7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

సంపెంగ సేవలో



"నాకు నిద్ర వస్తుంది, రా.. నాయనమ్మా పడుకుందాం" మూసుకుపోతున్న కళ్ళను బలవంతంగా విప్పుకుని గారాం చేసింది,

"నువ్వు పడుకోమ్మా! నాకింకా  ఇంటిపని ఉంది" బుజ్జగించే ప్రయత్నం చేసింది వనమ్మ. 

"ఊహూ, నువ్వు ప్రక్కన లేకుండా నిద్ర రాదు నువ్వూ రా"  రకరకాల పువ్వులన్నింటిని పొందికగా, అందంగా కదంబ మాల కడుతున్న నాయనమ్మ దగ్గరికి వచ్చి చేయి పట్టుకుంది సంపంగి. 

 అక్కడే కూర్చుని మాలలు కడుతున్న జానకి  "ఇక తప్పుదుగా ని  లేచెళ్ళు  వనమ్మక్కా ! ఈ పిల్లకి తల్లంటే  ఏమిటో తెలియదు .రెండు నెలల వయస్సున్నప్పటి నుండి తల్లిలా పక్కలో వేసుకుని పెంచుతున్నావ్? నువ్వు ప్రక్కన లేకుండా "సంపంగి" నిద్రపోతుందంటావా? నిద్రపోయేదాకా ప్రక్కన పడుకునిరా, ఈ లోపు నేను ఈ మల్లెపూలు కడుతూ ఉంటాను  చెప్పింది. 

"సరే కాసేపట్లో వచ్చి కూర్చుంటాను. మల్లెమాల  మరీ పలచగా కట్టేవ్,  కాస్త గుత్తంగా కట్టు చూసేదానికి బాగుంటుంది " అని చెప్పి .నిద్రకళ్ళతో ఊగుతున్న మనుమరాలిని ఎత్తుకుని ప్రక్క గదిలో ఉన్న మంచంపై పడుకోబెట్టి తను పడుకుంది. నిద్రలోనే తడుమ్కుంటూ వనమ్మ చీరలో నుంచి చేయి లోనికి పోనిచ్చి పొట్టకి అతుక్కుని  ఆమెగుండెల్లో తలను చేర్చి నిద్రలోకి జారుకుంది. 

పిచ్చితల్లి !  పదేళ్ళు వచ్చినా ఇంకా పసిపిల్లలా అతుక్కుని పడుకునే అలవాటు పోలేదు ఒక్కనాడన్నా తనని విడిచి ఎక్కడికి  వెళ్ళదు . సంక్రాంతి సెలవలకి మేనమామ వచ్చి బతిమలాడాడు "నాలుగు రోజులుండి వద్దువుగాని రామ్మా అని,  " నేను రాను నాకిక్కడే బాగుంది"  అని  అప్పటిదాకా మేనమామ ప్రక్కన కూర్చున్నదల్లా లేచి ఇవతలకి వచ్చింది. "తప్పమ్మా అలా అనకూడదు. మామయ్యా కదా ! తీసుకువెళ్ళడానికి వచ్చాడు . నువ్వు వెళ్ళాలి కదా! అక్కడ అమ్మమ్మ, తాతయ్య నువ్వు వస్తావని ఎదురు చూస్తూ ఉంటారు. నీ కోసం కొత్తబట్టలు కొన్నారంట. నీతో ఆడుకోవడానికి అక్కడ మామయ్యా వాళ్ళ పిల్లలు కూడా  ఉన్నారు, చాలా బావుంటుంది వెళ్ళమ్మా " అంటే తల అడ్డంగా తిప్పింది 

"సంపంగీ రామ్మా  ఊరికి వెళదాము  అని  మరో సారి ప్రేమగా అడిగాడు మేనమామ 

"నానమ్మ వస్తేనే నేను వస్తాను" అంది 

"చెల్లెలు లేకపోయినా ఆమె  కూతురిలోనయినా ఆమెని  చూసుకోవాలనుకునే చిన్న కోరిక కూడా తీరడం లేదని  అమ్మ నాన్న బాధపడుతున్నారు" .సంపంగిని తనతో తీసుకు వెళ్ళలేని నిత్సహాయతకి బాధపడుతూ అన్నాడతను .

"చిన్న పిల్ల కదా !  అందులో  చిన్నప్పటినుండి ఇక్కడే అలవాటయిపొయింది కదా ! రావడానికి మొహమాటపడుతుంది.  పండగెల్లే లోపు   ఒకరోజు సంపంగి ని తీసుకుని నేనే వస్తానులే రాము బాధపడకు, అలా ఒకటి రెండుసార్లు వచ్చి వెళ్తూ ఉంటే సంపంగికి ప్రేమలు తెలుస్తాయి, తర్వాత తర్వాత తనే వస్తుంది " అని సర్ది చెప్పింది. 

