పాట తోడు
వేగు చుక్క పొడిచింది. దానికి పోటీగా చుట్టు ప్రక్కల తెరుచుకున్న ఇళ్ళ తలుపులు మధ్య నుండి విద్యుత్ దీపాల వెలుగులు. స్నానాల చప్పుళ్ళు, హారతి ఇస్తూ మ్రోగే గంట చప్పుళ్ళూ కార్తీకమాస ప్రత్యేకతని చెపుతున్నాయి.
"అయ్యో ! ఈ రోజు గుళ్ళో ప్రదక్షిణలు చేయడానికి ఆలస్యం అయిపోతుంది నేనెళ్ళేటప్పటికే గుడి ఆవరణమంతా దీపాలు పెట్టేస్తారు. వేసిన ముగ్గులని, పెట్టిన దీపాలని త్రొక్క కుండా ప్రదక్షిణ చేయడం ఒక పరీక్షన్నమాటే.. మనసులో అనుకుంటూ పూజ బుట్ట పట్టుకుని బయటకి అడుగుపెట్టాను నేను.
విజయదశమి రోజున శివాలయంలో ప్రదక్షిణలు మొదలెట్టాను . నా కొడుకుకి హెచ్ వన్ అప్రూవైతే ఏబయ్యిఒక్క రోజులు ప్రదక్షిణలు చేస్తానని మనసులో అనుకున్నాను. ఆ మొక్కు చెల్లించడానికి గాను రోజు గుడికి వెళుతున్నాను నాకు మనుషులపై నమ్మకం పోయి చాలా ఏళ్ళయింది. నా కష్టం-సుఖం, నా దుఃఖం.. అంతా మౌనంగా భగవంతునికే చెప్పుకోవడం, ఎవరో ఒకరి రూపంలో ఆయన ఉండి సాయం చేస్తాడని నమ్మికవల్ల కావచ్చు నేను నా ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూ నా వెన్నుముక పైనే నిలబడి ఉన్నాననుకుంటా! ఇన్నిచ్చిన భగవంతుడికి మనమేమివ్వగలం .. ? హృదయం తప్ప , అలాగే ఇతరులకి చేసే చిన్న చిన్న సాయాలు తప్ప అని iఅనుకుంటూనే ఉంటాను. అలా తెల్లవారుఝామునే లేచి గుడికి వెళుతున్న నన్ను కొందరు వింతగా చూస్తారు. బారెడు పోద్దేక్కేదాకా నిద్ర లేవని కొంతమంది పుణ్యమంతా మీదే అంటూనే లోలోపల ఏడుస్తూ ఉంటారు. వీటన్నింటిని మననం చేసుకుంటూ మా వీధి చివరలో మలుపు తిరిగాను.
మంచుతెరల మధ్య నిశ్శబ్దంలో నడక హాయిగా ఉంది . అంతకన్నా హాయిగా చెవులకి సోకుతున్న నాదం. "అబ్బ .. ఎంత బావుంటుందో..అతని గానం. ఎవరిచ్చారీ శక్తి? తరువుని నిలువెల్లా నరికి తనువంతా గాయాలు చేసినా.. సరే, గాలి నింపుకుని తీయని నాదాన్నిఅందించే త్యాగగుణం వాయువుదా లేక వెదురుదా.. లేక అతని ప్రాణ శక్తిదా? " గాలి అలల్లోకి ప్రవహింపజేస్తూ అతని స్వరం ఏదో లోకాలలోకి లాక్కేళ్ళుతుంది. అతనిని చేరడానికి ఒక పర్లాంగ్ దూరంలో ఉండగానే వినరావడం మొదలైనతని గానం అతన్ని దాటేసిన ఒక పర్లాంగ్ దూరం నడిచే వరకు వినిపిస్తూనే ఉంటుంది. నిజానికి అతని గాలి పాట వినడం నాకొక వ్యసనం అయిపొయింది. తమ ఇంటికి రెండు పర్లాంగ్ ల దూరంలో ఉండే గుడికి వెళుతూ ఉండే దారిలో రహదారి ప్రక్కనే కళ్యాణ మండపం ముఖ ద్వారం ప్రక్కగా పన్నాయి చెట్టు క్రింద అతని వాసం. చిరుగు బొరుగు బట్టలతో రెండు మూడు పొరలతో కప్పుకున్నఅతని బక్క చిక్కిన కాయం , సంస్కారం లేని జుట్టు. అభావమైన ముఖంతో ఒంటరిగా అతను. అతని చెంత మురళి పాట. ఆపాట శృత సంగీతంలా ఉండదు, తపనపడి నేర్పు సాదించినట్లు ఉంటుంది రాత్రుళ్ళు కూడా అక్కడే నివాసం. వీధిలైట్ కాంతిలో పన్నాయి చెట్టు మొదలుకి ఆనుకుని కూర్చుని ప్రపంచానికి తనకీ సంబందమేమి లేనట్లు అరమోడ్పు కనులతో తన్మయత్వంతో పాడుకుంటుంటే చూసి కించిత్ ఈర్ష్య కలుగక మానదు. బతకడంలో ఉన్న ఆనందాన్ని అతను మనసారా అనుభవిస్తున్నట్లు ఉంటుంది నాకు .
భద్రమైన బ్రతుకులో ఇమిడి ఉన్నాకూడా .. ఇంకా ఏవేవో కావాలనే కోరికలు, అవి తీరాలని భగవంతుడిని వేడుకోవడానికి వెళ్ళడంలో కూడా పరుగులు తీస్తున్న నాకూ.. అతనికి మధ్య ఉన్న తేడా ఏమిటో కూడా నాకు బాగానే తెలుసు. ఇలా ఆలోచిస్తున్న కొద్దీ నా పై నాకే చికాకు కల్గింది
గుడిలోకి వెళ్ళబోతుండగా
"అమ్మా పాత చీరలు ఇస్తానన్నారు " అడిగింది ఒక భిక్షుగత్తె.
"అడుక్కోవడానికి అప్పుడే తెల్లారిందా? అయినా ఇంటికొస్తే పాత చీరలిస్తానన్నాను కానీ ఇక్కడకి తీసుకొచ్చి ఇస్తానన్నానా? " విసుక్కున్నాను. అంతటితో ఆపానా ? అదీ లేదు . "ఇలా అడుక్కుతిని తినడానికి అలవాటు పడిన వీళ్ళు పని చేసి బ్రతకాలనుకోరు. ఇలా అడుక్కుని తినడం నామోషి అని కూడా అనుకోరు " అని నేను, మరో భక్తురాలు దీనోద్దరణ గురించి మాట్లాడుకుని తర్వాత మా కోర్కెలు తీర్చమని శ్రద్ధతో నలబయ్యి ఒక్క ప్రదక్షిణలు చేసాము .
బయటకి వచ్చేటప్పుడు నన్ను చీరలడిగిన అమ్మాయిని పిలిచి .." నాతొ ఇంటికి రా .. చీరలిస్తాను " అని పిలిచాను . "ఇప్పుడోస్తే.. డబ్బులన్నీ పోతయి, మీ ఇల్లు నాకు తెలుసుగా మజ్జేనం వస్తా .. అప్పుడియ్యి" అంది .
"ఇప్పుడోస్తేనే ఇస్తా .. లేకపోతే ఇవ్వను మధ్యాహ్నం ఊరేళుతున్నా" అబద్దం చెప్పాను .
తన బదులు నాలుగేళ్ళ కూతురిని అక్కడ కూర్చోబెట్టి.. "వచ్చే వాళ్ళందరిని ధర్మం చేయమని అడుగు. అడగకపోతే ఎయ్యరు" అంటూ అయిష్టంగానే నా వెంట వచ్చింది
నా వెనుక నడుస్తున్న ఆమెని "నీ పేరేమిటీ? "అడిగాను .
