స్నేహేతర మలుపు తీసుకోవడం కూడా ఉంటుంది. అంతవరకు ప్రాణ స్నేహితుడు అనుకున్న వ్యక్తి స్నేహానికి మించి తననించి ఏదో కోరుకుంటున్నాడని తెలిసినప్పుడు ఆ స్త్రీ అనుభవించిన మానసిక ఘర్షణను సమర్ధవంతంగా అక్షరాలలో పెట్టగలిగారు ఓల్గా. అతి దగ్గరగా పురుష స్నేహాన్ని అనుభవిస్తున్న ఆధునిక స్త్రీల అనుభవం ఇది. ఒక మంచి ఆధునిక కాలపు కథ ‘స్పర్శ’.
పురుషాధిక్య సమాజం స్త్రీని తనకు అనుగుణంగా మలుచుకున్నది. స్త్రీని ఆమెకే తెలీకుండా నేరస్థురాలిని చేసి నిలబెడుతుంది. ‘అత్తిల్లు’ కథ అందుకు సంబంధించినదే. కుటుంబ వ్యవస్థ స్త్రీల పాలిటి ఒక విషపు వల. ఆ వలలో ‘రెండు వేళ్ళ మధ్య తూనీగలాటి’ ఒక అత్త ‘గుబురుగా ఎదిగిన తులసి మొక్కలాంటి’ కోడల్ని చంపేసిందనే నేరంపెై అరెస్టై జెైలు పాలవుతుంది.

ఈ కథలో తండ్రీ కొడుకుల క్రూరత్వం అతి స్పష్టంగా కనపడుతుంది. బయటి ప్రపంచంలో అలా స్పష్టంగా కనిపించదు కానీ విషయం మాత్రం అదే.‘పట్ట పగటి చీకటి’ కథలో విశాల పేదింటి పిల్ల. అవసరాలు ఆమెను నగరంలోని చిన్న ఉద్యోగంలో చేరేట్టు చేస్తాయి. అక్కడ సులభంగా వచ్చే డబ్బు ఎర చూపించే ప్రలోభాలు ఎన్నెన్నో. విశాల చాలా వరకు ఎదురు నిలబడి పోరాడుతుంది. చివరికి కుటుంబ పరిస్థితి ఆమెను ఆ విషవలయం వెైపు నిర్దాక్షిణ్యంగా నెడుతుంది. సమాజంలో విశాల లాంటి స్త్రీలు చాలామంది ఉన్నారు. వారి జీవితాన్ని మన ముందు శ్రద్ధగా పరిచారు ఓల్గా.మిగిలిన కథలు సూటిగా స్త్రీవాదాన్ని చర్చించవు. ఓల్గా స్త్రీవాద కథలు మాత్రమే రాయలేదు, సమాజంలోని ఇంకా ఇతర కోణాలను కూడా స్పృశించారని చెప్పడానికి ఇవి ఉదాహరణలు.‘ధనయవ్వనం’లో ఈ కాలపు యువత డబ్బు చుట్టూ ఎలా పరిభ్రమిస్తుందో చెప్తే,

‘వెలుగులోని చీకటి’ మారుతున్న సమాజంతో పాటు మారుతున్న విలువల్ని చెబుతుంది. ‘సారీ జాఫర్‌’ హిందూ ముస్లిం మతాల మధ్య మొలకెత్తిన ఘర్షణ గురించి. గతకాలం ఇరు మతాల వారి మధ్య ఉండిన స్నేహ నేపథ్యం నుండి చర్చిస్తుంది. కథ పరమార్థం ఇది అని చెప్పకున్నా పాఠకుడిలో ఆలోచనలు రేకెత్తించే కథ ఇది.‘నిర్వాసం’ భూ నిర్వాసితుల వెతలను రెండు వేణువుల చేత పలికించిన కథెైతే, రోషనారా రెండు దేశాల మధ్య నెలకొని ఉన్న కలహం ఒక విద్యావంతురాలి మనస్సులో ఎలాటి గోడలను కట్టిందో చెప్పే కథ. చివరి కథ జెైలుగది ఆత్మకథ. ఇది ఓల్గా మాటల్లో చెప్పాలంటే ఆమె యవ్వనారంభ సహచరి సామ్యవాదం. ప్రపంచంలోని బాధలన్నిటికీ పరిష్కారమని నమ్మిన సామ్యవాదం గురించి రాసిన కథ. బహుశా ఇది పత్రికలో ప్రచురితమైన ఆమె తొలికథ కావచ్చు.