అతను వెళ్ళాక సంపంగికి అర్ధమయ్యేటట్లు వివరించి చెప్పింది. " నాకేమైనా అయితే తర్వాత నిన్ను చూసుకునేది మీ అమ్మమ్మ- తాతయ్య, మామయ్యే !  వాళ్ళొచ్చి పిలిస్తే  నువ్వు వెళ్ళాలి, అలా రానని చెప్పకూడదు తెలిసిందా ? " అని చెప్పింది . అయిష్టంగానే తల ఊపి "నాయనమ్మా నీకేమి కాదు. నేను పెద్దయ్యాక నిన్ను బాగా చూసుకుంటాగా " అంది ఇష్టంగా నాయనమ్మని చుట్టుకుంటూ . 

 రాముకి మాట ఇచ్చినట్టుగానే ఒకరోజు ఉదయాన్నేసంపంగిని తీసుకెళ్ళి సాయంత్రం దాకా ఉండి వాళ్ళందరితో దగ్గర చేయడానికి ప్రయత్నించి వచ్చింది.అదంతా గుర్తుకు తెచ్చుకుంటూ తనని చుట్టుకుని నిద్రపోతున్న సంపంగిని  విడదీసి సరిగా పడుకోబెట్టి దుప్పటి కప్పి బయటకి వచ్చింది . 

నిద్రపోయిందా? ఏమైనా ఈ పిల్లని పెంచడం నీకు కష్టమయిపొయింది వనమ్మా! రోజంతా కష్టపడుతున్నావ్. ఆ హై క్లాస్ స్కూల్ కి పంపియ్యకపోతే ఏమైంది ? మన కాలనీలో పిల్లలందరూ ఇక్కడ స్కూల్ లో చదువుకోవట్లా!  పిల్లనీ, పిల్ల కోసం తోటని ఇష్టంగా పెంచుతున్నావ్. మన మిలటరీ వాళ్ళందరికీ ఇచ్చిన పొలాలు బీళ్ళు గానే పడి ఉన్నాయి . నువ్వు తప్ప ఈ భూమిని పచ్చగా పెంచినవాళ్ళు లేరు. వనమ్మ తోట అని పేరు కూడా పడిపోయింది. బస్టాప్ కూడా అయిపొయింది. ఆ మెచ్చుకోలులో ఈర్ష్య కూడా ధ్వనిస్తూ చెప్పింది జానకి. 

ఆ మాటలు పట్టించుకోకుండా రేపు ఏకాదశి కదా ! ప్రొద్దునే తొందరగా పని చేసుకుని మారేడు మొక్కలని నాటాలి తోటలో ఉత్తరం వైపున తోట  పొడుగూతా  మారేడు మొక్కలు నాటించాలని గుంటలు తవ్వించి ఉంచాను. ఆ పని చేయాలి.  పనెమ్మట  పని తెమలక ఇవ్వాళ చీకటి పడిపోయి సంపెంగలన్నీ తుంచలేకపోయాను మిగిలిన పూలని తెంచి గుళ్ళో ఇచ్చిరావాలి. అట్టాగే సంపెంగకి పుట్టినరోజుకి బట్టలు కొనాలి. టైలర్ కి ఇప్పుడిస్తే గాని ఆ రోజుకి ఇవ్వడు అని మరుసటి రోజు చేయాల్సిన పనులన్నింటిని ఏకరవు పెట్టింది . 

"సంపంగి ఎప్పుడు పుట్టింది ? ఎన్నేళ్ళు దానికి ?" అడిగింది జానకి ఆరాగా .   

"శివరాత్రి వెళ్ళినాక ఫాల్గుణ మాసం వచ్చాక ఐదో రోజున శుక్రవారం పుట్టింది.  పుట్టిన రోజున గుర్తుగా ఈ తోటలో సంపెంగ చెట్లని నాటి "సంపంగి " అని పేరు పెట్టాడు మా ఆయన. కోడలికి ఆ పేరు నచ్చక  "చంపక" అని పెట్టింది. మొగుడు సరిగ్గా లేకపోయినా బిడ్డనైనా బాగా పెంచుకోవాలని కలలు కంది. బిడ్డ ఆటా-పాటా, అచ్చట-ముచ్చట చూసుకోకుండానే చచ్చిపోయింది.  నేను చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు జానకి!  బిడ్డలని పెంచడం కష్టమయితే మాత్రం వదిలేస్తామా? పదేళ్ళు పెంచాను.ఇంకో పదేళ్ళు కష్టపడితే ఫలితం దక్కుద్ది. చదువుల్లో,ఆటల్లో అన్నిట్లోనూ ఫస్ట్ వస్తుందని స్కూల్ హెడ్ మాస్టర్ చెపుతుంటే సంతోషంగా ఉంటుంది. ఫీజులు కూడా సగానికి సగం తగ్గించారు కాబట్టీ అక్కడ చదువుకోగల్గుతుంది. నాదేముంది అంతా భగవంతుడి దయ .ఆ  పుణ్యాత్ముల చలువ" అంది.