"గౌరి"
"మీ ఆయన ఏం జేస్తాడు? "
"రిక్షా తోక్కుతాడు పుల్లుగా తాగుతాడు . ఇంటికొస్తే వస్తాడు లేకపోతే లేదు. పెళ్ళాలకి తక్కువైతేగా, ఇద్దరు బిడ్డలని పెట్టుకుని ఏడకని పనికి పోనూ !? పిల్లలని తీసుకొత్తే పనికి రావద్దంటారు మీబోటి అమ్మలు. అందుకే ఇట్టా గుడి ముందు కూర్చుని అడుక్కుంటున్నా " అడక్కుండానే చెప్పింది .
ఇంటికి వచ్చాక నాలుగు చీరలు జాకెట్లు ఇచ్చాను. "నే పోతానమ్మా " అంటే ఆపి
"నిన్ను గుడి ముందు నాలుగేళ్ళ నుంచీ చూస్తున్నా ! అడుక్కోవడం నామోషీ అనిపించట్లేదా ? మేము కార్లలో తిరిగే వాళ్ళమే ఇంకా ఏమిటేమిటో కావాలని ఇంకా ఇంకా ఇవ్వాలని గుళ్ళు చుట్టూ తిరుగుతున్నాం, మీకు తిండి కూడా జరగడం లేదే ? అయినా ఒక్కసారి కూడా గుడిలోకి వచ్చి దణ్ణం పెట్టుకోవు మరి నీ బతుకు ఎట్టా మారుద్ది ? అన్నాను.
"పుట్టించిన ఆయనకే ఉండాలమ్మా మేమేం చేయగలం ? "అంది
"ఇవన్నీ కాదుగాని .. నీకు గౌరవంగా బ్రతికే దారి చూపిస్తే అడుక్కోవడం మానేస్తావా? " అడిగాను
"ఆ మానేస్తా " అంది . "మాట తప్ప కూడదు " తర్జనగా వేలు చూపిస్తూ అన్నాను .
"తప్పను" ఏం చేయాలి చెప్పండి ?
"ఇప్పుడు కాదు .. రేపు నేను గుడికొచ్చే టైం కి .. శుభ్రంగా స్నానం చేసి, తల దువ్వుకుని . గుడి దగ్గరకొచ్చి ఉండు " అని చెప్పాను . తల ఊపుకుంటూ వెళ్ళిపోయింది
తెల్లవారి అన్నట్టుగానే నీట్ గా తయారై నా కోసం ఎదురు చూస్తూ కూర్చుంది " సుబ్బారావు కొట్టుకి వెళదాం ..రా" అంటూ కొట్టుకి తీసుకు వెళ్లాను .
ఒక ఇరవై కొబ్బరి కాయలు, కర్పూరం పేకెట్లు , సంబ్రాణీ కడ్డీల పేకెట్ లు , ఆవు పాల పేకెట్ లు, గంధం ,విభూది పొట్లాలు అన్నీ కలిపి లెక్క రాయించి డబ్బులు ఇచ్చేశాను . ఇంకో మూడువేలు పెట్టుబడిగా అతని దగ్గరే ఉంచమని ఎప్పుడు ఏ సరుకు కావాలన్నా ఇమ్మని చెప్పి కొన్న సరుకు నంతటిని తీసుకుని "గుడి దగ్గరకి వెళదాం పద "అన్నాను . నా వెనుకనే వచ్చింది . గుడి ముందు ఒక పట్టా పరిపించి గౌరీ చేతనే అన్నీ సర్ధించాను . "ఇప్పుడు ఇక్కడ కూర్చో ! కొబ్బరి కాయ ధర ఇంత, కర్పూరం ధర ఇంత అని నీకు తెలుసు కదా ! అసలు ధర మీద కొంత లాభం వేసి అమ్మడం నేర్చుకో ! "అన్నాను . ఎదురుగా ఉన్న బడ్డీ కొట్టతను తన వ్యాపారం దెబ్బ తీస్తున్నాని నా వంక గుర్రుగా చూస్తున్నాడు .