సామ్యవాదాన్ని నమ్మి నెత్తి మీద పెట్టుకుని తిరిగి, ఆశ నిరాశ అయిన తర్వాత విడివడి తమలో తాము అనుకుని ఏకమైన అస్తిత్వవాద ఉద్యమాలు దళిత, స్త్రీవాద ఉద్యమాలు. మహిళలో అస్తిత్వ చెైతన్యం మొదలవగానే అనేకమంది తీవ్రస్థాయిలో గొంతెత్తారు. అట్లా స్త్రీల నుండి విరివిగా రచనలు వెలువడ్డాయి. అయితే మిగిలిన అస్తిత్వ వాదుల లాగే స్త్రీ వాదంలోనూ వస్తువుదే పెైచేయి అయి శెైలి, శిల్పాలు వెనకబడ్డాయి. ఓల్గా రచనలకి ఈ విషయంలో సంపూర్ణంగా మినహాయింపు ఇవ్వచ్చు. శెైలి, శిల్పం, సిద్ధాంతం వంటి అన్నింటినీ ఏకతాట బిగించి సంధించిన బాణాలు ఆమె రచనలు.ఆంధ్రదేశంలో అంతో ఇంతో చదువుకున్న స్త్రీలలో చెైతన్యానికి, మార్పుకు, ప్రశ్నించే ధోరణి పెరగడానికి స్త్రీవాదం ఎనలేని కృషి చేసింది అనుకుంటే, ఆ స్త్రీవాదానికి మూల స్థంభం ఓల్గా!

    ఈ వ్యాస రచయిత : డా:సామాన్య (ఓల్గా రచనల పై పరిశోధన చేస్తూ అందులో భాగంగా ఈ వ్యాసాన్ని పత్రికలకి అందించారు.) "సూర్య" పత్రిక సౌజన్యంతో .. ఈ వ్యాసం 

15 కామెంట్‌లు:

hemalatha putla చెప్పారు...

ఇతిహాసాల నాటి స్త్రీలనీ , భావజాలాన్నీ పెంచి పోషిస్తుండటమే ఇప్పుడు జరుగుతున్నది. మంచి పోస్ట్ చేసారు. అభినందనలు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

హేమలత పుట్ల.. హేమ గారు మీ స్పందన కి ధన్యవాదములు.

Sharma చెప్పారు...

వనజ గారూ ,

ఎవరో ఒకళ్ళు ఫెమినిష్ట్ అన్నారని మీరేమీ ఫీలవకండి . నిజాల్ని ధైర్యంగా చెప్పటం తప్పేమీ కాదు . అందరూ అలా వుంటారనుకోవటం , వున్నారనుకోవటం తప్పు .మన బుల్లితెరల బడా బడా సీరియల్స్ లో చూపించేవన్నీ ఏమిటీ ఆడవాళ్ళకు ఆడవాళ్ళే శత్రువులుగా ధారావాహికంగా ప్రదర్శిస్తున్నారు . మరి ఆ కధలనేమంటారు ?
పురాణేఇతిహాసాలలో గాని , వేదాలలో గాని ఆడవాళ్ళను అన్యాయంగా చిత్రీకరించటం జరిగింది . ఇవి రచించబడ్డది ఓ మగవాడి చేత . వంచించబడ్డది ఆడజాతి అంతా . అనుమానమేమీ లేదు .
ఈ నాడు కూడా మన సమాజంలో మేక వన్నె పులులు ఉన్నాయి . " తన వంటికి పనికొచ్చే ఆడవాళ్ళు తన వంటింట్లోనికి రాకూడదంటారు .
ఓల్గా గారి కధలపై చక్కని విశ్లేషణనివ్వటం చాలా చాలా బాగుంది .
నేను నా బ్లాగులో తరచుగా చెప్తున్నది అలా ఆడవాళ్ళకు జరిగిన అన్యాయాల గురించే .

SRINIVASA RAO చెప్పారు...

చాలా కాలం తర్వాత ఒక మంచి పోస్ట్ చదివించినందులకు చాలా కృతజ్ఞతలు

Kottapali చెప్పారు...

స్త్రీ తన సమస్యలని గురించి స్పష్టంగా మాట్లాడడాన్ని సహించే స్థితికి మన సమాజం ఇంకా ఎదగలేదు. బ్లాగు చదవడమో రాయడమో అందరికీ అన్నిరకాల స్వేఛ్ఛనూ ఇవ్వదు. స్వేఛ్ఛ ఎంతవరకూ ఉంది, ఎక్కడ లేదు అని గుర్తించుకోవడం కూడా ఒక రకమైన తెలివి.
కాగా, తెలుగు సాహిత్య చర్చా రంగాలలో ఫెమినిస్టు అనే లేబులుకి చాలారకాల అపార్ధాలు ఉన్నాయి. కనీసం కొత్త తరాలనైనా ఇటువంటి విషయాల్లో ఎడ్యుకేట్ చెయ్యాలి.
నిర్మొహమాటంగా ఉండే మీ రచనాశైలికి అభినందనలు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Sharma గారు .. అలాంటి ఫీలింగ్ నాకైతే రాలేదండి. నవ్వేసానంతే!
హమ్మయ్య .. మీలా కొంతమంది వాస్తవాలని ఒప్పుకుంటున్నారు. అదే సంతోషం.
మీ స్పందనకి ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Srinivasa rao గారు బ్లాగ్ కి విచ్చేసి మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Narayanaswamy గారు .. మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదములు. ఫెమినిస్ట్ లకి వేరే అర్ధాలు ఉన్నాయని తెలుసు. అలాగే బ్లాగ్ లు చదవడానికి,వ్రాయడానికి,వ్యాఖ్యానించడానికి కూడా ఎలాంటి పరిమితులు విధించుకుంటున్నారో..అర్ధం అవుతూ ఉంది. ముందు తరాల వారికైనా మంచి అవగాహన రావాలని కోరుకుందాం.
మీ అభినందనలకి మరీ మరీ ధన్యవాదములు.