 రోజూ సంపెంగి పూలతో స్వామికి అర్చన చేయిస్తావుగా! ఆ పుణ్యం ఊరికే పోదులే  వనమ్మక్కా! అట్టాగే అందరి మంచి కోరుకుంటావ్. భగవంతుడు  మిమ్మల్ని చల్లగా చూస్తాడులే ! సంపంగి చూడచక్కనిది, .వాళ్ళ అమ్మకి లా నిలువెత్తు మనిషి అవుద్ది. పదేళ్ళ పిల్లలా లేదు. దిష్టి తగులుద్ది. నేనన్నానని ఏమనుకోకు  రోజూ కాస్త దిష్టి తీసేయి" అంటూ తను కట్టిన మాలని మూరలెక్క కొలిచి "ఇరవై నాలుగు మూరలయ్యాయి, ఇదిగో పుస్తకంలో  లెక్క రాయి" అంటూ దేవుడి పటం వెనుక దాచిన పుస్తకం తీసుకొచ్చి ఇచ్చింది . లెక్క రాసి "రేప్రొద్దునే వచ్చి గులాప్పూలు కోసి ఇచ్చి వెళ్ళు జానకి" అని గుర్తు చేసింది . 

మాలలు కట్టిన పూలన్నిటిని  తడి గుడ్డ పరచి అందులో పదిలంగా చుట్టి వెదురు బుట్టలో  పెట్టింది. తలుపు గడియవేసి వచ్చి మనుమరాలి ప్రక్కలో పడుకుంది .

చిన్నప్పుడు సంపంగిని ఇంటి దగ్గర ఉన్న అంగన్ వాడీ బడికి పంపుతున్నప్పుడు  ఒక రోజు సంపంగి "నాయనమ్మా నేను ఆ స్కూల్ బస్లో ఎక్కి స్కూల్ కి వెళతా, బాగా చదువుకుంటా ! నన్ను ఆ బడికి పంపించు"  అని అడిగింది 

భర్త చనిపోయాక సంపాదించే మగదిక్కు లేక,ఆసరాగా ఉన్న ఇల్లు కొడుకు చేసిన అప్పులవల్ల పోగొట్టుకుని  నిలువ నీడకూడా  లేకుండా పోవడంతో   ఊరికి దూరంగా పొలంలోకి వచ్చి  ఓ మూలాన చిన్న ఇల్లు కట్టుకుని వచ్చే సగం  పెన్షన్ డబ్బుతో  గుంభనంగా కాలం గడుపుతుంది వనమ్మ. చదువుకుంటానని నోరు తెరిచి అడిగిన  మనమరాలి కోరిక తీర్చడం కోసం నడుం బిగించింది. పొలంలో రెండు సార్లు  బోరు వేయించినా చుక్క నీళ్ళు పడలేదు.నిరాశ పడకుండా  మూడవసారి ప్రయత్నం చేస్తే నీళ్ళు పడటంతో ఏమైనా చెయగలననే విశ్వాసం కల్గింది. అంతకు క్రితం ఆకు కూరలకి గుత్తకిచ్చే ఎకరం పొలాన్ని చిన్న మడులుగా మార్చి తమలపాకు, మల్లె, కంకబరాలు,గులాబీలు, చామంతి, బంతి మొక్కలు నాటింది.సంవత్సరం తిరిగే సరికి తోటంతా కళ కళలాడింది.వనమ్మ పేరుని సార్ధకం చేసుకుంది.దళారీల మోసానికి చిక్కకుండా పట్నంలో ఉన్న పూల అంగళ్ళ వారితో బేరం కుదుర్చుకుని వాళ్లకి పూలివ్వ సాగింది.  

జానకి మాటలు గుర్తు చేసుకుంటూ అమాయకంగా నిద్ర పోతున్న సంపంగిని  చిన్నగా ముద్దుపెట్టుకుని ఈ సంపంగిని,  దేవుడు పూజ కోసం వెళ్ళే ఆ సంపగి పూలని కూడా ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వస్తుందో! అందరి కళ్ళు వీళ్ళపైనే.నరుడి కంటికి నాపరాయి పగులుద్ది అంటారు, రోజూ కర్పూరంతో దిష్టి తీసేయాలి . సంపెంగ చెట్లకి దిష్టి పిడతలు పెట్టాలి అనుకుంటూ కొన్నాళ్ళ క్రితం జరిగిన సంగతులని గుర్తు చేసుకుంది  

నెలల పర్యంతం ఇంటి ముఖం చూడని కొడుకు విశ్వం  ఒకనాడు ఉరుము లేని పిడుగులా  పత్యక్షం అయ్యాడు "అమ్మా  ఈ సంపెంగ పూలకి బాగా డిమాండ్ ఉంది  రోజుకొక వందపూల లెక్కన తెగుతున్నాయి కదా ! ఒక్కో పువ్వు రెండు రూపాయల లెక్కన  కొంటానంటున్నాడు మస్తాన్ . రోజుకి రెండొందలు నికర ఆదాయం వస్తుంది   పైగా నీకు కోసి ఇచ్చే పని లేకుండా తనే తెంపు కుంటానంటున్నాడు. ఇచ్చేద్దాం " అంటూ తొందర పెట్టాడు. 

"తోటలో పూసిన ఏ పూలైనా అమ్ముడానికి ఒప్పుకుంటాను కానీ సంపెంగ పూలు అమ్మడానికి లేదురా, ఆ మొక్కలు నాటిన రోజే మీ నాన్న చెప్పాడు. రోజూ ఎన్ని పూలు పూసినా అవి తీసుకెళ్ళి మహాదేవుడికి అర్పించాలని. మనం కరువులో ఉన్నామని ఆయనన్న  మాటకి నీళ్ళోదులుతామా? ఆ సాయిబుకి విషయం చెప్పి పంపేయి" అని అంది .