గుళ్ళో పూజారి దశరధ స్వామి వచ్చి "హేమ గారు భలే దారి చూపిచ్చారు గా " అంటూ నా పై ప్రశంసలు . గుళ్ళో హారతిచ్చే సమయానికి వంద రూపాయల లాభం కళ్ళ జూసింది గౌరీ . కళ్ళలో వెలుగుతో ఇక ఇట్టాగే బతుకానమ్మా ! అంది . సాయంకాలం సాయిబాబా గుడి దగ్గర , శనివారం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కూడా పూజ సామాను పెట్టుకో, తులసి దండలు తెచ్చి అమ్ముకో అంటూ పూజారి గారు, నేను ఆమెకి సలహాలు ఇచ్చాం
నెల తిరిగే టప్పటికి వ్యాపారంలో చాలా మెలుకువలు నేర్చుకుని నా దగ్గర కూడా ఎక్కువ లాభం తీసుకునేంత ఎదిగిపోయిన గౌరిని చూసి నవ్వుకున్నాను. ప్రతి రోజూ ఆమె కూడా తెల్లవారుఝామునే నాతో పాటు ప్రదక్షిణలు చేయడం మొదలెట్టింది.
"మంచి చేయాలంటే మనసే కాదండి ఓపిక కూడా ఉండాలి . మీరు ఓపికగా ఎన్నో సార్లు చెప్పి చెప్పి నందువల్లనే .. ఆమెకి గురి కుదిరింది " అని దశరధ స్వామీ అంటుంటే "డబ్బులయితే మేమైనా ఇచ్చేవాళ్ళమేనండీ ! దరిద్రులని బాగుచేసేంత మీకున్నంత ఓపిక,తీరిక మాకు లేదులెండి అనే వాళ్ళు కొందరు మూతి విరుపు, ముక్కు విరుపుతో.
అవన్నీ వింటూ "అభిషేకానికి రెండువందల మిల్లీ లీటర్ల పాలిచ్చి సంకల్పం చెప్పేటప్పుడు ఇరవై మంది పేర్లు చెప్పి వంద కోర్కెల చిట్టా విప్పే వీళ్ళు నా లాంటి బ్రాహ్మణుడికి దానమివ్వడం తప్ప ఆకలితో అలమటించే వారికి ఒక రూపాయి కూడా దానమియ్యరు, ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలరు." అంతా మాటల తీపే హేమగారు "అంటూ ఉండేవాడు దశరధస్వామి.
అలా గౌరీ యాచన చేయడం మానేసి గౌరవంగా బ్రతకడం నేర్చుకుంది.
నాకైతే లోలోపల చాలా గర్వంగా ఉండేది. నాలో నిత్యం ఉండే అసహనం, చిరాకులు తగ్గి కొంత ప్రశాంత రావడం మొదలైంది. అది భక్తీమార్గంలో లభించే సాంత్వన కావచ్చు, అతని పాట వినడం కావచ్చు , లేదా గౌరీ జీవితంలో వచ్చిన మార్పు వల్ల కావచ్చు .
కార్తీక మాసం అయిపోవచ్చింది. రాలుతున్న పన్నాయి పూల కోసం, అతని పాటని మరింత సమీపంగా వినడం కోసం నేను గుడికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడూ రెండుసార్లు ఆ వైపునే నడవడం మొదలెట్టాను. ఒకరోజతనిని పలకరించి పేరడిగాను . ఒక్క క్షణం నా వైపు చూసి "రంగ" అని చెప్పి తన గానంలో తానూ మునిగిపోయాడు. అప్పుడప్పుడూ అతనికి నా చేతిలో ఉన్న పండో, ప్రసాదం ఇస్తేనో... తీసుకోవడంలో కొంత అయిష్టం గమనించి .. ఇవ్వడం మానేసాను. ఎవరిని అగౌరవ పరచడం నా అభిమతం కాదు కాబట్టి .