అజ్ఞాత చెప్పారు...

మనిషి ఏనాడైతే తన మీద తాను నమ్మకం పెంచుకుంటారో.....అదే నిజమైన సంతృప్తినిస్తుంది. మీరు ఇలాగే రాయాలని....రాస్తారని ఆశిస్తున్నాను....

పల్లా కొండల రావు చెప్పారు...

మార్పు తప్ప ప్రతీదీ మారుతుంటుంది. అప్డేట్ కాకుంటే అవుట్డేట్ అవుతాము. స్త్రీవాదం-ఫెమినిజం-అస్తిత్వం ఏవైనా సమస్యలనుండి ఉద్భవించేవే. అయితే ఇవి సమస్యకు పరిష్కారం చూపకుండా లేదా మార్పుకు అవరోధం కలిగించే అవకాశాలను మెరుగుపరుస్తుంటాయి. అలా జరిగిందే మీపై ఫెమినిస్టు అనే భావన అనుకుంటాను. మీ అబ్బాయిని ప్రేమిస్తారు. మీ వృత్తి - ప్రవృత్తి చేసుకుంటూ సమాజం లో మార్పు కోసం వీలయినంతగా బ్లాగు రచనలు చేస్తున్న మీలో ఫెమినిస్టు లక్షణాలేవీ కనపడవు. ఆడవాళ్ల పోకడలను కూడా విమర్శించిన పోస్టులున్నాయి. మొత్తం సమాజం లో మార్పు ద్వారానే స్త్రీల అణచివేత లేదా స్త్రీవాద సమస్య రెండూ పరిష్కారం అవుతాయి. ఈ లోగా పరిణామాత్మకమైన మార్పులో ఎన్నో పోరాటాలు అవసరం. ఆ సందర్భంలో అవమానాలు - అవరోధాలు అత్యంత సహజం. వీటికి కొందరు రాలిపోతారు. మరికొందరు రాటుదేలతారు. రెండో కోవకే చెందుతారని నా అభిప్రాయం.

సామాన్య చెప్పారు...

వనజ గారూ మీ పోస్ట్ చాలా బాగుంది.మీకో విషయం చెప్పేయనా :)) కింద మీరు పెట్టిన వ్యాస రచయితను నేనే .....అనుకోకుండా ఇవాళ మీ బ్లాగ్ చూసాను చాన్రోజులకి .

సామాన్య చెప్పారు...

Surya lo vacchindandee

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

అనూ గారు .. మీ వ్యాఖ్యకి అందులోని సూచనకి మరీ మరీ ధన్యవాదములు .

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కొండలరావు పల్లా గారికి ధన్యవాదములు. ఎల్లప్పుడూ మీరు నేను వ్రాసిన పోస్ట్ లని చదివి సునిశిత పరిశీలనతో విలువైన వ్యాఖ్యానం చేస్తారు. మీ ప్రోత్సాహానికి, మీ వ్యాఖ్యలకి ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సామాన్య గారు బావున్నారా? ఇప్పుడే వ్యాసరచయిత గా మీ పేరుని జత చేస్తాను. ఓల్గా గారి గురించి వచ్చిన ఆ వ్యాసం నాకు బాగా నచ్చింది. అది వ్రాసినది మీరే నని తెలియడం నాకు చాలా చాలా ఆనందం. మీరు చాలా చక్కగా ఆ వ్యాసంలో ఓల్గా గారి గురించి చెప్పారు. మనమందరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం కాబట్టి .. వివరాలు తెలియకపోయినా ఆ వ్యాసాన్ని తద్వారా అభిప్రాయాలని గౌరవించాను. ఇప్పుడు ఇంకా సంతోషంగా ఉంది . ఇక్కడ మీ వ్యాఖ్యకి మరింత సంతోషం.. సంతోషం ..సంతోషం . థాంక్ యూ సో మచ్