"లేదమ్మా! అతనికి నేను మాటిచ్చి తీసుకొచ్చాను నా మాట పోడానికి వీల్లేదు. నాన్న కోరిక ప్రకారం చాలా ఏళ్ళు పూలిచ్చాం కాదా! ఇక చాల్లే! మాకు డబ్బులవసరం ఉంది ఇకమీదట నీ పూజకి పూలివ్వలేం అని లెంపలేసుకుని ఒక దణ్ణం పెట్టుకో ! ఆయన భోళాశంకరుడే కాబట్టి ఏమి అనుకోడు" అంటూ బేరం కి వచ్చినతనిని తీసుకుని తోటలోకి వెళ్ళసాగాడు. 

చెయ్యి అడ్డం పెట్టి " ఈ తోటలోకి వెళ్ళడానికి వీల్లేదు" అంది 

"చాల్లే ఊరుకోమ్మా ! చిన్న పిల్లలకి చెప్పినట్టు చెపుతున్నావ్, నువ్వు చెపితే నేను ఆగుతాననుకున్నావా? నువ్వు రా మస్తాన్, ఆడాళ్ళకి ఏం తెలుసు డబ్బు విలువ, డబ్బులు సంపాయించి పెట్టేవాటిని తేసుకెళ్ళి ఉలుకు పలుకు లేని  బండరాయిలోని దేవుడికి పెడతారంట. ఆయన కోరిన కోరికలు తీరుస్తాదట. అమాయకంగా నమ్మేస్తారు." హేళనగా అంటూ తల్లిని దాటుకుని ముందుకు నడవసాగాడు. 

."అరేయ్ విశ్వం ఆగరా, ఒక్క అడుగు ముందుకేస్తే బాగుండదు. కాళ్ళు విరగ్గొడతాను" అంటూ ఎదురెళ్ళి "నువ్వు వెళ్ళిపోయ్యా!  ఆ పూలు అమ్మను. వేరేవారిని అమ్మనివ్వను"  అని గట్టిగా అరిచి చెప్పింది . 

"సరేనమ్మా మీరు ఇంత చెపుతున్నాక నేనుందుకుంటాను . విశ్వం రమ్మన్నాడు కాబట్టి వచ్చాను" అంటూ వెనుదిరిగాడు.

"అమ్మా ! నీ పెత్తనమేంటే? ముసలిదానివి నోరు మూసుకుని పడుండు. ఇంట్లో మగాడు ఒకడుండాడు కదా వాడి  మాట వినాలనే ఇంగితజ్ఞానం లేదు. నీ యవ్వ! ఊళ్ళోవాళ్ళందరి ముందు నా పరువు తీస్తున్నావ్" అంటూ కొట్టడానికి చెయ్యెత్తాడు. .

"ఆ.. నువ్వు ఒక మగాడివేనా? నీకు భాద్యతనేది ఏమాత్రం  ఏడ్చింది . పెళ్ళాం పోయి పదేళ్లయింది, కన్నతండ్రి గుండె నొప్పివచ్చి కుప్పకూలిపోయి ఆరెళ్ళేయింది. ఏనాడన్నా ఇంటి పట్టున ఉండి బాధ్యతగా నడుచుకున్నావా? నువ్వు  నీ స్నేహితులు, నీ త్రాగుడు, బలాదూర్ తిరుగుళ్ళు తప్ప ఒక తండ్రిగా కొడుకుగా ఉన్నదెప్పుడురా!  కష్టపడి ఒక్క రూపాయైనా సంపాదించి ఇంటికి కావాల్సింది ఎప్పుడైనా తెచ్చిచ్చావా? ఆఖరికి నీ బిడ్డకయినా  ఒక్క బిస్కెట్ ముక్కన్నా తెచ్చిచావా? అమ్మ లేనేలేదు నాన్న ఉండి లేనిదయ్యింది. ఆ పిల్లదాని ముఖం చూసైనా నీలో మార్పు రాలేదు . నీది కసాయి గుండె రా, నువ్వు మారవు, మారవు"  దుఃఖంతో గొంతు పూడుకునిపోతూ ఆపేసింది.  

 "ఎప్పుడింటికి వచ్చినా ఇదే ఏడుపు పాట మొదలెడతావ్! అందుకే కొంపకి రావాలంటే విసుగు. అయినా తోట నీదైనట్టు మాట్టాడుతున్నావ్! అదేమన్నా నువ్వు సంపాదిచ్చిన ఆస్తినా ? మా నాన్నకి ఎక్స్ సర్వీస్ మేన్ కి ఇచ్చే కోటాలో గవర్నమెంట్ ఇచ్చిన పొలం. ఆయన మరణించాక కొడుకుగా  దాని పై నాకే అధికారం ఉంది. నిన్నిప్పుడు బయటకి గెంటినా అడిగే దిక్కులేదు. మళ్ళీ రేపోస్తాను. తోట మీద ఎట్టా చెయ్యేయ్యనీయవో అదీ చూస్తాను "అంటూ వెళుతున్నవాడిని ఆపి .. 