ఆ రోజు ...ఎందుకో .. అతని పాట వినబడటం లేదు. ఆశ్చర్యంగా ఉంది . దారెంట నడుస్తూనే అతను కూర్చుని ఉండే చోటు వైపు చూసాను. అతను ఇంకా లేచినట్లు లేదు. పాపం ! ఆరోగ్యం బాగొలేదేమో ! అతనికి నా అన్న వాళ్ళు ఎవరు లేనట్లున్నారు , హాస్పిటల్ కి ఎవరు తీసుకువెళతారు? ఆలోచిస్తూనే గుడికి చేరుకున్నాను గుడి బయట గౌరీ కనబడలేదు ఈ రోజు గురువారం కదా ! సాయిబాబా గుడి దగ్గర ఉండుంటుంది.. అనుకుంటూ గుడి లోపలకి వెళ్లాను. ఇంటికి వెళ్ళేటప్పుడైనా అతని పాట వినిపిస్తుందేమోనని చూసాను. నిరాశ మిగిలింది. ఆ రోజంతా ఏదో చికాకు. రాత్రి పడుకునేటప్పుడు చౌరాసియా సీ డి ప్లే చేసుకుని వింటే కానీ మనసుకి స్థిమితంగా ఉన్నట్లు అనిపించింది. శుక్రవారం ,శనివారం కూడా అతని పాట వినబడలేదు, గౌరీ కనబడలేదు, చెప్పలేని దిగులేసింది . అనుకున్న ప్రకారం నా ప్రదక్షిణ వ్రతం పూర్తయింది .
కార్తీక మాసం అయిపొయింది. తర్వాత రోజు నేను వేకువనే గుడికి వెళ్ళడానికి బద్దకించాను. మళ్ళీ ఓ నాలుగు రోజుల తర్వాత వచ్చిన సోమవారం రోజున వేకువనే గుడికి బయలుదేరాను రోడ్డు మీదకి రాగానే అతని వేణు గానం మృదుమధురంగా వినవచ్చింది. సంతోషంతో కొంచెం వడి వడిగా అడుగులు వేసి రోడ్డుకి ఈవల వైపునే నిలబడి కాసేపు ఆగి మరీ అతని పాట విని గుడికి వెళ్ళాను. చెప్పులు విప్పి కాళ్ళు కడుక్కుంటూ ప్రక్కకి చూసాను అక్కడ గౌరీ కూర్చుని ఉంది. ఆశ్చర్యం, కోపం రెండూ . పూజా సామాగ్రి అమ్ముకోవడానికి బదులు ఒక సత్తు గిన్నె పట్టుకుని వచ్చే పోయే వాళ్ళని ధర్మం చేయండయ్యా అంటూ యాచన చేస్తుంది
"గౌరీ !ఇన్నాళ్ళు ఎక్కడ కెళ్ళావ్? మళ్ళీ ..ఈ అడుక్కుతినే అవతారం ఏమిటీ ?"
"అదీ .... అదీ".. అంటూ నసుగుతుంది. "ఏమైందో చెప్పు ?" కాస్త కోపం తగ్గించుకుని అడిగాను .
"అమ్మా ! డబ్బులు అయిపోయాయమ్మా... కొట్టాయన అప్పు పెట్టనన్నాడు. మరి పాల పేకెట్లు,కొబ్బరికాయలు అన్నీ ఎట్టా తెచ్చుకోను ? అందుకే ఇట్టా. నాకలవాటైన పనే కదా ఇదని" మళ్ళీ నసిగింది .