"నీకు తెలియదేమో , నువ్వెంత మంచి కొడుకువో అన్న సంగతి తెలిసిన మీ నాన్న ఈ తోటంతా నా పేరున రాసేసి నా తదనంతరం "సంపంగి" కి చెందేటట్టు విల్లు రిజిష్ట్రేషన్ చేయించారు .ఈ తోట పై ఆశలేం పెట్టుకోకు, అయినా నువ్వు ఈ తోట కోసం ఏం చేసావురా ? నువ్వేమన్నా మొక్క నాటావా, నీళ్ళు పోసావా, ఎరువేసావా? తోటలోకి అడుగుపెట్టే అర్హతే నీకు లేదు. ఈ తోటలో పూసిన ప్రతి పువ్వుని ఏం చేయాలన్నది నా ఇష్టం  తూకం లెక్కన మార్కెట్ కి అమ్ముతానో   మాలలల్లి మందికి పందారమే జేస్తానో, దేవుడిపూజకే ఇస్తానో అది నా ఇష్టం రా. కొడుకుగా  ఈ ఇంటికి వస్తే ఒక ముద్ద అన్నం తినెళ్ళు.! అంతే కాని ఇక్కడ నీ పెత్తనం చేయాలని రాకు." అని గట్టిగా చెప్పింది. 

"అందరితోపాటు ముసలాడు కూడా  నాకు అన్యాయమే చేసాడు. ఇక ఈ ఇంటి ముఖమే చూడను. నువ్వు చచ్చినా ఈ ఇంటి గడప తొక్కను."తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు.

మళ్ళీ ఒక నెల తర్వాత వచ్చాడు. 

"నా కూతురిని నాకిచ్చేయ్ ! నేనే పెంచుకుంటాను. తోటలో పువ్వులు అమ్మడానికే వీల్లేదన్నావ్! నువ్వు మొక్క నాటావా? నీరు పోసావా అంటూ లాయర్ ప్రశ్న లేసావ్. ఇప్పుడు చెప్పవే అమ్మా ! ఇది నా కన్న కూతురు  దీని పుట్టుకకి కారణం నేను . నాకు దీనిపై సర్వ హక్కులున్నాయి . దీనిని ఏమైనా చేసుకుంటాను. నాతో పంపియ్యి " అంటూ  సంపంగి చేయి పట్టుకుని లాక్కు వెళ్ళసాగాడు 

వనమ్మ కి భయమేసింది. డబ్బుకాశపడి సంపంగి ని అమ్మేయడానికి కూడా  వెనుకాడడు.  "అరేయ్ విశ్వం   పిల్లని వదులు. నీకు డబ్బులేమైనా కావాలంటే ఇస్తాను " అంది చప్పున . 
"
ఆ మాట వినగానే విశ్వం ఆగిపోయాడు. సంపంగి చేయి వదిలేసి  వెనక్కి తిరిగి  "ఒక యాబై వేలు ఇచ్చేయి  ఏదో ఒక వ్యాపారం చేసుకుంటాను " అన్నాడు 

 "అంత డబ్బా !" అంటూ తెల్లబోయింది "ఉన్న పళాన  అంత డబ్బు ఎక్కడ నుండి తెచ్చి ఇవ్వను . రేపొచ్చి పట్టుకెళ్ళు."  అంటూ  గబుక్కున సంపెంగని రెండు చేతుల మధ్య పొదువుకుంది.  "మాట తప్పితే నేనంటే ఏమిటో తెలుసుగా " తర్జనగా వేలు చూపిస్తూ  వెళ్ళిపోయాడు. విశ్వం  

"నాయనమ్మా! నాన్న  నిజంగా నన్ను తీసుకెళ్ళి పోతాడా? నాకు భయమేస్తుంది నేనెళ్ళను నాయనమ్మా" .. మెడకి చేతులు వేస్తూ ఏడుపు ముఖం పెట్టింది . 

"నా బంగారు తల్లి  మీ నాన్న కాదు  కదా! ఎవరు కూడా నిన్ను నా నుంచి  విడదీయలేడు, నిన్ను కంటికి రెప్పల్లా కాపాడటానికే నాకు భగవంతుడు శక్తి నిస్తాడు" అంటూ ఆకాశం వైపు చూస్తూ చేతులు జోడించింది .

పూలమ్మి రూపాయి రూపాయి కూడ బెట్టిన సొమ్మంతా తీసి విశ్వం అడిగినంత  ఇచ్చి ఊపిరి పీల్చుకుని .. "ఇంకెప్పుడు డబ్బులు అడగకు".  చెప్పింది .

"ఇవ్వడం నీ వంతు, అడగడం నావంతు. మనది ఋణానుబంధం అవసరమైతే  మళ్ళీ వస్తా " అంటూ వెళ్ళిపోయాడు. వీడిని ఆయన యెంత క్రమ శిక్షణగా, తానెంత ప్రేమగాను పెంచాం.సరిగ్గా చదవనూ లేదు , వ్యాపారంలో నిలకడ లేకుండా  చెడు  సావాసాలతో నాశనం అయిపోయాడు. వీడు మారడం చాలా కష్టం అనుకుంటూ విచారంతో సంపంగి ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అలాగే  కూర్చుండి పోయింది . 

విశ్వం దుర్మార్గుడు వాడిని నమ్మే దానికి వీలులేదనుకుని అప్పటి  నుండి తనే స్వయంగా సంపంగి ని స్కూల్ కి తీసుకువెళ్ళి వదిలి పెట్టాలని నిర్ణయించుకుంది. సంపంగి ని  స్కూల్ కి పంపిన  తర్వాతే పూల బేరం చూసుకోవాలి అనుకుంది . సంపంగి స్కూల్కి వచ్చేటప్పుడే తను బయలుదేరి  స్కూల్ లోపలికి భద్రంగా పంపించి  స్కూల్ కి  ఎదురుగా ఉన్న  ఆంజనీయ స్వామి గుడి దగ్గర పూల బుట్ట, తమల పాకులు పెట్టుకుని అమ్ముకుంటూ డబ్బు ఎక్కువ సంపాదించడానికి శ్రమ పడసాగింది .

మధ్యాహ్నం  సంపంగికి భోజనం తినిపించి ఇంటికెళ్ళి తోటలో పూలు కోసుకుని మాలలు కట్టడానికిచ్చి సంపంగి పూలు స్వయంగా కోసి మహాదేవునికిచ్చి "సంపంగి" ని చల్లగా చూడు తండ్రి . దాని తండ్రి నుండి దానిని రక్షించు .. అని  పదే పదే కోరుకుంటూ భద్రంగా స్కూల్ నుండి ఇంటికి తీసుకు వెళ్ళడం చేయసాగింది. 
అప్పుడప్పుడు వచ్చి వేలకి వేలు  డబ్బు కావాలని పీడించడం  అతనడిగినంత కాకపోయినా ఐదో,పదో వేలిచ్చి అతనిని పంపివ్వడం  చేస్తుంది.ఇట్టా పీక్కుతింటే తను ఎన్నని తెచ్చి ఇవ్వగలదు. సంపంగి పెద్దదవుతుంది. చదువులకి బోలెడు ఖర్చు అవుతుంది  ఈ సారి వచ్చినప్పుడు వాడిని ఎక్కువసేపు కూర్చోబెట్టి మంచి మాటలు చెప్పి  తన పరిస్థితి వివరించాలి  అనుకుంటూ నిద్ర పోవడానికి కళ్ళు మూసుకుంది.

టక టక తలుపు కొడుతున్న శబ్దానికి మెలుకువ వచ్చింది . మళ్ళీ విశ్వం వచ్చాడేమో అనుకుంటూ  చిన్నపాటి భయంతో తలుపుతీసింది. ఎదురుగా  నలుగురు పోలీసులు  వారితో ఒక వాచ్ డాగ్. " విశ్వం మీ అబ్బాయేనా? " అడిగాడు ఒక పోలీస్ .

"అవునండీ " గొంతు పెగుల్చుకుని చెప్పింది .

"ఎప్పుడొచ్చాడతను? " కరుకుగా అడిగాడు . పది పదిహేనురోజుల క్రిందట వచ్చి వెళ్ళాడు మళ్ళీ రాలేదు. ఏమైందో అన్న భయంతోనే చెప్పింది . 

వస్తే మాకు తెలియజేయి. కొడుకు అని దాచిపెట్టినా, రాలేదని మభ్య పెట్టినా  నీకు శిక్ష పడుతుంది జాగ్రత్త  అంటూ హెచ్చరించి వాచ్ డాగ్ లాగుతున్న వైపుకి వెళ్ళారు. ఏమైంది బాబూ చెప్పండి అంటూ బయటకి వచ్చి అడిగింది . . "వాడు ఒక మైనర్ బాలిక ని అత్యాచారం చేసి చంపేసిన  కేసులో నిందితుడు"  ఎక్కడికి తప్పించుకోలేడు ఇటువైపే వచ్చాడని తెలుస్తుంది. తెల్లారేలోపే  ఖచ్చితంగా పట్టుకుంటాం " అని  చెప్పేసి పరుగెడుతున్న కుక్క వెనుకాల పరిగెత్తారు. 

భయంతో వణికిపోతూ అలాగే నిలబడిపోయింది.  కొడుకు ఇంత దుర్మార్గుడైపోయాడన్నమాట. వాడికి తగిన శిక్ష పడాల్సిందే అనుకుంటూ  అలాగే  మంచం పై కూర్చుండి పోయింది.

పోలీసులెల్లిన గంట సేపటికి  చడి చప్పుడు లేకుండా ఇంటిలోకి జొరబడ్డాడు విశ్వం. అమ్మా నాకు అర్జంట్గా డబ్బు కావాలి అన్నాడు. రక్తంతో తడచిపోయిన పాంట్ తో కాలు ఈడుస్తూ నిలబడ్డాడు. కాలికి ఏమైందిరా ? అడిగింది. ఏదో దెబ్బ తగిలింది అవన్నీ తర్వాత  ముందు డబ్బు ఇవ్వు అన్నాడు. ఇంట్లో డబ్బు ఏమి లేదు సూర్యం ని పిలుచుకుని వస్తాను నీకు కాలుకి కట్టుకట్టి వెళతాడు.అట్టాగే డబ్బులు తెమ్మంటాను అని తలుపు మూసి బయటకి వెళ్ళింది. 

వెంటనే పోలీసులకి ఫోన్ చేయాలి ఈ దుర్మార్గుడు ఇక్కడికే వచ్చాడని చెప్పెయ్యాలి అనుకుంటూ గబగబా నడిచేదల్లా టక్కున ఆగిపోయింది. సంపంగి ఒంటరిగా ఉంది పైగా  నిద్రపోతుంది. వచ్చినవాడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. రెండు మూడు సార్లు నుండి వాడు వచ్చినప్పుడల్లా సంపంగిని చూసే చూపుల్లో కనబడుతున్న మార్పుని గమనించింది. వార్తలలో వింటున్న విషయాలు  ఎక్కడెక్కడో జరుగుతున్న అరాచకాలు గుర్తుకువచ్చి జాగ్రత్తగా ఉండాలి అనుకుంది మళ్ళీ అంతలోనే  ఛ! అలా ఆలోచించకూడదు. ఎంత దుష్టుడైనా వాడు దానికి కన్నతండ్రి అనుకుంది కానీ ఇప్పుడు ఇందాక పోలీసులు చెప్పిన విషయం గుర్తుకు వచ్చి వెంటనే వెనక్కి తిరిగింది  గబా గబా  ఇంటికి వచ్చి తలుపునెట్టింది. తలుపు తెరుచుకోలేదు. అపాదమస్తకం భయంతో వణికిపోతూ తలుపులు బాది "సంపంగి తలుపు తీయమ్మా" అంటూ పిలిచింది. మరొకసారి పిలుస్తూనే  అటుఇటు చూసింది వసారాలో  సంపెంగలు తుంచే  వంకీ కత్తి కట్టిన చువ్వకనబడింది . తలుపు సందులోకి చువ్వని పోనిచ్చి లోపలి గడియని లేపేసి తలుపులు తెరుచుకుంటూ ఒక్కంగలో లోపలికి వెళ్లి అక్కడి దృశ్యాన్ని చూసి కోపంతో ఊగిపోయింది. సంపంగి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి సిద్దమవుతున్న కొడుకుని ఆపాలని వెనక్కి లాగుతూ .." ఒరేయ్ విశ్వం అది నువ్వు కన్న కూతురు రా కళ్ళు పోతాయి "అంటూ అతనిని వెనక్కి లాగే ప్రయత్నం చేసింది. కామంతో  కళ్ళు మూసుకుపోయిన  విశ్వం తల్లిని విసిరి కొట్టాడు. వనమ్మ విసురుగా వచ్చి గోడకి తగిలి నేలకి కర్చుకుపోయింది. ఎదురుగా  సంపంగి భయంతో నాయనమ్మా నన్ను కాపాడవా ! అంటూ చూసే చూపులు. అరక్షణంలో పైకి లేచింది. మూలన పెట్టిన రోకలి బండని చేతిలోకి తీసుకుంది గుండె నిబ్బరం చేసుకుని  విశ్వం తలపై ఒకే ఒక దెబ్బవేసింది. "అమ్మా "అంటూ సంపంగిని వదిలేసి రెండు చేతులతో తలని పట్టుకుంటూ వెనక్కి పడిపోయాడు. ఇంకో దెబ్బ వేసింది . రక్తం ధారలా కారుతుంది. వనమ్మ కళ్ళలోనుంచి కన్నీరు అలాగే కారుతుంది. సంపంగి దగ్గరికి వెళ్ళి నోట్లో కుక్కిన గుడ్డలు లాగేసింది. బట్టలు సరిచేసి కుండలో నీళ్ళు తెచ్చి తాగించబోయింది. సంపంగి నీళ్ళు త్రాగకుండా మంచం ప్రక్కన నేలపై మడుగులా ఉన్న రక్తాన్ని చూసి సృహ తప్పి పడిపోయింది 

వనమ్మ సంపంగిని అలాగే వదిలేసి కొడుకు దగ్గరికి వచ్చి ముక్కుదగ్గర చేయి పెట్టి శ్వాస ఆడుతుందో లేదో చూసింది . ఆమె కొట్టిన రెండో దెబ్బకే ఊపిరి ఆగిపోయిందని తెలుసుకుని అల్లారుముద్దుగా పెంచిన చేతులతోనే ప్రాణాలు తీసేలా దుర్మార్గంగా తయారయ్యావు కదారా. ఏ తల్లికి నాకు పట్టిన  ఇలాంటి ఖర్మ పట్టకూడదు అనుకుంటూ ఏడుస్తూ, పోలీస్ స్టేషన్ నంబర్కి పోన్ చేయబోయి ఆగిపోయింది.  తను నేరం చేసినదని జైలు శిక్ష వేస్తే సంపెంగ ని ఎవరు చూస్తారు? అయినా తను నేరం చేయలేదు. కన్నకూతురినే పాశవికంగా బలిగొనబోతున్న ఓ కాముకుడిని అంతం చేసింది. ఓ చిన్నారి మొగ్గని ఓ రాక్షసుడి పదఘట్టనకి నలిగిపోకుండా  కాపాడింది.  తాను  నేరం చేసానని ఏ కోశానా అనుకోవడంలేదు. లోకం దృష్టిలో తప్పు చేసినదానిలా అనిపించి తనకి శిక్ష పడితే?   ఇప్పుడు జరిగిన సంఘటనకే సంపంగి  మనసు చెదిరిపోయింది. తను కూడా దూరమైతే? ఆ ఊహే భయం కల్గించింది. తను సంపెంగిని కాచే కన్నవ్వాలి, తన ఒడి స్వేచ్చగా విహరించే వనమవ్వాలి. ఈ వనానికి మాలినవ్వాలి దృడంగా  అనుకుంది.  పోలీసులకి పోన్ చేసే ప్రయత్నాన్ని విరమించుకుని  ఒక్క నిమిషం ఆలోచించుకుంది  చీర చెంగు చింపి  చనిపోయిన విశ్వం కాళ్ళు కట్టేసింది ఇంకో సగం చీరని  తాడుగా మెలేసి మెడకి కట్టి తోటలోకి ఈడ్చుకెళ్ళింది.  దశమినాటి వెన్నెలలో  మసక చీకట్లోనే అంతకు ముందు రోజు మారేడు చెట్టు నాటడానికి తీసిన నాలుడుగుల లోతు గోతులోకి కొడుకుని నిలువుగా దించి ప్రక్కనే ఎరువు కలిపిన మట్టితో గోతిని నింపేసి గట్టిగా  కాళ్ళతోతొక్కేసింది.ఆ గోతిలోనే మారేడు మొక్కని నాటి చుట్టూ  మరింత మట్టిని పోసి ఈ చెట్టు బ్రతికి కొమ్మా రెమ్మా వేస్తే ఆ దళాలు మహాదేవుడికి సమర్పించి తన హత్యా పాపకాన్ని పోగొట్టుకోవడం మినహా తనకి మరో దారి లేదనుకుంటూ గబగబ ఇంట్లోకి వచ్చి రక్తం మరకలని శుభ్రం జేసేసింది. తడి లేకుండా  గట్టిగా తుడిచేసి ప్యాన్ స్పీడ్ పెంచి తడి ఆరిపోయటట్టు చేసి  అప్పుడు సంపగి దగ్గరికి వెళ్ళి మొహంపై నీళ్ళు జల్లి   నెమ్మదిగా తుడిచి ప్రక్కలో పడుకుంది  . 

నెమ్మదిగా సృహలోకి వచ్చిన సంపంగి కళ్ళు తెరచి నాయనమ్మా, నాన్న, రక్తం అంటూ ఏదో మాట్లాడబోయింది. 

ఏంటి తల్లీ ! ఏమన్నా పీడకల వచ్చిందా !? నాన్నేంటి, రక్తం ఏంటమ్మా? నేను నీ ప్రక్కనే పడుకున్నాగా, ఇంకా తెల్లారలేదు పడుకో  అంటూ ఒక చేత్తో తలని నిమురుతూ  రెండో చేత్తో వెన్నుపై చిచ్చుకోట్టింది.

(2 ఫిబ్రవరి 2014 తెలుగువెన్నెల. కామ్  వెబ్ పత్రిక లో ఈ కథ)
 
  


3 కామెంట్‌లు:

Geethanjali చెప్పారు...

bhayam ga undi.. ila evariki jaragakudadu

Saraswathi Durbha చెప్పారు...

చాలా మంచి కధ. దేశంలో తల్లులందరూ అంతటి విచక్షణా జ్ఞానంతో ఉంటే నేరాలే ఉండవు. ఆ తల్లి తెలివికి ధైర్యానికి నా జోహార్లు.

Visala Appidi చెప్పారు...

మాతృస్వామ్యం వున్న కాలంలో పురుషులపై ఇన్ని ఆఘాఇత్యాలు జరిగాయా.బిడ్డల్ని కనే వరం ఆడవాళ్లకు మాత్రమే ఇచ్చిన దేవుడు కన్నిళ్ళకి ఆడవాళ్ళని ప్రచారకర్తని మాత్రమే చెయ్యలేదని నా ఫీలింగ్. కండ బలం గుండె బలం సమయస్పూర్తి ఆడవాళ్ళకి చాల చాలా అవసరం ఈ కాలంలో ఆత్మ రక్షణ విద్యల అవసరం ఎంత వుందో పసిగుడ్డు నుండి ముసలి తల్లులపై కూడా అత్యాచారం చేసే వెధవలకి వాళ్ళని వెనకేసుకొచ్చే రాజకీయ ధన మదాంధులకి బుద్ధి చెప్పాలనే స్త్రీ జాతి తెలుసుకోవాలి. తల్లి చెల్లి అక్క లాంటి ఏ బంధాలు అడ్డుకాకూడదు.శక్తీ జగన్మాత ..ఎట్సెట్రా లన్నీ ఏమయ్యాయి.ఆడవాళ్ళు చాలా చాలా మారాలని కధలోని అమ్మ చెప్పింది.పునర్జన్మ లాంటి మాతృత్వం కన్నా అన్యాయాన్ని ఎదిరించటం చాలా గొప్ప నిర్ణయం.