"నేనిచ్చిన డబ్బంతా ఏం చేసావ్ ? రోజూ లాభం వచ్చిన డబ్బంతా ఏం జేసావ్? పెట్టుబడి పెట్టిన డబ్బు తీయోద్దని నీకు చెప్పానా లేదా ? నీ మొగుడికి ఇచ్చేసావా? "
"లేదమ్మా"
మరేం చేసావ్? మీ బతుకులు మారుద్దామని ఎంత జేసినా బూడిదలో పోసిన పన్నీరే ! కష్టపడకుండా డబ్బులు రావాలి. తాగి తందానాలాడాలి. ఛీ ఛీ ... అసలు నన్ననుకోవాలి కుక్క తోక ఒంకరని తెలిసినా సరిజేయడానికి చూస్తున్నా" విదిలింపుగా అనేసి గుళ్ళోకి వెళ్ళిపోయాను . నవగ్రహాలకి ప్రదక్షిణం చేసుకుని మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కోవడానికి పంపు దగ్గరకి వచ్చాను . నా వెనుకనే నిలబడి గౌరీ నాతొ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. నేను తనని పట్టించుకోకుండా బిందె నిండా నీరు నింపి అందులో కొన్ని పుష్పాలు, మారేడు దళం వేసుకుని భక్తితో ఓ .నమస్కారం చేసుకుని శివ శివా అనుకుంటూ బిందెని నడుమ పై పెట్టుకుని వెళ్లి స్వామీ సన్నిధికి చేర్చి దణ్ణంపెట్టుకుని మళ్ళీ ధ్వజస్తంభం వరకు వచ్చాను సోమసూత్రం మొదలెట్టబోతుండగా "అమ్మా" నేను చెప్పే ఒకమాట వినమ్మా ఒకే ఒక్క మాట విను" ..అంటూ నాకు దణ్ణం పెట్టింది .
"నాకెందుకు దణ్ణాలు పెడతావ్ ! ఆ స్వామికి పెట్టు, మీ రాతలు ఆయన తప్ప ఎవరు మార్చలేరు" అంటూ కోపగించుకున్నాను .
"ఆ రంగడు లేడూ... ఆడికి "... అంటూ మొదలెట్టింది
అసంకల్పితంగా ఆగిపోయాను. " ఏమయిందతనికి ?" ఆందోళనగా అడిగాను
వారం రోజుల క్రిందట ఎవళ్ళో వచ్చి ఆడిని బాగా కొట్టేసి, ఆడి చేతిలో మురళిని ఇరిసేసి పోయారు .
"ఎవరువాళ్ళు. నీకేమైనా తెలుసా ? "
"ఏమోనమ్మా.. ఎప్పుడు ఏమి చెప్పడు. ఎవరిని ఏమీ అడగడు. ఏడనుంచి వచ్చాడో ? ఆ మురళూదుకుంటా ఉంటాడు. ఆకలి దప్పికలని కూడా అనుకోడు. ఎప్పుడన్నా మాకే జాలేసి టిఫిన్ పొట్లాం కట్టించుకెల్లి ఇచ్చోస్తాం. "
"అవును పాపం! ఎప్పుడైనా ఓ పది రూపాయలివ్వబోయినా తీసుకోవడానికి మొహమాట పడతాడు, తర్వాతేమైందతనికి చెప్పు ? " తొందర చేసాను.
" అట్టా జరిగిందని మాకేం తెలుసు? ఒక రోజంతా ఎవరు పట్టించుకోలేదు. అతని పాట వినబడకపోయే సరికి దగ్గరకెళ్ళి చూసాం. ఒళ్ళంతా దెబ్బలు,సలసల కాగే జొరం. నేనే ఆటో ఎక్కించుకొని గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకు వెళ్లాను. మూడు రోజులకి కళ్ళు విప్పి చూసాడు. కాస్త జొరం తగ్గాక తీసుకొచ్చాం . ఆ చెట్టు వదిలి రానంటాడు, తినడు, తాగడు ఊదుకోడానికి మురళి లేక పిచ్చాడై పోయాడు. మాక్కూడా అతని పాట ఇనకపోతే ఏం తోచడం లేదమ్మా! రంగడి పాటలో ఏదో... మహత్యం ఉందమ్మా! పగలల్లా ఏడో ఒక చోట అడుక్కుని తినేవాళ్ళు కూడా అక్కడికొచ్చి కూర్చుని రంగడి మురళి పాట ఇని పోతారు ఒకోసారి అక్కడే పడి నిదరోతారు. ఆడిని హాస్పటల్ కి తీసుకెళ్ళి బతికిచ్చినట్టీ ఆడి పాటని కూడా బతికియ్యాలనుకున్నాను. అందుకే గాంధీ నగర్ పోయి. బొమ్మలమ్మే కొట్లో ఇత్తడి మురళి ఒకటి, వెదురు మురళోకటి కొనుక్కొచ్చి ఇచ్చాను. అయి చేతిలో పడ్డాక, తనివితీరా ఊదుకున్నాక కానీ ఇంతన్నం తిన్నాడు " తన్జేసిన గొప్ప పనిని సంతోషంగా చెపుతుందనిపించింది .
నాకు భలే ఆశ్చర్యమేసింది . వాళ్ళ మధ్య ఏ రక్త సంబంధం, ఏ విధమైన అనుబంధమూ లేదు . పైగా ఎవరైనా అతనికి భిక్షమేస్తున్నా ఓర్చుకోలేకపోయేవారు ఎప్పుడూ అతనితో గొడవపడుతూనే ఉండే వారు . అలాంటిది గౌరి అతన్ని అలా ఆదుకుందంటే.. ఆలోచిస్తుంటే అబ్బురమనిపించింది. తోటి మనిషిపట్ల ఉండాల్సిన కూసింత కరుణ ఆమె రేపటి పరిస్థితిని కూడా మరపించేసింది. ఇట్టా కాకపొతే ఇంకోలా బతుకు బతకలేమా అన్న ధీమా, తెంపరితనంతో ఏ మాత్రం ఆలోచించకుండా అతనికి సాయం చేసేసింది. గౌరిలో ఉన్న ఆ గుణం నాకు బాగా నచ్చేసింది క్రమేపీ క్రమేపీ నాకు మనుషులపై తగ్గిపోయిన నమ్మకం తిరిగి ఇక్కడిలా సాక్షాత్కారమవడం ఆనందం కల్గించింది
"డబ్బులన్నీ అయిపోయాయా? సుబ్బారావు అప్పు పెట్టనన్నాడా ? "
"అవునమ్మా "
అందుకని వ్యాపారం చెయ్యడం మానేసి మళ్ళీ పాత బాటే పట్టావా ?
"ఇంకోసారి నాకెవరు పెట్టుబడి పెడతారమ్మా" దిగులుగా చూసింది
"నా పంట చేను చవకేసిపోలేదు , పాడి గొడ్డు ఒట్టి పోలేదు లే " అంటూ మేడ పైకి చూస్తూ ...
దశరద్ స్వామీ ! ఓ దశరధ స్వామీ!! నోరెత్తి గట్టిగా పిలిచాను. ఆయన పిట్ట గోడ దగ్గరకొచ్చి "చెప్పండి ..హేమ గారు" "ఓ మూడు వేలు చేబదులు ఇచ్చి పంపండి." అన్నాను
దానికేం భాగ్యం ఇదిగో ఇప్పుడే తెస్తా ! అంటూ ఆయన లోపలికెళ్ళారు.
1 కామెంట్:
సాటి మనిషికి సహాయం చేయాలంటే ధనవంతులే కానక్కర్లేదు,పెద్ద పెద్ద సేవా సంస్థలు పెట్టి,మేము సేవ చేస్తున్నాం, మాకు మీరు కూడా సహాయం చేయండి అని ఎవరినీ అడగక్కర్లేదు..
ఉన్నంతలోనే సహాయం చేయగల గొప్ప మనసు, స్పందించే హృదయం ఉంటే చాలని హేమ,గౌరి ఇద్దరూ నిరూపించారండి ..
మీ పాట తోడు చాలా బాగుందండీ ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి